పాపారావు పక్కమీద నుంచి ఎగిరి కూర్చున్నాడు. "బయటిక్కూడా పోనివ్వకుండా ఏమిటి బందిఖానా" అని తాయారుమీద బోలెడు కోప్పడిపోయి, ఏమీ లాభం లేదని తెలిసినవాడై ఒకవేళ తలుపు తీయమన్నా అందరిముందూ ఏమైనా అంటుందేమోనన్న భయంచేత మంచంమీదే పడుకొని బయటవాళ్ళ మాటలు వినసాగాడు.
"మీరేం చదువుతున్నారండీ?" అని అమ్మాయిల నడిగింది తాయారు.
"ఈవిడ నర్మద, ఇది రాజేశ్వరి, ఈ అమ్మాయి పేరు అనూరాధ. ఇక నా పేరు పద్మ" అంటూ ఓ అమ్మాయి పరిచయ కార్యక్రమాన్ని ముగించింది. "మేమంతా ఉమెన్స్ కాలేజీలో బి.యస్.సి. ఫైనలియర్ చదువుతున్నాం."
"నా పేరు తాయారు. అదిగో ఆ ఫోటోయే మావారు. పేరు నేను చెప్పకూడడులెండి. ఆయన స్టేట్ బ్యాంక్ లో కాషియర్."
పాపారావు గదిలో మండిపోతున్నాడు, తాయారు నక్క వినయాలు వినలేక.
"అవునూ ఆ రోజు సినిమా మధ్యలో అలా ఎందుకు వెళ్ళిపోయారు?" అంది ఒక నీరజాక్షి.
"మా వారికి మధ్యలో భరించలేనంత తలనొప్పి వచ్చిందండీ. ఇంటికొచ్చిన తరువాత ఆ రాత్రంతా దగ్గర కూర్చొని, అమృతాంజనం రాసీ, పట్టువేసీ, అదిచేసీ, ఇదిచేసీ, నానా అవస్థలు పడితే, చివరికి ఎలాగయితేనేం ఏ అర్ధరాత్రో నిద్ర పోయారు" అంది తాయారు.
"మీ వారెప్పుడు వస్తారండీ?" అని అంటూంది ఓ అన్నుల మిన్న.
"ఎందుకూ?" అని వెళ్ళి అడుగుదామనుకున్నాడు పాపారావు. బాగోదని వూరుకున్నాడు.
"సాయంత్రందాకా రారండి- వూరెళ్ళారు" అంది తాయారు.
ఒక క్షణం నిశ్శబ్దం.
"మీరంతా గట్టిగా ఎలా ఈల వేస్తారండీ? అసలు మీరిలా ఈల వేయడం మీ వారికి ఇష్టమేనా?" అని పత్రికా విలేఖరుల్లాగ ప్రశ్నలు గుప్పించారు. తాయారు అన్నిటికీ ఓపిగ్గా సమాధానాలు ఇస్తూంది. "మా వారు, నేనూ కలిసి,మెలిసి ఉంటామండి. ఎప్పుడూ నన్ను ఈల వేయమని ఆయనే ప్రోత్సహిస్తూంటారు. తన జీవన రాగానికి నా ఈలే పల్లవి అని కవిత్వం చెబుతూ వుంటారుకూడా."
ఒళ్ళు మండిపోతూంది పాపారావుకి. మంచం మీద నుంచి దిగి అటూ ఇటూ పచార్లు చేయసాగాడు.
"సరే ఇక పాఠం మొదలు పెడదామా" అని ఒక అమ్మాయి అనేసరికి అంతా ఘొల్లున నవ్వారు.
నవ్వులు తగ్గిన తరువాత "ఇదిగో ఈల అంటే ఇలా వేయాలి" అని నోట్లో వేలుపెట్టి, నాలుక మడతవేసి విజిల్ వేసింది. అంతా చప్పట్లు చరిచారు.
ఆ తరువాత ఒకరి తరువాత ఒకరు ప్రయత్నించారు. కానీ, ఎవరూ చేయలేకపోయారు.
"మీరు ప్రయత్నించి చూడండి. నేను పొయ్యిమీద ఎసరు పడేసి వస్తాను" అంటూ తాయారు వంటింట్లోకి వెళ్ళింది.
హాలంతా ప్రాక్టీసు మొదలయింది. ఇలాగే ఇంకెంత మందిని ఈల కత్తెలుగా తయారుచేసి వాళ్ళ మొగుళ్ళని బాధపెట్టనుందో..... అని అనుకుంటూ తల పట్టుకున్నాడు పాపారావు.
బయట ఇష్టారాజ్యంగా ఈల ప్రాక్టీసు సాగుతోంది. అంతలో ఒక అమ్మాయి తన ప్రయత్నంలో సఫలీకృతురాలై గట్టిగా ఈల వేసింది. ఈల వెంట ఈల. అందరికీ వచ్చేసినట్టే గది అంతా విజిల్స్ తో నిండిపోయింది.
పాపారావుకి భూమి గిర్రున తిరుగుతున్నట్లు అనిపించింది. గోడమీదున్న కాలెండరులో ఆంజనేయులు నవ్వుతున్నట్లు అనిపించింది. పిడికిళ్ళు ఆవేశంతో మూసుకున్నాయి.
హాలులో గోల ఎక్కువైంది. ఆ ఇంట్లో ఏమయినా గొడవ అవుతోందేమోనని పక్కింటివాళ్ళు ఒకరిద్దరు తొంగిచూసి వెళ్ళిపోయారు.
