ముందుగా కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్ళి నగరంలోని స్మశానాల గురించిన వివరాలు సేకరించారు. ఒక ప్రాంతాన్ని ఎంపిక చేశారు.
అక్కడ జన సంచారం చాల తక్కువగా ఉంది. మారుమూల ప్రాంతం!
స్మశానం లోపల పొదలు, పుట్టలు, చెట్లు బాగా పెరిగిపోయి అరణ్యంలాగ కన్పిస్తున్నాయి. కాలుమోపాలంటేనే భయంగా ఉంది.
ఒక మూలగా చితి వెలుగుతోంది. పొదల మధ్యనించి సమాధి రాళ్ళు తొంగి చూస్తున్నాయి. అర్ధంకాని విచిత్ర కీటకాల రొద విన్పిస్తోంది.
"ఇంతవరకూ వచ్చాం బాగానే ఉంది. ఇప్పుడేం చెయ్యాలి?"
"యోగి ఈ ప్రాంతాలలో ఉన్నాడేమో వెతికి చూడాలి!"
"నాకు భయంగా ఉందే! నేను లోపలికి రాను" అంది కళ్యాణి! అప్పటికే ఆమె గుండె దడ తాజ్ ఎక్స్ ప్రెస్ వేగాన్ని దాటిపోయింది.
"అయితే మేమిద్దరమే లోపలకు వెడతాం. నువ్వు ఇక్కడే ఉండు!"
"ఇందుకన్న మాట నువ్వొచ్చింది" విసుక్కుంది ఉమ.
"అందరమూ కలసి వెడితే రహస్యం బయట పడొచ్చు. మీరు ఇక్కడే ఉండండి! నేను ఒక్కర్తిని వెళ్ళి చూసొస్తాను."
"నీ కసలు భయం లేదన్న మాట?"
"భయంగానే ఉంటుంది కాని వెనకడుగు మాత్రం వెయ్యను."
"బ్యాటరీ లైటు తీసుకు రావలసింది."
"రహస్యంగా వెళ్ళి రావాలని కదా అనుకున్నాం?" అంటూ మరింక వారి సమాధానం కోసం ఎదురు చూడకుండా లోపలకు నడచింది. మాటలు పెంచినకొద్దీ అనుమానాలు పెరుగుతుంటాయి.
కొయ్య పలకలతో నిర్మించిన గేటు మీద చేయి వెయ్యగానే అది కిర్రుమంటూ తెరుచుకుంది. అడుగు పెడుతూనే దారికి రెండు వంకలా గచ్చ పొదలున్నాయి. ప్రధమంలో దారి సరిగా కన్పించలేదు.
కళ్ళు చీకటికి అలవాటు పడ్డాక పరిసరాలు గుర్తించేందుకు వీలు అవుతున్నాయి. కాలి క్రింద నలుగుతున్న ఎండుటాకులు కరకరమని శబ్దం చేస్తున్నాయి. సమాధుల మీద ఆలనా పాలనా లేక పొదలు పెరిగాయి. గాలి గుబుర్ల మధ్యకు వెడుతూ బయట పడుతూ విచిత్రమయిన శబ్దం చేస్తోంది. పెద్ద వృక్షాలు తలలు ఊగిస్తున్నాయి.
సాయం సమయానికి మంటలారిపోయి నివురుకప్పిన చితిమీది బూడిద గాలికి లేచిపోయి చండ్ర నిప్పు కన్పిస్తోంది భయంకరంగా! తులసి దడదడలాడే గుండెలతో అడుగు ముందుకేస్తోంది.
ఆమె కదలికల్ని పసిగట్టి కొమ్మల మీద తల క్రిందులుగా వ్రేలాడుతున్న బెగ్గురు పక్షులు రెక్కలు టపటప లాడిందుకుంటూ లేచి మరో చెట్టు మీదికి వెడుతున్నాయి.
మరి కొన్ని బెగ్గురు పక్షులు తల క్రిందులుగా తపస్సుచేసే మౌనుల్లాగా వ్రేలాడుతూ అలానే ఉన్నాయి.
గుబుర్లలోంచి గుడ్లగూబల కళ్ళు మెర్క్యురి దీపాలా వెలుగుతున్నాయి. మరికొంత ముందుకు పోయాక చితిమీది గాలి పొగ నేరుగా ముక్కు పుటాలకు సోకి ఘాటు వాసన కలిగించింది.
చల్లనిగాలి వీస్తున్నా చెమటలు క్రమ్మి ఒళ్ళంతా తడిసింది.
భయపడుతూ అడుగులు ముందుకే వేస్తోంది!
ఒక చోటున నిలిచిపోయి పరిసరాలను పరిశీలించింది. దగ్గరలో చిన్న పాక కన్పించింది. అక్కడ స్మశానం తాలూకు వ్యక్తులు ఎవరో ఒకరు ఉండేందుకు అవకాశముంది!
అదే నిజమయితే కష్టం తీరిపోయినట్లే! ద్రవిడ మాహేశ్వరుడి వివరాలు తెలుస్తాయి. దగ్గరగా వెళ్ళి నిశ్శబ్దంగా నిలబడి చూచింది.
చాల చిన్న పాక! తాటియాకులు కప్పి ఉన్నాయి.
చిన్న తలుపు దగ్గరగా వేసి ఉంది. లోపల కాస్తంత వెలుతురు కూడా ఉన్న జాడలు కన్పిస్తున్నాయి. బహుశా ఎవరో ఉండి ఉండాలి. చిన్న దీపం వెలిగించి ఉంటారు అనుకుంది తులసి!
వారిని పిలవటం కన్నా వెళ్ళి చూడటమే మంచిది అని నిర్ణయించుకుంది. చేయివేయగానే వెదురు చీలికల తలుపు కిర్రుమంటు తెరుచుకుంది.
ఉద్విగ్నమయిన భయంకర క్షణాలు!
భయం గుండెల్ని పిండుతున్నా అడుగు ముందుకే వేసింది తులసి!
ఎదురుగా కనిపించిన దృశ్యం చూచి ఒళ్ళు ఝల్లుమంది.
ద్రవిడమాహేశ్వర యోగి ఎప్పటిలాగే పద్మాసనం వేసుకుని కూర్చున్నాడు. మేడమ్ ఊహించినదంతా నిజం!
కనురెప్పలు మూసి ఉన్నాయి. చిన్న దీపంలోంచి ఎర్రని వెలుతురు ఆయన ముఖం నీడలుగా తారాడుతోంది.
అంత సేపూ జటా జూటంలోంచి తన కోసమే తొంగి చూస్తున్నదా అన్నట్లున్న కృష్ణ సర్పం బుస్సుమని లేచింది. అది పడగవిప్పి ఆడుతోంది. ఒంటరి ఆడపిల్లకు గుండెలు పిండుతున్నట్లుగా అయింది.
నల్లని త్రాచు జటాజూటాన్ని వదలి యోగి మెడమీదుగా వెనుక నించి వక్షస్సు మీదికి తిరిగి వచ్చింది. నడుముని చుట్టి నేలమీదికి పాకుతూ వచ్చి పడగ విప్పి ఇంతెత్తున లేచి తులసి ఎదుట నిలిచింది. అడుగు కదిపేందుకు దమ్ముచాలలేదు. ఊపిరి పీల్చేందుకు శక్తిలేదు.
శరీరం వెన్నపూస ముద్దలా కరిగి పోతున్నట్లు అనిపించింది!
పాతిన మేకులా, రాతిబొమ్మలా అయిపోయింది తులసి!