Previous Page Next Page 
రాధ-కుంతి పేజి 21


                                              పెళ్ళిచూపులు

    "ఏవండీ,
    మీరంటే నాకిష్టం. ఇది యిష్టం మాత్రమే సుమా! వెన్నెల రాత్రీ, మహమ్మద్ రఫీ పాటా నాకెంత ఇష్టమో మీరన్నా అంతే. కానీ, చాలా ఫ్రాంక్ గా చెబుతున్నాను ఈ ఇష్టాన్ని ప్రేమగా మార్చుకొని మన అభిప్రాయాలు కలిసిన పక్షంలో మిమ్మల్ని పెళ్ళి చేసుకోవాలని నా కోరిక. అఫ్ కోర్స్, ఇప్పుడు కాదనుకోండి, మన చదువులు పూర్తయిన తర్వాత.
    ఈ విషయంలో మీరూ ధైర్యంగా ఒక్క అడుగు ముందుకు వెయ్యాలి. ఇక అసలు విషయానికి వస్తాను. రేపు సాయంత్రం మీ కాలేజీ వదిలేసిన తరువాత నాతో కలిసి బీచ్ కి రావాలి. చూడండి. ఇందులో మీరు కంగారు పడవలసిన పనేమీ లేదు. మనిద్దరమూ చదువుకున్న వాళ్ళం. ఇంకో ఆర్నెల్లలో నేను ఎమ్.ఎస్ సి. మీరు బి.ఎ. పూర్తి చెయ్యబోతున్నాం. ఇలా నాతో బీచ్ కి రావటం వల్ల తరతరాలుగా మన రక్తంలో జీర్ణించుకుపోయిన భారతీయ సంస్కృతికి ఏదో ద్రోహం చేశామని అనుకోనక్కరలేదు.
    పోతే అసలు నాతో మాట్లాడటానికే మీ కిష్టం లేకపోయినా, లేక మీకీపాటికే ఇంకెవరితోనయినా వివాహం నిశ్చయమైపోయిన పక్షంలో ఈ రోజే, సాయంత్రం నేను చూస్తూ ఉండగానే ఈ లెటర్ ని చింపెయ్యండి.... అంతే. ఇక నేను మీకు కనబడను. నా దురదృష్టాన్ని నిందించుకొని యింకెప్పుడూ అలాంటి తొందరపాటు పని చెయ్యను. భగ్న ప్రేమికుణ్ణి మాత్రం అవను. ఎందుకంటే నేనింకా మిమ్మల్ని ప్రేమించటం మొదలు పెట్టలేదు కాబట్టి, ప్రస్తుతానికి 'ఇష్టం' స్టేజీలోనే వున్నాను కాబట్టి.
    ఉంటానిక.
    ఈ రాత్రికి ఎలాగూ నిద్ర వుండదుగా? రేపటి మీ నిర్ణయం ఏమవుతుందో అన్న ఆలోచనలతో-

