ఇద్దరూ ఊరి పొలిమేరల కొచ్చారు. వారి ఇంటి నుంచి అరగంట నడక. దూరంలో వుంది గోదారి. అక్కడ పడవల రేవు లేదు. స్నానాల రేవు ఉంది. కానీ జనం అంతదూరం వెళ్లరు. సన్నటి పాయ ఊరిలోకి వస్తుంది. గోచీలు కట్టుకుని కుర్రవాళ్ళు ఆ పాయలోకి దూకుతారు. అక్కడ అంతా కంగారు. ఆయన కదినచ్చదు. అందుకే దూరం వెళ్తాడు.
ఊరు రాతగానే పొలాలు కోసిన మళ్ళలో ఒక గిత్త తోక పైకెత్తి పరుగెడుతూంది. కందిచేలు కోతకి సిద్దమయ్యాయి. పరిగలేరుకోవటానికి అప్పుడే పొలాల్లోకి చేరారు కొందరు.
"ఈ రోజు కూడా బడి వుందిరా?"
"ఉంది తాతయ్యా!"
"సంక్రాంతి పూట బడి ఏమిట్రా?"
"ఈసారి మొదటిస్థానం మాకే రావాలని మావాళ్ళు చాలా పట్టుదలగా వున్నారు తాతయ్యా అందులోనూ మా అయ్యవారికి ఈ దేముళ్ళ మీదా, పండగలమీదా నమ్మకం లేదు" అంటూ ఆయన మొహంలోకి చూశాడు. అయితే ఆ మోహంలో తిరస్కారం ఏదీ కనపడలేదు.
"తనమీద తాను నమ్మకం పెంచుకున్న మనిషికి దేముడి అవవరం లేదురా అబ్బీ. అయితే మీ అయ్యవారు అంత ధీశాలా? లేక పిడివాదంతో తర్కంచేసే మూర్ఖుడా?"
సోమయాజి తబ్బిబ్భై ఆయనవైపు చూశాడు. నాలుగు వేదాల్నీ నలిగులిపట్టిన ఈ నలిమేలి దొర ఏ గొప్ప హేతువాదికీ తీసిపోడు. అలా అని తన నమ్మకాల్తో అవతలివారిని నొప్పించడు.
ఇంతలో రేవు దగ్గిరపడింది.
రేవులో మరికొందరు స్నానం చేస్తున్నారు. సోమయాజి మిత్రులు కూడా వున్నారు అందులో.
ఆ రోజు గోదావరి కాస్త అలిగినట్టుంది. వడివడిగా ప్రవహిస్తూంది.
గోదావరిని చూస్తే అతడికి తన తల్లి గుర్తొస్తుంది. అతడికి తల్లి గురించి ఏమీ తెలీదు. అంతా చెప్పింది తాతయ్యే ఆయన చెప్పినదాన్ని బట్టి ఆమె ఒక అద్భుతమైన వ్యక్తి అయి వుండాలని తోస్తుంది. ఆమె నుంచి దూరమయ్యాక పిన్నమ్మల్లో, అక్కయ్యల్లో అమ్మని చూసుకోవాలని అతడు చాలా ప్రయత్నించాడు. ఒక్కరూ సరిరాలేదు. చివరికి తన తాతయ్యలోనే తల్లిని కనుగున్నాడు.
మోకాలి లోతుకి దిగాడాయన. దోసిలిలోకి తీసుకున్న నీటిలో సూర్యుడు ప్రతిబింబిస్తూ వుండగా అన్నాడు -
"సంక్రాంతిలో విశేషమేమీ లేదురా మకరరాశిలోకి సూర్యుడు ప్రవేసించటంలోనూ విశేషమేమీ లేదు. కానీ కాసిని తిండిగింజలకోసం చెట్టుకోక పక్షిగా వెళ్ళిన కొడుకులూ ఆడపిల్లలయిన ఈడపిల్లలూ, వాళ్ళ కొడుకులూ అందరూ కలవటంలో విశేషం వుంది. ఆదిరా పండగంటే! ఒక పండగ వెళ్ళగానే మరో పండగకోసం ఎదురు చూడటంలో తృప్తి వుంది. అదే లేకపోతే రోజులు నిస్సారంగా, మనకీ, పశువులకీ తేడా లేకుండా గడిచిపోతాయి. "మనిషి బ్రతుకే ఒక పండగ అని నిరూపించటం కోసమే పండుగ" అంటూ చెప్పి ఆయన నీళ్ళలో మునిగాడు.
సోమయాజి చేష్టలుడిగి నిలబడ్డాడు.
అధ్యయనం చేయాలంటే మనిషి జీవితం కన్నా గొప్ప వేదం లేదు.
