Previous Page Next Page 
యుగాంతం పేజి 22

   

     అదే వాళ్ళని కోటలా కాపాడుతూంది. ఐదురోజులపాటూ వాళ్ళు ఆ నమ్మకంతోనే బ్రతుకుతారు. తరువాత చచ్చిపోతారు. అది వేరే సంగతి. ఈ ఐదు రోజుల సంగతి? తనకున్న మానసిక వ్యధ వాళ్ళకి లేదు. చావు దగ్గరవుతూందన్న చింతలేదు. భక్తి వాళ్ళని కాపాడుతూంది. ఆ గొడుగు క్రింద వాళ్ళు రక్షణ తీసుకొంటున్నారు.
   
    అజ్ఞానం మనిషిని రక్షిస్తుంది.
   
    తను దాన్ని నమ్మలేడు.
   
    నమ్మలేకపోవటం తన ఖర్మ నమ్మితే ఎంత బావుణ్ణు నమ్మగలిగితే చాలు ఇంకా ఏ ఘర్షణా వుండదు.
   
    వాళ్ళెంత ఆనందంగా వున్నారు!
   
    తన వాస్తవికతా వాదనతో వాళ్ళ ఆనందాన్ని ఎందుక్కాదనాలి? అసలు అనటానికి తనకేం హక్కుంది?
   
    అతడు స్కూటర్ మీద సాగిపోయేడు.
   
    ఇంకా అయిదు రోజులు.... తన ఆనందాన్నీ- విషాదాన్నీ పంచుకోవడానికి తన కెవరూ లేరు. ఈ అయిదురోజులూ హాయిగా, నిశ్చింతగా గడపాలి. ఎలా వస్తుంది నిశ్చింత? ఎలా దొరుకుతుంది ఆనందం? వాటీజ్ ది బెస్ట్ వే ఆఫ్ స్పెండింగ్ ది లాస్ట్ ఫైవ్ దిస్ ఆఫ్ ది హ్యూమన్ లైఫ్!
   
    అతడు నగరంలో ప్రవేశించాడు. ఆ నగరం నగరంలా లేదు. పాటుపడిన స్మశానంలా వుంది. రోడ్లు నిర్మానుష్యంగా వున్నాయి. కొన్ని ఇళ్ళు రాత్రి జరిగిన భీభత్సానికి కూలిపోయి వున్నాయి.
   
    అతడొక పెద్ద హోటల్ ముందు ఆగి, లోపలి ప్రవేశించాడు. కౌంటర్ దగ్గర ఎవరూ లేరు. స్టార్ హోటల్ అది. సర్వర్లూ, వెయిటర్లూ కూడా లేరు. తినుబండారాలన్నీ నేలమీద చల్లినట్లున్నాయి. బాగా తిని వదిలేసినట్టున్నారు.
   
    రిసెప్షన్ పక్కనుంచి మెట్లెక్కి రూమ్ వైపు వచ్చేడు.
   
    మొదటి అంతస్థులో ఎయిర్ కండిషన్డ్ గదులున్నాయి. కరెంట్ పోకపోయినా, ఎవరో  జనరేటర్ 'ఆన్' చేసినట్టున్నారు. సన్నగా చప్పుడు వినిపిస్తూంది.
   
    కారిడార్ నిర్మానుష్యంగా వుంది.
   
    రూమ్ నంబర్ నూట ఒకటి దగ్గర నిలబడ్డాడు. నెమ్మదిగా డోర్ నాబ్ తిప్పి తోసేడు. లోపల ఎయిర్ కండీషనర్ పనిచేస్తున్న శబ్దం వినిపిస్తూంది. తలుపు తియ్యగానే చల్లటి గాలి మొహం మీదకు కొట్టింది. సన్నగా వణికేడు. అయితే ఆ వణుకు చల్లగాలి వల్ల వచ్చింది కాదు, లోపల దృశ్యం చూసి.
   
    లోపల డబుల్ కాట్ మీద ఇద్దరు బిచ్చగాళ్ళు పిల్లల్నేసుకుని కూర్చొని వున్నారు. ఇంకో మూల ఒక కుష్టురోగి భోజనం చేస్తున్నాడు.
   
    అతడు తలుపు తెరవటం చూస్తూనే పక్కమీద కూర్చొన్న వాదు చప్పున లేచి బిగ్గరగా, "మేం వెళ్ళం" అని అరిచేడు. అతడు యుద్దానికి సిద్దపడినవాడిలా వున్నాడు.
   
