"కావాలంటే సొరుగు తీసి చూడు! ఆ నోటు మీద నా సంతకం కూడా వుంటుంది! ఆ నోటు నంబర్ కూడా చెబుతాను కావాలంటే........అని నంబరు చెప్పాను! సొరుగు చూసి చూస్తే నోటు దొరొకింది. అందరూ నాయర్ నే తిట్టారు. ఇంతకూ ఆ నోటేక్కడిదో తెలుసా?రమణగాడు ఇచ్చింది! ముందే దాని మీద సంతకం పెట్టాను!"
భోజనాలు ముగించి బయటకొచ్చారు ముగ్గురూ. సావిత్రి వెంటనే లోపలికి వెళ్ళిపోయింది.
"ఒరేయ్ శ్రీకాంత్! నాకిప్పుడు చాలా ఆనందంగా వుందిరా! సావిత్రి కూడా వప్పుకుంది......" అన్నాడు చలపతి.
"సరే! మంచిదే! కానీ ఇక నువ్వు ఆ విషయం మాట్లాడటం మానేయ్! నాకు ఇష్టం లేదు. ఆ గొడవే మాట్లాడటం!"
"ఇంకెన్ని రోజుల్లెరా! సరిగ్గా రెండు రోజులు! ఎల్లుండి ఎలాగూ హాస్పిటల్లో జాయినావుతున్నాను అంటే మిగిలింది ఒక్కరోజే ఇక! నా వల్ల ఎన్ని కష్టాలు పడ్డా రేపోక్కరోజే కదరా?......" అన్నాడు చలపతి.
"సరేలేరా బాబూ! నీతో మాట్లాడినాగొడవగానే వుంది! నీకు నచ్చ జెప్పటం నా వల్ల కాదు! అది సరే గాని మీ ఆఫీసుకి శెలవు పెట్టావా?"
"నర్సరాజు వచ్చి నిన్న రాయించుకెళ్ళాడు. శాంక్షన్ చేయించడానికి ప్రయత్నిస్తానన్నాడు. ఒకవేళ శాంక్షన్ కాకపోయినా ఫర్వాలేదు! జీతం నష్టమవుతుంది అంతే."
"అలాగయితే ఫరవాలేదు!"
" మరి కాసేపు ఆఫీస్ గొడవలే మాట్లాడి తన గదిలోకి వెళ్ళిపోయాడు శ్రీకాంత్.
చలపతి లోపలికొచ్చేసరికి సావిత్రి కుర్చీలో కూర్చుని ఏదో ఆలోచనలో నిమగ్నమయిపోయి వుంది.
"ఏమిటోయ్ ఆలోచిస్తున్నావ్?" ఆమెకు సమీపంగా కూర్చుని అడిగాడు చలపతి.
"ఏమి లేదు"
"ఏమి లేని దాని గురించి ఆలోచనలు వుంటాయా?"
సావిత్రి నవ్వేసింది. "నిజంగానే ఏమిలేదు! ఊరికే కూర్చుంటే ఏమిటేమిటో పిచ్చి ఆలోచనలు వస్తుంటాయ్!"
ఆ రాత్రంతా ఆమెకు నిద్ర పట్టలేదు. ఎల్లుండే చలపతి హాస్పిటల్లో చేరేరోజు అన్న విషయం గుర్తుకొచ్చి నప్పుడల్లా గుండెలు కలిచివేసినట్లవుతోంది.
అంటే తనూ, చలపతి కలిసి గడిపేది మరోక్కరోజు! ఆ తరువాత దేముని ఇష్టం! కళ్ళ వెంబడి నీళ్ళు తిరిగిపోయినయ్యా మెకి తెల్లారేవరకూ ఆమె కన్నీళ్ళు అగనేలేదు.
ఉదయం చలపతికి మెలుకువ వచ్చేసరికి టైము అరుదాటింది. అప్పటికే సావిత్రి లేచి తలంటుపోసుకొని జుట్టు అరబెట్టుకొంటుంది.
"త్వరగా లేవండి! ఇవాళ మనం ఒక చోటకి వెళ్లి రావాలి!" అంది అతని చెయ్యి పట్టుకొని లేపి కూర్చోబెడుతూ.
"ఎక్కడికి?"
"చెప్తాను కదా..........మీరు ముందు స్నానం అదీ కానీండి."
చలపతి లేచి స్నానం వగైరా ముగించి ఆమె దగ్గరికొచ్చి నిలబడ్డాడు.
"ఇప్పుడెం చేయాలో చెప్పు!" అన్నాడు నవ్వుతూ .
"పదండి!" అంటూ బయటకు నడిచింది. ఇద్దరూ రోడ్డు మీద కొచ్చారు.
ఖాళీగా పోతున్న అటోరిక్షా పిలిచిందామె. ఇద్దరూ పది నిమిషాల్లో గుడికి చేరుకున్నారు.
"ఓహో దేవుడికి లంచం ఇవ్వడానికి?" నవ్వుతూ అన్నాడు చలపతి. సావిత్రి చురచుర చూసిందని వంక. గుడిలోకి నడిచారు.