                                                                                          కుమార్".
                    *    *    *
    "చాలా ఫ్రాంక్ గా వ్రాశాడు. ప్రతి వాక్యంలోను సిన్సియారిటీ కనబడుతోంది" లెటర్ మడిచి యిచ్చేస్తూ అంది భారతి. అనూరాధ మాట్లాడలేదు.
    "మరేం చెయ్యదల్చుకున్నావ్?"
    "భయంగా వుంది".
    భారతి నవ్వి "అంటే ఒకవైపు ఇష్టంగా కూడా ఉందన్నమాట" అంది.
    ఆమె నవ్వి తలవంచుకుంది. ఆమె బుగ్గలు కొద్దిగా ఎర్రబడ్డాయి.
    అది గమనించి, "మరింక ఆలోచన ఎందుకూ? వెళ్ళిచూడు. అతనేమీ అసభ్యంగా ప్రవర్తించడనే నా ఉద్దేశ్యం" అంది భారతి.
    "కాని, ఎందుకో ఇది తప్పేమో అనిపిస్తోంది" సాలోచనగా అంది అనూరాధ.
    "అలా అని నేను అనుకోను. ఇది తప్పేమో అదే భావంతో చేసుకొనే ఆత్మవంచన కన్నా, వచ్చిన అవకాశం ఎలాంటిదో పరీక్షించుకోవటంలో తప్పులేదనే నా ఉద్దేశ్యం."
    అనూరాధ మాట్లాడలేదు.
    "కుమార్ అంటే.... పొడుగ్గా, ఎర్రగా వుంటాడు.... అతనేనా? జుట్టు ఎప్పుడూ నుదుటిమీదికి పడుతూ వుంటుంది" జ్ఞాపకం తెచ్చుకుంటూ అడిగింది.
    ఆమె సిగ్గుపడి అస్పష్టంగా అవునన్నట్టు తల వూపింది. భారతి నవ్వి.... "అతని దృష్టిలో అసలు నువ్వెలా పడ్డావ్...." అంది.
                                            *    *    *
    రెండు మెయిన్ రోడ్లని కలిపే సందు అది, దాదాపు అర ఫర్లాంగు ఉంటుంది. కాలేజీ నుంచి ఇంటికి చేరుకోవటానికి దగ్గిర దారి అదే. ప్రతిరోజూ అటే వెళుతుంది అనూరాధ.
    ఆ రోజు శుక్రవారం. కాలేజీలో ఏదో ఫంక్షన్ వుండటం వల్ల చాలా ఆలస్యం అయిపోయింది. అసలే అది విశాఖపట్నం. అందులో ఆ వీధిలో లైట్లు ఎప్పుడూ వెలగవు. తను ప్రతిరోజూ వెళ్ళే సందే అయినా ఆ చీకట్లో నిర్మానుష్యంగా వున్న సందును చూచి, చుట్టూ తిరిగి పోదామా అని ఒక్కక్షణం ఆలోచించింది. కానీ, వెనకే యింకెవరో నడిచి రావటంతో ధైర్యం వచ్చి తనూ నడవటం మొదలు పెట్టింది.
    సగంలోకి వచ్చాక, వీధి లాంతరు మసక వెలుతురులో ఒక పొడవాటి ఆకారం నిలబడి తనవైపే తదేకంగా చూస్తూ వుండటం చూసి భయంతో వణికిపోయింది అతను రాములు!
    ఆ చుట్టుప్రక్కల రాములంటే తెలియని వాళ్ళెవరూ లేరు. ఆరడుగుల ఎత్తు, ఎప్పుడూ తాగుతూ వుండటం వల్ల కళ్ళలో ఎర్ర జీరలూ, మెడకి అడ్డంగా కట్టిన జేబురుమాలూ- అతన్ని పగలు చూడటానికే దడుసుకుంటారు ఆడవాళ్ళు.
    అనూరాధకి ఏం చెయ్యాలో తోచలేదు.... వెనక్కి తిరిగి చూసింది. వెనుక వస్తూన్న వ్యక్తి కూడా కనబడలేదు. ఒక్కసారిగా ముచ్చెమటలు పోసినాయి..... అయినా, ధైర్యం చిక్కబట్టుకొనిముందుకు అడుగు వేసింది.
    "ఏం పిల్లా, బావున్నావా?"
    అనూరాధ గుండె క్షణంసేపు కొట్టుకోవటం ఆగిపోయింది. దాదాపు పరుగెడుతున్నంత వడిగా నడవసాగింది. 
    "అరె -అంత తొందరెందుకు?" అంటూ ఇంకొంచెం దగ్గిరగా ముందుకు వచ్చాడు రాములు. సారా వాసన గప్పున కొట్టింది. కెవ్వున అరవబోయింది. కాని, గొంతు పెగలలేదు. ఇక అడుగు ముందుకు పడలేదు. స్థాణువులా నిలబడిపోయింది.
    ఇంకో క్షణం ఆలస్యమై ఉంటే ఏమైవుండేదో కానీ, అప్పుడే వెనుకనుంచి వస్తూ చీకట్లో కలిసిపోయిన వ్యక్తి అక్కడకు వచ్చాడు. అనూరాధకి కొండంత ధైర్యం వచ్చింది. తనూ అడుగు ముందుకేసింది.
    "ఆగు!" బొంగురు గొంతుతో అరిచాడు రాములు. ఇద్దరూ ఆగారు. "నిన్ను కాదురా. బచ్చా... నువ్వెళ్ళు" అన్నాడు.
    "నేను బచ్చాని కాదండీ. నా పేరు కుమార్" అన్నాడు కుమార్.
    "ఏదో ఒకటిలే. పో ఇక్కణ్ణుంచి."
    కుమార్ తాపీగా రెండు చేతులూ జేబులో పెట్టుకుని నడవసాగాడు. అనూరాధ అడుగు ముందుకు వెయ్యబోయింది.
    "ఏయ్ పిల్లా, నువ్వెక్కడికి?"
    అనూరాధకి ఏడుపు వచ్చింది. ఏడుపుతోపాటూ ఏమీ పట్టనట్టు వెళ్లిపోతున్న కుమార్ని నమిలి మింగేద్దామన్నంత కోపం వచ్చింది. వస్తున్న ఏడుపుని గొంతులో ఆపుకుని, "ఏమండీ" అని దాదాపుగా అరిచింది.
    వెళుతున్న వాడల్లా ఆగి, వెనక్కి వచ్చి, "పిలిచారా" అన్నాడు.
    రాములుకి ఇదంతా చూస్తూ వుంటే ఒళ్ళు మండిపోయింది. కుమార్ కాలర్ బిగించి పట్టుకుని "నేనెవర్నో తెలుసా?" అన్నాడు ఆవేశంతో ఊగిపోతూ.
    కుమార్ బిక్కమొహం పెట్టి, "తెలియదండీ. వైజాగ్ కొత్తగా వచ్చాను" అన్నాడు.
    పక్కనే ఉన్న మునిసిపాలిటీ కొళాయిమీద కాలుపెట్టి పాతాళభైరవి విలన్ ఫోజులో నిలబడి, "మనమంటే ఈ పేటంతా హడల్.... తెలుసా?" అన్నాడు మీసం మీద చెయ్యి వేసి.
    "తెలిసిందండీ" అన్నాడు కుమార్.
    ఈసారి అనూరాధకి ఒళ్ళు మండిపోయింది. తన్నిక్కడ నిలబెట్టి ఇద్దరూ తీరిగ్గా పరిచయాలు చేసుకుంటూ ఉంటే.

