Previous Page Next Page 
ప్రేమ తరంగం పేజి 20

కాదు వీళ్ళిద్దరూ మా అమ్మ సెలక్షను. అతను స్వరూప్. ఐ. ఎ. ఎస్. కి ఆప్పియర్ అవుతున్నాడు. అతను కుమార్. ఏదో బ్యాంకులో ప్రొబేషనరీ ఆఫీసర్. వీళ్ళిద్దరూ తప్ప వేరే మొగాళ్ళు లేరా అనిపించింది నాకు" అంది.
వాళ్ళిద్దరూ- లావణ్యకి నచ్చలేదని వినగానే శ్రీహర్ష మనసు కుదుటపడింది.
"నా మాట విని పేపర్లో వేయించండి. పదిరూపాయల అప్లికేషన్ ఫీజు పెట్టినా ప్రపంచంలో ప్రతి బ్రహ్మచారి అప్లై చేస్తాడు. ఆ కోట్లాది ఫోటోల్లో నచ్చినవాణ్ణి ఎన్నుకోవచ్చు."
"ఏమో! అందరూ అప్లై చేస్తారని గ్యారెంటి ఏమిటి?"
"మీరు మరీ ఎక్కువ క్వాలిఫీకేషన్లు అడక్కపోతే ప్రతివాడూ- ప్రతివాడూ అప్లై చేస్తాడు. అసలింతకీ మీకు కావాల్సిన అర్హతలేవో చెప్పండి."
"నాకా? ఊ!....అబ్బే పెద్ద పెద్ద ఆశలేం లేవండి. అందంగా.........." అంటూ ఒకసారి శ్రీహర్ష వైపు చూసింది............" ఉండాలి."
ఇంకోసారి అతన్ని ఆపాదమస్తకం చూసి, ఐదడుగుల పదంగుళాల పోడుగుంటే చాలు. అంతలావూ సన్నము కాకుండా ఉండాలి. గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. డబ్బు సంపాదించి పైకి రావాలనే తహతహ ఉండాలి. ఒక్క మాటలో చెప్పాలంటే మీలాగా ఉంటే చాలనుకొండి" అంది.
"నాలాగానా?" అన్నాడు శ్రీహర్ష. "చాలా చిన్న కోరికే నాది. నాలాంటి వాళ్ళు వీధికొకళ్ళు ఉంటారు ఇండియాలో."
"మరీ అంతగా అబద్దాలాడేయ్యకండి. మీలాంటి వారైతే చాలు అన్నాను గానీ, మీలాంటి వాళ్ళు వీధి కొకళ్ళు ఉంటారని నేననుకోలేదు. అనలేదు. వీధికొకళ్ళు కారు, కోటికొకళ్ళు కూడా ఉండరు."
"మీరంటే గుర్తొచ్చింది. కోఠిలో ఒకడు నాలాంటి వాడే కనబడుతుంటాడు."
"అబ్బ పోనిద్దురూ వేదవెవడో! అయినా మీలా ఉండడం ఎందుకు?"
"సరదానేమో పాపం"
"ఇంతకీ నన్ను చెప్పనివ్వండి. మీలాంటి వారు మీరొక్కరే ఉంటారు ఈ ప్రపంచంలో"
"అయితే మీ అడ్వర్ టెయిజ్ మెంటుకి ఒకటే అప్లికేషన్ వస్తుంది."
"ఎంట్రి ఫీజు లేకుండా వచ్చినా మీది కన్ సిడర్ చేస్తాం."
"మరి ఇంటర్వ్యు?"
"మిరోక్కరు చేస్తే చాలా ? మీ నాన్నగారూ? మీ అమ్మగారూ?"
"ఉద్యోగానికి మిమ్మల్నే అపాయింట్ చెయ్యాలని నాన్నగారు తహతహలాడి పోతున్నట్లు నాకు తెలుసు. అయినా అయన ఊరికెళ్ళబోతూ తను అడగాల్సిన ప్రశ్నలు కుడా నన్నే అడగమని చెప్పేసి వెళ్ళారు."
