"బెస్ట్ ఆఫ్ లక్ టూ యూ, మైడియర్ సర్!" అంటూ చిరునవ్వుతో తలవంచింది. డ్రమెటిక్ గా అతడి కళ్ళలో తడి మెరిసింది. సంకోచంగానే దాన్ని అందుకుని, ఆమె మొహంలోకి చూశాడు.
"సౌదామినీ! ఇంకా చూడు! సంవత్సరం తిరిగేలోగా నిన్ను బంగారంతో ముంచేస్తాను దిసీజ్ ఎ ప్రామిస్. రియల్లీ!"
సంతోషంగా నవ్వింది సౌదామిని. "మీరు ఏదైనా చెయ్యగల సమర్ధులని నాకు తెలుసు. బెస్ట్ ఆఫ్ లక్ ఎగైన్!"
అతను మంగళసూత్రాన్ని గట్టిగా పట్టుకుని గుప్పెట్లో పెట్టుకుని ఆ చేతిని ఫ్యాంటు జేబులో పెట్టుకుని ఖుష్ బూలాల్ చందన్ మల్ షాపుకి వెళ్ళాడు. పీత బొక్కలా, ఎలుక బొరియలా, గోడలో కన్నంలా వున్న చిన్న షాపు అది. తాకట్టు పెట్టబడే నగలకి అది వన్ వే ట్రాఫిక్ లాంటిది. నగలు ఆ షాపులోకి పోవడమే తప్ప వెనక్కి రావడం ఎప్పుడో తప్ప జరగదు.
షాపులో షోకేస్ ఒకటి వుంది. దానిలో అలారం టైంపీసు ఒకటి, ఇత్తడి బిందె ఒకటి, ట్రాన్సిష్టరు రేడియో ఒకటి వున్నాయి.
షాపు ఓనరైన సేఠ్ తో నోరు విప్పి మాట్లాడాలని కూడా అనిపించలేదు బాలూకి.
కానీ అది సరైన పద్దతి కాదని తెలుసు అతనికి. కొంచెం గట్టిగా బేరం చెయ్యకపోతే సేఠ్ ఏ పాతికో చేతిలో పెట్టి "రాంరాం" అంటాడని గ్రహించాడు. గీచి గీచి బేరమాడి, నాలుగొందలు సంపాదించగలిగాడు.
* * *
"నాలుగొందలు వచ్చాయి సౌదామినీ! ఇంక చూడు. నాలుగంతస్తుల ఇల్లు కొనేస్తాను చూస్తూండగానే" అన్నాడు బాలు.
"తప్పకుండా చేస్తారు!" అంది సౌదామిని. "అదేం బ్రహ్మ విద్యా ఏమిటి?"
తర్వాత ఇద్దరూ దగ్గర దగ్గరగా కూర్చుని ప్లాను పకడ్బందీగా వేయటం మొదలుపెట్టారు. ఏ తారీఖున ఇవ్వాలి ప్రోగ్రాం, ఏ ఆడిటోరియంలో, టిక్కెట్లు ఎక్కడ ఎలా ప్రింటు చేయించాలి. పబ్లిసిటీ ఎలా పేపర్లలో వేయించాలా?
"పేపర్లలో వేయించలేంలెండి! అలాంటివి పెట్టుకుంటే ఆరిపోతాం" అంది సౌదామిని.
"మరి పబ్లిసిటీ ఎలా?" అని కాసేపు ఆలోచించి "యురేకా!" అన్నాడు ఉత్సాహంగా. "అహమ్మద్ గాడి రాత ముత్యాలకోవలా వుంటుంది. వాడిచేత తెల్లకాయితాల మీద రాయించి, కార్డుబోర్డు అట్టలమీద అతికించి, నాలుగు హోటళ్ళల్లో, పాన్ షాపుల్లో పెడదాం. ఓ.కే?"
"వాళ్ళు పెట్టనిస్తారా?"
"ఆ డ్యూటీ నీదన్నమాట. సపోజ్ నువ్వెళ్ళి ఏ హోటల్ వాళ్ళనో 'మా ప్రోగ్రాం వుంది. కాస్త ఈ బోర్డు యిక్కడ పెట్టనివ్వండి ప్లీజ్' - అన్నావనుకో. ఒప్పుకోని వెధవంటూ అసలు వుంటాడా అని".
