Previous Page Next Page 
రాయుడిగారి సినిమాకథ పేజి 23

    సుహాసిని స్వరం తగ్గించీ "గట్టిగా అరవకే! అంతా అంటే ఏమో అనుకున్నాను. అతనుకూడా బావను చింపాంజీ అన్నాడు. ఓసారి చింపాంజీని వెళ్ళి చూడాలనుంది. మన జూలో చింపాంజీ ఉందా?" అనడిగింది.   
    "ఈ మధ్యనే వచ్చిందంటున్నారు. చింపాంజీని కొత్తగా ఏం చూస్తావు? రోజూ మీ బావను చూస్తూనే ఉన్నావుగా?" అంది వనజ.   
    "వేళాకోళానికేం లే" అన్ధిఒ సుహాసిని.   
    "అతనెవరోగానీ నాకు నచ్చాడు. నీకిష్టం లేకపోతే చెప్పు. అతన్ని నేను ఈ ప్రపంచమంతా ఎదిరించి అయినా పెళ్ళి చేసుకుంటాను" అంది వనజ ఆమెను కుదుపుతూ.   
    సుహాసిని ఏమీ మాట్లాడలేదు.   
    వనజ మరోసారి ఆమెను కుదిపి "ఏమే-అతన్ని నాకో సారి పరిచయం చెయ్యవూ?" అంది.   
    "అలాగే, చేస్తాన్లే!" అంది సుహాసిని.   
                                                  12   
    సాయంత్రం పార్కులో సుహాసిని బామ్మ. సుబ్బారావు అమ్మ కలుసుకున్నారు. ఒకరి నొకరు ఆప్యాయంగా కౌగలించుకున్నంత పనిచేశారు. సుహాసిని, సుబ్బారావు వేరే చోట కూర్చున్నారు.   
    సుహాసిని సుబ్బారావుకు వనజ అన్న మాటలన్నీ చెప్పింది. సుబ్బారావు కాస్త సిగ్గుపడుతూనే "ఆ అమ్మాయి కులమేమిటి?" అన్నాడు. సుహాసిని చెప్పింది.   
    "శాఖ కలవకపోతేనే అమ్మ ఒప్పుకోదు. కులం కలవకపోతే ఒప్పుకుంటుందా? ఈ విషయం ఆ అమ్మాయికి చెప్పండి" అన్నాడు సుబ్బారావు.   
    సుహాసిని చటుక్కున లేచి వెళ్ళి సుభద్రమ్మ కాళ్ళకు నమస్కరించి "మీరు చాలా గొప్పవారు. మీ ఆశయాలు చాలా గొప్పవి" అని సుభద్రమ్మ ఆశ్చర్యపడి ఏదో అడిగే లోగా మళ్ళీ వచ్చి సుబ్బారావు పక్కన కూర్చుంది.  
    "ఆఁ మా అబ్బాయేదో పొగిడి ఉంటాడు. మా అబ్బాయితో కాసేపు ఎవరైనా మాట్లాడారంటే నాకొచ్చి దణ్ణం పెట్టాల్సిందే!" అంది సుభద్రమ్మ. ఈ మాటలు సుబ్బారావు క్కూడా వినిపించాయి. మళ్ళీ బామ్మకు కోపం వస్తుందేమోనని- అతను కూడా ఓసారి లేచి వెళ్ళి బామ్మగారికి దణ్ణంపెట్టి వచ్చాడు. బామ్మగారతన్ని వెయ్యేళ్ళు జీవించమని ఆశీర్వదించింది.   
    "మీరు మా బామ్మకెందుకు దణ్ణంపెట్టి వచ్చారు?" అంది సుహాసిని.   
    "ఆవిడ చిన్నబుచ్చుకోకుండా! మరి మీరు మాఅమ్మ కెందుకు దణ్ణం పెట్టారు?"   
    "వనజను మీరు పెళ్ళిచేసుకుంటారేమోనని భయపడ్డాను. మీ అమ్మగారి ఆశయాల కారణంగానే ఆ పెళ్ళి జరుగదనేసరికి అప్రయత్నంగా ఆవిడ కాళ్ళకు మొక్కి రావాలన్న ఆలోచన కలిగింది" అంది సుహాసిని.  
    "ఏం! వనజ మంచిది కాదా?" అన్నాడు సుబ్బారావు.   
    "నేను చెడ్డవాళ్ళతో స్నేహం చెయ్యను..." అంది సుహాసిని.  
    రాయుడు ఉత్సాహంగా పొదలచాటున ఈలవేయబోయి ఆగిపోయాడు. తర్వాత నెమ్మదిగా రామగోపాల్ తో, "వీళ్ళు అసలైన ప్రేమికుల్లా మాట్లాడుకోబోతున్నారు. ఇంక మీదట ప్రతి డైలాగూ శ్రద్దగా రికార్డు చేయండి" అన్నాడు.  
    సుబ్బారావోసారి నుదుటి మీద కొట్టుకుని "నేనూ అంతే!" అని "అన్నట్లు మరిచే పొయ్యాను. పులిహోర ఆవకాయ ఎలా ఉంది?" అన్నాడు   
    పొదలచాటున రాయుడు తలపట్టుకున్నాడు.   
