అతనికళ్ళలో నిలిచిననీళ్ళు చూసి ఆమెకదిలిపోయింది. తనకోసం అతనింతగా తల్లడిల్లిపోతున్నాడా?" అవసరమయితే తప్పకుండా నీ సహాయం కోరతాను...." చిరునవ్వుతో అందామె.
"అంతేకాదు! మీలాంటి యువతి ఇలాంటి హింసలు భరించే అవసరంకూడాలేదు. మీరూ మిగతా అందరి స్త్రీలలా పతియేప్రత్యక్షదైవం అనుకుంటే ఇంక చదువుకు అర్ధంలేదు. మీరు సాధించదల్చుకున్న ఆశయాలు కాలక్షేపం ఆశయాలయిపోతాయ్!"
ఆమె మాట్లాడలేదు. మళ్ళీ ఆలోచనలు చుట్టుముట్టసాగినాయి.
"నేనికవెళతాను. మళ్ళీ పదిహేను రోజుల్లో మిమ్మల్ని చూడ్డానికొస్తాను".
"ఇంతత్వరగానా?" ఆశ్చర్యంగా అడిగిందామె."
"అవును హేమగారూ! మీకు చెప్పానుకదా! ఇదే మామూలుగా అయితే ఇంతగా బాధపడేవాడినికాదు! కానీ మీ పరిస్థితి చూశాక నా మనసంతా పాడయిపోయింది అసలు మిమ్మల్ని వదలి వెళ్ళాలనే అనిపించడం లేదుకానీ అది సాధ్యం కాని విషయంకదా. అందుకే వెళుతున్నాను. కనీసం పదిహేనురోజులకు ఒకసారైనా తప్పక మిమ్మల్ని చూడ్డానికి రాందే ఉండలేను".
అతనువెళ్ళిపోయాడు. లోపలకు తిరిగి వచ్చింది ఆమె. ఆమె మనసులో అదో విధమైన ధైర్యం ఏర్పడిందిప్పుడు. ఆ రాత్రి పన్నెండింటివరకూ కూర్చుని మరో కథ రాయడంముగించిందామె. అందులోని పాత్ర శ్రీనివాసరావుని పోలిఉన్నదే. అతని మూర్ఖత్వాన్ని ఎదుర్కొని అతనిని వదలివెళ్ళిపోయిన స్త్రీకథ అది. ఆ కథ పూర్తయేసరికి ఎంతో సంతృప్తి కలిగించామెకి.
శ్రీనివాసరావు ఆ తరువాత వచ్చి ఆమెతో మాట్లాడకుండానే నిద్రపోయాడు. మర్నాడు తెల్లారుజామునే ఎవరో తలుపు కొట్టినచప్పుడయి తలుపు తెరిచింది హేమ. ఓ ముసలాయనా మరోయువతీ బెడ్డింగుతో కనిపించారు.
"శ్రీనివాసరావ్ వున్నాడమ్మా?" అడిగాడు ముసలాయన.
"ఉన్నారు! లోపలకు రండి!" ఆహ్వానించింది ఆమె. ఇద్దరూ లోపలకు నడిచి కుర్చీల్లో కూర్చున్నారు. ఆమె వెళ్ళి శ్రీనివాసరావుని లేపింది.
"ఎవరో బంధువులొచ్చారు" అంది అతను కళ్ళుతెరవగానే.
లేచి బయటకు వచ్చాడు శ్రీనివాసరావ్. నాగమణీ, ఆమె తండ్రీ కనిపించేసరికి ఆశ్చర్యపోయాడతను.
"మీరా!" అన్నాడు వాళ్ళు ఎందుకొచ్చిందీ అర్ధంకాక."
"బాగున్నావా?" అడిగాడు ముసలాయన.
"ఆ! ఏమిటంత హఠాత్తుగా వచ్చారు?" అడిగాడతను.
"నాగమణి కి ఇక్కడ ఉద్యోగానికి ఇంటర్ వ్యూ వచ్చింది. అందుకువచ్చాము....." శ్రీనివాసరావ్ కి చెప్పారని ఆశ్చర్యం కలిగింది.
నాగమణి ఉద్యోగం కోసం వచ్చిందంటే నమ్మలేకపోతున్నాడతను అయిదేళ్ళ క్రితం ఆమెకు ఏమీ తెలీదు చదువు సంధ్యలే మాత్రం రానిపిల్ల. ఇప్పుడామె హఠాత్తుగా మెట్రిక్ పాసయి, టైపుపరీక్షలు పాసయి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తోందంటే ఆమె ఎంత పట్టుదలగలమనిషో తెలుస్తోంది. నాగమణి వేపు ప్రశంసాపూర్వకంగా చూశాడతను.