నవ్వింది సౌదామిని.
ఉత్సాహంగా వుంది యిద్దరికీ గబగబా వంట ముగించింది సౌదామిని. బాలూ యిద్దరికీ కంచాలు పెట్టేశాడు. అల్లపచ్చడి ముద్దలే ఒకళ్ళకి ఒకళ్ళు తినిపించుకుంటూ భోజనాలు పూర్తిచేసి బయటికి వెళ్ళడానికి తయారు అయ్యారు.
గుమ్మం దాటబోతున్న సౌదామినిని "ఇటురా" అని పిలిచాడు బాలు.
అనుమానంగా చూసింది సౌదామిని.
"ఏమిటి చెప్పండి?"
"ఏం చెయ్యనులే భయపడకు. నీతో రహస్యంగా ఒక మాట చెప్పాలి."
"ఇక్కడ చెప్పొచ్చుగా!" పెదాలు బిగించి అంది.
"చెప్పనా? నాకేం చెప్పేస్తాను-" ఆగి పెద్దగా అన్నాడు బాలు. "ఒకవేళ మనం సంగీతంలో షైనవ్వక పోయినా, నువ్వు మోడల్ గా భలే సూటవుతావు సౌదామిని. నువ్వు కట్టుకుంటే ఈ చీరెకి ఎంత అందం వచ్చిందో తెలుసా? ఇక జాకెట్...." ఎవరన్నా వింటున్నారేమోనని భయంగా అటూ ఇటూ చూసింది సౌదామిని.
నవ్వాడు బాలు. "అందుకే అమ్మాయ్ లోపలి రమ్మంటే విన్నావా?" సౌదామినికి లోపలి రాక తప్పలేదు. ఆమెని ముద్దుపెట్టుకుని "ఇక పద" అన్నాడు.
మిట్ట మధ్యాహ్నపు ఎండ అతి తీవ్రంగా వుంది. కానీ వాళ్ళకు అవేమీ పట్టడం లేదు. పైన ఎండా వెదికి తలలు మాడి పోతున్నా, కింద కరిగి ముద్దలు ముద్దలుగా వున్న తారు, అరిగి పోయిన చెప్పులలో నుంచి అరికాళ్ళని కాల్చేస్తున్నా లెక్కపెట్టకుండా త్వరత్వరగా నడిచేస్తున్నారు.
"జోళ్ళు అరిగిపోయి కాళ్ళు కాలుతుంటే నాకో పాతపాట గుర్తొస్తోంది." అన్నాడు బాలూ.
"నేను వినదగ్గది అయితేనే చెప్పండి."
"మరేం ఫర్వాలేదు. యూ సర్టిఫికెటు పాటే, చల్ మోహనరంగా నీకూ నాకూ జోడు కట్టెను కదరా" అని పాడాడు బాలూ ఒక కాలు ఎత్తెత్తి వేస్తూ.
నవ్వుతూ తలతిప్పి అతనివైపు చూసింది సౌదామిని. "అందుకే మీరంటే నాకంత ఇష్టం."
"ఎందుకు?"
"ఎంత కష్టంలో అయినా సరే, మీలో వున్న సైన్సాఫ్ హ్యూమర్ పోదు. ట్రాజెడీలో నుంచే కామెడీ తెప్పించగలరు మీరు, ఛార్లీ చాప్లిన్ లాగా!"
"ఆఁ నాదే వుందిలే" అని పెదవి చప్పరించి తేల్చేసాడు గానీ, అతను ఆ మాటలకి చాలా సంతోషించినట్టు, చిన్నపిల్లాడిలా అతని మొఖమే చెబుతోంది.
"సౌదామినీ! నువ్వు అద్భుతమైన టానిక్కులాంటి దానివి. నువ్వు లేకపోతే నేనేమైపోయి వుండేవాన్నో అసలు" అన్నాడు.