"మరి మీ అమ్మగారు తప్పకుండా నన్ను ఇంటర్వ్యులో ఫెయిల్ చేసేస్తారు కదా"
"మరేం భయం ల్;లేదు. ఇంటర్వ్యూ బోర్డులో ఇద్దరు సరే అంటే మూడో వాళ్ళు ఒప్పుకోకపోయినా సెలెక్టయి పోయినట్లే మీరు. బెంగపెట్టుకోకండి."
"సరే! ఐయామ్ రెడీ" అన్నాడు శ్రీహర్ష, సర్దుకు కూర్చుంటూ.
"మీ పేరు ?" అంది లావణ్య.
"శ్రీహర్షవర్ధన్"
"జస్ట్ ఏ మినిట్. ఒక్కసారి మీ పెన్ను ఇవ్వండి. ఆ! కాస్త ఆ బల్ల మీద లెటర్ పాడు ఇటు పడెయ్యండి. ఇప్పుడు చెప్పండి మీ పేరు?"
"శ్రీహర్షవర్ధన్"
"అలా ఏదో దేశానికి రాజులాగా పెట్టుకున్నారేం పేరు?"
"ఏ దేశానికి రాజుని కావాలని లేదుగానిండి ఎవరన్నా అమ్మాయి మనో సామ్రాజ్యానికి యువరాజుని కావాలని ఉంది."
"ఫలానా అమ్మాయిని అని పట్టుదల లేదా?" అంది లావణ్య కోపంగా.
ఒక్క క్షణం ఆలోచింది, "ఆశ అయితే ఉంది."
నవ్వింది లావణ్య.
"ఆ అమ్మాయికి మాత్రం పట్టుదల చాలా ఎక్కువ అనుకోండి. ఫలాని అబ్బాయి కావాలనుకుంటే చేసుకు తీరుతుంది."
"అతని కిష్టం లేకపోయినా?"
"ఇష్టమయినా, కష్టమయినా కూడా! అయినా అతని కిష్టం లేకపోవడమేమిటి?" అంది కనుబొమ్మలు ముడేసి చూస్తూ.
ఈసారి నవ్వడం శ్రీహర్ష వంతయింది.
అంతలో చటుక్కున లేచి నిలబడింది లావణ్య. గదిలోంచి బయట కెళ్ళి పదిసేకేండ్ల తర్వాత తిరిగి వస్తూ, గొంతు మారుస్తూ కుటుంబరావుగారిని అనుకరిస్తూ "సారీ ఫర్ ది డిస్టర్ బెన్స్" అంది.
అని చకచక నడిచి ఇందాక తను నిలుచున్న స్థానానికి వచ్చి తన గొంతుతో "మీరు అప్పుడే వచ్చేరేమిటి నాన్నగారూ? మన ఇంటర్య్వూ ఒక పద్దతి ఏమి లేకుండా జరిగిపోతుంది." అని మళ్ళీ ఇటు వైపు వచ్చి సీరియస్ గా మొహం పెట్టి, రావుగారి గొంతుతో "లావణ్యా! ఇది చాలా సీరియస్ విషయం. నువ్వు అల్లరిగా మాట్లాడకు" అంది.
మళ్ళీ లావణ్యా స్థానానికి వచ్చి "సరే అలా అయితే నేనెందుకిక్కడ. నే వెళ్ళి పోతున్నాను. బై! శ్రీహర్షా" అంది.
"హు! పిచ్చిపిల్ల" అంది రావు గారి గొంతుతో.
శ్రీహర్ష టెన్నిస్ ప్రేక్షకుడిలా తల తిప్పుతూ ఈ ద్విపాత్రాభినయాన్ని చూస్తున్నాడు.

 Previous Page Next Page