"నువ్వు గొప్ప ఫీట్ చేశావు నాగమణి" అన్నాడతను. నాగమణికూడా నవ్వేసింది.
"ఇంత తేలిగ్గా ఇంటర్ వ్యూ ఎలా దొరికింది నీకు?"
"టైపులోయరూ, హైయ్యరుకూడా డిస్టింక్షన్ తో పాసయ్యాను. అందుకని పిలిచారనుకుంటాను.....".
"వెరీగుడ్" అభినందిస్తూ అన్నాడు. అయితే ఆమె కట్టూబొట్టూ విషయంలోనూ, ఇతరఅలంకారాల విషయంలోనూ ఏమాత్రం మార్పు కనిపించలేదు. అచ్చం అదే పల్లెటూరి అవతారం.
"హేమా!" లోపలకు చూస్తూ పిలిచాడతను.
ఆమె వచ్చిందక్కడికి.
"ఇదిగో! తనెవరో తెలుసా? నాగమణి నాకు వరసకు మామయ్య కూతురు? ఆయన మా మామయ్య నాగమణికి ఏదో ఇంటర్ వ్యూ వచ్చిందట! అందుకని వచ్చారు....." అన్నాడు పరిచయం చేస్తూ.
"మీ పెళ్ళికి రావాలని ఎంతగానో అనుకున్నానక్కా! కానీ మావాళ్ళు పడనీలేదు" లేచి హేమ దగ్గరకునడుస్తూ అందామె.
ఆమెమందహాసం చేసింది. "నువ్వు గ్రాడ్యుయేట్ నికదక్కా! ఏమీ ఉద్యోగం చేయటంలేదా?" అడిగిందామె.
కొద్దిక్షణాలతర్వాత. "ఊహు!" అంది హేమ క్లుప్తంగా.
"ముందు మీరు బట్టలు మార్చుకోండి! తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందురుగాని......" అన్నాడు శ్రీనివాసరావ్ తనులేచి లోపలకునడుస్తూ.
ఆమె వంటింటిలోకివెళ్ళి పని ప్రారంభించింది. నాగమణి కూడా ఆమెవెనకే వచ్చి పనిలోసహాయం చేయసాగింది.
"మీరెందుకుచేయడం! నేను చేసేయగలనులెండి" అందామె వారిస్తూ.
ఫరవాలేదక్కా! నిజం చెప్పాలంటే వెధవ ఉద్యోగంకంటే వంటింటి పనేఇష్టం నాకు!" నవ్వుతూ అందామె. ఆమెకూడా నవ్వేసింది.
"మొఖంమీద ఆ బొబ్బలేమిటక్కా?" అడిగింది నాగమణి.
"ఈ ఇంట్లో నేనే భార్యను అనడానికి గుర్తులు...." నవ్వుతూనే అందామె.
"అంటే?....నూనె పడిందా?" ఆర్ధంకాక అడిగింది నాగమణి.
"అవును!" ఆమె ఇంకేమీ మాట్లాడలేదు.
హేమ ప్రతి కదలికనూ జాగ్రత్తగా గమనించసాగింది. బావ తననుకాదని ఓ చదువుకున్న అందమయిన అమ్మాయిని చేసుకోబోతున్నాడని నిన్న క్షణం నుంచీ హేమను చూడాలన్న కోరిక తినేస్తోంది తనను. తనలో లేనిది ఆ అమ్మాయిలో ఏం కనిపించింది బావకి? ఆమెలో ఏమేం ప్రత్యేకతలు చూసి వివాహం చేసుకున్నాడతను?
శ్రీనివాసరావు మొఖం కడుక్కుని టవల్ తో మొఖం తుడుచుకుంటూ వెళ్ళాడు. అది నాగమణికి కొంత ఆశ్చర్యం కలిగింది. తమ ఇంట్లో తన తండ్రికి అన్నీ తల్లే అందిస్తుంది పందుపిల్లా, మొఖం కడుక్కోవడానికి నీళ్ళూ, మొఖం తుడుచుకోడానికి తువాలూ, మధ్యాహ్నం స్నానానికి నీళ్ళు తోడటం, పక్కవేయడం, కాళ్ళుపట్టడం ఒకటేమిటి సర్వస్వం ప్రతిమగాడికీ సేవలు చేయాల్సిందే. భార్యగానీ, లేకపోతే కూతురుగానీ, లేదా కోడలుగానీ ఎవ్వరొకరు ఆ బాధ్యత స్వీకరించాల్సిందే. ఇది తమ గ్రామంలో ప్రతి ఇంట్లో వున్న పద్దతి. పల్లెటూరి నుంచి పట్నం వచ్చిన తమ బంధువుల ఇళ్ళల్లో కూడా ఇదే పద్దతి అమలులోవుంది.