    "కాబట్టి నువ్వెళ్ళు" అన్నాడు కాలర్ వదిలేసి విసురుగా తోస్తూ.
    కుమార్ ఆ వూపుకి దూరంగా వెళ్లి పడ్డాడు. చేతిలో నరం కలుక్కుమంది. నెమ్మదిగా లేచి పాంటుకి అంటిన దుమ్ము దులుపుకొని మళ్ళీ రాములు దగ్గరగా వచ్చి, "పోనీ వదిలెయ్యకూడదా అండీ? అమ్మాయి భయపడుతోంది" అన్నాడు జాలిగా.
    ఈ ఉచిత సలహాలు చూస్తూంటే రాములుకి అకస్మాత్తుగా టైమ్ వాల్యూ జ్ఞాపకం వచ్చింది. పిడికిలి బిగించి కుమార్ గడ్డం మీద ఫెడేలున కొట్టి, అనూరాధవైపే హీరోలా చూశాడు.
    మొదటి క్షణం కుమార్ కి రకరకాల బొంగరాలు కనబడ్డాయి. తరువాత అకస్మాత్తుగా ప్రపంచం అంతా చీకటి అయిపోయింది. నిముషం తరువాత మళ్లీ ఈ ప్రపంచంలోకి వచ్చేసరికి రాములు చేతుల్లో అనూరాధ గింజుకుంటూంది.
    లేచి మళ్ళీ వాళ్ళ దగ్గిరకెళ్ళి నిలబడ్డాడు. రాములు తన ప్రయత్నంలో నిమగ్నుడై కుమార్ని చూడలేదు. క్షణంసేపు వేచి చూసి రాములు చాలా కాన్ సన్ ట్రేషనులో వున్నాడనీ, తనని గమనించలేదనీ తెలుసుకొని, "ఏవండీ" అంటూ వెనక నుంచి భుజం తట్టాడు.
    రాములు ఉలిక్కిపడి వెనక్కి తిరిగాడు.
    "నేను వెళుతున్నానండీ" అన్నాడు వినయంగా అతడు.
    రాములుకేమీ అర్ధం కాలేదు. అనూరాధ నోటిమీద అలాగే చేతిని నొక్కిపట్టి, "ఏమిటీ?" అన్నాడు.
    "నేనేమో నా దగ్గరుంచుకోనండీ- మీవి మీరు తీసేసుకుంటే నేను వెళ్లిపోతాను. తరువాత మీ ఇష్టం" అన్నాడు తల వంచుకొని.
    కుమార్ మెదడు విషయమై హఠాత్తుగా రాములుకేదో తట్టింది. గట్టిగా నవ్వి, సరిచెయ్యటానికి చెయ్యి పైకేత్తాడు.
    అదే రాములు చేసిన తప్పు. బాబీఫిషర్ అంతటివాడే అప్పుడప్పుడూ తప్పులు చేస్తూ వుంటాడు - రాములు దేముంది? అయినా కుమార్ మాటలకి ఒప్పుకొని అతనిచ్చే రెండూ పుచ్చేసుకొని వుంటే, తేలికయిన హృదయంతో కుమార్ చీకట్లోకి వేదాంతిలా నడుచుకొంటూ వెళ్ళిపోయేవాడేమో? కానీ యిప్పటికే రెండు బాకీ వుండి, మళ్ళీ తన మీదకే చెయ్యి ఎత్తడం అన్యాయం అనిపించింది. అంతకుముందు రాములు కొట్టిన దెబ్బకి గడ్డం మళ్ళీ కలుక్కుమని కొంచెం రెచ్చగొట్టింది.  

 Previous Page Next Page