Previous Page Next Page 
అరణ్యకాండ పేజి 19

    కాని ఇప్పుడు  వచ్చింది ఇటు ప్రజలకి, అటు అటవీశాఖకు వో ప్రశ్నగా, ప్రాణాంతకంగా  పరిణమించిన  మేనీటర్ తిరిగే దుర్గమారణ్యానికి.

    మనిషి  ప్రాణాలను  కాపాడే  ఓషదులతో  నిండిన  అడవిగా  పేరుగాంచిన ప్రాంతం  ఈనాడు ఎందరి  ప్రాణాలనో  బలి  తీసుకున్న  మరుభూమిగా  వాసికెక్కింది.

    పాడేరు అడవులకు  కొన్ని మైళ్ళ  దూరంలో  చుట్టుపక్కల  ఉన్న  హుకుంపేట, గంగరాజు మాడుగుల, పెదబయలు, అనంతగిరి_ఒకనాడు  తెల్లదొరలకు  సింహస్వప్నమై  నిలిచిన  సీతారామరాజుకు  నీడనిచ్చిన  ప్రాంతాలు.

    సిబియా  పక్షుల కిలకిలరావాలతో, సువాసనలు  వెదజల్లే  అడవిపూలతో  నిండిన పచ్చని ప్రకృతి ఈ సుందరవనం  ఈనాడు  పులివాత పడ్డ  అభాగ్యజీవుల రక్తబిందువులతో  తడిసిపోయింది.

    అలా ఎంతసేపు  నిలబడ్డాడో  అతనికి  గుర్తులేదు.

    "భోజనం  పెట్టమంటారా, అయ్యగోరూ!"

    తవిటయ్య  కరకు  గొంతు  విని  వాస్తవంలోకి  వచ్చాడు. అతడు సమీపంలో నిలబడి అడిగిన  తీరు, 'మనిషి మాంసం  తింటారా. మాష్టారూ!' అన్నంత  జుగుప్సని  కలిగిస్తుంటే  వెళ్ళమన్నట్లు  సౌంజ్ఞ చేసి రిలాక్సింగ్ గా ఫోమ్ బెడ్ పై  వాలిపోయాడు.

    ఇదే గదిలో  రఘునందన్  పాముకాటు  మూలంగా  ప్రాణాలు వదిలాడు.

    సన్నని  ప్రకంపన. ఆకలిగా లేదతనికి. బయటకు  వచ్చి  నిలబడ్డాడు.
 
    చేతులు జోడించింది  ఓ వయసులోవున్న స్త్రీ. ఆమె వంటమనిషి సింగిగా అనుకున్నాడు. ఆమె పక్కనే నిలబడి రెప్పలార్పకుండా  చూస్తున్నాడో  ఏడేళ్ళ  బాలుడు. అమాయకంగా  చూస్తున్న అబ్బాయిని గమనిస్తూ "మీ అబ్బాయా?" అనగానే _ అవునన్నట్లు వినయంగా  తలూపింది. ఆ మాత్రం  పరామర్శకే పరమానందపడుతూ.

    "పేరు అబ్బులండి" అంది అడక్కుండానే.

    "ఉండేదెక్కడ?" 0.375 మేగ్నమ్ రైఫిలును  శుభ్రం చేస్తూ అన్నాడు.

    "నక్కలపుట్ట" గిరిజనుల  పల్లెల పేర్లు  ఎంత విచిత్రంగా ఉండేదీ తెలిసిన చైతన్య__"సరే, ఈవేళకిక  నువ్వెళ్ళొచ్చు" అని జీప్ దగ్గరికి  నడిచాడు.

    తల్లితో  వెళుతున్న  అబ్బాయి ఇంకా  రెప్పవేయకుండా  చూస్తూనే ఉన్నాడు చైతన్యని. అంత టెన్షన్ లోనూ  మృదువుగా నవ్విన చైతన్యను చూడగానే  తల్లిని  తట్టి  చూపించాడు  తనూ  నవ్వుతూ.

