"అందులో ఏముందో చదివావా?"
"డియర్ విశాలా! ఇది నీ హీరోకి నువ్వే అందజేయి, వాడిని రేపటికి నలుగురు మనుషుల్ని మాట్లాడి ఉంచుకోమను. లేకపోతే వాడి శవాన్ని స్మశానానికి తీసుకుని వెళ్ళేవారుకూడా ఉండరు. రేపు సోమువాడి చావుకు ముహూర్తం పెట్టాడు. నాయుడి మనుషుల జోలికి వచ్చిన వాళ్ళకు అదేగతి పట్టక తప్పదు మరి. వాడు చావగానే నీ ప్రియుడు సోము నీ దగ్గరకువచ్చి నిన్ను స్వాధీనం చేసుకుంటాడు. సోము అధీనంలో వుండి అతడు చెప్పినట్లు వినడం నీకు చాలా మంచిదని నీ హీరో చావగానే నీకెలాగూ అర్ధమవుతుంది. వుత్తరం చివరసంతకం లేకపోయినా ఎవరు వ్రాశారో నువ్వు అర్ధం చేసుకో గలవనుకుంటాను-"
గోపీ చేతులుకట్టుకుని పాఠంలా అప్పచెప్పాడు. అదృశ్యం చూస్తూంటే ఆ పరిస్థితిలో కూడా విశాలకు నవ్వుపట్టింది. ఆమె చేతిని ముఖానికి అడ్డుగా పెట్టుకుంది. సరిగ్గా అప్పుడే వారిపక్కనుంచి ఓ గుంపు వెళ్ళింది. నలుగురు మనుషులు ఓశవాన్ని మోసుకుపోతున్నారు. కొందరు భజనలు పాడుతున్నారు.
"పాపం-వాడెవరో నీకు తెలుసా?" అన్నాడు గోపీ జాలిగా.
"తెలుసు. మా వీధిలోనివాడే-ఎంతో వయసుండదు. నలభై ఏళ్ళుంటాయి. క్యాన్సర్ తో పోయాడు-" అన్నది విశాల.
"క్యాన్సర్ తో పోయాడా? నేనింకా నాయుడితో జగడం పెట్టుకున్న వాడేమోననుకున్నాను-" అన్నాడు గోపీ గంభీరంగా.
విశాల అదోలా ముఖంపెట్టి-"నీకు సీరియస్ గా ఉండడం తెలియదా?" అన్నది.
"నా సంగతి అలావుంచు. నువ్వు నీ అదృష్టానికి సంతోషించడానికి బదులు-దిగులుగా కనబడుతున్నావు-" అన్నాడు గోపీ.
"నా అదృష్టమా-నీకు నేనంటే వేళాకోళంగా ఉందా?"
"అదృష్టం కాకపోతే-ఇంతవరకూ నీమీద ఉన్న ప్రమాదం నామీదకు మళ్ళింది. అది నీకు మంచిదే కదా- "అని- "అవున్లే-అసలు విషయం మరిచేపోయాను. ఆ సోము నన్ను చంపేక మళ్ళీ నీజోలికి వస్తానన్నాడు గదా- అందుకనేనా ఈ దిగులు-" అన్నాడు గోపీ.
విశాల ముఖం చిన్నబోయింది-"అంటే-నేను నిన్ను ప్రమాదంలో ఇరికించానంటావా?"
"అవును తెలివిగా నన్నిందులో ఇరికించావు. కానీ ఆ సంతోషం ఎంతోకాలందక్కదు నీకు. సోము నిన్ను వదలడు-"
"నిన్న సోము నావెంటబడినప్పుడు-నిన్ను రక్షించమని నేనడిగానా? అనవసరంగా అందులో జోక్యం చేసుకుని నీకు నువ్వే ప్రమాదంలో ఇరుక్కున్నావు-"
"మరి నేను కలగజేసుకోకుంటే-నీపని ఏమయ్యేది?"
"ఏమయ్యేది? ఎందరో అభాగినుల్లాగే నేనూ సోమువద్దనే పడిఉండేదాన్ని. ఇప్పటికైనా మించిపోయిందిలేదు. ఇప్పుడే సోమువద్దకు వెళ్ళిపోతాను-" అన్నది విశాల రవంత ఆవేశంతో.
"సోము వద్దకు వెళ్ళాలని అంత తొందరెందుకు? కాస్త రేపటిదాకా ఆగగలిగితే-సోమూయే నీ దగ్గరకు వస్తాదు...." తాపీగా అన్నాడు గోపీ.
"వాడు నా దగ్గరకెందుకు వస్తాదు? నేనేమైనా వాడి ఉంపుడు కత్తెనా?"