    డాక్టర్ క్షణంపాటు అలానె నిలబడ్డాడు. నెమ్మదిగా అతని పెదాలమీద చిరునవ్వు వెలిసింది. "ఎంజాయ్ ఫ్రెండ్స్, ఎంజాయ్" అని తలుపు దగ్గరగా  వేశాడు. హోటల్ అంతా వెతగ్గా వెతగ్గా అతనికి అయిదో అంతస్థులో ఒక రూమ్ ఖాళీగా దొరికింది. మళ్ళీ కిందకొచ్చేడు. కౌంటర్లో  వెతికితే ఫ్రిజ్ తాళాలు దొరికినయ్. కిచెన్ లోకి వెళ్ళి ఫ్రిజ్ డోర్ తెరిచాడు.
   
    పై వరుసలో ఉడకబెట్టిన కోడిగ్రుడ్లూ, ఉడక పెట్టిన కోళ్ళూ వున్నాయి. క్రిందవరుసలో బీరు బాటిల్స్ వున్నాయి. ఆల్మైరా తెరిచాడు. స్కాచ్ దొరికింది. రెండు స్కాచ్ లూ, అరవై బీర్లూ, ఆరు కోళ్ళూ తీసుకెళ్ళి తన రూమ్ లో ఫ్రిజ్ లో పెట్టుకున్నాడు. తలుపు లోపల తాళం వేసుకున్నాడు.
   
    కుర్చీలో కూర్చొని ఎదుటి బల్లమీదకు కాళ్ళు తన్నిపెట్టి బాటిల్ తెరుస్తూ అనుకున్నాడు, 'వెధవ ప్రపంచం పోనీ.....ఇంకేమైనా అయిపోనీ - కేరేపిన్.'
   
                                                             *    *    *
   
    ట్రిపోలీలో అరబ్ దేశాలు ఇజ్రాయెల్ మీద దండెత్తటానికి తీసుకొన్న నిర్ణయం బగ్గింగ్ చేయబడింది.
   
    ఆగష్టు 15 రాత్రి అన్నివైపుల నుంచీ ఇజ్రాయెల్ ని హఠాత్తుగా చుట్టుముట్టాలన్న అరబ్బుల ప్రయత్నం దారుణంగా ఫెయిలయ్యింది. అంతకు ముందురోజే ఇజ్రేల్ ఎయిర్ ఫోర్సంతా సమీకరించబడింది. రహస్యంగా సంపాదించిన న్యూక్లియర్ ఆయుధాలు సిద్దం చెయ్యబడ్డాయి.
   
    అరబ్ దేశాల చేతిలో నూనె ఆయుధాన్ని చూసి ఇంతకాలం ఓపిక పట్టిన అమెరికా- ఇంకా ఆ అయిదురోజుల కోసం ఇజ్రాయెల్ మీద జరుగుతున్న పోరాటాన్ని సహించలేకపోయింది.
   
    అమెరికా అకస్మాత్తుగా దండెత్తితే తమ నూనె గనులను పేల్చెయ్యతానికి అరబ్ దేశాలు కొన్ని సంవత్సరాల క్రితమే బాంబులను తమ గనుల ప్రక్కే అమర్చి వుంచాయి.
   
    మూడు మిలియన్ ల ఇజ్రాయెల్ జనాభా యుద్దానికి ఆయత్తమయింది. మూడు లక్షలమంది సుశిక్షితులయిన సైనికులు "క్రీస్తు వస్తున్న ప్రదేశాన్ని" రక్షించటానికి కంకణం కట్టుకున్నారు.
   
    ఇజ్రాయెల్ స్వంతంగా తయారుచేసుకొన్నా "జెంకోమిస్సిల్స్" మోహరించబడ్డాయి. కొత్తగా కనుక్కొన్న ఆయుధం "యం.డి. 6660 సర్ఫేస్ టు సర్ఫేస్ మిస్సిల్స్" సిద్దమయ్యేయి. ఐదువేల టాంకులూ, ఆరువందల ఎయిర్ క్రాఫ్ట్సూ సరిహద్దుల్ని రక్షిస్తున్నాయి. ఈ లోపుగా అమెరికన్ ఇంటర్ కాంటినెంటల్ మిస్సిల్స్ అరబ దేశాలవైపు దూసుకురాసాగాయి. అరబ్ దేశాధినేతలు నూనె గనుల్ని పేల్చి వెయ్యమని ఆర్డర్ ఇచ్చేరు.
   
