Previous Page Next Page 
మరో ప్రస్థానం పేజి 19

 

                                      రాక్షస ఉగాది
        
  

రాక్షసాభిదానవత్స
ర ప్రవేశ శుభవేళ
ప్రపంచాంధ్ర మహాసభల1
పండుగకిది మొగసాల

ఎలక్షన్ల దురోదరపు
రంగేళీ కేళిలోని
విషపు టెత్తుగడలు నాకు
ససేమిరా అసమ్మతం

అయితే రాజకీయాని
కతీతుణ్ణి కాను నేను
రాజకీయమనేది మన
బ్రదుకుల కూపిరిలాంటిది

కాని దీనిలో ఉన్నర
కాలు రెండు మాత్రమే!
తుచ్ఛ రాజకీయాలూ!
స్వచ్ఛ రాజకీయలు!

చెడుగాలిని పీలిస్తే
చెడిపోదా ఆరోగ్యం
కల్మష వాతావరణం
కన్న వేరు నరక మేది?

నేనొక దేవతనని, తెగ
నీలుగుచున్నా ననుకొని
అంత పొగరుబోతుదనం
అంటగట్టవద్దు నాకు!
రాక్షసులని ఎందుకు వ
ర్ణన చేస్తున్నానంటే
దానవులకు దాక్షిణ్య
ఏకోశానా ఉండదు
దానవతకు మానవతకు
దక్షిణోత్తర ధృవాల
దూరముంది, మానవతనే
ఆరాధిస్తాను నేను!
మనుషుల్లో మతి  విరిగిన
రక్కసు లుంటున్నట్టే
నూటికొకడు కోటికొకడు
చాటగలడు దివిజగుణం!

అతనిని గుర్తించలేరు!
అంతేనా, పైగా తమ
కభ్యంతరమని వాడిని
నిర్బంధిస్తుంటారు!

ఇది రాసే సమయానికి
ఈ దేశపు చెరసాలలు
వేలకొలది మణిపూసల
కాలవాలమయి వున్నవి

వీరంతా గొప్ప కుట్ర
దారులంట చట్టబద్ధ
సర్కారును సాయుధ సమ
రంలో కూలుస్టారట!

బ్రిటిషు వాడుకూడ యీ
ప్రేలాపనతోనే మన
అల్లూరీ, భగత్సింగు
లందరినీ తినేశాడు!

అదే ఆర్గుమెంటు నేడు
అదే రాక్షస వ్యవస్థ
అదే చదువు, అదే బ్రతుకు
అదే కోర్టు, అదే జైలు!

అందాకా యెందుకు ఈ
అఖిల భారతావనియే
ఆ సేతు హిమాచలమూ
వ్యాపించిన ఘోరకాన!

తెల్లవాళ్లు ఇండియాకు
మేళ్లెన్నో చేశారని
చిన్నప్పుడు స్కూళ్లల్లో
ఎన్ని చదువలేదు మనం!

సహగమనం ఆ పేరు
ధగ్గీ పరిమార్చారు2
రైళ్లు టెలిగ్రాపులు వం
తెనలు చాల వేశారు

ఔను వాళ్లు చాలా మేళ్లు
చేయకపోలేదు నిజం!
అయినా ఆ దొరతనాన్ని
అసహ్యించుకున్నాం కద!

అని చేసినా కూడా
తెల్లదొరల నందర్నీ
గెంటేశేదాకా మన
కంటికి నిదరొచ్చిందా?  

అదే రీతిగా నేడూ
పాలకవర్గం చేసిన
చేస్తున్న సమస్తాన్నీ
చూస్తూనే వుంది జనం

సమకాలిక పరిపాలక
చర్యలు సర్కారు వారి
ప్రచార సాధానాలతో
ప్రాచుర్యం పొందెను కద!

ఇన్ని జరుగుచున్న, మన
హీనస్థితి మారదుకదా!
ధనశక్తులతో బాటే
దారిద్య్రం పెరిగెనుకద!

