Previous Page Next Page 
క్షమించు సుప్రియా! పేజి 20

           

                                    పరస్పరం
   
   
   
    భైరవమూర్తి పెళ్ళయిన కొత్తలో చాలా సంతోషించేవాడు. (చాలా అసంబద్దమైన వాక్య నిర్మాణం ఇది. అయినా రచయిత చెప్పదల్చుకున్నది పాఠకులకి అర్ధం అయింది కదా! చాలు-పబ్లిషర్) అతడు అందరితోను మామూలుగానే వుండేవాడు. కానీ ఆలోచన్లు మాత్రం విచిత్రంగా వుండేవి.
   
    అతడో రకంగా సైకోపేధిక్. (అంటే అనాచరణాయోగ్యబాహ్య స్వరూప ప్రకటిత మనస్కుడు....పబ్లిషర్.) అయితే ఇది తక్కువ మోతాదులో వుండటం వల్ల ఎవరికీ తెలిసేది కాదు.
   
    తను ఒంటరివాడినన్న భావం అడాల్ సెన్స్ లో ప్రతివాడికీ వుంటుంది. అయితే వయస్సు పెరిగేకొద్దీ ఏర్పడే వ్యాపకాల్తో ఇది పోతుంది. (ఈ ఒంటరితనం అనేది జంట దొరగ్గానే పోతుందని చాలామంది అనుకొంటారు కానీ అది తప్పు .... పబ్లిషర్.)
   
    భైరవమూర్తికి సంబంధించినంతవరకూ వయస్సు పెరిగినా ఆ ఒంటరితనం పోలేదు. కారణం అతడికి మరేం వ్యాపకమూ లేకపోవటమే. ఆఫీసునుంచి వచ్చి, స్నానం చేసి, రూమ్ బయట కుర్చీవేసుకొని రాత్రి ఎనిమిదిన్నర వరకూ సినిమా పత్రికలూ, వారపత్రికలూ చదివేవాడు. అతడికి ఇవన్నీ చౌకబారుగా కనిపించేవి. అయినా పది సంవత్సరాలనుంచీ చదువుతున్నాడు. (దీన్ని పారనాయిక్ సైకాలజీ అంటారు - పబ్లిషర్.)
   
    ఆ తరువాత అతడు భోంచేసి మళ్ళీ బయట కూర్చొనేవాడు. చీకట్లో ఆకాశం కేసి చూస్తూ శూన్యత గురించి ఆలోచించేవాడు. మిగతా ప్రజలంతా ఏదో అజ్ఞాతంలో వేగిపోతున్నట్టు - తన లాజికల్ ఐడియలిజంని (భావప్రధాన తార్కిక వివరణాన్ని) వాళ్ళు అర్ధం చేసుకోలేకపోతున్నందుకూ - విచారించేవాడు.
   
    స్నేహితులతో కలసి మందు కొడ్తున్నప్పుడు కూడా అతడు వాళ్ళ గురించే బాధపడేవాడు. తన సంగతి వేరు. ఇళ్ళల్లో వదలి రాత్రి పదకొండింటి వరకు యిలా ఎందుకు గడుపుతారో అర్ధం అయ్యేది కాదు. ప్రేమ, ఆప్యాయతా, కళ్ళల్లో చూసుకోవటం, యుగాలు క్షణాలుగా మారటం...... ఇలాంటి వాటిగురించి ఆలోచించేవాడు.
   
    అతని ఆలోచన్లు ఇంకోరకంగా కూడా వుండేవి. అతడు తాగుడుకి బాగా బానిస అయిపోయినట్టు - భార్య దుఃఖాన్ని గుండెల్లో (చాలా బరువయిన పదం- పబ్లిషర్) దాచుకొని, బేలగా తనవైపు చూస్తూన్నట్టూ తను ఇంకా పాడైపోయినట్టూ కలగనే వాడు. అయితే ఈ కల ముగింపు గొప్పగా వుండేది. ఒక రోజున హఠాత్తుగా అతడికి జ్ఞానోదయ మయ్యేది. భార్యని హృదయానికి హత్తుకొని "క్షమించు సీతా, ఈ రోజే తెలిసింది ఇన్నాళ్ళూ నిన్నెంత బాధపెట్టానో! ఈ క్షణం నుంచి మన చుట్టూ వున్న చీకటి తెరలు తొలగిపోయేయి సీతా. ఇక అంతా ఆనందమే!!" అనేవాడు ఆవేశంతో. ఆమె కళ్ళనిండా నీళ్ళతో "ఇదంతా నా మంగళసూత్రం చేసుకున్న భాగ్యమండీ" అనేది చాలా డ్రెమెటిక్ గా ఆ , మరుసటిరోజే దీపావళి వచ్చింది. పిల్లల్తో కలసి ఆనందంగా టపాకాయలు కాలుస్తున్న భర్తని చూసి సీత పాడు రోజులు పోయాయి కదా అని సంతోషపడేది.....ఇలా ఉండేవి అతని ఆలోచన్లు.
   