ఒక ఆడిటోరియంకి వెళ్ళారు. అడ్వాన్సు చెల్లించి హాలు బుక్ చేసారు. అక్కడ నుంచి చిన్న ప్రింటింగ్ ప్రెస్ కెళ్ళారు. టిక్కెట్లు ప్రింటు చెయ్యడానికి ఆర్డరు ఇచ్చారు. తర్వాత సిమెంటూ' రంగులూ అమ్మే చిన్న షాపుకి వెళ్ళారు. ఐదు కిలోల జేగురురంగు కొన్నాడు బాలూ.
"ఇదెందుకు?" అంది సౌదామిని ఆశ్చర్యంగా.
"ఫ్రీ పబ్లిసిటీ మనకి. గోడలమీద రాద్దాం?"
"పాపం వాళ్ళ గోడలు పాడయిపోవూ?"
"గవర్నమెంటు వారి గోడలమీదే రాస్తాం మనం. మా వాళ్ళందరికీ ఇలాంటి రాతలు అలవాటే సౌదామినీ!"
"ఏమని రాసేవాళ్ళు? అవుటర్ మంగోలియాలోని కార్మిక, కర్షక విప్లవశక్తులకు మా లాల్ సలామ్ అనా?" అంది సౌదామిని నవ్వుతూ.
నవ్వాడు బాలూ.
ఇంటికి రాగానే వంటింటి గోడకి చేరగిలబడి కూర్చుండి పోయింది సౌదామిని.
అతను ఆదుర్దాగా ఆమె పక్కనే కూర్చున్నాడు. "ఏమైంది సౌదామినీ?"
నీరసంగా తల వూపింది సౌదామిని. "ఏమీలేదు, కొంచెం నడుంనొప్పి! అంతే."
అప్పుడు గుర్తుకువచ్చింది అతనికి. ఆమెకి ఐదవనెల అనీ, ఆ సంగతి పట్టించుకోకుండా తను ఆమెను వీధులెంబడి తెగ తిప్పాడనీనూ, గిల్టీగా చూసాడు.
"సారీ సౌదామినీ! ఈ సంగతి పట్టించుకోనేలేదు నేను. కాళ్ళు నెప్పెడుతున్నాయా మసాజ్ చేయనా?"
"ఇంకా నయం!" అంటూ చప్పున కలలు వెనక్కి లాగేసుకుని, చీర కుచ్చెళ్ళు పాదాల మీదకి సరిగ్గా లాక్కుంది సౌదామిని.
"ఇవాళ ఇంకేం పనులు చెయ్యకు సౌదామినీ! పూర్తిగా రెస్టు తీసుకో కాస్త టీ పెట్టివ్వనా?"
"ఏం వద్దు!" అని అతని చెయ్యి పట్టుకు లాగింది సౌదామిని. "మీరిలాగే నా పక్కన కూర్చుని మాట్లాడుతూ వుండండి చాలు! పావుగంటలో మామూలుగా అయిపోతాను."
ఆమె తలని తన ఒళ్ళో పెట్టుకున్నాడు బాలూ తన నోరు ఆమె చెవి దగ్గర పెట్టి చెప్పటం మొదలుపెట్టాడు.
"సౌదామినీ! ఐ లవ్ యూ! ఐ లవ్ యూ! ఐ లవ్ యూ! ఐ..."
సౌదామిని పెదవులు చిరునవ్వుతో అరవిచ్చుకున్నాయి. అరమూతలు పడ్డ కనురెప్పల కొసలలో చేరిన ఒక ఆనంద బాష్పం మెల్లగా ఆమె చెంపమీదికి జారింది. దాన్ని తన పెదవులతో తుడిచాడు బాలూ.
పావుగంటసేపు అలానే పడుకుని, తర్వాత లేచింది సౌదామిని. ఇద్దరికీ టీ పెట్టింది సౌదామిని. అదే ఊరించుకుంటూ, కబుర్లు నంచుకు తాగారు.
తర్వాత మళ్ళీ ఆలోచనలో పడ్డారు.
ప్రోగ్రాంలో ఏ యే ఐటెమ్స్ వుంటే రక్తి కడుతుంది? ఆర్కెస్ట్రా ఎవరెవరు వుండాలి! ఏ యే ఇన్ స్ట్రుమెంట్సు?
అవన్నీ నిర్ణయం అయ్యాక, "లేవండి, వెళ్దాం" అంది సౌదామిని. అర్ధరాత్రి అవుతోంది అప్పుడు, కిటికీలోంచి వెన్నెల ఆమె మొహంమీద పడుతోంది.
