Previous Page Next Page 
అనిత పేజి 19

   
    తను వచ్చినపని ఎంతకష్టమో అర్థంకాసాగింది రాజారావుకు. గొంతు సవరించుకున్నాడు.
    "అమ్మా! జానకీ! నేనెలాంటి నడి సముద్రంలో ఉన్నానో నీకు పూర్తిగా తెలియదు. కొంత కొంత అప్పులు తీర్చాను. కానీ ఇంకా తీర్చవలసినవి చాలా ఉన్నాయి. అన్నింటిలో అనిత కియ్యవలసిన యాభై వేల అప్పు  నన్ను పుండులా నలుపుతోంది."
    "అనిత కియ్యాలా?"
    "ఎలాగో మన యిల్లు వేలం వెయ్యబోతున్నారని తెలుసుకుని, ఆ బాకీకి  కావలసిన యాభై వేలు బొమ్మకొంటున్న మిష మీద నాకిచ్చింది. గత్యంతరంలేక ఆ డబ్బుతో బాకీ తీర్చాను. కానీ ఆడపిల్ల సొమ్ముతో పబ్బం గడుపుకున్నాననే వ్యధ నన్ను వదలటంలేదు. ఆ అప్పు తీర్చేవరకూ నాకు శాంతి లేదు........ఇలాటి పరిస్థితుల్లో ఆ రమణరావు సంబంధం తప్పి!
    పెళ్లెలా చెయ్యగలను?"  
    జానకిముఖంలో జీవం నశించింది. తలుపును గట్టిగాపట్టుకుని "సుశీలను రమణరావుకు యియ్యటానికే నిశ్చయించుకున్నావా అన్నయ్యా! సుశీలను అడిగావా?" అంది.
    "సుశీలకేం తెలుసమ్మా! అది మరొకళ్ళను ప్రేమిస్తే నేను ఈ విషయంలో బలవంత పెట్టేవాడినికాను. అలాంటి అనుబంధమేదీ సుశీలకి లేనపుడు తనను చేసుకున్న వాడితో సర్దుకుపోగలదు. ప్రస్తుతం  నేను తేగలిగిన వాటిల్లో యిదే మంచి సంబంధం!"
    "ఒకవేళ సుశీలకు ఇష్టంలేకపోతే......."
    "లేకపోతే, ఆమాట నాతో ముందే చెప్పేదిగా! తాంబూలాలు పుచ్చుకోలేదు తప్ప అంతా నిశ్చయమయింది, నా స్నేహితులకీ బంధువులకీ అందరికీ సుశీలను రమణరావు కియ్యబోతున్నట్లు చెప్పేశాను. ఈ సంబంధం మనం వదులుకుంటే సుశీల కింతలో పెళ్ళికాదు. నాకు మనశ్శాంతి ఉండదు."
    ___జానకి సమాధానం చెప్పలేదు.
    "ఆ రమణరావు ఏమన్నాడో తెలుసా జానకీ! నువ్వు మా ఇంటికొస్తే తను మా యింటికి రాలేడట."
    ఈ మాటలు విని జానకి బాధపడుతుందనుకున్న రాజారావు రాయిలా కూర్చున్న జానకిని చూసి ఆశ్చర్యపోయాడు.
    తరువాత ఎంత ప్రయత్నించినా రాజారావు తను చెప్పదలచుకున్నది చెప్పలేక పోయాడు. గద్గదికతతో" నువ్వు క్షమించమ్మా!" అన్నాడు. జానకి పేలవంగానవ్వి "బెంగపెట్టుకోకు, అన్నయ్యా ఇకమీదట నువ్వు రమ్మనే వరకూ ఎవరు పిలిచినా అక్కడికి రానులే!" అంది.
    జానకి ముఖంలోకి చూడలేక త్వరత్వరగా అక్కడి నుండి వచ్చేశాడు రాజారావు.

    
                                                          15

    ఎప్పుడోకాని తనదగ్గిరకురాని తులశమ్మను సగౌరవంగా ఆహ్వానిస్తూ "రండి. కూర్చోండి ఏంపనిమీద వచ్చారు?" అన్నాడు రాజారావు తల్లితర్వాత తల్లిలాంటి దానిని. నువ్వు నామాట వినాలి బాబూ" అంది తులశమ్మ.    
    "చెప్పండి. తప్పకుండా వింటాను."
    "జానకి చెప్పింది. నువ్వు అనితకు యాభై వేలియ్యాలట కదూ"
    "అవునమ్మా! ఆ బాకీ యెలా తీరుతుందో అర్థం కావటం లేదు. అది తీర్చేవరకూ నాకు మనశ్శాంతి లేదు."
    "అది సహజమే బాబూ! అయినా ఆడపిల్లకి ఉన్నంతలో మనం యిచ్చి పంపాలి కాని, తనసొమ్ముకశపడతామా? ఇదిగో ఈ డబ్బు అనిత కియ్యి."
    తన కళ్ళముందు తులశమ్మ ఉంచిన నోట్ల కట్టలు చూసే సరికి తలతిరిగినట్లయింది రాజారావుకు.
    "ఏమిటమ్మా, ఇది?"
    "నాకున్నది కాస్తా అమ్మితే వచ్చిందది."
    "వద్దమ్మా, వద్దు, ఒక పరాయి వ్యక్తినుండి యింతదానం స్వీకరించలేను."
    "నామాట విను. నేను నీకు తల్లి లాంటిదానినే."
    "అమ్మా! ఇది ఇబ్బందిగా నేను భావించటంలేదు. ఈనాటికైనా నావారిని గుర్తించి మాలో కలుపుకోగలిగినందుకు సంతోషిస్తున్నాను."
    రాజారావు కళ్ళలోకి నిదానించి చూసిన తులశమ్మకు అతనామాటలు మనసారా అన్నాడని అర్థమయింది.
    ఆనందబాష్పాలు కనుకొలకులలో నిలవగా అంగీకార సూచకంగా తల ఊపింది.

 Previous Page Next Page