పోయే ప్రాణం తెలుస్తూంది సోమయాజికి! అప్పటికే రెండుమూడు గుటకలు నీరు మింగాడు. చేతులు వూపటం మానేశాడు. నీరు ఎలా తిప్పితే అలా తిరుగుతున్నాడు. ఇంతలో తల నీటిపైకి ఒకసారి వచ్చింది ... ఆఖరిసారి ప్రపంచాన్ని చూడటానికా అన్నట్టు కనులు విప్పాడు. ఆ క్షణకాలంలోనే అతడి కన్నులు విస్తారితమయ్యాయి.
ఒక చేపలాగా, ఒక ప్రభంజనంగా వస్తున్నాడు తాతయ్య. ఆ వయసులో కూడా ఆయన శరీరపు తాకిడికి గోదావరే బెదిరి దారి ఇస్తున్నట్లు వుంది. రణరంగంలో కురువృద్దుడిలా వున్నాడు. అస్త్రంలా వస్తున్నాడు.
దిక్కులు పిక్కటిల్లేలా 'వద్దు' అని అరవబోయాడు సోమయాజి. అంతలో మళ్ళీ తల నీతి అడుక్కివెళ్లిపోయింది. అంతలోనే అక్కడ రెండు చేతులు బలంగా అతడిని పట్టుకున్నాయి. వాటికి ఆ శక్తి ఎలా వచ్చిందో తెలీదు. అతడిని బైట ప్రవాహంలోకి విసిరేశాయి. ఆయన తన శరీరాన్నే బోటుగా నిలబెట్టి, దాని ఆధారంగా తన మనువాడు పట్టు చిక్కించుకోవటానికి తోడ్పడ్డాడు. ఆ నీళ్ళల్లో కావల్సింది అలాంటి గట్టి ఆధారమే. దాని సాయంతో అతడి శరీరం కాస్త ఆగగానే, తిరుగుతున్న చక్రంనుంచి బైటపడినట్టూ విసురుగా మామూలు ప్రవాహంలోకి వచ్చిపడ్డాడు. అతడికి స్పృహ తప్పింది. అంతలో మరో స్నేహితుడు తనని ఒడ్డుకి లాగటం లీలగా తెలిసింది.
నీళ్ళు కక్కించిన అయిదు నిమిషాలకి అతడికి మెలకువ వచ్చింది. కళ్ళు విప్పి చూశాడు. పక్కన ఒకరిద్దరు మిత్రులు వున్నారు. చాలామంది ఇంకా ఒడ్డునే నిలబడి గోదారికేసే చూస్తూ వుండటంతో చిన్న అనుమానం ప్రారంభమై, క్షణాల్లో అది కరాళ రక్కసి అయి, చప్పున లేచి కూర్చున్నాడు. కదిలే సుడి కళ్ళలోనే తిరిగింది. పారే గోదారి పరుగాపి వణికేలా, పక్కన కొండలు పరుగులు తీసేలా "తాతయ్యా" అని అరిచాడు.
ఉత్తరాయణ ఆగమనమే సంక్రాంతి. పుట్టుకకైనా మరణానికైనా అది శుభప్రదం. అంపశయ్య మీద భీష్ముడు అప్పటివరకూ అందుకే ఆగాడు.
3
తాపోపశమనార్ధం
పిపాసోపశమనార్ధం
క్షుదుపశమనార్దం
ప్రాణావసాన కాలంలో పంచభూతాలూ వేర్వేరు ప్రాంతాల్లో వుంటాయిట. ఒకటి ప్రాణం పోయిన స్థలంలో, మరొకటి శ్మశానమున, ఒకటి కర్తయందు, ఒకటి బ్రాహ్మణునియందు, కాకి రూపంలో ఒకటి వుంటాయి.
'నా శరీరం ఏమయిపోయింది' అనే చింతతో ఎవరు కనిపిస్తే వారిని ఆశ్రయించటానికి ఆత్మ ప్రయత్నిస్తుంది. కర్మవలన దానికి విముక్తి లభిస్తుంది.
అపరాహ్నవేళ.
వేదోక్త మంత్రాల్తో చేసిన హోమం తాలూకు నిప్పుని కుండలో వేసుకుని అతడు ముందుకు నడుస్తున్నాడు. వెనుకే తాతయ్య. 'ఇంతవరకూ తాతయ్యే ముందు వుండేవాడు, ఇంకనుంచీ నువ్వే నడవాలి సుమా' అన్న స్థితికి ప్రారంభం అది.
