Previous Page Next Page 
రెండోమనసు పేజి 20


    సరిగ్గా అదే సమయంలో చలపతి తన గదిలో పడుకున్న వాడల్లా లేచి కూర్చున్నాడు. సావిత్రి ప్రశ్నార్ధకంగా అతని వంక చూసింది.
    "నీతో కొంచెం మాట్లాడాలి సావిత్రీ!" గంభీరంగా అన్నాడతను.
    సావిత్రి గుండెలు వేగంగా కొట్టుకోసాగినాయ్. అతని మాటలు వినాలంటే తనకు భయంగా ఉంటోంది. తనిక బ్రతకనట్లే అన్ని విషయాలూ మాట్లాడుతుంటే ఎవరికయినా అలాగే వుంటుంది.
    "ఏమిటది?"
    "నీ సంగతి"
    "రేపు మాట్లాడుకోవచ్చుగాని........ఇప్పుడు పడుకోండి"
    "ఊహు! ఇప్పుడే మాట్లాడకపొతే నాకిక నిద్ర కూడా రాదు."
    తనూ లేచి కూర్చుంది సావిత్రి.
    "ముందే చెప్తున్నాను. అశుభం మాటలు మాట్లాడితే నే వూరుకొను" చిరుకోపంతో అందామె.
    "ఊహు! అశుభం గురించి మాట్లాడటం అయిపొయింది. కేవలం "శుభం" గురించే మాట్లాడతానని హామీ ఇస్తున్నాను సరేనా?"
    "సరే, అలాగయితే మాట్లాడండి."
    

                                                            * * *

    "నాకు జరగబోయే ఆపరేషన్ ప్రమాదకరమని మనందరకూ తెలుసు! అవునా?"
    అయోమయంగా తలూపింది సావిత్రి.
    "ఆ ఆపరేషన్ విజయవంతం కావాలంటే అది రోగి మానసిక స్థితి మీద కూడా కొంతవరకూ ఆధారపడి వుంటుంది. మరి నేను ఎలాంటి దిగులూ లేకుండా వుండాలంటే నువ్వు నాకో మాటివ్వాలి........."
    "ఏమిటది?"
    "అది ముందే చెపితే ఎలా? నువ్వు నాకు మాటిస్తేనే చెప్తాను."
    "నేను మీ మాటేప్పుడయినా కాదన్నానా."
    "అనవని నాకు తెలుసు. అయినాగని నేనింతగా అడుగుతున్నానంటే అందుకు కారణం వుంటుంది కదా! " కొద్ది క్షణాల నిశ్శబ్దం తరువాత తలూపిందామె. "సరే మీకు మాటిస్తున్నాను, చెప్పండి...."
    ఒకవేళ నాకేదయినా జరిగితే........"
    "అదిగో ....అశుభం మాట్లాడనన్నారు......"
    "అందుకే జరిగితే' అన్నాను. ఒకవేళ జరిగితే - నువ్వు శ్రీకాంత్ ని పెళ్ళి చేసుకోవాలి."
    త్రుళ్ళిపడింది సావిత్రి.
    "మీ మాటలకేమైనా అర్ధం వుందా?" కన్నీళ్ళు తెచ్చుకొంటూ అందామె. ఆమె పెదాలు వణుకుతున్నాయి.
    "నిజమే సావిత్రీ! అర్ధం లేనివిగానే కనబడతాయి. కాని ఆ అర్ధం లేని మాటలే నాకు మనశ్శాంతినిస్తాయన్న సంగతి మర్చిపోకు. నా బ్రతుకు ప్రమాదంలో పడిందన్న మాట ఎన్ని రోజుల నుంచి నేనాలోచిస్తోంది ఒక్కటే! అది నీ విషయం! నేను లేని నువ్వు ఎలా బ్రతుకుతవా అనేదే నాకు బాధాకరమయిన సమస్య అయి కూర్చుంది.
    ఇన్ని రోజుల ఆలోచనకి ఇవాలే పరిష్కారం దొరికింది. శ్రీకాంత్ కేమీ లోపం లేదు. నాకంటే అన్ని విధాల యోగ్యుడు. నిన్ను అన్ని విధాల ఉన్నతంగా చూడగల సామర్ధత  అతనోక్కడికే వుంది. అతను నిన్ను ప్రేమగా చూసుకుంటాడని నేను నమ్మడానికి మరోకారణం కూడా వుంది........."కొంచెం ఆగాడు చలపతి.
    సావిత్రి అతని వంక చూడటం లేదు. జీవం లేనిదానిలా కిటికీ లోంచి బయటికి చూస్తోంది.
    "అదేమిటో తెలుసా? అతను ప్రేమించిన అమ్మాయి ఆత్మహత్య చేసుకొందని చెప్పాడు గుర్తుందా? ఆ అమ్మాయికి , నీకూ పోలిక లున్నాయట! నిన్ను చూసినప్పుడల్లా వాడికి ఆ అమ్మాయే గుర్తుకొస్తుండి ఉంటుంది. ఈ పరిస్థితిలో నిన్ను కాదని వాడు కూడా అనలేడు......."
    "అంటే మీ ఉద్దేశ్యం నేను మనిషినీ కాదనీ, నాకు మానసనేది లేదనీ నాక్కావలసిందీ ఒక మగాడు గానీ - వేరే బందాలేమీ అవసరం లేదనీ - అన్నమాట! ఇంతేనా మీరు నన్ను అర్ధం చేసుకొంది?" కన్నీళ్ళు జలజలరాలిపోతుండగా అడిగింది సావిత్రి.
    "నువ్వునన్నలా నిందిస్తే నేనేమీ చెప్పలేను సావిత్రీ. నేను నిన్ను అర్ధం చేసుకున్నానో లేదో నీకు బాగా తెలుసు! నిన్ను బాధించడానికి, హింసించడానికి నేనీ మాటలు చెప్పడం లేదు. పోనీ నాకు హామీ ఇస్తే నాకింక వేరే అసంతృప్తేమీ మిగలదు........"
    "నేనుమీతో మాట్లాడను.........." పక్కకు తిరిగి పాడుకుంటూ అంది సావిత్రి.
    పక్కనే మోచేతి మీద వరిగి ఆపుకోలేని కన్నీళ్ళను తుడుచేసుకొంటూ ఆమె చెక్కిళ్ళ ను చుంబించాడు చలపతి. హటాత్తుగా అతని దుఃఖానికి కట్టలు తెగిపోయినాయ్! ఆమె శిరస్సు మీద తన తల ఉంచి చిన్నపిల్లాడిలా రోదించేయసాగాడు.
    సావిత్రి బిత్తరపోయింది. మరు క్షణంలో ఆమెకూ దుఃఖం పొంగుకొచ్చేసింది.


