Previous Page Next Page 
విషవలయం పేజి 19

    రాధమ్మగారు అసలే చాలాకాలం నుంచీ రోగంతో తీసుకుంటోంది. భర్త మరణించినప్పటినుంచీ, ఆ దిగులుతో కొంతా, కూతురిమీది బెంగతో కొంతా మరీ శుష్కించి పోసాగింది. ఒకనాటి ఆమె సౌందర్యం ఇప్పుడా శరీరం మీద రేఖా మాత్రంగా నన్నా నిలిచిలేదు.

    చెల్లెల్ని గురించి యీ సందేహమే సత్యమూర్తికి కలిగింది. కాని అతను దాన్ని గురించి అంత తీవ్రంగా ఆలోచించలేదు. "అలాంటి బండ మనసు కాబోలు" ఆనుకుని ఊరుకున్నాడు.

       
                                    *    *    *

    హడావుడి అంతా క్రమంగా అంతరించసాగింది. వీలున్నన్నాళ్ళు కూర్చుని యిహా పనులు వున్నాయంటూ వచ్చిన చుట్టపక్కాల్లో చాలా భాగం నిష్క్రమించారు. కొంతమంది ఇప్పుడిప్పుడే వెళ్దామా వద్దా అన్న అస్పష్ట దశలో వున్నట్లు కనిపించింది. బలరామయ్యగారి జాతకం ఏమిటో గాని ఆయనకున్న బంధువులంతా బొత్తిగా అర్ధశూన్యులు. అందుకని ఇక్కడే బాగుందని కొద్దిమంది కదలకుండా వుండటానికి దృఢంగా నిశ్చయించుకున్న ఛాయలు గోచరించాయి. కాని వీళ్ళందర్నీ పట్టటానికి ఒక వైపునుంచి వీరభద్రం, మరోవైపు నుంచి రామక్రిష్ణయ్యగారూపూనుకున్నారు. ఇద్దరూ మొహమాటమంటే తెలియని వ్యక్తులు. దాడి నిర్ధాక్షిణ్యంగా జయప్రదంగా జరిగింది. జీవితంలో డక్కాముక్కీలు తిని, ఇలాంటి అనుభవాలతో తల నెరిసిపోయివున్న ఒకరిద్దరు వృద్దులు ఈ దండయాత్రను మొదట్లో లెక్కచేయక ముభావంగా ఊరుకున్నట్లు లక్షణాలు కనిపించినా, ఎదుటి పక్షంవాళ్ళు సర్వశక్తులూ వినియోగించి విజ్రుంభణకు ఉపక్రమించేసరికి  ఎట్లాగో సత్యమూర్తిని కలుసుకుని, "నాయనా వెళ్ళివస్తాం. స్వర్గంలో వున్న ఆ మహనీయుని ఆత్మకు శాంతి కలుగగాక. దేముడు నీకు..." అని ఇలాంటి ఆశీర్వచనాలు అప్పచెప్పి చల్లగా నిష్క్రమించారు.

    ఇహ తనకూ ఉద్వాసన తప్పదని గ్రహించి మొదట్లోంచీ వరుసలు కలుపుతూన్న ఓ తల్లీ, తన పదహారేళ్ళ కూతుర్ని పిలిచి "బావకు చెప్పకుండా వెళ్ళిపోతే అతను ఏమయినా అనుకోడుటే వెర్రిమొహమా! పో. పోయి సెలవు తీసుకొనిరా" అని మందలించి పంపింది.

    ఆ అమ్మాయి గుమ్మం దగ్గరకువచ్చి తారట్లాడటంచూసి సత్యమూర్తి తలయెత్తి "ఏం కావాలి?" అని ప్రశ్నించాడు నెమ్మదిగా.

    ఆ అమ్మాయి సిగ్గుపడుతూ, కళ్ళు క్రిందకువాల్చి "అమ్మ వెళుతున్నామని చెప్పమంది" అన్నది.

    "మంచిది" అన్నాడు సత్యమూర్తి.

    ఆ అమ్మాయికి మళ్ళీ ఏమి మాట్లాడాలో తోచక కాసేపు తటపటా యించి "మళ్ళీ యిప్పట్లో రామేమో" అన్నది గోముగా.

    "పోనీ" అన్నాడు అతను.

    పాపం మరీ సందిగ్ధావస్థ వచ్చిందా అమ్మాయికి. కొంచెం బెదిరింది కూడా. అయినా ఎలాగో లేనిపోనీ నవ్వుతెచ్చుకొని "చెప్పేటందు కేమీ లేదా?" అంది.

    "ఏముంది?" అన్నాడు అతను.

    చేసేదిలేక ఆ పిల్ల మౌనంగా అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. సంగతి తెలుసుకొని తల్లి కూతుర్ని తిట్టిపోసింది.
"చవట మొహమా! ఏబ్రాసీ, ఆకర్షించే తెలివితేటలు లేకపోతేపోయె. కనీసం రైలుఖర్చులన్నా గుంజడం చేతకాకపోయె..." అని.

    మొత్తంమీద ఒకరు తర్వాత ఒకరు చుట్టాలమంటూ చెప్పుకొనివచ్చిన వాళ్ళంతా నిష్క్రమించక తప్పలేదు.
    ఇల్లు సొంత మనుషులతో మిగిలింది.
   
                                                                                      8

    రాత్రి ఎనిమిది దాటింది. ఇల్లంతా అలికిడి లేనట్లు నిశ్శబ్దంగా ఉంది.

    సత్యమూర్తి అద్దంవైపునుండి ప్రక్కకితిరిగి, కిటికీదగ్గరికి వచ్చి నిల్చున్నాడు.

    "అవును, నేనే. ఇలా అవుతోంది నేనే" పదే పదే ఘోషిస్తోంది మనసు.

    ఉష తనకు రాసిన జవాబును ప్రత్యుత్తరం ఇన్నాళ్ళూ ఎందుకివ్వలేదు అని ప్రశ్నించుకుంటున్నాడు. సరయిన సమాధానము కనబడదు. తికమకగావుంది. ఉష ఇప్పుడు కలలోని వస్తువుగా, లీలగా పొడగట్టుతోంది.

    అతని ఉత్తరం అందిన వెంటనే ఆమె జవాబు రాసింది.

    మూర్తిగారూ!

    మీరు అభిమానంతో రాసిన ఉత్తరం అందింది. మీరు వెళ్ళిన మరునాడు అన్నయ్య వచ్చాడు. మిమ్మల్ని కలుసుకోలేకపోయినందుకు ఎంతగానో బాధపడ్డాడు. మీ గదికివెళ్ళి సామానులన్నీ ఇక్కడకు తెచ్చేసి గది ఖాళీ చేసేశాము. మీ అనవసరపు సామానులతో మా యిల్లు సగము నిండిపోయింది. (నిజమనుకొని కంగారుపడేరు. అతిశయోక్తి) మీ నాన్నగారికి వంట్లో ఎలావుంది? ఈపాటికి నిమ్మదించి ఉంటుందనుకుంటాను. అక్కడ మీరేం చేస్తున్నారు? ఎట్లా తోస్తోంది? మీరు వెళ్ళినప్పటినుంచీ

 Previous Page Next Page