    భైరవమూర్తి ఆఫీసులో అమ్మాయి లెక్కువ. అతడు పన్జేసేది స్టేషనరీ డిపార్టుమెంట్ లో కాబట్టి వాళ్ళు ఇతడితో నవ్వుతూ మాట్లాడేవారు. (తెల్ల కాగితాల కోసం!) వాళ్ళతో మాట్లాడుతూ ఇతడు తెగ బాధపడి పోయేవాడు. "అయ్యో.....పెళ్ళి కావాల్సిన అమ్మాయి ఇలా పరాయి మొగవాడితో మాట్లాడి చెడిపొతుందే" అని. (మరి ఇతడికి పెళ్ళికాలేదు కదండీ-పబ్లిషర్)
   
    భైరవమూర్తికి ఇరవై ఎనిమిదో ఏడు నిండుతూ వుండగా అతడి జీవితం మలుపు తిరిగింది. ఎవరూ సాధించలేని గొప్ప విజయాన్ని సాధించేడు. హీరో అయ్యాడు. అది అతడి పెళ్ళి!
   
    ఎవడి పెళ్ళిలో వాడు హీరోయే కదా!
   
                                                                    *    *    *
   
    ఆ తరువాత భైరవమూర్తి కనపడలేదు.
   
    (అంటే కనబడకుండా పోవటం అనికాదు - బయట కనిపించలేదు అని. ఆఫీసు అవగానే ఇంటికి పరుగెత్తుకుంటూ వచ్చేవాడు. ఆఫీసులో వుండగా ఎప్పుడూ గడియారం వంక చూస్తూ ఉండేవాడు. బయట ప్రజల్తో కలవడం మానేశాడు. క్యాజువల్లీవులన్నీ వాడేసుకొన్నాడు. తొందరగా ఇంటికి వెళ్ళగలిగే పర్మిషన్లన్నీ సూపర్నెండెంటు ఇక ఇవ్వననే వరకూ వాడేశాడు - పబ్లిషర్).
   
    ఇలా ఓ మూడు నెలలు గడిచేయి.
   
    ఒకరోజు షికారుకి వెళ్ళటానికి తయారవుతున్నారు భార్యాభర్తలు. ఆమె  అద్దం ముందు అలంకరించుకొంటూంటే చూస్తున్న మూర్తి "రాదా" అన్నాడు.
   
    ఆమె తల తిప్పి చూసింది.
   
    "నువ్వు చెవులకు రింగులు పెట్టుకోవడం మానేసి. దుద్దులు పెట్టుకో కూడదూ" అన్నాడు.
   
    రాధ నవ్వి "దుద్దులు ఓల్డ్ ఫేషనండీ" అంది.
   
    "అయినా వాటిలో వున్న అందం ఈ రింగుల్లో ఏముంది చెప్పు" అన్నాడు. ఆమె అతనివైపు ఆప్యాయంగా చూసి "సర్లేండి మీకేది ఇష్టమైతే నాకూ అది ఇష్టమే" అని ఆ రింగుల్ని పెట్టె అడుగున పారేసింది. మూర్తి మొహం మూర్తివంతమైంది. ఇంట్లో తల్లి వుంది కాబట్టి ఆగిపోయాడు కానీ లేకపోతే ఆ క్షణం ఆమెని ఉక్కిరిబిక్కిరి చేసేవాడు.
   
    ఇది జరిగిన కొన్నాళ్ళకి ఓ స్నేహితుడికి ప్రమోషనొచ్చి పార్టీ ఇచ్చేడు. అందులో ఎంత బలవంతం చేసినా భైరవమూర్తి మందు ముట్టుకోలేదు. "వద్దు బ్రదర్" అనేశాడు.
   