"అపార్ధం చేసుకోకు మిస్! నేను నీకు ఉత్తరంలోని విషయం గుర్తుచేస్తున్నాను-" అని హఠాత్తుగా గోపీ దిగులుగా అయిపోయాడు-"భగవంతుడా-ఈ ఫిరంగిపురంలో బ్రహ్మచారిగా చావాలని నాకు రాసిపెట్టి ఉన్నట్లున్నది-ఆఖరికి నా సమాధిముందు దీపం వెలిగించేవారు కూడా ఉండరనుకుంటాను-"
"నీవు ముసల్మానువా?" అన్నది విశాల ఆశ్చర్యంగా.
"కాదు కాబట్టే అలాగంటున్నాను-" అన్నాడు గోపీ నవ్వుతూ.
విశాలకు నవ్వొచ్చింది- చావు గురించి కూడా తేలికగా మాట్లాడుతున్నావు. నీవు చావంటే భయంలేదా?"
"మిస్ విశాలా! చావు అందరికీ వస్తుంది. భయం చావును ఆపగలిగితే భయపడడానికి నేను సిద్దమే!" అన్నాడు గోపీ-" కానీ నా బెంగ ఒక్కటే-రేపు నేను చచ్చిపోతే నా చిట్టితమ్ముడు, చెల్లెలు, రోగిష్టితల్లి ఏమైపోతారోనని భయంగా ఉంది. వాళ్ళు రోడ్లమ్మట పడి అడుక్కుంటారేమోనన్న ఆలోచనే భరించలేకపోతున్నాను-"
"అలా జరుగనివ్వను. ఇప్పుడే నేను సోము వద్దకు వెడతాను-"
"మిస్ విశాలా! ప్రమాదంనుంచి తప్పుకునేటందుకు నీకు రెండే రెండు ఉపాయాలున్నాయి. ఒకటి ఎల్లప్పుడూ నాతో ఉండడం-రెండు సోము వద్దకు వెళ్ళడం...." అన్నాడు గోపీ.
"నేను సోము వద్దకే వెడతాను. నీ కుటుంబం రోడ్డుమీద పడటం నేను భరించలేను-" అన్నది విశాల.
"కంగారు పడకు-నా కుటుంబాన్ని రోడ్లపాలు చేయడం ఆ సోము వల్లకాదు-" అన్నాడు గోపీ.
"నీకు తెలియదు ఆ సోము సంగతి...." అన్నది విశాల.
"నా సంగతీ నీకు తెలియదు..."
"నాకు తెలుసు...."
"ఏం తెలుసు? నా కుటుంబాన్ని రోడ్లపాలు చేయడం ఆ సోము, నాయుడులవల్లనే కాదు. ఆ భగవంతుడివల్లనే కాదు- నాకు కుటుంబం లేదు గదా-నేను ఒంటరిగాన్ని...." అన్నాడు గోపీ.
విశాల ఒక్కక్షణం తెల్లబోయి- "యూ ఆర్ టూ సిల్లీ-మరి నాకు అబద్దాలెందుకు చెప్పావు?" అన్నది.
"ఏం చేసేది-నేను సీరియస్ గా ఉండడంలేదంటున్నావు. అందుకోసమని తోచిన డైలాగు ఒకటి చెప్పాను-" అని-"అయితే నీతో సీరియస్ గా కాసేపు మాట్లాడతాను. నాతో వస్తావా?" అన్నాడు గోపీ.
విశాల అంగీకరించింది. ఇద్దరూ బుల్లెట్ మీద ఓ పార్కుకు వెళ్ళారు. అనువైనచోట కూర్చున్నాక-"నాకెవ్వరూలేరు. ఏమీతోచక నేనీ ఊరొచ్చాను. మరి నీ సంగతేమిటి? ఈ ఊరెందుకొచ్చావు?" అన్నాడు గోపీ.
"నా తల్లికి నేను ఒక్కగానొక్క కూతుర్ని. మూడు సంవత్సరాలుగా మా అమ్మ జబ్బుతో మంచం పట్టింది. నేను చదువు కట్టిపెట్టి టైపూ, షార్టుహ్యాండూ నేర్చుకున్నాను. పదినెలలక్రితం ఈ ఊళ్ళో ఉద్యోగం వచ్చింది. మంచి జీతం వస్తోంది. మా అమ్మను బలవంతంగా హాస్పిటల్లో జేర్పించాను. కనీసం ఇంకోసంవత్సరం పాటైనా మా అమ్మ హాస్పిటల్లో ఉండాలి-" అన్నది విశాల.