"తల తిరిగినట్టుంది. సంతోషీమాత పేరుతో శుక్రవారం, సాయిబాబా పేరుతో గురువారం, వెంకటేశ్వరస్వామి పేరుతో శనివారం-రోజూ ఉపవాసం చేస్తే ఏమౌతుంది? మొన్న గురువారం ఉపవాసం, నిన్న శుక్రవారం ఉపవాసం, ఈ రోజూ ఏం తినకూడదని తినలేదు. కళ్ళు తిరగక ఏమౌతుంది?" అంది కాంచన నాయనమ్మ.
"ముహూర్తం మించిపోతుంది. అమ్మాయిని పీటమీద కూర్చోబెట్టండి" చెప్పాడు పురోహితుడు.
"ఇప్పుడు ఈమెకు విశ్రాంతి చాలా అవసరం. ఇంట్లోకి తీసికెళ్ళి పడుకోబెట్టండి" చెప్పాడు అరవింద్.
"ఇప్పుడు విశ్రాంతి ఏమిటి లగ్నం సమీపించాక? మెడలో ఆ మూడుముళ్ళు పడిపోతే అలాగే విశ్రాంతి తీసుకుంటుందిలెండి. ఈ జీలకర్ర బెల్లం ముద్ద కొంచెం చేతికి తీసుకోండి బాబూ....అమ్మా మీరు కూడా...." పురోహితుడు జీలకర్ర బెల్లం ముద్దా అరవింద్ కి కొంత యిచ్చి, కాంచనకి కొంత యిచ్చి, కాంచనకి కొంత యిచ్చాడు.
అరవింద్ తన చేతిలో వున్న ముద్దా ముందున్న పళ్ళెంలో పడేసి లేచాడు. "ఇప్పుడు పెళ్ళి జరగడానికి వీల్లేదండీ. ముందు ఆమెని తీసుకెళ్ళి విశ్రాంతిగా పడుకోబెట్టండి" మరింత సీరియస్ గా చెప్పాడు.
అందరూ శిలాప్రతిమల్లా చూస్తూ నిలబడితే రామకృష్ణ కోపంగా ముందుకు దూసుకువచ్చాడు. "పెళ్ళి జరగడానికి వీల్లేదా? అదేమిటి? నీకేమయినా మతిపోయిందా? కాంచనకి ఇప్పుడేమైందని? ఇప్పుడు బాగానే వుందికదా?"
"కాంచనకి విశ్రాంతి చాలా అవసరం. చెబితే అర్ధం చేసుకోరెందుకు?" కొంచెం చిరాకుగా అన్నాడు అరవింద్.
"నేను కూడా డాక్టర్నే. కాంచనకి ఏమీ కాలేదని నాకు తెలుసు. ఉపవాసాల వలన వచ్చిన ఉపద్రవం యిది. దీనికింత రాద్దాంతం చేస్తావేమిటి?" పీటల మీది పెళ్ళి ఆగిపోవడమంటే మాటలనుకున్నావా?" ఆవేశంగా అడిగాడు రామకృష్ణ.
"అసలు మొదటినుండి నాకు పెళ్ళి ఇష్టంలేదని నీకు తెలుసుకదా? అమ్మ బలవంతంతో, మీ బలవంతంతో వప్పుకున్న పెళ్ళి యిది. ఎందుకో నా మనసు ఎదురు తిరుగుతోంది. నేనీ పెళ్ళి చేసుకోలేను."
రామకృష్ణకి ఎంత కోపం వచ్చిందంటే లాగి ఒక్కటిద్డామనిపించింది. తమాయించుకున్నాడు. "ఇంతవరకూ వచ్చి ఇప్పుడు పెళ్ళి చేసుకోనంటే ఎలా?"
"నా మనసు చివరి క్షణంలో ఎదురుతిరుగుతూందని చెప్పాకదా? పెళ్ళంటే ఇష్టం లేనివాడిని బలవంతంగా చేసుకుని ఆమె జీవితం నరకం చేయలేను."
"ఆడపిల్లకి పీటలమీది పెళ్ళి చెడిపోతే అంతకంటే మరో నరకం వుండదు. ఇంత దూరం వచ్చి పెళ్ళి చేసుకోను అంటే ఎవరూ వప్పుకోరు."