    "చాలా బాగుంది. అసలు నేను భోంచేశాక మీ ఇంటికి వెళ్ళాను. ఆ ఆవకాయ వాసనకుండబట్టలేక దారి లోనే కాస్త రుచి చూశాను. ఇంటికి వెళ్ళగానే అదొక్కటీ వేసుకుని మళ్ళీ అన్నం తిన్నాను" అంది సుహాసిని.   
    "అనుకున్నాను. మొట్టమొదట అది రుచి చూసిన వాళ్ళందరూ అలాగే చేశారు. మీరూ అలాగే చేశారు. మనుషులంతా ఒక్కటేనండీ" అన్నాడు సుబ్బారావు.   
    ఆ రోజు వాళ్ళ సంభాషణంతా ఊరగాయల మీదే నడిచింది.   
    ఇంటికి వెళ్ళేక రాయుడు రచయితతో "లాభం లేదయ్యా ఇలాంటి చచ్చుప్రేమికులే ప్రపంచంలో ఉండరు" అన్నాడు.   
    "చూశారా! ఆశ మీ మాటల్లోనే ధ్వనిస్తోంది" అన్నాడు రచయిత.   
    "నా మాటల్లో ఆశ నీకెక్కడ అనిపించిందయ్యా" అన్నాడు రాయుడు.   
    "రవికాంచనిచో కవిగాంచునే కదా!" అంటూ రచయిత రాగయుక్తంగా పద్యంపాడి "మీరు వాళ్ళని చచ్చు మనుషులు అనడానికి బదులు, చచ్చు ప్రేమికులు అన్నారు అలాంటి చచ్చు ఘటాల్ని ప్రేమదావా ఈడ్చుకొచ్చిన ఘనత మనకే దక్కుతుంది. ఆ ప్రేమను మనం బలపరచాలి. ఎలాగంటే, స్టూడియో-సీక్వెన్స్! పార్కులో ఒంటరిగా సుహాసిని, సుబ్బారావు- ఉన్నట్లుండి అక్కడ భోరున వర్షం తడిసిన వళ్ళుతో ఆ ప్రేమికులు ఒకరికొకరు దగ్గరౌతారు. శరీరాలతోపాటు మనసులూ దగ్గరవుతాయి."   
    "బాగుంది నీ ఆలోచన. మరీ ఆ బామ్మనీ, సుభద్రమ్మనీ వాళ్ళ నుంచి వేరుచేయడమెలా?" అన్నాడు రాయుడు.   
    "ముందు పార్కులో వర్షానికి ఏర్పాట్లు చేయండి. ముసలాళ్ళ సంగతి నేను చూసుకుంటాను" న్నాడు రచయిత.   
    నేతాజీ సుభాష్ చంద్రబోస్ పార్కు మరీ అంత పెద్దదేంకాదు. రాయుడి ఫిల్మ్ యూనిట్ వాళ్ళు కోరగానే వాన కురిపించే ఏర్పాట్లు అక్కడ త్వరగానే చేసేశారు. ఏర్పాట్లన్నీ జరిగేక ఓసారి వానను పరీక్షచేసి అంతా సంతృప్తికరంగా వచ్చేక మర్నాడు రాయుడు పథకం వేసుకున్నాడు.   
    పార్కు దగ్గరకు రాగానే భూత భవిషద్వర్తమానాలు వున్న ఉన్నట్లు చెబుతానంటూ ఓ సాధువు బామ్మనూ, సుభద్రమ్మనూ ఆపాడు. సుబ్బారావు, సుహాసిని కూడా జాతకాలు చూపించుకుందుకు సరదాపడ్డారు. కానీ సాధువు ముప్పై సంవత్సరాల లోపు వారికి జోస్యం చెప్పడట. ఆయన బామ్మవంక చూసి "మహాత్ముల శీలాన్ని శంకిస్తు ఎన్నో కథలున్నవి. మాపై అటువంటి అపప్రథ మేము సహించలేము. అందుకే మేము వయసులో ఉన్న స్త్రీ పురుషులను మా చెంతకు రానివ్వము" అన్నాడు. ఆయన నివాసం అక్కడకు దగ్గరలోనే. బామ్మ, సుభద్రమ్మ మంత్రముగ్దుల్లా ఆయన వెంట నడిచి వెళ్ళారు.   
    పార్కులోపల సుహాసిని, సుబ్బారావు ఎప్పటిలాగే ఎప్పటిచోటే కూర్చున్నారు. సుహాసిని సుబ్బారావుతో "జూకు వెళ్ళి చింపాంజీని చూడాలని నాకు చాలా కోరికగా ఉంది" అంది.   
    "వచ్చే ఆదివారం మనం నలుగురం కలిసి వెడదాం" ఆనందు సుబ్బారావు ఆమెవైపే చూస్తూ.   
    "నిజంగా మా బావ చింపాంజీలాగే ఉంటాడా?" అంది సుహాసిని.   
    "చూస్తే మీకే తెలుస్తుంది" అన్నాడు సుబ్బారావు.   
    "చింపాంజీలాగే ఉంటే బావను నేనుపెళ్ళిచేసుకోను" అంది సుహాసిని.

 Previous Page Next Page