రమణరావు అయోమయంగా తండ్రివంక చూసి బుద్దిగా కూర్చున్నాడు.
"మన కుటుంబాలలో యిలాంటివి చాలా అరుదు కదండీ! అందుకని మావాడు తొందరపడ్డాడు. ఎప్పుడు తాంబూలాలు తీసుకుందాం?"
ఆ మర్యాదకు రాజారావు తలక్రిందులయ్యాడు.
"మీ యిష్టం. యెప్పుడైనా నేను సిద్దమే."
"సాధ్యమయినంత త్వరలో ముహూర్తం నిర్ణయించండి. ముందు తాంబూలాలు తీసుకుందాం!"
"అలాగే!"
వికసించిన ముఖంతో రాజారావు వెళ్ళిపోయాడు
రమణరావు చిరాగ్గా "ఏమిటి నాన్నా! ఆయన మళ్ళీ కేసు" అని ఏదో అనబోతుండగా చిరునవ్వుతో వారించాడు కేశవరావు.
"ఓయ్ చవటా! నువ్వు చేసే పన్లన్నీ సర్దుకురాలేక చస్తున్నాను. రాజారావు సమర్థుడయిన లాయరు, ఈ విషయంలో నువ్వు మరీ ఇంత గట్టి పట్టుపడితే అనుమానం రాదూ! అదీగాక నువ్వు పెళ్ళికి వప్పుకుంటే కాబోయే బావమరదని నీమీత ప్రేమ భావం ఉంటుంది. రేపు మా బాబాయి చక్రపాణిగారిని పంపిచూస్తాను. మూడొంతులు లొంగిపోతాడు. అంతకూ లొంగి తిరగతోడ్తారని ఎవడు కలగన్నాడు? అందుకే రికార్డు విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నాను. రాజారావు అప్పుడే దాన్ని చూసేశాడట. అఖండుడు!"
"చూస్తే? నిజం బయట పడుతుందా?"
నిలువెల్లా వణుకుతూ అడిగాడు రమణరావు.
"నిజం అంత తేలిగ్గా ఎలా బయటకొస్తుందోయ్! నేను లేనూ అడ్డు పడటానికి! ధైర్యంగా ఉండు."
కొడుకు వీవు చరిచారు కేశవరావుగారు.
18
"రమణరావుగారు సుశీలను చేసుకోవటానికి వప్పుకున్నారు. తాంబూలాలు తీసుకోవటానికి ముహూర్తం నిర్ణయించమన్నారు."
వికసించిన ముఖంతో రాజారావు చెప్తోంటే అనిత, సుశీల, జానకి స్థాణువులైపోయారు.
సంభ్రమంతో తలమునకలవుతున్న రాజారావు అది గమనించకుండా తల్లికీ విషయం చెప్పటానికి త్వరగా లోపలికి వెళ్ళి పోయాడు.
ఉద్రేకంతో ఏదో అనబోతున్న అనిత నోరు తన చేత్తో మూసి తన గదిలోకి తీసి కెళ్ళింది జానకి.
"అనితా! తొందరపడకు, ఏం చెయ్యదలచుకున్నావ్ నువ్వు"
"ఇంక ఈ నాటకానికి స్వస్తి చెబుతాను. రాజారావుకు నిజం చెపుతాను."
"నిజం చెప్పగలవు. కానీ రుజువు చెయ్యలేవు. అన్నయ్య నీ మాటలు నమ్మగలడు. బ్రతుకు చక్కదిద్దలేడు."
"నీ కేసు పునర్విచారణకు బావ అనుమతి సంపాదించాడు. నిజం రుజువవుతుంది."
"అనితా! ఇంత వెర్రిదానివవుతున్నావేం? అవతలి వ్యక్తులు అంగ బలం, అర్థబలం ఉన్నవాళ్ళు. ఆనాడు అమ్మ ప్రయత్నించలేదా?ఏం సాధించ గలిగింది? వాళ్ళు ఎంతకైనా సమర్థులు?"