"చివరి క్షణంలోనైనా ఒక దుర్ఘటన జరుగకుండా తప్పిపోయిందని సంతోషపడాలిగాని బాధ ఎందుకు? ఒక మనసు నిలకడ లేనివాడితో పెళ్ళి ఆమెకు ఏ మాత్రం సుఖకాంతులనివ్వదు. ప్లీజ్! నన్ను వదిలేయండి" కళ్యాణవేదిక దిగి కారు దగ్గరికి వెళ్ళబోయాడు.
అప్పటికే ఆడవాళ్ళు, మగవాళ్ళు కోపంగా అరవడం ప్రారంభమయింది. అందరూ ఒక్కసారిగా మాట్లాడటం వలన ఎవరి మాటా స్పష్టంగా వినబడటంలేదు. ఏదో ప్రమాదం జరిగితే కాకులు అరిచినట్టుగా కాకిగోలగా తయారయింది అక్కడ వాతావరణం.
"మిమ్మల్ని వదిలేయదమా? ఒక్క అడుగు కూడా వేయలేరు మమ్మల్ని దాటి" పల్లెటూరి యువకులు తువాళ్ళు నడుముకు బిగించి గొలుసుకట్టుగా అతడికి అడ్డుగా నిలబడ్డారు అయిదారుగురిదాకా.
మాధవరావుగారూ, అతడి తల్లీ కోపతాపాలకి పోకుండా దీనంగా కళ్ళనీళ్ళతో వేడుకుంటున్నారు. అతడి చేతులు గడ్డాలు పట్టుకుని "బాబూ! పీటలమీది పెళ్ళి చెడిపోతే మేం తలెత్తుకోలేం. ఆ పిల్లకు మళ్ళీ సంబంధం కుదరడం ఎంతో కష్టం. అసలు ఏం తప్పు చేసిందని దానికీ శిక్ష?"
"ఎవరి తప్పు ఏం లేదు. నాకే ఈ పెళ్ళి ఇష్టంలేదు."
"ఒక్కమాట....ఇంకొక్కమాట మాట్లాడకుండా పెళ్ళిపీటల మీద కూర్చో. పిచ్చిపిచ్చిగా చేశావంటే కాళ్ళు చేతులు విరిచేస్తాను" తండ్రి సుదర్శనంగారు ఉగ్రంగా అరిచారు.
ఇంత వయసు వచ్చినా, ఇంత పెద్ద డాక్టరు అయినా ఏనాడూ తండ్రి మాటకు ఎదురాడనివాడు, మొదటిసారిగా ఆయన్ని లక్ష్యపెట్టనట్టుగా అన్నాడు అరవింద్. "మీకు తెలీదు నాన్నగారూ! ఈ విషయంలో మీరు కల్పించుకోవద్దు."
విసవిసా నడిచి కారెక్కబోయాడు అరవింద్.
కాంచన మేనమామ రగిలిపోతున్న అగ్నిపర్వతంలా అరవింద్ రెక్కపట్టి లాగాడు. "పీటలమీద పెళ్ళి చెడగొట్టి వెళ్ళిపోతానంటే ఎవరు వూరుకుంటార్రా? ఇంకొక్కమాట మాట్లాడావంటే నీ బాడీ క్షణంలో పచ్చడిగా మారిపోతుంది" అసలే దీర్ఘకాయుడు-పైగా కసరత్తు చేసే శరీరం ఉక్కుముక్కలా వున్నాడు. అరవింద్ పచ్చడి కావడానికి ఒకటి రెండు గుద్దులకంటే ఎక్కువ అక్కరలేదు.
ఇహ చెప్పక తప్పలేదు అరవింద్ కు. "ఒక ఆడపిల్ల అల్లరిపడకూడదని, పదిమందిలో మీ మర్యాద పోకూదదన్న సదుద్దేశ్యంతో నింద నా మీద వేసుకుని వెళ్ళిపోదామనుకున్నాను. కానీ నిజం బట్టబయలు చేయనిదే నన్ను వదిలేలా లేరు ఏం చేయను? మీకు మీరు చేసుకుంటున్న అవమానం యిది. మాధవరావుగారూ! మరో ఏడు నెలల్లో మీ అమ్మాయి మిమ్మల్ని తాతయ్యను చేయబోతూంది. పాలిపోయిన ఆమె ముఖం చూసినప్పుడే నాకు అనుమానం వచ్చింది. పల్స్ చూశాక నిర్ధారణ అయింది. నేను కన్యను పరిగ్రహించడానికి వచ్చానేగాని కడుపుతో వున్నదాన్ని కాదు"