Previous Page Next Page 
రాయుడిగారి సినిమాకథ పేజి 22

    అయితే రాయుడు అసహాయుడు ఆయన చూస్తూండగా బామ్మ సుహాసినినీ- సుభద్రమ్మ సుబ్బారావునీ వెంటబెట్టుకుని వెళ్ళిపోయారు.   
    "ఏమయ్యా రచయితా! ఇప్పుడేది దారి మనకు?" అన్నాడు రాయుడు.   
    "సినిమాలో విశ్రాంతి చూపించడానికింతకంటే పట్టయిన సన్నివేశం ఉంటుందంటారా?" అన్నాడు రచయిత.  
    "బాగానే ఉంది. కథ మొత్తం విశ్రాంతి తీసుకుంటే ఎలా?"   
    "అలా కంగారు పడకండి. కథ కొంత మనం నడిపిస్తూంటే కొంత పాత్రలు నడిపిస్తున్నాయి. ఇప్పుడు కొంపలేం మునగలేదు. మళ్ళీ మనం కలగజేసుకోవాల్సిన సమయం వచ్చింది. అంతే!" అన్నాడు రచయిత.  
    "నేను బెంగపెట్టుకుని కూర్చుంటే నువ్వు చాలా నమ్మకంగా కనబడుతున్నావు. ఏవో అయిడియా లున్నట్లున్నాయి నీ దగ్గర" అన్నాడు రాయుడు ఆశగా.
    రచయిత వెంటనే ఏమీ బదులివ్వకుండా గర్వంగా నవ్వాడు.  
                                                  11
    రచయిత సుబ్బారావుతో మాట్లాడాడు. సుహాసిని భవిష్యత్తు గురించి చర్చించాడు. నీకాపిల్ల ప్రభాకరం పాలబడడం ఇష్టమేనా అని అడిగాడు. సుబ్బారావు వంటి ఉత్తముడు సుహాసినివంటి అమాయకురాలికి సాయపడక పోవడం అన్యాయమన్నాడు. అన్నీ అయినాక సుబ్బారావు నెమ్మదిగా, "మా పెళ్ళి జరుగదు. శాఖ కలవకపోతే అమ్మ ఒప్పుకోదు" అన్నాడు.  
    "నీ పెళ్ళి గురించి ఎవరు చెప్పేరయ్యా? ఆ అమ్మాయి పెళ్ళి ప్రభాకరంతో జరక్కుండా ఆపాలన్నాడు. అంతేకదా! అలా జరగాలంటే ముందు మీ అమ్మా వాళ్ళ బామ్మా సఖ్యంగా ఉండాలి. అందుకు నువ్వె రాయబారం నడపాలి" అన్నాడు రచయిత.  
    "ఆ బామ్మగారి పేరు చెబితేనే మా అమ్మ మండి పడుతోంది. నాకు చాలా భయంగా ఉంది. మీరిచ్చే ఉద్యోగానికో నమస్కారం. ఇంకా నా జోకిలి రాకండి" అన్నాడు సుబ్బారావు.  
    "సులభమైన పద్దతి నేను చెబుతానుగదా!" అన్నాడు రచయిత.  
    సుబ్బారావు అంతా జాగ్రత్తగా విని సుహాసిని ఇంటికి వెళ్ళాడు. అతడు వెళ్ళిన సమయానికి సుహాసిని తండ్రి రాఘవయ్య ఉన్నాడు. ఆయన సుబ్బారావును చూసి, "ఎవరి కోసం?" అనడిగాడు.   
    "బామ్మగారి కోసమండీ!" అన్నాడు సుబ్బారావు.
    "మా యింట్లో ఓ బామ్మ  ఉందని నీకెలా తెలుసు?" రాఘవయ్య ఆశ్చర్యంగా అడిగాడు.  
    "ఆవిడ నా స్నేహితురాలండి!" అన్నాడు సుబ్బారావు.  
    రాఘవయ్య నవ్వాపుకోలేకపోయాడు. "ఏమన్నావ్! మా అమ్మ నీకు స్నేహితురాలా?" అన్నాడు "ఆవిడ మనుమడి ఈడుంటుంది నీకు!"  
    "ఒకరి మనసు ఒకరు అర్ధం చేసుకోవాలి గానీ స్నేహానికి వయసుతో నిమిత్త మేముంటుందండీ? నాకావిడ మసుమడి వయసు అని తెలుసు. అయితే ఆవిణ్ణి బామ్మగారంటున్నాను. ఓసారి ఆవిణ్ణి పిలుస్తారా?" అన్నాడు సుబ్బారావు.  
    రాఘవయ్య ఓసారి సుబ్బారావుని ఎగాదిగా చూసి "అమ్మా!" అని పెద్దగా కేకపెట్టాడు. లోపల్నుంచి "ఎందుకురా?" అన్న జవాబు వచ్చింది.  
    "నీ స్నేహితుడు వచ్చాడు" అన్నాడు రాఘవయ్య.  