"అలాంటి నరరూప రాక్షసుడికా, సుశీలను కట్టబెట్టాలనుకుంటున్నావ్? సుశీల క్షేమం ఆలోచించయినా రాజారావుకు అన్ని విషయాలూ చెప్పెయ్యాలి."
"చెబుతావు. అన్నయ్య సుశీలకీ సంబంధం చెయ్యడు. తరువాత ఏమవుతుంది? అంతా నిశ్చయమయ్యాక సంబంధం చెడిపోతే ఆడపిల్లకు పెళ్ళికావటం ఎంత కష్టమో తెలుసా?"
"ఇలాటి పెళ్ళి కావడంకంటే అసలు పెళ్ళి కాకపోవటమే మేలు!"
"రమణరావు సుశీల అంటే పడిచస్తున్నాడు సుఖపెడ్తాడేమో?"
అనితకు మండింది...
"ఆ తరువాత నువ్వెందులోపడి చస్తావ్?"
"నేనేనాడో చచ్చిపోయాను. బ్రతికే ఉన్నానని భ్రమపడుతున్నావు నువ్వు."
"నాన్సెన్స్! నేను........"
"ఆగు అనితా! నా మాట విను. మేమిద్దరమూ ఇక్కడికి రావటం వల్లనే అన్నయ్య అంతులేని చికాకుల్ని ఎదుర్కోవలసి వస్తోంది. దానికి మరింత అశాంతిని జోడించటం నాకిష్టంలేదు. రమణరావు నన్ను పదిమందిలో అంగీకరిస్తాడని నాకే కోశానా నమ్మకంలేదు. నా బ్రతుకు బాగుపడకపోయినా అన్నయ్యకొక బల్లేన్ని సృష్టించిన దానినవుతాను."
"నీది అర్థంలేని వాదన. పిరికి పలుకులు. ఆత్మవిశ్వాసమనే ఉక్కుకవచం తొడుక్కున్న వాళ్లని బాణాలూ బల్లేలూ ఏం చెయ్యలేవు. రాజారావుకు విషయం చెప్పేస్తాను."
"అలా చేస్తే నా శవాన్ని మాత్రమే చూస్తావు." అనిత నిర్ఘాంత పోయింది.
"ఏమిటీ మూర్ఖత్వం జానకీ!"
"అన్నయ్య ఎంతో శ్రమపడి తిరిగి కేసు విచారణకు అనుమతి పొందాడుగదా! వేచిచూడు! ఏమాత్రం న్యాయం జరుగుతుందో? అప్పుడు నా మాటలు నీ కర్థమవుతాయి."
జానకి పట్టుదల అర్థంచేసుకున్న అనిత ఇంక వాదించలేదు. తీవ్రంగా ఆలోచిస్తూ కూర్చుని జేమ్స్ కొక వుత్తరం రాసింది.
"డియర్ జేమ్స్!
ఇక్కడ నేను కొన్ని చిక్కుల్లో యిరుక్కున్నాను. నా అంతట నేను అవి పరిష్కరించుకోలేక పోతున్నాను. నీ సహకారం కావాలి. వెంటనే బయలుదేరి రా!
ఉత్తరం అందుకున్న వెంటనే వచ్చాడు జేమ్సు.
"మా అమ్మతరపు బంధువు నా కోసం వచ్చాడు."
"రాజారావుకు పరిచయం చేసింది అనిత...
రాజారావు ముభావంగా కరచాలనం చేశాడు.
సుశీల నమస్కారం చేసింది.
'బ్యూటిఫుల్' అనితతో నెమ్మదిగా అన్నాడు జేమ్స్.
జేమ్స్ అన్నదేమిటో వినపడకపోయినా అతను అనిత ముఖం మీదకు వంగి ఏదో అనటం అర్థమయింది రాజారావుకు.