                                                                   * * *
    మర్నాడుదయం చలపతి లేచేసరికి ఆలస్యమయిపోయింది. సావిత్రి ముందుగానే లేచి మాములుగా కాఫీ తయారు చేసింది.
    ఆరోజు కాఫీ తీసుకెళ్ళి శ్రీకాంత్ కివ్వాలంటే అదోలా అనిపించిందామెకి. అంతకు ముందెప్పుడూ శ్రీకాంత్ మీద అలాంటి వ్యతిరేకభావం లేదు. ఎందుకో తెలీదు గానీ రాత్రి ఆ విషయం చెప్పినప్పటి నుంచి అతని మీద అలాంటి భావం చోటు చేసుకొంటూ వస్తోంది.
    నిజానికి శ్రీకాంత్ దే తప్పూ లేదని ఆమె మనసుకు తెలుసు. అయినా గాని తనని తను అదుపులో ఉంచుకోవడం సాధ్యం కావడం లేదు. అయిష్టంగానే కాఫీ తీసుకెళ్ళి అతని టేబుల్ మీదుంచింది. ప్రతిరోజూ చిరునవ్వుతో అతనిని పలకరించేది. కానీ ఇవాళ తలవంచుకునే బయట కొచ్చేయబోయింది.
    "వాడు లేవలేదా?" అడిగాడతను. అతని గొంతులో కూడా ఏదో మార్పు కనిపించిందామెకి.
    "ఊహు!" అనేసి త్వరత్వరగా బయటకొచ్చేసింది.
    భోజనాల దగ్గర మరింత ఇబ్బందికరంగా కనిపించింది. శ్రీకాంత్ ఆమె ముఖంలోకి చూడటానికే సాహసించలేకపోతున్నాడు. ఏదో తప్పు చేస్తున్న భావన!
    సావిత్రి ఆరోజు ఉదయం నుంచి ఎక్కువ మాట్లాడకుండా ముభావంగా ఎందుకుందో కూడా అతను తేలిగ్గానే ఊహించుకొన్నాడు. బహుశా సావిత్రి క్కూడా ఆ విషయం చెప్పి ఆమెను బలవంతం చేసి వుంటాడు.
    అది ఎంత మూర్ఖత్వమయిన ఊహో తనకూ తెలుసు! కానీ కాదని చెప్పి వాడి మనను నొప్పించడం 'ఊ' అని ఉంటుంది.
    తామిద్దరికీ కావలసింది చలపతి క్షేమం! రోజూ శ్రీకాంత్ సావిత్రి చలపతిని ఉత్సాహంగా ఉంచడానికి ఏదొకటి కల్పించుకొని మాట్లాడుతుండే వాళ్ళు. కానీ ఈరోజు అందుకు విరుద్దంగా వుంది. శ్రీకాంత్, సావిత్రి మాటల్లెకుండా కూర్చుండిపోయారు. చలపతి ఉత్సాహంగా తన చిన్ననాటి కబుర్లు చెబుతున్నాడు.
    "రమణ అని ఉండేవాడప్పుడు . ఇద్దరం కలిసి నాయర్ హోటల్ కెళ్ళాం. చెరో టేబుల్ మీదా కూర్చుని టిఫిన్ చేశాం! ముందు రమణగాడు లేచి రెండు రూపాయల నోటిచ్చి వాడిబిల్లు చెల్లించి వెళ్ళిపోయాడు. తరువాత నేను వెళ్ళి నోటివ్వకుండానే బిల్లు తీసుకొని మిగతా చిల్లరివ్వమన్నాను."
    "నువ్వసలు డబ్బు ఇవ్వందే?" అన్నాడు నాయర్ ఆశ్చర్యంగా.
    "ఇవ్వకపోవడమేమిటి? రెండురూపాయలు నోటిస్తే నువ్వు సొరుగులో వేసుకున్నావు"? అంటూ డబాయించాను.
    "ఇవ్వలేదయ్యా! నాకు ఆ మాత్రం గుర్తుండదేమిటి?" అన్నాడు నాయర్. మా చుట్టూ నాలుగురయిదుగురు జనపోగయ్యారు.

 Previous Page Next Page