అందుకే శ్రీనివాసరావ్ హేమప్రమేయమేమీ లేకుండా తనంతట తానే మొఖం కడుక్కోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది తనకు. కాఫీ ఫలహారాలయాక కూడా అతనే వేడినీళ్ళు తోడుకోవడం, స్నానం చేయడం కూడా గమనించింది నాగమణి.
"అక్కా! బావకి నీళ్ళుతోడడం కావలసినవన్నీ అందించడం ఇవేమీ చేయవా నువ్వు?" అడిగిందామె శ్రీనివాసరావ్ ఆఫీసుకెళ్ళిపోయాక.
ఆమెకు నవ్వాగలేదు. "సేవలు జబ్బు మనుషులకు చేయలిగాని ఏ రోగమూ లేని వాళ్ళ కెందుకు?" అంది నవ్వుతూ.
"ఇదే మా వూళ్ళో అయితే ఎంతో తప్పు అక్కా! అలా పట్టనట్టుఊరుకోవడం!" అంది కొంచెంగర్వంగా ఫీలవుతూ.
"మొన్న మొన్నటి వరకూ భర్తతోపాటు సహగమనం చేయకపోవడంకూడా ఎంతో తప్పుగానే భావించేవారుకదూ?" అడిగిందామె.
ఈ ప్రశ్న నాగమణిని కలవరించింది. "ఆడది మగాడికి బానిసకాదు నాగమణి! మనలాంటి చదువుకున్నవాళ్ళయినా కళ్ళుతెరవకపోతే మన స్త్రీ జాతిపూర్తిగా పాతాళానికి జారిపోతుంది....."
నాగమణి ఏమీ మాట్లాడలేదు. ఆమెకు హేమ మాటలు అంతగా నచ్చలేదు. తన ఉద్దేశంలో మొగాడూ, ఆడదీ ఎప్పటికీ సమానం కాలేరు. మగాడి ఔన్నత్యం ఎప్పటికీ అలాగే వుండిపోతుంది యుగయుగాలుగా ఇదే రుజువవుతూ వచ్చింది. అది న్యాయం కూడా!
"కాని అక్కా! మగాడు బయటకష్టపడి ఇంటికొస్తాడు. అలాంటప్పుడు మనం అతనికి సేవలు చేయడంలో తప్పేముంది?" తెలివిగా అడిగిందామె.
"సరే! బయట కష్టపడేవారికి ఇంట్లో వున్నవారు సేవలు చేయాలి! మరి, అదే ఆడది ఉద్యోగం చేసి ఇంటికొస్తుందనుకో! అప్పుడు భర్త ఆమెకి సేవలు చేస్తాడా? ఎక్కడయినా అలా జరగడం చూశావా?" అడిగిందామె. ఆమెతో వాదించడం కష్టమని తెలిసిపోయింది నాగమణికి.
"పోనీ అక్కా! ఇప్పుడా గొడవలెందుకుగానీ నీ గురించి ఏమయినా విశేషాలు చెప్పు! బావకు నువ్వంటే ఎంతో ఇష్టంకదూ?"
"అవును! ఎంతో ఇష్టం!" నవ్వుతూనే అందామె.
"నీకీ విషయం తెలుసా అక్కా? నేను బావను చేసుకుంటానని పట్టుపట్టాను. కానీ బావ ఒప్పుకోలేదు....." హేమ ఆశ్చర్యపడింది. అతను ఆమెను చేసుకోడానికి ఒప్పుకోలేదన్న విషయం తనకు తెలీదు.
"ఎందుకని?"
అప్పటికి నేను అసలు చదువుకోలేదు. చదువులేని అమ్మాయి అవసరం లేదని బావ ఖచ్చితంగా చెప్పేశాడు. నిజంగా నాకెంత కోపం వచ్చిందో తెలుసా! అ రోజు నుంచే పట్టుదలతో చదవడం ప్రారంభించాను. నేను పెద్ద చదువులు చదవాలనీ, పెద్ద ఉద్యోగం చేయాలనీ అప్పుడు నన్ను చూసి బావ పశ్చాత్తాపపడాలనీ ఏమిటేమిటో పిచ్చి ఆలోచనలు వచ్చేవి తీరా చదువులో పడ్డాక అవన్నీ మర్చిపోయాను. ఇప్పుడు మళ్ళా ఆ పట్టుదల, ఆలోచనలూ ఏమీలేవు, అసలు జీవితం మీదే ఆసక్తిపోయింది...." చొరవగా అన్ని విషయాలూ చెప్పేసింది నాగమణి.