"నాల్గురోజులు. ఇప్పుడే బయటకు వెళ్దామనుకుంటున్నాను. ఇంట్లో ఏమీలేవు."
"బయట కూడా ఏమీ దొరకవు" అన్నాడు రమణ. "ఒకసారి బైటకొచ్చి చూడండి. అంతా స్మశానం ..... స్మశానంలా వుంది."
ప్రొఫెసర్ ఒక్కక్షణం మాట్లాడలేదు. రమణే అన్నాడు. "మా నాన్న చివరిరోజులు కాశీలో గడపాలన్నాడు. ప్రయత్నిస్తే రైళ్ళు నడవటం మానేసి రెండ్రోజులయిందని తెలిసింది."
"మొత్తం అంతా స్థంభించిపోయిందన్నమాట."
"అంతా కాదు....."రమణ కంఠంలో గంభీరత చోటుచేసుకుంది. "మనిషిలో రాక్షసత్వం పురులు విప్పుకుంటూంది."
"అంటే?"
"అందమైన ఆడవాళ్లున్న ఇళ్ళలోకి జొరబడి గూండాలు మానభంగాలు చేస్తున్నారు. ఆహారపదార్ధాల్ని దోచుకుంటున్నారు. అడ్డుకొనేవారు లేకపోవడంతో పైశాచికత్వం విజ్రుంభించింది. చావెలాగూ తప్పదని తెలిసిన మనిషి అన్నిటికీ తెగించాడు. ఈ చీకట్లో చిన్న వెలుగురేఖ ఒకటే. పాపభీతితో డబ్బున్నవాళ్ళు చేస్తున్న సంతర్పణలు....."
"పాపభీతా?"
"అవును" అన్నాడు రమణ. "చాలా విషయాల్ని బయట పెడుతుందది. పాపం ఒక శ్రేష్టిగారు- ఎన్ని తరాలనుంచి సంపాదించిన పాపపు డబ్బుని బగారంగా మార్చుకున్నాడో - తన మూడో అంతస్థుమీదకి ఎక్కి నాణేల్ని వెదజల్లి పిచ్చివాడై పోయాడు."
"ప్రళయం తప్పదనే నమ్మకం అంత బలంగా ఏర్పడిందా అందరికీ."
"మామూలుగా అయితే నమ్మకమూ, అపనమ్మకాల మధ్య కొట్టుమిట్టాడేవారు. కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా భూమి బీటలువారడం కనిపిస్తూ వుంటే - ఇంకా తమనెవరూ రక్షించలేరని నమ్మకం ప్రబలుతోంది."
ప్రొఫెసర్ ఉలిక్కిపడి "భూమి బీటలు వారుతోందా?" అని అడిగేడు.
రమణకి విసుగేసింది. "ఒక్కసారి బయటకు రాకూడదూ?" అన్నాడు. "జరుగుతున్న విధ్వంసకాండ కళ్ళారా చూడొచ్చు."
"లేదు లేదు. ఇక్కడే వుండాలి. ఏదయినా చెయ్యాలి. ఏదయినా ఆలోచించాలి. ఏదయినా చేసి ప్రపంచాన్ని రక్షించాలి".
రమణ జాలిగా ఆ మతిలేని ప్రొఫెసర్ కేసి చూసేడు. ప్రళయకాలపు ఝుంఝామారుతంలా దూసుకు వస్తున్న ఈ నక్షత్రాన్ని ఈ అల్పజీవి ఎలా ఆపుతాడు?
లేచి "వెళ్ళొస్తాను" అన్నాడు.
"అప్పుడేనా?" అన్నాడు.
"వంతుల ప్రకారం కాపలా కాస్తున్నాం."
ప్రొఫెసర్ ఆశ్చర్యంగా "ఎందుకు?" అన్నాడు.
"ఎందుకా...."పేలవంగా నవ్వాడు రమణ. "ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా స్థంభించి పోయినందుకు, ప్రజల్ని ప్రజలే రక్షించుకోవలసి వచ్చినందుకు".
ప్రొఫెసర్ లేచి, "ఇక్కడే ఇలా వుంటే మిగతా దేశాల్లో ఎలా వుంది?"
"తెలీదు."
"ఏం?"
"రేడియో స్టేషన్లు పని చెయ్యటం మానేసి రెండ్రోజులైంది."
ప్రొఫెసర్ నిశ్చేష్టుడయ్యాడు.
"వెళ్ళొస్తాను" అన్నాడు రమణ.
ప్రొఫెసర్ మాట్లాడలేదు.
రమణ లేచి బైటకొస్తూ తలుపు బలంగా వేసి ముందుకు నడిచేడు. లోపల ప్రొఫెసర్ తిరిగి కాగితాలు పరిశీలించసాగేడు.
తలుపు బలంగా వేసినప్పుడు ఆటోమాటిక్ లాక్ పడిపోయిందని బయట రమణకి గానీ, లోపలున్న ప్రొఫెసర్ కి గానీ తెలీదు.
* * *
ఆ రోజు బాగా చీకటిపడ్డాక. పెద్ద పెద్ద చప్పుళ్ళు వినబడ్డాయి. ఇళ్లలో తలుపులు బిగించుకొని కూర్చున్న వాళ్ళంతా హాహాకారాలు చేస్తూ బైటకొచ్చేరు. అంతకుముందుకన్నా ఎక్కువగా భూమి బీటలు వారుతోంది. ఫెళ - ఫెళా చప్పుళ్ళు చేస్తూ, అక్కడక్కడా భూమి రెండుగా విడిపోతూంది. ఆ ప్రదేశంలో వున్న ఇళ్ళూ, చెట్లు భూస్థాపితం అయిపోతున్నాయి. రోదనలు..... అరుపులు.....