శ్మశానం దగ్గిర శవం ఆగింది.
శాంతి జరిగాక దక్షిణ దిక్కుగా పడుకోబెట్టారు.
పట్టెమంచం మీద పడుకున్నట్టు ఠీవీగా పడుకున్నాడు. ఒక్కొక్కరే చూసి వెళుతున్నారు. అందరిలోకి గుండెలవిసేలా ఏడుస్తున్నది కృష్ణుడు. అతడిని పట్టుకోవటం నలుగురికి కూడా సాధ్యం కాలేదు.
ఏమీ లేనిది సోమయాజికొక్కడికే! ఏమీ లేకపోవటం పరిపూర్ణమైన విషాదానికి ఉచ్చస్థాయి. అది శ్మశాన వైరాగ్యం కాదు. వైరాగ్యం వేరు, వేదాంతం వేరు. ఈ మామూలు ప్రపంచాన్ని వదిలి తాతయ్యతో అతడూ అపికి వెళ్ళిపోయాడు. అతడి కన్నుల్లో నీరు కూడా లేదు. చూసే వారికి ఇతడేమి జడుడా? అన్నట్టు వున్నాడు. అదే స్తబ్దతతో శవానికి చివరి నమస్కారం పెట్టాడు.
కాటి కాపరి కర్ర అందించాడు.
తల్లీ తండ్రీ పోయిన పిల్లవాడికి గోరుముద్దలు తినిపించటానికి తాతయ్య సాచిన చెయ్యి గుర్తొచ్చింది.
అంజలి ఘటించి మంత్రమేదో అనమన్నాడు శ్రాద్ధకుడు. తాతయ్య నేర్పిన మంత్రపుష్పంతో పవిత్రత నాపాదించుకున్న పెదవులు ఆ మంత్రం చదవటానికి వణికాయి.
చితి నటించమన్నాడు కాపరి. ఏ వళ్ళో కూర్చుని పలక పట్టుకున్నాడో, ఆ వంటిని నిర్దాక్షిణ్యంగా తగులబెట్టడానికి ఓనమాలు దిద్దిన వేళ్ళు నిరాకరిస్తున్నాయి.
కుండలో నీళ్ళు తీసుకుని చితి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయించాడు బాపడు. శివుడి గుడిలో 'భక్తికీ, ప్రార్ధానకీ' తేడా చెపుతూ తాతయ్య చేయించిన ప్రదక్షిణలు గుర్తొచ్చి కాళ్ళు తడబడ్డాయి.
ఒక్కొక్కమలుపుకీ ఒకొక్క రంధ్రం చేయిస్తూ, మూడో మలుపులో కుండని బ్రద్దలు కొట్టించాడు కర్మకుడు. తర్వాత వెనక్కి చూడకుండా వెళ్లిపొమ్మన్నాడు. చూపునైతే మరల్చుకుని వెళ్లిపోవచ్చుగానీ, వెంటాడే జ్ఞాపకాలు అంత తొందరగా వదులుతాయా!
ఇంటికి వచ్చాడు. మొగవారంతా ఇంకా కాటి దగ్గరే వున్నారు. వచ్చిన కుర్రవాడికి సానుభూతి చెప్పడానికి ఆడవాళ్ళు తిరిగి గొల్లున ఏడవటం ప్రారంభించారు. అతడికి దుఃఖం రాలేదు. బాధని మర్చిపోవడానికి దుఃఖమే సరిపోతే ప్రపంచంలో అందరూ దుఃఖం ద్వారా ఆనందాన్ని పొంది వుండేవారు.
* * * *
పదిరోజులపాటూ అతడు ఎవరితోనూ మాట్లాడలేదు. తంతు మాత్రం చేశాడు. అస్థికలు ఏరాడు. బూడిద నీటిలో కలిపాడు. అస్థికలు ఏరుతున్నప్పుడు మాత్రం కాస్త దుఃఖం వచ్చింది. ఏ వ్రేళ్ళయితే తన జుట్టులోకి ప్రేమగా దూరి శిరస్సుని దగ్గిరగా లాక్కొని ముద్దిడుకొనేవో, ఆ వ్రేళ్ళ ఎముకల్ని ఏరటం!
