రాజారావు అందర్నీ ఆశ్చర్యంగా చూస్తున్నాడు. వేరే తలుపు ఒకటి వున్నదనీ, ఇది కేవలం కిటికీ మాత్రమేననీ చాలామంది మరిచిపోయినట్లున్నారు. చాల మామూలుగా దాన్ని గుమ్మలా వాడెస్తూన్నారు.
రాజారావు ఈశ్వరరావుని ప్రత్యేకంగా అభినంధించి "మీరు లేకపోతే ఈ పూటకు తిండితినేదారికూడా వుండేది. కాదు-" అన్నాడు. జనరల్ కంపార్టుమెంటులో ప్రయాణం చేసేవారందరూ కడుపులో భోజనంగానీ ఏదైనా ఆహార పదార్ధంగానీ పడాలంటే- ఈశ్వరరావులాంటి వ్యక్తిని తోడుగా తీసుకువెళ్ళాలి అని రాజారావు వేళాకోళంగా కాక సీరియస్ గానే చౌదరికూడా చెప్పాడు.
తర్వాత ప్రయాణంలో చెప్పుకోతగ్గ విశేషాలు లేవు. పూనా చేరేవరకూ ట్రయిన్ అలా రద్దీగానే వుంది. పూనాలో కాస్త కాలు కదిపే అవకాశం కనబడింది. చౌదరి, రాజారావు, ఈశ్వరరావు కబుర్లలో పడ్డారు. వారు చాలా ఆత్మీయులైపోయారు.
"తిరుగు ప్రయాణానికి రిజర్వేషన్ చేసుకున్నాకనే మనం బొంబాయినుంచి బరోడా బయల్దేరాలి-" అని రాజారావూ, ఈస్వర్రావూ నిర్ణయించుకున్నారు. విక్టోరియా టెరిమినల్ దాకా ఆ ట్రయిన్ వెడుతుందనీ, కానీ ముందుగా దాదర్లోనే దిగిపోయి అక్కడే రిజర్వేషన్ చూసుకోమనీ చౌదరి సలహాఇచ్చాడు. అతనిసలహామేరకు ఇద్దరూ దాదర్లో దిగారు. సుమారు పన్నెండున్నరదాటేక రాజారావు జీవితంలో మొట్టమొదటిసారిగా కంపార్టుమెంటు కిటికీలోంచి బయటపడవలసి వచ్చింది.
దాదర్ ప్లాట్ ఫారం చాలా రష్ గా వుంది. అందుమీద నుంచి బయటపడి కౌంటర్ చేరడానికి వాళ్ళకు పదినిముషాలకి పైగా పట్టింది. ఈశ్వరరావు వెళ్ళి కౌంటరులో విచారించగా హైదరాబాదుకు రిజర్వేషన్ సదుపాయం దాదరులో లేదనీ విక్టోరియా టెరిమినస్ కు వెళ్ళవలసిందనీ తెలిసింది. మళ్ళీ ఇద్దరూ పరుగెత్తి ట్రయిన్ ఎక్కారు. ఫలానా అని పట్టించుకోకుండా కనబడిన కంపార్టుమెంటులో ఎక్కేశారు. అందులో ఎవ్వరూ లేరు. ఏదోలా వుంది. అంత కాళీగా వుంటే కూర్చోవాలంటే!
ట్రయిన్ ఇంకో పదినిముషాల తర్వాత కదిలింది. ఆ ట్రయిన్ లో సుమారు ఇరవయ్యేళ్ళ వయసున్న కుర్రాళ్ళు ముగ్గురూ ఏ మూలనుంచో బయటపడ్డారు. వాళ్ళు తిన్నగా ఒకచోట కూర్చోకుండా కంపార్టుమెంటంతా కలయదిరుగుతూ తరచు రాజారావు, ఈశ్వరరావుల వంక చూస్తూండేవారు రాజారావుకు మనసులో భయంవేసినా మేకపోతు గంభీర్యం వహించాడు. ట్రయిన్లో ఇంకెవ్వరూ లేరు. వీళ్ళు తమని లూట్ చేస్తే చేయగలిగిందేమీలేదు. ఇందొటి ప్రయాణానికీ ఇప్పటి ప్రయాణానికీ తేడాతల్చుకుని రాజారావు అంతభయంతోనూ మనసులో నవ్వుకున్నాడు- "ఒకసారి కంపార్టుమెంటులో వుండ వలసిన కంటే చాలా ఎక్కువమంది వున్నారు. అదోరకం అన్యాయం కారణంగా ప్రయాణికులు నరకం చవిచూశారు. ఇంకోసారి కంపార్టుమెంటులో మరీ తక్కువ ప్రయాణికులు వున్నారు. ఇదీ ప్రమాదమేమరి!
సుమారు రెండుగంటల ప్రాంతాలలో ట్రయిన్ బొంబాయి విక్టోరియా టెర్మినస్ లో ఆగింది. అక్కడ ఈశ్వర్రావూ, రాజారావూ, చౌదరిని కలుసుకున్నారు. రాజారావును కాపలాపెట్టి ఈశ్వరరావు, చౌదరి రిజర్వేషన్ కౌంటర్ వద్దకు వెళ్ళారు. ఆదారులూ అవీ చౌదరి తనే చూపించాడు. ఈశ్వరరావు కు చొరవ ఎక్కువ. చౌదరి రిజర్వేషన్ స్లిప్ పూర్తిచేస్తుండగా అతను కౌంటరులో వ్యక్తిని వివరాలడిగేడు. 19 వ తేదీకి అతనికి టికెట్స్ కావలసి వుంది. ఆ తేదీకి లేవనీ- 22వ తేదీన అయితే ఉన్నాయనీ కౌంటర్ వ్యక్తి చెప్పగానే అతను క్షణాలమీద నిర్ణయం తీసుకుని ఆ తేదీకే ఇచ్చేయమని కోరాడు. అతనికి పేర్లు చెప్పి తను రిజర్వేషన్ స్లిప్ రాయడం మొదలు పెట్టాడు. చౌదరి ఈలోగా స్లిప్ రాసి కౌంటరులో ఇచ్చాడు. కౌంటర్ మనిషి ముందు ఈశ్వరరావు పని పూర్తి చేస్తున్నాడు. అతను రాస్తూండగానే ఈశ్వరరావు త్వరగా రిజర్వేషన్ స్లిప్ అందించాడు. 22 వ తేదీకి వాళ్ళిద్దరికీ రెండు బెర్తులు రిజర్వయ్యాయి.
కౌంటరులో వ్యక్తి చౌదరిచ్చిన స్లిప్ చూసి- "19 కి లేవండీ- 26 దాకా లేవు-" అన్నాడు. చౌదరి గతుక్కుమని "పోనీ 22 కైనాలేవా?" అన్నాడు. ఇప్పుడే అయిపోయాయి. కావాలంటే వెయిటింగులిస్టులో పెడతాను..." అన్నాడు. చౌదరి కోపంగా- "అసలు ముందు వచ్చింది నేను. రిజర్వేషన్ స్లిప్ మొదట ఇచ్చింది నేను..." అన్నాడు. అతను ఈశ్వరరావు వంక గుర్రుగాచూశాడు. కౌంటరులోవ్యక్తి ఇటువంటి విషయాల కలవాటుపడ్డవాడిలా చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు. చివరికి చౌదరి తనపేరు వెయిటింగులిస్టులో వేయించుకున్నాడు. అతనిప్పుడు ఈశ్వరరావు కేసి మామూలుగా చూడలేకపోతున్నాడు. చాలా కోపంగా వుందతనికి.