ఇంకా అయిదు రోజుల తర్వాత రావాల్సిన ప్రళయం ఆ రోజే వచ్చినట్లుంది.
దాదాపు పది సెకండ్ల తరువాత అంతా సద్దుమణిగింది.
నిన్నటి రోజూ అదే సమయానికి.
ఆగష్టు పదిహేడు అదే సమయానికి.
ఆ రోజు నుంచీ ప్రతిరోజూ అదే సమయానికి.
అయితే భీభత్సానికి చెదరనివాళ్ళు ఆ పల్లె ప్రజలే. స్వామివారు ఆ ఒక్కపల్లెని రక్షిస్తామని మాట యిచ్చేరు. ప్రార్ధనలు నిర్విరామంగా జరుగుతున్నాయి.
రాజయ్య కూడా వెళ్ళి తృణమో, ఫణమో అర్పించుకొన్నాడు.
వస్తూంటే చీకట్లో యిద్దరు వ్యక్తులు మాట్లాడుకొంటూ వుండటం కనిపించింది. ఒకడు భూషణం, ఇంకొకరు ప్రెసిడెంటు మాటల్లో తన పేరు వినిపించటం చూసి అతడు చీకట్లో ఆగేడు. చెట్టుచాటున వున్న అతణ్ణి గమనించని వాళ్ళు అతడి గురించి మాట్లాడుకొంటున్నారు.
"రంగారావు ఆపు సేస్తాడంట - రాజయ్య పొలం మన స్వాధీనమవకుండా."
"అంత పెద్దోడయ్యాడా రంగారావు?"
"ఎట్టయినా మనమీద దెబ్బ కొట్టాలని చూస్తున్నాడు" అన్నాడు భూషణం.
"ఆన్ని జూసుకొనేనా ఈ రాజయ్యగాడు ఇన్ని కబుర్లు చెప్తున్నాడు?"
భూషణం మాట్లాడలేదు.
"సరే - అయితే ఆడేం సేస్తడో- ఏం సెయ్యగలడో సూద్దాం. ఆడి కళ్ళముందరే ఆ రాజయ్య గాడ్ని సెట్టుక్కట్టి నిప్పెడ్తే.....? ఆడేం సేస్తడో....."
వింటున్న రాజయ్య వణికిపోయేడు. రెండు ఏనుగులు ఢీ కొంటే మధ్య నలిగిన కుందేలుళా వణికిపోయేడు.
పరుగెత్తాడు. ఆక్కుండా పరుగెత్తీ రంగారావు దగ్గరకు వగరుస్తూ చేరుకొన్నాడు. విషయం అంతా విని మీసం తిప్పుతూ, "అంత ధైర్యం వుందటరా వాళ్ళకి?" అన్నాడు రంగారావు.
రాజయ్య కి భయంతో మాట రావటంలేదు.
"సరే- నేను చూసుకుంటాలే ఆళ్ళ సంగతి."
దూరంనుంచి "మముబ్రోవరా" అని భక్తులు ముక్తకంఠంతో పాడుతున్నారు.
అక్కడ స్వామివారు శేషశయనం మీద విష్ణుమూర్తిలా పడుకొని వున్నారు. అక్కడున్నవారి చేతులకు తాయెత్తులు కట్టబడి వున్నాయి. పూజలు జరుగుతున్నాయి.
డాక్టరు మెట్లు దిగి వస్తూంటే రాజయ్య కనబడి నమస్కారం చేసి, "ఎక్కడికో వెళుతున్నట్టున్నారే" అని అడిగేడు ఇంటి ముందున్న స్కూటర్ ని చూస్తూ.
"వెళ్ళిపోతున్నాను రంగయ్యా! ఈ ఆఖరి అయిదు రోజులూ పట్నంలో గడుపుదామని" అన్నాడు డాక్టర్.
"అదేమిటి బాబూ- ఈ పల్లెలో వుండాలని, ఈ పల్లెకు రావాలని అందరూ కోరుకుంటూ వుంటే మీరు వెళ్ళిపోతున్నారే!"
"ఈ పల్లెకా?" అర్ధంకాక అడిగేడు.
"మొత్తం ప్రపంచం అంతా నాశనం అయిపోద్ది, ఈ తాయెత్తు కట్టుకున్నేళ్ళే బతుకుతారు."
డాక్టర్ కి అతణ్ణి చూస్తే జాలేసింది.
పల్లెని వదిలి వెళ్తున్న డాక్టర్ని చూస్తే రంగయ్యకి జాలేసింది. అమాయకుణ్ణి చూసి వేదాంతి ఎంత జాలిపడ్తాడో....వేదాంతిని చూసి అమాయకుడూ అంతే జాలిపడ్తాడు. డాక్టర్ మౌనంగా స్కూటర్ స్టార్ట్ చేశాడు. తనింతకాలం వున్న ఇంటివైపు ఆఖరిసారి చూసుకున్నాడు. ముందుకు సాగిపోయేడు.
ఊరు దాటుతుంటే గుడి కనిపించింది. స్కూటర్ ఇంజన్ ఆపుచెయ్యకుండానే అలా ఆగి అటు చూసేడు!
బాబాగారి చుట్టూ చేరి భక్తులు భజనలు చేస్తున్నారు. భక్తి పారవశ్యంతో ఊగిపోతున్నారు. ప్రపంచాన్నీ, ప్రళయాన్నీ జయించిన ఆనందం వాళ్ళ మొహాల్లో కనిపిస్తూంది. అసలు మృత్యువు వాళ్ళ దరి చేరదనే నమ్మకంతో- ఆనందంతో వూగిపోతున్నారు.
అతడికో విషయం అర్ధమైంది.
అక్కడ బాబా కాదు ముఖ్యం.
నమ్మకం!