    ఏటవాలుగా  వున్న  గుట్టపై నుంచి  కొడుకుతో  సహా  ఆమె దిగి వెళుతుంటే  అలాగే కొంతసేపు  చూస్తూ నిలబడ్డ  చైతన్య  జీపెక్కాడు.

    జీప్ ను స్టార్ట్ చేసి ఎందుకో  వెనక్కి  చూశాడు   చైతన్య. స్తంభం వారన  నిలబడి  పెదవులను  కొరుక్కుంటూ కళ్ళు  చిట్లించి చూస్తున్నాడు  తవిటయ్య.

    'టాక్స్ లైక్ ఎ బీస్ట్' అసహ్యంగా  అనుకున్నాడు.

    జీప్ ప్రయాణానికి  అనువుగాలేని  పరిసరాలను   ఏకాగ్రతగా గమనిస్తూ  ముందుకు  పోనిస్తున్నాడు.

    పట్టపగలే  చీకటిని  నింపుకున్నట్లుగా  ఉంది  అడవి. తను ప్రయాణం  చేసినంత  దూరాన్ని  మననం  చేసుకుంటూ, వన్యమృగాలకు  తప్ప  వేటగాళ్ళకి  అనుకూలమయిన  అడవి కాదన్న  నిర్ధారణకు  వచ్చాడు.

    జీప్ ను టక్కున  ఆపేశాడు. దిగులుగా  కనిపించే  భయంకరమయిన లోయను చూస్తూ, అజాగ్రత్తగా  మరికొన్ని అడుగులు ముందుకు పోనిచ్చి వుంటే  చైతన్య  జీప్ తో సహా  కొన్ని  వందల  అడుగుల లోతుకు  జారిపోయేవాడు.

    లోయకు  ఆనుకుని  వున్న  టేకు  చెట్ల దగ్గరే  జీప్ ను ఆపి, క్రింది లోయలోకి  చూశాడు. చాలా దిగువగా, లోయ మధ్యగా  ఓ చిన్న  పల్లెలాంటిది  కనిపించింది. చేతిలోని  మాప్ ను పరిశీలిస్తూ మార్టూరు గ్రామంగా  గుర్తుపట్టాడు. 0.375 మేగ్నమ్  ఎక్స్ ప్రెస్ రైఫిల్ ను చేతిలోకి  తీసుకుని  మేగజిన్ లోని  అయిదు బుల్లెట్లను చాంబర్ లోనికి  లోడ్ చేసి  జాగ్రత్తగా  అడుగులో  అడుగువేస్తూ  క్రిందకు  దిగుతున్నాడు. ఏమాత్రం  కాలుజారినా, అగాధంలో సమాధి కావటం ఖాయం.

    నిజానికి  అతడు  కొత్త  ప్రాంతంలో  బయలుదేరాల్సింది గార్డు సహాయంతో.

    కాని  ఎందుకో  అతడు  తొలి  చూపులోనే  తవిటయ్య పై ద్వేష మేర్పడటంతో  ఒంటరిగానే  పులి  గురించిన  వివరాలను  సేకరించాలని  బయలుదేరాడు.

    తను ఇప్పుడు  సంచరిస్తున్నది  మేనీటర్  సామ్రాజ్యంలో  అన్న విషయాన్ని  అతడు  మరిచిపోలేదు. కాబట్టే  తుప్పలపై  నడుస్తూ కూడా  ఏ చిరుచప్పుడయినా  వినేటంతగా  శ్రవణేంద్రియాలకు  పని కల్పించాడు.

    మరో పది  నిముషాల్లో  మార్టూరు  చేరుకున్నాడు.

    సామంతులు ,సవర్లు  ఎక్కువగా  వున్న పల్లె అది. తెలుగుతోపాటు  ఒరియా  భాషకూడా  మాటాడే  ఈ తెగకు  చెందిన  గిరిజనులు  అడవుల్ని  నరికి  వ్యవసాయం చేస్తుంటారు. పశువుల్ని  తినే  అలవాటు కూడా వున్న  అనాగరిక జాతి  వీరిది.