"ఇప్పుడా? ఇంత రాత్రివేళా? ఎక్కడికి?" అన్నాడు బాలు.
"గోడలు ఖరాబు చేద్దాం అన్నారుగా! రండి?"
"ఆ సంగతి నేనూ, అహమ్మదూ చూసుకుంటాం. నువ్విక శ్రమ పడొద్దు సౌదామినీ."
"ఇది శ్రమ కాదు, ప్లెజరు లేవండి".
బక్కెట్ లో జేగురు రంగు కలిపారు. ఇందాక కొన్న అంగుళం వెడల్పు బ్రష్, పాత నిచ్చెనా తీసుకొని బయలుదేరారు.
గొప్ప ఎడ్వెంచర్ చేస్తున్నంత థ్రిల్లుగా ఉంది ఇద్దరికీ. చీకటి సందులు - లూజ్ కనెక్షన్ వల్లో మరెందువల్లో, ప్రతి కొద్ది సెకండ్లకీ వెలిగి ఆరిపోతున్న స్ట్రీట్ లైట్లు.... ఎక్కడో దూరంగా పోట్లాడుకుంటూ వున్న కుక్కలా అరుపులు.... నాలుగు వీధుల అవతల ఘూర్ఖా లాఠీని రోడ్డుమీద కొడుతూ వస్తున్న అలజడి.
"ఇక్కడ మొదలెడదాం" అన్నాడు బాలూ, ఒక గోడని సెలక్ట్ చేసుకుని దానిమీద రాయడం మొదలుపెట్టారు. పై వరస అక్షరాలని నిచ్చెనమీద వున్నా బాలూ రాస్తున్నాడు. కింద వరస అక్షరాలు సౌదామిని రాస్తోంది.
"బ్రహ్మాండమైన మ్యూజిక్ ప్రోగ్రాం-వారం సాయంత్రం ఆరు గంటలకు."
కింద మరికొన్ని వివరాలు.
బ్రష్ తో రాయడం వాళ్ళు అనుకున్నంత ఈజీగా లేదు. పెన్నులా గట్టిగా వుండదు బ్రష్ వెంట్రుకలు వంగిపోతుంటాయి. కొంచెం ఒత్తి రాస్తే పెయింట్ ముద్దగా పడి చారికలుగా కిందకి కారుతోంది. మరీ తేలిగ్గా రాస్తే గీతలు గీతలుగా పడుతుంది. ఒక్కొక్క అక్షరానికీ రెండేసిసార్లు బ్రష్ ని రంగులో ముంచవలసి వస్తుంది. మధ్య మధ్యలో రాయడం ఆపి కింద వున్న సౌదామిని వైపు చూస్తున్నాడు బాలు. నిండు పున్నమి రోజు అది. నెలరాజు తెల్లటి వెన్నెల కురిపిస్తున్నాడు. నెలలు నిండుతున్న సౌదామిని ఆ వెన్నెలలో తడిసిపోతూ మనోహరంగా కనబడుతోంది బాలూకి. ఆమె కదలికలు ఇదివరకటిలాగా చురుగ్గా లేవు. ఆయాసపడుతున్నట్లు కనబడుతోంది.
ఆమె వంగి వ్రాస్తున్న విధానం, కృష్ణవేణి వంపులో నాగార్జున కొండ ఒదిగినట్టు వుంది.
ఒక మహోన్నత శిఖరం మీద తన భర్తని అధిష్టింపజేసి విజయహారతి నివ్వటం కోసం - కుంచె చేతుల్ని ప్రమిదలుగా, కళ్ళని వెలుగు దివ్వెలుగా పెదాలమధ్య పట్టువదలని వత్తిగా, నుదుటిమీది స్వేదబిందువుని నూనెగా చేసుకుని అక్షరం అక్షరమే వ్రాస్తోంది.
ఆమె పడుతూన్న కష్టాన్ని చూసి అతడి మనసంతా ఆర్ద్రతతో నిండిపోయింది.
ఒక ఇంటి గూటిలో-
నువ్వెవరితో కలిసి వుంటున్నావన్నది-