అంతలో నీళ్ళ అడుగున ఏదో ముసలిలా పట్టుకున్నట్టయి, ఆలోచనలోంచి తెప్పరిల్లి సోమయాజి క్రిందకి చూశాడు. అతడి మిత్రుడు పైకి వస్తూ నవ్వేడు.
సోమయాజి వెళ్లి వాళ్ళతో కలిశాడు. మరో గంటవరకు అతడికి ఆటవిడుపు.
స్నేహితులతో కలిసి దూరంగా వెళ్లి ఈత కొట్టసాగాడు. ఆ ప్రదేశంలో ప్రతి అంగుళమూ వారికి పరిచితమే. మునకలువేస్తూ పైకి తేలుతూ నీళ్ళు జల్లుకుంటున్నారు. సూర్యాభిముఖంగా నిలబడివున్న ఆయనకి ధ్యానభంగం కలిగించకుండా. "ఒరేయ్! అక్కడవరకూ వెళ్లివద్దామా." అవతలి తీరాన్ని చూపిస్తూ అన్నాడో స్నేహితుడు.
"అబ్బో నేను రాలేను బాబూ" అందరిలోకీ బలహీనంగా వున్న రాముడు అనేసరికి అందరూ నవ్వారు. గోదారి అవతలిగట్టును తట్టి తిరిగి రావటం మాటలు కాదు. ఎంతో బలం వుండాలి. నడి గోదారి చేరాక - సమన దూరంలో వున్నా ఇరుగట్లనీ చూసి మనోస్థయిర్యం కోల్పోకుండా వుండాలి.
చివరికి పందెం వేసుకుని నలుగురు బయల్దేరారు.
ముందు సోమయాజులే వున్నాడు. బంతాట ఆడి ఆడి బలమెక్కిన కాళ్ళతో, నీటిని తోసుకుంటూ సాగిపోయాడు. అవతలి తీరం చేరటానికి అరగంటకి కాస్త ఎక్కువయింది. మిగిలినవారు ఇంకా వందబారల దూరంలోనే వున్నారు. గట్టునితట్టి తిరిగి వెనక్కి ప్రయాణించాడు. అయిదు నిమిషాలు వచ్చాక కాళ్ళకి ఏదో చుట్టుకున్నట్టయింది.
గోదావరిలో పాములు కొత్తకాదు. చుట్టుకోగానే కాలు విదిలిస్తే, అసలే ప్రాణభయంతో కొట్టుకుపోతూన్న పాము చటుక్కున కాటు వేస్తుంది. దానంతట అది తొలగిపోవాల్సిందే. కానీ నడిసముద్రంలో దొరికిన ఆధారాన్ని అంత తేలిగ్గా వదులుకుంటుందా అది.
కాళ్ళు కదపకుండా అతడు నీతి అడుక్కి దిగిపోయాడు.
అందులో తొంభై శాతం నీటిపాములే అయివుంటాయి. అవి ఎక్కువసేపు వుండవు. వెంటనే వెళ్లిపోతాయి. అయినా అవి కాలిని చుట్టుకోగానే భయంతో ప్రాణాలు పోయినవారున్నారు.
నీటి పామైతే, అది వుండదల్చుకుంటే మనతోపాటే ఎంతసేపైనా వుంటుంది. మిగతావైతే మనం కదలకాపోతే, లోపల ఎక్కువసేపు వుండలేక కాళ్ళను వదిలేసి వెళ్ళిపోతాయి. అలా వెళ్ళకపోతే అవి నీతిపాములని తేల్చుకుని, కొంచెంసేపు అయ్యాకా మనమే విదిలించి వేయవచ్చు. నీళ్ళలో తరుచు ఈదేవాళ్ళకి ఈ విషయం తప్పనిసరిగా తెలిసి వుండాలి.
అయితే అతను చేసిన తప్పు ఒకటున్నది. చేతుల సాయంతో తల నీటిపైనే వుంచి కాళ్ళని కదపకుండా వుంటే లోపలి పాము వెళ్ళిపోవును. కానీ యువరక్తం అంత భయంలోనూ మనసులో ఏమూలో రవ్వంత సాహసం చెయ్యాలనే ప్రోత్సాహాన్ని కలిగించింది. నీటి అడుక్కువెళ్ళాడు. క్రింది అడుగు కాలికి తగిలాక, కళ్ళు విప్పి చూడటానికి ప్రయత్నించాడు. కానీ నీళ్ళలో ఏమీ కనబడలేదు. అంతలో కాళ్ళ దగ్గిర పాము క్రింద ఉక్కిరిబిక్కిరిగా కదలటం తెలుస్తూంది. కొద్ది క్షణాల తరువాత అది కాలిని వదిలేసి వెళ్లిపోయింది.