    చైతన్య  రాక గురించి  అప్పటికే  చుట్టుపక్కల  పల్లెలకు  తెలిసి పోవడంతో  అంతా అతని చుట్టూ  గుమిగూడారు. పండించిన  రాగులు  సంచిలోకి  ఎక్కించుకుని  వస్తున్న  కొడుకుని  పులి  హతమార్చిన విషయాన్ని చెప్పాడు జంగయ్య. 

    "వయసుడిగినోడ్ని, కొడుకు నీడ్నే  బతికి  కాటికెల్లాలనుకున్నా కాని, నాకంటా  ముందే నా  కొడుకెళ్ళి  పోండు" వణుకుతున్న  కంఠంతో  అతడు  చెప్పాడు.

    పదిహేను రోజుల  వ్యవధిలో  పులి  ఇంకా  ఆ ప్రాంతాన్నే  సంచరిస్తూ ఉంటుందన్న  నమ్మకం  లేదు చైతన్యకు. కాని అది అనుసరించే  పేటర్న్  స్టడీ  చేయాలన్నదే అతడి సంకల్పం.

    గుట్టపై  ఏటవాలుగా  వున్న  ప్రాంతంలో  పోడు  వ్యవసాయం చేసే ప్రదేశాన్ని  చేరుకుని, ఆ వృద్ధుడు  కొడుకు  ఎక్కడ  చంపబడింది  కొందరు  యువకులు చూపగా  వెళ్ళి పరిశీలించాడు. పట్టపగలు  అందునా  దట్టమైన పొదలు  చుట్టూలేని  ఆ ప్రాంతంలోనే  పులి  మనిషిపై బడిందంటే  అది ఎంత  పొగరెక్కిన  మేనీటర్ అర్ధం చేసుకున్నాడు.

    అప్పటికే  మేనీటర్  మట్టుపెట్టే  ప్రయత్నంలో  మరణించిన ఇద్దరు ఫారెస్టాఫీసర్లు  చేయలేని  పనేదో  తనుచేసి  వారిని  ఉద్దరిస్తాడన్న  నమ్మకం  వారిలో  ఏర్పడి  ఉంటుందన్న  నమ్మకం  చైతన్యకు  లేదు.

    అందుకే  తను గోడు వినిపిస్తూ కళ్ళనీళ్ళు  పెట్టుకుంటున్న వారిని  ఉద్దేశించి_"ఎలాంటి అనుమానం వచ్చినా, ఎటువంటి ఆపద ఏర్పడినా  ఆలస్యం  చేయకుండా  నాకు  తెలియపర్చితే  వీలయినంత త్వరలో  యింత మందిని  బాధపెడుతున్న  ఆ పులిని  అంతం చేసే ప్రయత్నం చేస్తాను.

    హత్య చేసిన  మనిషిలాగే, తను బలి తీసుకున్న  మనిషిని  దాచి సాక్ష్యం దొరక్కుండా  చేయాలని  ప్రయత్నిస్తుంది  క్రూరమృగం కూడా. మనిషికాని ,మృగంకాని  కొంతకాలం  తప్పించుకోగలరు  కాని ఎల్లకాలం కాదు. మీ అండ ఉంటే తప్ప.

    కేవలం  తుపాకీ  సాయంతో  పులిని  తుదముట్టించగలనన్న  నమ్మకం నాకూలేదు. మీరు పులిని ఎదుర్కోనక్కరలేదు. జాగ్రత్తలు తీసుకోండి చాలు. నేను  వచ్చింది  మీకోసమే  అన్న విషయం  మరచిపోకండి" అంటూ వారి నమ్మకాన్ని  గెలిచే  ప్రయత్నం  చేశాడు.

 Previous Page Next Page