Previous Page Next Page 
వెలుగుబాట పేజి 22

 

    కుమార్ ప్రాక్టీస్ బాగా అభివృద్ధి చెందుతోంది. ప్రతిరోజూ ప్రాక్టీస్ అయిపోయిన కొద్దిసేపు సుందరమ్మా, కుమార్ అదీ, ఇదీ  మాట్లాడుకుంటారు. సుందరమ్మ అప్పులో కొంత తీర్చబోయాడు కుమార్. సుందరమ్మ తీసుకోకుండా "ఆస్పత్రికింకా పరికారాలేవో కొనాలనుకున్నావుగా బాబూ! కొను. నా అప్పు అంతా ఒకేసారి  తీసుకుంటాను, వడ్డీతో సహా" అంది. ఆ తరువాత బోసుబాబు తన దగ్గరకు వచ్చిన సంగతి కొంత సంతృప్తితో చెప్పింది.
    కుమార్ చాలా బాధపడి "తండ్రి తప్పుకు కూతుర్ని శిక్షించటం అన్యాయం" అన్నాడు. సుందరమ్మ ఉగ్రురాలై "బాబూ! నాకు న్యాయం, అన్యాయం ఏమీలేవు. నీ కసి తీర్చుకోవటం ఒకటే నాకు న్యాయం! అంది. ఆ ఉగ్ర రూపాన్ని చూస్తూ ఏమీ అనలేక పోయాడు కుమార్. అదే సమయానికి సరళి వచ్చింది అక్కడికి సరళ, సుందరమ్మ ఒకరినొకరు చూసుకున్నారు. సరళి నవ్వబోయింది కాని, సుందరమ్మ సుఖం తిప్పుకుంది.
    "బాగున్నావా సరళా!" అన్నాడు కుమార్.
    "బాగుంటే, మీదగ్గరకెందుకొస్తాను డాక్టర్ బాబూ!" అంటూ, మోచేతులమీసా మోకాళ్ళమీదా ఉన్న దెబ్బలు చూపించి, "ఇంకా చూపించటానికి వీల్లేనిచోట బోలెడు దెబ్బలున్నాయి. ఏదైనా మందియ్యండి, పైన రాయటానికి. అయెడిస్ రాసాను తగ్గలేదు. అందరూ వున్నప్పుడు రావటానికి సిగ్గేసి ఇప్పుడొచ్చాను" అంది.
    ఎర్రగా వాతలు తేలిన ఆ దెబ్బలుచూసి కటకట లాడాడు కుమార్.
    "ఇవన్నీ మాధవరావు కొట్టినవేనా!"
    "ఆ! అన్నీ పతిదేవుడి ప్రేమ బహుమానాలే."
    "ఛీ! వాడు మనిషేనా? ఇంత రాక్షసంగా ఎలా ప్రవర్తిస్తున్నాడు? నువ్వెందుకు భారిస్తున్నావు? ఎదురుతిరగాలేదా?"
    "నాకు హాయిగావుందికానుక భరిస్తున్నాను."
    "ఏమన్నావ్? హాయిగా ఉందా?"
    "అవును డాక్టర్ బాబూ! చాలా హాయిగా ఉంటుంది. శరీరానికి బాధగా ఉంటుంది కాని, మనసు కేదో సంతృప్తిగా ఉంటుంది. ఆనాడు  నా కారణంగా రామయ్య దెబ్బలు తిన్నాడు. అప్పుడు నేనేమీ చెయ్యలేకపోయాను. ఇప్పుడు నా వంటిమీద దెబ్బ పడినప్పుడల్లా, రామయ్యలాగే నేనూ దెబ్బలు తింటున్నాను అని సంతృప్తి పడుతుంటాను. రామయ్య ఒక్కసారే దెబ్బలుతిని హాయిగా చచ్చిపోయాడు. నేను రోజు రోజూ చావుదెబ్బలు తింటూ చావురాక బ్రతుకుతున్నాను."
    సరళ  పిచ్చిదానిలాగా నవ్వుతోంది. కాని, ఆ పిచ్చి పిల్ల మనసు ఎంత లోతైనదో అది ఎంత ప్రేమపూరితమో బాగా అర్ధమయింది కుమార్ కి.
    మందు రాసిచ్చి, "ఈ ఆయింట్ మెంట్ మీ నాన్నతో తెప్పించుకో! నా దగ్గర మందులుండవు" అన్నాడు.
    "వెళ్ళొస్తాను డాక్టర్ బాబూ! వస్తాను వదినగారూ!" అని ఇద్దరికీ నమస్కారం చేసి వెళ్ళిపోయింది సరళ.
    "వదినగారు!" అన్న పిలుపు సుందరమ్మ మనసును మధించివేసింది. భరించలేనట్లు చెవులు చేతుల్తో మూసుకుంది. ఎంత నిగ్రహించుకున్నా కళ్ళు నీళ్ళతో నిండిపోయాయి ఆ కళ్ళుచూసి సంతృప్తితో కూడిన చిరునవ్వుతో 'ఇంపాసిబుల్ సుందరమ్మగారు? ఎంత ప్రయత్నించినా మనిషి రాక్షసి కాలేడు. అందులో మంచి మనుష్యులు అసలు కాలేరు" అన్నాడు కుమార్.

 

                                                     *    *    *


    "శాంతమ్మతల్లీ!" అంటూ చేతిలో సంచితో వచ్చిన ఝాన్సీ తల్లినిచూసి నిర్ఘాంతపోయింది శాంతమ్మ. ఝాన్సీ తల్లి శాంతమ్మ కూచోమనకుండా, తనే ఒక కర్రకుర్చీ చూసుకొని కూర్చుంటూ సంచిలోంచి రేమడు సీసాలుతీసి "ఇది చింతకాయపచ్చడి, ఇది ఉసిరికాయపచ్చడి. ఏదో నంజుకోవటానికి వుంటుందని తీసుకొచ్చాను" అంది. మతి పోయినట్లయిన శాంతమ్మ తడబడుతూ "అయ్యో బాపనమ్మా! ఇయ్యన్నీ దేనికి! అభిమానంతో మా ఇంటి కొచ్చిందే చాలు! అంది తనూ ఓ కుర్చీలో కూచుని.
    "అంతమాటనకు. ఆ రోజు నువ్వెళ్ళిపోయాక నా కంటికి కునుకురాలేదనుకో! ఏదో పెద్ద ముండావాళ్ళం- ఇలాంటివి ఒకళ్ళతో పోవు, వంశ పారంపర్యంగా పట్టుకు పీడిస్తాయి. అందులో మా బ్రహ్మల్లో మరీ పీడించుకు తింటారు. అందుకని అలా మాట్లాడాను. ఈ ఊళ్ళో మీకు తెలిసిన వాళ్ళుండి అలా వెళ్ళిపోయారనుకున్నాను. అంతేగాని ఏ ఆధారమూ లేకుండా, ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళారనుకో లేదు- మా ఝాన్సీ నామీద విరుచుకుపడేవరకూ ఆ సంగతి తెలీలేదు. ఆ తరువాత ఎంత బాధపడ్డానో, ఆ దేవుడికే తెలియాలి."

 Previous Page Next Page