పదోరోజున నగ్న ప్రచ్చాదనం చేసి, వస్త్రాన్నీ, గొడుగునీ, పాదుకలనీ దానం చేశాడు. పిండ ప్రధానానికై అన్నం వండాడు. కుండ పగలగొట్టిన రాయిమీద ప్రేతని ఆవాహన చేసి నువ్వుల నీళ్ళు వదిలాడు. తర్వాత అన్నాన్ని అక్కడ పెట్టాడు.
ఎంతకీ కాకి రాలేదు.
ఎన్నెన్నో చెప్పారు.
లాభం లేకపోయింది.
చివరికి పంతులుగారు సోమయాజి భుజం మీద చేయివేసి, "ఈ కుర్రవాడి సంగతి నువ్వు దిగులు పడకు. ఇందరు బావలు, చిన్నాన్నలు వున్నారు. వీరు కంటికి రెప్పలా చూసుకుంటారు" అన్నాడు.
కాకైతే వచ్చింది కానీ ముట్టలేదు.
ఉన్నవారంతా సోమయాజి మా వాడని ముక్తకంఠంతో అన్నాడు. అప్పుడు వచ్చాయి కావుకావుమంటూ మరికొన్ని కాకులు. కన్నుమూసి తెరిచేటంతలో పిండాన్ని ఖాళీ చేశాయి.
చనిపోయినవాళ్ళు నడిచే దోవలో కృష్ణపక్షం ఒక రాత్రి - శుక్ల పక్షం ఒక పగలు మనకి నెల అంటే, వాళ్లకి ఒకరోజు ఈ విధంగా పన్నెండు రోజులపాటు నడుస్తూనే వుంటారు. అందుకే ఏడాదిపాటూ భోజనం పెట్టాలి. ఏడాది కొకసారి తద్దినం మొత్తం 16 మాసికాలు.
అడిగి తెలుసుకునేటందుకు పంతులుగారొకరే వున్నారు.
"స్వామీ" అన్నాడు సోమయాజి కర్మకి ముందురోజున. "-మా అయ్యవారికి దేముడంటే నమ్మకం లేదన్న రోజున కూడా తాతయ్యకి కోపం రాలేదు. అంతటి హేతువాది ఆయన! మరి అటువంటప్పుడు వున్నదో లేదో తెలియని ఆత్మకోసం ఇన్ని తంతు లెందుకు?"
"ఇక్కడ ప్రశ్న దేముడున్నాడా, ఆత్మ వున్నదా అని కాదు నాయనా! సంతృప్తి వున్నదా లేదా అని ఈ శరీరాన్ని ఒక ప్రాణం తన సుఖదుఃఖాలకు కొన్ని సంవత్సరాలపాటూ ఉపయోగించుకుంది. ప్రాణం పోయిన వాడు నిన్నటివరకూ నాతో వున్నవాడు. ఆ శరీరానికి కాస్త అయినా విలువ ఇవ్వాలి కదా! మనతో కలిసి కొంతకాలం జీవించిన ఆత్మని అప్పుడప్పుడు గుర్తు చేసుకోవాలి కదా! ఉదాహరణకి, ఒక పెద్దమనిషికి మనమొక పూలదండ వేస్తాము. అతడు దాన్ని తనతోపాటూ తీసుకువెళ్ళడు. కాని దండ వేసిన మనని ఆదరభావంతో చూసి అక్కడ పెడితే మనకో తృప్తి. అదే మనం చూస్తూ వుండగా చెత్తకుండీలో వేస్తే మనకెలా వుంటుంది? 'రేపు అది వాడిపోయిన తర్వాత చేరేది అక్కడికే కదా' అన్నది పిడివాదం, మన మిత్రుడు, మనతో ఈ ప్రాపంచిక సుఖదుఃఖాలను ఇంతకాలం పంచుకున్నవాడు పోతే, కనీసం సంవత్సరానికి ఒకసారి అయినా అతడిని తల్చుకోటానికే ఏ శ్రద్దాలు, తద్దినాలు! అవే లేనిరోజున ఈ దహనం ఖర్చు మాత్రం ఎందుకు? చావగానే బయట దారిపక్కన పడేస్తే ప్రభుత్వమే తీసుకుపోతుంది కదా!
అందరూ అలా పడెయ్యటం ప్రారంభించిన రోజున వీటిని కాల్చటానికి యంత్రాలు కనుక్కోబడినా మనం ఆశ్చర్యపడనవసరంలేదు."