    "నాకు స్నేహితుడేమిట్రా" అంటూ బామ్మగారక్కడికి వచ్చి సుబ్బారావుని చూసి "నువ్వా?" అంది.  
    సుబ్బారావు చటుక్కున బామ్మగారికాళ్ళకు సాష్టాంగ పడిపోయాడు. బామ్మకు ఏమనాలో తెలియలేదు. "ఏమిటిది బాబు లే!" అంది ఆఖరికి.   
    సుబ్బారావు లేచి నిలబడి "మీతో ఏకాంతంగా పది నిముషాలు మాట్లాడాలండి" అంటూ రాఘవయ్య వంక అదోలా చూశాడు.   
    "ఏం మాట్లాడాలి?" అంది బామ్మ.  
    "నన్ను మా అమ్మ పంపిందండి" అన్నాడు సుబ్బారావు.   
    బామ్మగారు సుబ్బారావును పెరట్లోకి తీసుకువెళ్ళి "ఇప్పుడు చెప్పు!" అంది.   
    "మా అమ్మకు మీరెంతో నచ్చారండి. తీరి కూర్చుని గొడవ తెచ్చుకున్నానని బాధ పడుతోందండి. తన తప్పు క్షమించమందండి. రోజూ మళ్ళీ ఎప్పటిలాగే కలుసుకుందామని చెప్పిందండి. పాత గొడవలు మరిచిపోదామందండి" అన్నాడు సుబ్బారావు.   
    బామ్మ తొందరగానే కరిగిపోయి. "ఏముంది. వడ్లగింజలో బియ్యపు గింజ- సరే - అలాగే వస్తానని చెప్పు" అంది.   
    "సుహాసిని లేదాండీ- తనక్కూడా ఈ విషయం చెప్పమందండి."   
    "అది వాళ్ళ స్నేహితురాలింటి కెళ్ళింది. పక్క వీధి లోనే దానిల్లు."  
    సుబ్బారావు అక్కణ్ణించి సుహాసిని స్నేహితురాలింటికి వెళ్ళాడు. ఆ యిల్లు చిన్నది. వీధి గదిలోకూర్చుని సుహాసినీ, స్నేహితురాలూ కారమ్స్ ఆడుతున్నారు. సుబ్బారావుని చూస్తూనే సుహాసిని స్నేహితురాలు "నలుడా, నలకూబరుడా, ఎవరే ఈ అందగాడు. ఎవరికోసం వచ్చాడో ఏమో నా కోసమైతే బాగుండును" అంది. ఈలోగా సుబ్బారావు సుహాసినిని పిలువనే పిలిచాడు. సుహాసిని వెనక్కు తిరిగి సుబ్బారావుని చూసి గుర్తుపట్టి "మీరా?" అనడిగింది.   
    "అవునండి. ఒక్క నిముషం మీతో మాట్లాడాలి!" అని సుహాసిని బయటకురాగానే తను చేసిన పని చెప్పి "ఊరికే తీరి కూర్చుని పెద్దలు కలహించుకోవడం బాగోలేదని నే నీపని చేశాను. మీరు కూడా మా యింటి కొచ్చి బామ్మగారు బాధపడుతున్నట్లు మా అమ్మకు చెప్పండి. గొడవ పూర్తవుతుంది. మీరొచ్చినప్పుడు కొంచెం పులిహోర ఆవకాయ కూడా తీసుకుని వెళ్ళచ్చు" అన్నాడు.   
    సుహాసిని సరేనంది. సుబ్బారావు వెళ్ళిపోయాక "ఎవరె ఆ నవమన్మధుడు? నీతో ఏం మాట్లాడాడు?" అనడిగింది స్నేహితురాలు.
    "ఏముంది వనజా! అతను నాకు స్నేహితుడు..." అంది సుహాసిని.  
    "ఓహో - అయితే ప్రేమించేవన్నమాట!" అంది వనజ.   
    "ప్రేమ ఏమిటే! నేను ప్రభాకరం బావను పెళ్ళి చేసుకుంటానుగా?" అంది సుహాసిని అమాయకంగా.   
    "ఆ నల్ల మొద్దును, ఆ చింపాంజీని నువ్వు చేసుకోకే నా గుండె బద్దలైపోతుంది. ఇతనెంతో బాగున్నాడు. ఇతన్ని చేసుకో" అంది వనజ.   
    "బాగుంది. ఎవర్ని పడితే వాళ్ళని పెళ్ళి చేసుకోడాని కిదేమన్నా సినిమా అనుకున్నావా? మాకూ, వాళ్ళకీ, శాఖలు కలవలేదు" అంది సుహాసిని.  
    వనజ ఆశ్చర్యంగా సుహాసిని వంక చూసి, "ఎవరూ మా సుహాసినే ఈ మాటలంటున్నది, నీ ప్రభాకరం బావని చింపాంజీ అనగానే షటప్ అని మండి పడేదానివి- ఇప్పుడు శాఖ కలిస్తే ఆ వెళ్ళినతన్ని పెళ్ళి చేసుకుందునంటున్నావు" అంది.

 Previous Page Next Page