"నువ్వే దొంగ" అతను ఆటపట్టిస్తున్నట్టు బిగ్గరగా నవ్వుతూ చెప్పాడు.
ఇసుకను పొడవుగా కట్టగాచేసి, అందులో పుల్ల గుచ్చారు. మిగిలిన వాళ్ళంతా గుంపుగా చేరారు.
ఊర్మిళ తన గుప్పిటను ఓ దగ్గర వేసిందిగానీ అందులో పుల్ల లేదు. దాంతో ఊర్మిళ దోసిట్లో ఇసుకపోసి, పుల్ల గుచ్చారు. వెంకటాచలం ఆమె కళ్ళుమూసి, ముందుకు తీసుకెళుతున్నాడు.
అతని చేతులు తగులుతూవుంటే కొన్ని వేల మైళ్ళ దూరమైనాసరే అలా నడుస్తూ వెళ్ళచ్చనిపించింది ఆమెకి. ముప్పైఏళ్ళ శరీరం తొలిసారి వేడిగా అయిపోతున్నట్లు ఆమె ఫీలవుతోంది. తన అవయవాలు అంత మత్తులో, అంత గమ్మత్తైన అనుభవం ఇస్తాయనికూడా ఆమెకి తెలియదు.
అతని చేతులు ఇంకాస్త కిందకి దిగితే ఇంకెంతహాయిగా వుంటుందో అన్న ఆలోచనకూడా వచ్చింది.
అంతకుముందు లేని ఏదో ఆరాటం మొదలైంది. అదంతా ఆమెకి కొత్తగా, వింతగా, గమ్మత్తుగా వుంది.
ఆట మధ్యలో వుండగానే భోజనాలకి పిలుపొచ్చింది. అందరూ వెళ్ళి తిన్నామంటే తిన్నామని లేచి వచ్చేశారు.
తొమ్మిదవుతుండగా ఉజ్వల, వెంకటాచలం తమ గదిలోకి వెళ్ళారు.
హాల్లో రఘురామయ్య, ఊర్మిళ పడుకున్నారు మరో అయిదు నిముషాలకి ఉజ్వల గదిలో లైట్ ఆరిపోయింది.
అక్కడ లైట్ ఆరడం, ఊర్మిళ కళ్ళు తెరుచుకోవడం ఒకేసారి జరిగాయి. లోపల ఏం జరుగుతుందో కళ్ళకు కట్టినట్టు కన్పిస్తోంది ఆమెకి.
తన చెల్లెలి స్థానంలో తనుంటే ఎంత బావుండోననిపించింది.
ఆ ఆలోచనకు తనకు తనే సిగ్గుపడింది. ఏమైంది ఈ రోజు తనకి? మొదటిసారి ఎందుకు ఈ వికారం కలుగుతోంది? ముప్పై ఏళ్ళుగా నిద్ర పోతున్న శరీరం ఎందుకు మేల్కొంది? అందులోనూ తను మోజు పడుతున్నది ఎవరిమీదో కాదు -స్వంత చెల్లెలు భర్తమీద. ఇది ఎంత ఘోరం?
ఆమెలో సంఘర్షణ ప్రారంభమైంది.
కోడి కూస్తున్నా ఆమె కళ్ళు మూతలు పడలేదు.
ఎప్పుడో తెల్లారగట్ల కునుకు పట్టింది. మరుసటి రోజు నుంచి మరిదితో మామూలుగా వుండలేకపోయింది.
అతని స్పర్శనే శరీరం క్షణక్షణానికి గుర్తుకు తెచ్చుకుంటోంది.
కానీ మనసు మాత్రం ఇది తప్పని హెచ్చరిస్తూనే వుంది. శరీరానికీ, మనసుకి మధ్య యుద్దం మొదలైంది.
వీలైనంతవరకూ అతనికి ఎదురుపడకుండా తనను తాను రక్షించుకుంటోంది అయితే ఒకరోజు అతనితో టౌన్ కి వెళ్ళక తప్పలేదు. ఆ రోజు వెంకటాచలం టౌన్ కి బండి కట్టాడు. ఇంట్లో బియ్యం అయిపోయాయి. వడ్లు తీసుకెళ్ళి దంపించుకు రావాలి. మొత్తం అయిదు బస్తాలు.
వడ్లు ఆడే మిషన్ టౌనుకు దగ్గర్లో చెక్ పోస్టు దగ్గరుంది. ఒక్కడి వల్ల అయ్యేపని కాదది. మామూలుగా అయితే చుట్టుపక్కల వాళ్ళు కూడా తమ ఒడ్లు బండ్లో వేస్తారు. తోడుగా మనిషి వెళతారు.
కానీ ఆ రోజు ఎవరూ వేయలేదు.
వెంకటాచలానికి తోడుగా ఓ మనిషి వెళ్ళాలి. ఉజ్వలకు రెండు రోజులనుంచి జ్వరం. దాంతో అతనితోపాటు తను బయల్దేరక తప్పింది కాదు ఊర్మిళకు.
బస్తాలు వేశాక బండి ఎక్కి కూర్చుంది ఆమె.
వెంకటాచలం హుషారుగా బండి నొగలమీద ఎక్కి తోలడం ప్రారంభించాడు.
దార్లో ఏమిటేమిటో అతను మాట్లాడుతున్నాడు. ఆమె ముభావంగా జవాబులు చెబుతోంది.
ఆమె ముందులాగ మాట్లాడలేక పోతోంది.
అతనితో ఎలాంటి దురుద్దేశ్యం లేకపోవడంతో మామూలుగానే వున్నాడు. తనకే ఏదో అయిందని ఆమెకి తెలుసు.
వడ్లు దంచేటప్పటికి సాయంకాలం ఆరుగంటలైంది. బియ్యం బస్తాలు వేసుకుని బండి బయల్దేరింది మధ్యలో బండి ఆపి "రా వదినా! మంచి స్ట్రాంగ్ కాఫీ తాగి వెళదాం" అని అతను పిలిచాడు.
మొదట ఆమె వద్దంది కానీ అతను వినకపోయేటప్పటికి బండి దిగింది.
ఇద్దరూ కాఫీ తాగారు.
తిరిగి బయల్దేరేటప్పటికి చీకటి పడుతోంది. ఎవరో మంత్రించినట్టు సడెన్ గా ఆకాశంలో మబ్బులు ప్రత్యక్షమయ్యాయి.