"దేముడికి దణ్ణం పెట్టుకోండి! వచ్చేవారం ఇక్కడికొచ్చి కొబ్బరికాయ కొడతానని మొక్కుకోండి"
చలపతి కళ్ళు మూసుకుని చేతులు జోడించాడు. అతను కళ్ళు తెర్చెసరికి సావిత్రి ఇంకా దేముడిని వెడుతూనే వుంది. అయిదు నిమిషాల తర్వాత గానీ ఆమె ఈలోకంలోకి రాలేదు.
"వెళదామా?" అడిగాడు చలపతి.
"పదండి"
ఇద్దరూ బయటకొచ్చి మళ్ళీ ఆటోలో ఇల్లు చేరుకొన్నారు.
"ఏమని అడిగావ్ దేవుడ్ని?" నవ్వుతూ అడిగాడు చలపతి.
"నా మనసులో వున్నది చెప్పాను?"
"అదే ఏమిటా అని!"
"నేను చెప్పను!"
"చెప్పకపోయినా నాకు తెలుసులే - దేముడా! మా ఆయనకి ఎలాంటి అపాయం జరక్కుండా చూడు! అలా చూస్తే నీకు - ఎంతో తెలీదు - లంచం ఇస్తాను అని అంతేనా."
"మీకు అన్నీ తెలుసు లెండి!" కోపంగా అందామె.
శ్రీకాంత్ గదిలోంచి బయటికొచ్చాడు. "ఎక్కడికెళ్ళారు. ఇంతపొద్దున్నే" ఆశ్చర్యంగా అడిగాడు.
"గుడికి!" నవ్వుతూ అన్నాడు చలపతి.
"గుడ్! నాకు రాత్రే ఆ ఆలోచన వచ్చింది వెళ్తే బావుంటుందని! మీరిప్పుడు వెళ్ళి రానేవచ్చేశారు బావుంది!"
"మనలో మనమాట! నాకీ ఆపరేషన్ చేయిస్తోందీ దేముడే! రోగం తెప్పిం చిందీ దేముడే కదా! మళ్ళీ దణ్ణం పెట్టినంత మాత్రాన వెంటనే తగ్గించేస్తాడంటావా?"
సావిత్రి అక్కడ్నుంచి లోపలకు వెళ్ళిపోయింది.
"అదిగో చూశావా! అలా అన్నానని సావిత్రికి కోపమొచ్చేసింది. తప్పు నాదేలే! ఇవాళ కూడా అలాంటి పరిహసాలాడటం తప్పు కదుమరీ! ఇప్పుడే సావిత్రికి మూడ్ మార్చేసి వస్తాను...." లోపలికెళ్ళిపోయాడు చలపతి.
శ్రీకాంత్ చలపతి ప్రవర్తనలో చాలా తేడా కనిపించింది. మనసులో లేనట్లుగా మాట్లాడుతున్నాడీ రోజు.
మరికాసేపట్లో తిరిగి శ్రీకాంత్ దగ్గర కొచ్చేశాడతను. "మనం ముగ్గురం ఇంగ్లీషు సినిమా ఒకటి చూడాలి. బాగుంటుంది లే! ఆ ఆతరువాత టాంక్ బండ్ మీద కాసేపు పచార్లు చేయాలి! అప్పుడు చైనీస్ హోటల్లో భోజనం - ఆ తరువాత ఇంటికి తిరిగివచ్చి రాత్రి పన్నెండు వరకూ కబుర్లు - ఇవ్వన్నీ నాకిష్టమైనవి ! అంచేత ఆఖరిరోజు న ఇష్టప్రకారం జరిగిపోవాలి . ఒకే?" తలూపేడు శ్రీకాంత్. చలపతితో వాదించి కూడా ప్రయోజనం లేదనిపించిందతనికి.
మధ్యాహ్నం ముగ్గురూ అనుకొన్నట్లుగా కారులో మ్యాట్నీ కెళ్ళారు. రెండో ప్రపంచ యుద్దానికి సంబంధించిన చిత్రం అది. ఆ సినిమా అదివరకు చూసినదే సీరియస్ సినిమా అవడం వల్ల బయటికొచ్చే వరకూ మాటల్లేకుండానే గడిపారు.
కారు టాంక్ బండ్ వేపు పరుగెత్తింది. మధ్యలో పార్క్ చేసి దగ్గరే ఉన్న బెంచి మీద కూర్చున్నారు ముగ్గురూ.
చలపతి ఏదేదో మాట్లాడుతున్నాడు. అతను కేవలం తన మనసులో పెరిగిపోతున్న ఆందోళనని కప్పి పుచ్చుకోవడానికే ఇలా మాట్లాడుతున్నాడన్న విషయం అర్ధమవుతూనే వుంది.
శ్రీకాంత్ కి అది చూస్తుంటే కళ్ళ వెంబడి నీళ్ళు తిరుగుతున్నాయ్. తరువాత చైనీస్ హోటల్లో భోజనాలయినాయ్! మంచి సంగీతం నెమ్మదిగా వినబడుతోందక్కడ టైము తోమ్మిదయ్యే వరకూ అక్కడే కూర్చుండిపోయారు.
"ఇంక ఇంటికెళ్ళిపోదాం! "అంది సావిత్రి లేచి నించుంటూ.
* * *