అమ్మడమూ కొనడమనే
ఈ పద్ధతికన్నా ఒక
మంచి వ్యవస్థను చేరే
మార్గమనుసరించాలి

సమసమాజ నిర్మాణం
స్వప్నం కాదీనాడు
మనయెదుటే ఈ లోకం
మారుతోంది క్షణక్షణం

బుడతకీచు సామ్రాజ్యం
పడవెక్కిందీనాడు
ప్రబల వియత్నాం భుజంగి
పడగెత్తిందీనాడు

తూర్పు దిక్కు మార్పుచెంది
ఎరుపెక్కిందీనాడు
లెనిన్ కన్న ఎరుపు కలలు
ఫలిస్తున్న వీనాడు

మావో ఆలోచనలే
గెలుస్తున్న వీనాడు
సామ్యవాదమే ప్రపంచ
శక్తియైనదీనాడు

జ్వల దరుణారుణ చైనా
ఘనచైనా జనచైనా
ఐక్యరాజ్య సమితికి నే
డలంకారమే చైనా

భరత జాతి విమోచనకు
ధృవతారగ నిలిచింది
భారత - చైనా మైత్రి ప్ర
పంచశాంతి కవసరమని

అనేకులంటున్నారు
అదే మనకు కావాలి
కావచ్చు బహుశా నా
భావాలే పొరపాటుల
ప్రోవులు, ఏమయినా
దృక్పథాన్ని దాచలేను

తొలినుంచీ నాకుందొక
దురలవాటో సదలవాటో
అనుకున్నది అనుకున్న
ట్లనేయడం, రాయడమూ
అదే నేరమయితే నే
నందుకొప్పుకుంటున్నా
తెలుగువాళ్ల మందరమూ
కలసి కట్టుగా వుంటే
చక్కగా జీవిస్తామను
సంగతి నేనెరిగిందే

మీ ప్రపంచ తెలుగు సభలు
ఇదో మంచి అవకాశం
మించిన దొరకని తరుణం!
అంచేతే పొంచిన అవ
కాశవాదులకు సుఖదం!

ఆ ప్రపంచ సదస్సులో
అమాంబాపతయిన వాళ్లు
డబ్బాలను మ్రోగిస్తూ
పబ్బం సాగిస్తారు

ఇస్తినమ్మ వాయనమూ
పుచ్చుకోమ్మ వాయనమూ!
ఈలా గొకవారం వ్యా
పారం సాగుతుంది!

రాక్షసులే ఈ పండుగ
రక్తిగ జరిపిస్తారు
గతిలేనోళ్లకి ఎంగిలి
మెతుకులు విదిలిస్తారు!

నన్నీ సందర్భంలో న
న్మానిస్తున్నామంటూ
సందేశపు లేఖ పంపె
నాంధ్ర రాజ్య ముఖ్యమంత్రి

ఇప్పుడు మన మంత్రిగారి
కిస్తున్నా, నా జవాబు
ప్రస్తుతానికొక ముచ్చట
ఇచ్చోట ప్రవచిస్తా

ఓ మహాంధ్ర రాష్ట్ర ముఖ్య
మంత్రి వర్యా! ఇది వినండి!
నాకు మీరు జరిపించే
సన్మానం ఒకే ఒకటి

ఇందాకా చెప్పానే
ఈ దేశం ఖైదే అని!
ఇంత పెద్ద జైలు కన్న
చిన్న సైజు దివ్వండి!


సికిందరాబాదో, మరి
విశాఖ పట్టణమో, సరి
వరంగల్లు , రాజమండ్రి
ఏదైనా చాకు నాకు3

ఏదో మిష చూడండి
ఎరెస్టు చేయించండి!
చక్కగ నిర్బంధించే
చట్టాలున్నాయి మీకు

దీనికన్న అదే సుఖం
అదే నాకు శాంతికరం
ఎంతో విశ్రాంతివరం
తీర్చండీ చిన్న కోర్కె4

మీరు చేయగల మహా మ
హా సన్మానాలకన్న
గౌరవమని తలుస్తాను
మీరిచ్చే జైలు బ్రదుకు!