పాపారావు వున్న గది కిటికీ వీధి వేపున వుంది. హాల్లో తొంగిచూసి వెళ్ళిపోతూ వాళ్ళలో వాళ్ళు అనుకున్న మాటలు పాపారావు చెవిలో పడ్డాయి. "మొగుడు ఆడారి వాడయితే పెళ్ళాలు మొగుళ్ళవుతారు. ఈ అమ్మాయిని ఈ ఇంట్లో కొచ్చిన దగ్గర్నుంచి చూస్తున్నాను - ఇంత పిసరు లెక్కలేదు సరికదా, పైగా మొగుడే ఈ అమ్మాయికి భయపడతాడు."
ఈ మాటలు తాయారు వేసిన ఈలకంటే ఎక్కువ బాధ పెట్టినాయి. కాలెండరువైపు చూశాడు. ఆంజనేయులు దీవిస్తున్నట్టు కనబడ్డాడు. ఏదో కొత్త బలం వచ్చినట్లు హుంకరించాడు.
"నేను ఒన్, టూ, త్రీ అనగానే అంతా ఒకసారి ఈల వెయ్యండి చూద్దాం" అని ఆఖరి పాఠం చెబుతోంది తాయారు.
"సరే, సరే" అన్నారందరూ.
"ఒన్....టూ...."
"తాయారూ? తలుపు తియ్యి...." అని ఒక్కసారి గర్జించాడు పాపారావు. అమ్మాయిలకి ఏమీ అర్ధం కాలేదు. పడకగదివైపు, తాయారు వైపు చూశారు. తాయారు అంతలో సర్దుకొని....." కూర్చుందురూ, హాల్లో ఆడవాళ్ళున్నారు" అంది.
"తలుపు తీస్తావా, తన్నమన్నావా!" బెడ్ రూమ్ లో నుంచి కేక వినిపించింది.
"ఎంత ధైర్యం? రండి, ఎలా తంతారో చూస్తాను" అని నడుం బిగించింది తాయారు.
అమ్మాయిలంతా విస్తుపోయి, ఈల సంగతెలా వున్నా ఇక్కడేదో ఘోరావమానం జరుగుతుందేమోనని భయపడటం మొదలు పెట్టారు. "మీకేం భయంలేదు" అని వాళ్ళకో అభయహస్తం చూపించి వెళ్ళి గొళ్ళెం తీసింది.
పాపారావు ఆవేశంతో రొప్పుతూ హాల్లోకి వచ్చి పడ్డాడు. అమ్మాయిలవైపు తిరిగి...... "మీకు సిగ్గూ - ఎగ్గూ లేదా? ఈల నేర్చుకొంటే ఫలితం ఏమిటో ఇప్పుడు చూద్దురుగానీ" అన్నాడు.
"ఏమిటండీ చూసేది? పరాయి వాళ్ళముందు ఎప్పుడూ లేంది - ఇలా అవమానిస్తారా?" అంటూ ఆడపులిలా పాపారావు మీదకు దూకబోయింది తాయారు.
పాపారావు వంటింట్లోకి పరిగెట్టాడు. హాల్లో అమ్మాయిలకి ఇదంతా సినిమాలా వుంది. అంతలో పాపారావు బయట కొచ్చాడు. ఈసారి చేతిలో కత్తిపీట వుంది.
పాపారావు అవతారం చూసి తాయారే భయపడింది. పాపారావు విజ్రుంభించాడు. ఇకముందేం జరుగుతుందోనన్న ఆలోచన లేకుండా, ఏదో సినిమాలో రాకుమారుడు మంత్రగత్తె జుట్టు కోసేసినట్టు తాయారు మెడవంచి జుట్టు కోసేశాడు.
నలుగు రమ్మాయిలూ అది చూసి పరిగెత్తి వెళ్ళిపోయారు బయటికి.
తాయారు ఏమి జరిగిందో తెలుసుకునే లోపున చేతిలో కొచ్చిన జడను విసిరేసి, "నువ్వేసిన వేషాలకి అసలు చంపేద్డును. వట్టి మనిషివి కావని ఇంతటితో వదిలాను. ఇప్పుడు పోవే. పుట్టింటికి పోతావో, ఉప్పుటేర్లో దూకుతావో" అంటూ వీధి తలుపు గడియవేసి మళ్ళీ తాయారు దగ్గిర కొచ్చాడు.
మోకాళ్ళ మీద తల పెట్టుకుని తాయారు ఏడుస్తూంది. పాపారావుకి జాలివేసింది. "తాయారూ! ఎందుకు చెప్పు, నన్ను బాధపెట్టడం..... నువ్వు బాధపడటం" అన్నాడు బాధపడుతూ.
తాయారు తల ఎత్తి..... "క్షమించండి ఇంకెప్పుడూ ఈల వేయనుగా" అంది.
కత్తిపీట వదిలేశాడు పాపారావు.
"ధన్" మని చప్పుడయింది. మెలకువ వచ్చింది పాపారావుకి. వంటింట్లో డబ్బా ఏదో క్రిందపడినట్టుంది. పక్కకి తిరిగి చూశాడు. తాయారు లేదు. తెల్లవారిపోయిందన్న మాట అనుకున్నాడు.
అంతలో తాయారు స్నానాల గదిలోంచి బయటికొచ్చి పక్కగదిలోకి వెళ్ళిపోయింది. తలారా స్నానం చేసిందేమో, అందంగా జుట్టు భుజాల మీదనుంచి క్రిందికి జారుతోంది. పాపారావు తలగడలో తలదాచుకొని గుండెలనిండా గాలి పీల్చుకొన్నాడు.
పక్క రూములోంచి సన్నగా ఈల వినిపించడం మొదలెట్టింది- సుప్రభాతం ట్యూన్ లా.
--* * * --