సోమయాజి లోలోపలే గర్వంగా నవ్వుకున్నాడు. ఈ విషయం మిత్రులకీ, తాతయ్యకీ చెప్తే ఎలా వుంటుందో అతడప్పుడే ఊహించడం మొదలు పెట్టాడు. రెండు చేతులూ రెక్కల్లా చాపి నీటిపైకి రావటానికి కాళ్ళతో క్రింద భూమిని
తన్నాడు.
కానీ కొద్దిగా పైకి రాగానే వూహించని
రీతిలో ఒక కెరటం అతడిని బలంగా పక్కకి తోసింది. అతడు ఆశ్చర్యపడ్డాడు. సముద్రంలోనే అంతర్వాహినులు వుంటాయని చదివాడు. కానీ, నదుల్లో ముఖ్యంగా గోదావరిలో నీతి అడుగున ఈ ప్రవాహాన్ని చూడటం కొత్త!
ఆశ్చర్యపడుతూనే అతడు మరింత వేగంగా పైకి రావటానికి ప్రయత్నించాడు. కానీ అతడిని బయటికి తోసేసిన కెరటం తిరిగి లోపలికి లాక్కుంది. బలంగా బయటికి రావటానికి ప్రయత్నం చేసాడు.
సఫలీకృతుడు అయ్యాడు కూడా.
తల నీటిపైకి రాగానే గుండెల్నిండా వూపిరి తీసుకుని ఒడ్డువైపు చూసి ఉలిక్కిపడ్డాడు.
ప్రవాహంలో పడి తను తనవాళ్ళనుంచీ రేవునుంచీ కూతవేటు కన్నా ఎక్కువ దూరంలోకి వచ్చేశాడు ఊహూ.... రాలేదు.....తోసివేయబడ్డాడు.
అతడు తిరిగి రేవువైపు ఈదబోతూంటే మళ్ళీ అదే ప్రవాహం అతడిని బలంగా తనలోకి ఈడ్చుకోవటం ప్రారంభించింది. అప్పుడు చూశాడు తన వెనుకవున్న సుడిగుండాల్ని! సరీగ్గా నలుగు గజాల దూరంలో చిన్న చిన్న గడ్డిపరకలూ, తుక్కూ, గుండ్రంగా తిరుగుతూ దాంట్లో లీనమయిపోతున్నాయి. అంత దగ్గరగా సుడులు తిరుగుతున్న ఆ నీటిని చూడగానే అంత ధైర్యవంతుడికీ గుండె ఝల్లుమంది. బలవంతుడు కాబట్టి సరిపోయింది. మరొకరైతే ఈపాటికి లాగేసేదే. అతడు దాన్నించి దూరం రావడానికి కాళ్ళు విదిలిస్తూ పక్కకి గెంతాడు. బహుశా అదే అతడు చేసిన తప్పేమో! ఆ గెంతటంలో కాళ్ళు సుడిలోకి ప్రవేశించాయి. అంతే! తిరుగుతున్న చక్రంలోకి చెరకుగడ ప్రవేశించగానే అది లోపలి లాక్కొన్నట్టూ ఆ సుడిగుండం అతడిని లాక్కొంది. అంతటి శరీరము చిన్న చేపపిల్లలాగా లోపలికి వెళ్ళిపోయింది.
విధి లాగానే సుడి కూడా మనిషితో ఆడుకుంటుంది. వెంటనే చంపదు. బయటకు తోస్తుంది. వెంటనే లోపలకు లాక్కుంటుంది. లేగ దూడలు చిక్కుకున్నప్పుడు మరీ భయంకరంగా వుంటుంది. నాలుగు కాళ్ళూ నీటిపైకి వచ్చి గిర్రున తిరుగుతాయి. గిలగిలా కొట్టుకునేలోపులో మునిగిపోతాయి.
సోమయాజి స్థితి దాదాపు అలాగే వుంది. అతడి శక్తి పూర్తిగా నశిస్తూంది.
అప్పటికే అతడు సుడి మధ్యలో చిక్కుపడటాన్ని రేవు దగ్గర మనుష్యులు చూశారు. కొందరు హాహాకారాలు చేశారు. ఈ లోపులో ఒడ్డుకు చేరుకున్న మిత్రులు ఆ ప్రదేశం దగ్గరికి రావటం కోసం రేవు అంచునే పరుగెత్తుకు రాసాగారు. నీళ్ళలో దూకే ప్రయత్నం మాత్రం ఎవరూ చేయలేదు. గోదావరీ తీరంలో వున్నా పసిపిల్లవాడికి కూడా సుడిగుండం ఎంత ప్రమాదమైనదో తెలుసు.