    ప్రేలుళ్ళు..... పెద్ద పెద్ద ప్రేలుళ్ళు, ఆకాశానికి అంటిన మంటలు ప్రళయం అప్పుడే వచ్చిందేమో అన్నంత మంటలు.
   
    మండిపోతున్న నూనె గనులు. ఎర్రగా నాలుకలు సాచిన మంటలు. క్షణంలో ప్రపంచపు నూనె సముద్రం అంతా దగ్ధమైపోయింది. ప్రపంచంలో లభ్యమయ్యే పెట్రోలులో డెబ్బైశాతం - ప్రపంచం ఆఖరవటానికి నాలుగు రోజులు ముందుగానే నాశనమైపోయింది.
   
    ఆగష్టు పధ్నాలుగు
   
    తన గదిలో కూర్చొని వున్నాడు ప్రొఫెసర్ అతడు గుక్కెడు టీ నీళ్ళు తాగి అప్పటికి రెండు రోజులయింది. అతడు ఆలోచిస్తున్నది ఏమీలేదు. ఆలోచించి, ఆలోచించి మెదడు శూన్యమైంది. అతడి గెడ్డం బాగా పెరిగిపోయింది.
   
    తైలసంస్కారం లేక జుట్టు పీచులా తయారైంది. చెంపలు పీక్కుపోయేయి.
   
    కుర్చీలో కూర్చొని, అరచేతుల్లో గెడ్డం ఉంచుకొని శూన్యంలోకి చూస్తున్నాడు.
   
    ఒక ఎలుక అతడి కాలుమీదనుంచి దూకి వెళ్ళిపోయింది. పట్టించుకోలేదు. ఇంకొ ఎలుక కొద్దిగా ధైర్యం చేసి అతడి బల్ల ఎక్కి ఆర్రోజుళ క్రితం తిని వదిలేసిన బ్రెడ్ ముక్క అందుకొని పారిపోయింది.
   
    ప్రొఫెసర్ కదల్లేదు.
   
    ఎలా....?
   
    ఆ ప్రాక్సిమా సెంక్చువరీ అయస్కాంత శక్తినుంచి భూమిని ఎలా రక్షించటం.....?
   
    అతడాలోచిస్తున్నాడు.
   
    నాలుగు రోజుల్నుంచీ ఒకటే ఆలోచన.
   
    ఎలా రక్షించటం....?
   
    తిండీ తిప్పలు లేక శుష్కించిపోయిన ఆ వృద్దుడి శరీరం ఆలోచించటానికి కావల్సిన శక్తిని మెదడుకి ఇవ్వలేకపోతోంది. ఐనా ఆలోచిస్తూనే వున్నాడు. అనుభవం నేర్పిందీ, పుస్తకాలలో చదువుకొన్నదీ - అంతా రంగరించి ఆలోచిస్తున్నాడు. కంప్యూటర్ కన్నా వేగంగా అతడు లెక్కలు కడుతున్నాడు. అయినా సమస్య పరిష్కారం కావటంలేదు.
   
    ఎలుక ఒక అడుగు దూరంలో రెండుకాళ్ళమీద నిలబడి, రెండు చేతులతో బ్రెడ్ కి అంటిన మట్టిని విడదీయటానికి ప్రయత్నిస్తూంది.
   
    ప్రొఫెసర్ కాగితంమీద భూమి బొమ్మ వేసేడు. రింగు రింగులుగా దానిచుట్టూ సర్కిల్సు గీచి, ఒక్కొక్క రింగులోనూ వాతావరణపు పేర్లు వ్రాసేడు. దానివైపే గంటసేపట్నుంచీ చూస్తున్నాడు. మాగ్నటోస్పియర్ అవతలనుంచి ఒక బాణం గుర్తు- ఆ ప్రళయ నక్షత్రం ఏ దశలో వెళుతుందో ఆ దశలో గీచేడు. ఆగష్టు పదిహేడు రాత్రి పదకొండు పన్నెండు సెకన్లకి-
   
    ఎలుక అతడివైపే చూస్తూంది- అతడు దానివైపే చూస్తున్నాడు. 'హల్లో!' అన్నట్టు మీసాల్ని కదిపింది. ప్రొఫెసర్ కదలలేదు. ఎప్పుడూ నవ్వుతూ హుషారుగా వుండే ప్రొఫెసర్ ఈసారి తన ఆలోచనలతో గంభీరంగా వున్నాడు.
   
    ఎలుక తన పనిలో నిమగ్నమైంది.
   
    ప్రొఫెసర్ తన కాగితంవైపు చూసేడు.

 Previous Page Next Page