    "అదేమిటి గురూ.....అంతకుముందు తాగే వాడివిగా" అన్నారు స్నేహితులు. అతడేదో మాట మార్చటానికి ప్రయత్నించేడు కాని కుదర్లేదు. నసుగుతూ "మా ఆవిడకి ఆ వాసన పడదోయ్" అన్నాడు. ఆ గది నవ్వులతో ప్రతిధ్వనించింది.
   
    "మా ఆవిడకీ ఈ వాసన పడదోయ్, అందుకని మానేస్తామా? మందు కొట్టేయ్. తరువాత మొహం టూత్ పేస్ట్ తో కడుక్కో కిళ్ళీ వేసుకో. నాలుగు జామ ఆకులు నములు బ్రహ్మ వచ్చినా పట్టుకోలేడు" అన్నాడో స్నేహితుడు. "కాల్గేట్ అయితే మంచిది" స్వానుభవంతో చెప్పేడు ఇంకొకడు.
   
    "వద్దోయ్" అన్నాడు భైరవమూర్తి. "పరస్పరం అలా మోసం చేసుకుంటే ఇక భార్యాభర్తల మధ్య అవగాహనేముంటుంది?"
   
    ఇక్కడ డిస్కషను రసవత్తరంగా కొంచెం తెలివితేటలుగా నడిచింది.
   
    "ఇందులో మోసం ఏముంది? నువ్వేమీ ఆవిణ్ణి ద్రోహం చెయ్యటం లేదుగా? నీ సుఖం కోసం నువ్వు ఓ పెగ్గు తాగుతున్నావ్. అది మీ ఆవిడకి ఇష్టంలేదు కాబట్టి ఆవిడ్నించి దాస్తున్నావు. 'నొప్పించక తానొవ్వక ఎస్కేపై తిరుగువాడు ధన్యుడు సుమతీ!' అన్న పద్యం వినలేదూ? జీవితంలో షైన్ అవ్వాలంటే ఆ మాత్రం లౌకికం వుండాలి బ్రదర్. ఒక్క భార్యే సర్వస్వం అనుకోకూడదు" ఓ అనుభవజ్ఞుడు సలహా ఇచ్చేడు.
   
    "ఆత్మవంచన -" అన్నాడు భైరవమూర్తి.
   
    "చెప్తే ఎక్కువ బాధపడ్తుంది కాబట్టి చెప్పటం లేదు, అంతేగా...."
   
    అతడీ మాటలు పట్టించుకోలేదు. అంతలో స్నేహితుడు తెప్పించిన మందుకూడా వచ్చేసింది. ఎంత బలవంతం చేసినా ముట్టుకోలేదు. ఇంటికొచ్చేశాడు.
   
    ఇది జరిగిన రెండ్రోజులకి అతడు ఆఫీసుకు బయల్దేరబోతూ వుంటే తల్లి వచ్చి "నేను రేపు వెళ్ళిపోదామనుకుంటున్నాన్రా" అంది. అతడు సంతోషాన్ని మొహంలోనే దాచుకొని "అప్పుడే ఎందుకు?" అన్నాడు.
   
    "మీ నాన్నగారు ఒక్కరే వుంటారు. ఎలా వున్నారో యేమో" అంది.
   
    "సరే అయితే" అన్నాడు.
   
    ఆమె గదిలోంచి వెళ్ళిపోయాక రాధ వచ్చింది- "ఈ రోజు నేనూ అత్తగారు మార్నింగ్ షో కి వెళదామనుకొంటున్నామండీ....." అంటూ.
   
    "దేనికీ?" చొక్కాగుండీలు పెట్టుకొంటూ అడిగేడు.
   
    "బురదరాముడు...."

    అతడు పర్సు జేబులో పెట్టుకుంటూ "మిట్ట మధ్యాహ్నప్పూట ఎండలో ఆ క్యూలో నిలబడి సినిమా చూడకపోతేనేం?" అన్నాడు.
   
    "పోనీ ఫస్ట్ షోకి వెళ్దాం. మీరూ రండి" అంది రాధ ఆశగా.
   
    "నేను తెలుగు సినిమాలు చూడనని తెలుసుగా"
   
    "అందుకే మేం వెళ్తున్నది...." అంటూ అతడు తనవైపు చూసేసరికి మాట మధ్యలో ఆపుచేసింది.
   