బాతాఖానీ క్లబ్బులు
బాపతుగా పనిచేసే
శాసనసభ లెలా ప్రజా
స్వామ్యం నిలబెట్టగలవు?

మీ దారిని మీరుపొండి
నా దారిని నాకు వదిలి
మీరట ప్రజలంటారు
నేనూ ప్రజలంటాను
మీ ప్రజకూ నా ప్రజకూ
పొంతన కుదరదు లెండి

చస్తున్న వ్యవస్థ మీది
వస్తున్న చరిత్ర నాది
శవాదరణ మీ ధ్యేయం
శిశూదయం నా న్యాయం

విప్లవ ఝంఝానిలాలు
వీస్తున్న యుగాది నేడు
విప్లవ రణదుందుభులు ధ్వ
నిస్తున్న శుభాళినేడు

విగతాశులు ప్రగతిమార్గ
విరోధులకు సమాధి
విప్లవజన వాహినులు జ
యిస్తున్న ఉగాది
తెలుగువారి ధీశక్తి
తెలుగువారి క్రియాశక్తి
నలుదెసలా రహించాలి
తెలుగుతనం జయించాలి
ఐదుకోట్ల తెలుగుజాతి
హర్షించాలి
ఆనందం తెలుగునాట
వర్దించాలి
తెలుగువాడి తెలుగు 'వాడి'    
దీపించాలి
తెలుగునాట తెలుగుపాట
వ్యాపించాలి
తమ గమ్యం తెలుగువాళ్లు
చేరాలంతే
ఈ ఉగాది వేళ నేను కోరేదింతే
                                                                        రచన : 12 - 4 - 1974
                                     ముద్రణ : విరసం సిటీ యూనిట్  వెలువరించిన బులిటెన్
                                    పునర్ముద్రణ: మరో ప్రస్థానం, విరసం ప్రచురణ - మే,1980.
 1. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొలి తెలుగు మహాసభాల్ని 12-4-1975న పెద్దెత్తున హైదరాబాద్ లో నిర్వహించింది. బూర్జువా, భూస్వామ్య శవ సంస్కృతికి నీరాజనాలు పలుకుతున్నందుకు నిరసనగా శ్రీశ్రీ ఈ సభల్ని బహిష్కరించారు.
2.థగ్గీ పరిమార్చారు" తెల్లవాడు రాకముందు మనదేశం మొత్తంగా ఒక రాజకీయ పలుకుబడి కింద  లేదు. ఎప్పుడూ విదేశీ దండయాత్రలకు లోనవుతూవుండేది. వైకింగులు, శ్వేతహూనులు,పిందేరీలు, థగ్గులు మన దేశంమీదపడి దోచుకుపోతుండేవారు. మనదేశాన్ని మొత్తంగా తమ ఏలుబడిలోకి తెచ్చుకుని 'స్థిర పరిపాలన నెలకొల్పాడు తెల్లవాడు.
3. ఏదైనా చాలు నాకు: ఈ పట్టణాల్లో జైళ్ళున్నాయి.
4. తీర్చండి. చిన్నకోర్కె: ఆనాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్షరాలా శ్రీశ్రీ ఈ చిన్నకోర్కెను తీర్చింది. ప్రపంచ తెలుగు సభలను బహిష్కరించి సభముందు ప్రదర్శన నిర్వహించిన శ్రీశ్రీని, రచయితలనూ, విద్యార్థులనూ11 మందిని అరెస్టు చేసి 36 గంటలపాటు పోలీస్ లాకప్ లో పెట్టింది.

 

 

 Previous Page Next Page