    "వెళితే వెళ్ళండి. బాపు సినిమాకయితే వెళ్ళండి. మంచి అభిరుచుల్ని పెంపొందించుకోండి" అనేసి ఆఫీసుకి వెళ్ళిపోయేడు.
   
    అతడు ఆఫీసుకెళ్ళిన అరగంటకి ఎవరో ముఖ్యుడు బాల్చీ తన్నేశాడని తెలిసింది. ఆఫీసుకి శలవు. ఇంటివాళ్ళు సినిమాకి వెళ్ళారన్న వార్త గుర్తొచ్చింది. ఏమి చెయ్యాలో తోచలేదు.
   
    అతడి స్నేహితులైన కొలీగ్స్ మధ్యాహ్నమే ఒకడి రూమ్ కి మందు కొట్టటానికి వెళ్ళిపోయేరు.
   
    అతడు లైబ్రరీకి వెళ్దామని బయల్దేరాడు. సైకిల్ మీద వెళ్తూ వుంటే రోడ్డుమీద ట్రాఫిక్ జామ్ అయింది. బురదరాముడి తాలూకు క్యూ రోడ్డుమీదకి వచ్చేసింది. బుకింగ్ దగ్గర ఎవరొఇ కొట్టుకుంటున్నారు. అంతా గడావుడి - రష్ దాంట్లోంచి బైటపడి లైబ్రరీకి వెళ్ళేసరికి పన్నెండయింది. ఒక గంట అక్కడ కూర్చొని ఇంటికొచ్చేడు. అంతడింటికొచ్చిన పది నిమిషాలకి తల్లీ భార్యా సినిమా నుండి వచ్చేరు.
   
    లోపలి వచ్చేక "ఎలా వుంది సినిమా?" అని అడిగేడు. బురద రాముడి క్యూలో తల్లినీ భార్యనీ చూసిన దగ్గరనుంచీ అతడి మనసు బావోలేదు. క్యాజువల్ గా అడిగేడు.
   
    "చాలా బావుందండీ" అంది రాధ.
   
    "చిన్న పిల్లలిద్దరూ బాగా చేసేరు"
   
    అతడామెవైపు విచిత్రంగా చూసి "ఏ సినిమా" అన్నాడు.
   
    "స్నేహం బాపు డైరెక్షన్"
   
    క్షణంలో వెయ్యవవంతు పాటు అతడి దవడ కండరం బిగుసుకొని మళ్ళీ మామూలుగా అయిపోయింది. మొహంలో ఏ భావమూ లేకుండా "ఓహో అలాగా" అన్నాడు.
   
    ఆమె చెవి రింగు అమాయకంగా వూగుతోంది. "రింగు" కదా.
   
                               *    *    *
   
    ఆ రోజు సాయంత్రం అతడు స్నేహితుడి బాత్ రూమ్ వైపు నడుస్తూ "కాల్గేట్ టూత్ పేస్టు ఉందా గురూ" అని అడుగుతున్నాడు.
   
    ఆ తరువాత భైరవమూర్తీ రాధా అరవై సంవత్సరాలు హాయిగా కాపురం చేసేరు.
   
    చాలామందిలాగే.
   
    (ఈ రచయితకి ప్రతిదీ అస్పష్టంగా వదిలెయ్యటం అలవాటు. అందువల్ల దాన్ని విప్పి చెప్పే బాధ్యత మేమె తీసుకున్నాం. పరస్పరం మోసం చేసుకోవటం అన్నది మానవజాతిలోనూ, భార్యాభర్తల మధ్యా సర్వ సాధారణం అనేది రచయిత ఉద్దేశ్యం అని మా అభిప్రాయం. పరాయి స్త్రీతో తిరిగే మొగవాడు భార్యనెంత మోసం చేస్తున్నాడో, భర్త చొక్కా అతడికి తెలియకుండా స్త్రీలు సామాన్ల వాడికిచ్చే భార్యకూడా అంత మోసమే చేస్తున్నదని రచయిత చెప్పదల్చుకున్నాడు. క్వాంటిటీ మాత్రమే తేడా...... పబ్లిషర్.)
   
   
   
           
                                 --* * * *--

 Previous Page Next Page