Previous Page Next Page 
ఆనందోబ్రహ్మ పేజి 19

   

      సత్యభామ చూచుకం ఇంత పని చేస్తుందనుకోలేదు.
   
    "ఒరేయ్ యాజులూ! నువ్వు వేదం చదువుతే పక్క ఊరు వినపడుతుంది. కాలితో బంతిని తంతే గోదావరి అవతలికెళ్ళి పడుతుంది. ఇంతవాడివి, రాత్రయ్యేసరికి చిన్నపిల్లాడిలా నా పక్కలో దూరతావేమిట్రా? రేప్రొద్దున నేను లంగరెత్తేస్తే ఏమవుతావు?"
   
    సోమయాజులు చప్పున వెనుదిరిగి నోటికి చెయ్యి అడ్డుపెడుతూ - "అలా అనకు తాతయ్యా, తధాస్తు దేవతలుంటారట" అన్నాడు.
   
    "దేవతల సంగతి దేముడెరుగుగానీ ముందు కళ్ళకి చెయ్యి అడ్డు తియ్యి, లేకపోతే సైకిలు తిన్నగా గోదావరిలోకే... అందులోని యిక్కడే సుడిగుండం వుంది."
   
    నాల్రోజుల క్రితమే కరణంగారి ఆవుని లోపలి లాగేసిన సుడి, పైకి నిర్మలంగా వుంది.
   
    యాజీ వళ్ళు ఎందుకో అప్రయత్నంగా జలదరించింది.
   
    అంతలో వారి వాహనం గ్రామంలో ప్రవేశించింది.
   
    చిన్న ఊరది. అందరికీ అందరూ తెలిసేటంత చిన్నది.
   
    ఊరులోకి ప్రవేశిస్తూంటే ముందు ఆహ్వానించేది మర్రిచెట్టు! ఊడలు సాచుకుని, మరో ఊరంత వుంటుందది. ఎన్నో తరాల్ని చూసింది. మనుష్యులపట్ల దయతో గాంభీర్యాన్నీ, వాళ్ళ పిల్లచేష్టల్ని చూసి మౌనాన్నీ ఆశ్రయించిన మునిలా వుంటుందది. ఎంత గాలొచ్చినా కదలదు. ఆకులు మాత్రం మనుష్యుల్లా గలగలమంటూంటాయి. ఊరంతా గోల గోలగా వుంటుంది. అక్కడికొచ్చేసరికి మాత్రం ఒక్కసారిగా ప్రశాంతంగా అయిపోతుంది. అదేం చిత్రమో ఆకుల కదలికా, పక్షుల కిలకిలా కూడా నిశ్శబ్దానికే దోహదం చేస్తూ వుంటాయి.
   
    చిన్న పిల్లలు గోళీలూ, గొడ్ల కాపర్లు గోటీబిళ్ళలూ అక్కడ ఆడుకుంటారు. అక్కడ చప్టామీద అష్టాచెమ్మా కూడా వుంది.
   
    ఆ రోజు మాత్రం అక్కడో నలుగురు చేరారు. తలలకి అదో రకమైన టోపీలు పెట్టుకున్నారు. పట్నం నుంచి వచ్చారుట. దారి వెడల్పు చేయటానికి ఊడలు కొట్టిస్తున్నారు.
   
    దాన్ని చూసి ఆయన ఆగారు. మొహం వెలుగో, అది సంధ్య ఎరుపోగాని క్షణకాలం మెరిసింది.
   
    ఊరు ప్రవేశించారు.
   
    కాలువ పక్కనే లంకంత యిల్లు అది. ఆయన ముగ్గురు తమ్ముళ్ళూ ఆయనతో వుంటారు. వీరుగాక ఆరుగురు కూతుళ్ళు. అందరికీ పెళ్ళిళ్ళయినయ్. ఇద్దరల్లుళ్ళు అక్కడే వుండి పొలం చూసుకుంటూ వుంటారు. మిగతావారు గోదావరికి అవతల పట్నంలో వుంటారు. ఆయనకీ ఒకడే కొడుకు. పోయాడు. ఆ కొడుకు ఏకైక సంతానం సోమయాజి. తల్లీతండ్రిలేనివాడు. అతడికి తాతయ్యే తల్లేతండ్రిగా పెంచుతున్నాడు.
   
    ఆ ఇంట్లో పదిహేను, ఇరవై విస్తర్లకన్నా తక్కువ ఎప్పుడూ లేవలేదు. పండగొస్తే సరేసరి. సోమయాజికి మరీ ఉత్సాహం అందరూ వస్తారు ప్రతి యిల్లూ ఒక గుడి అవుతుంది. పెద్దతనంతో పెద్దక్క, చిరునవ్వుతో చిన్నక్క, మూతి బిగింపు కొత్త అల్లుడూ, ముహూర్తానికి ముప్పై రోజుల ముందే పాతల్లుడు, అట్టహాసంతో అత్తయ్యలు, మందహాసంతో మామయ్యలూ, పొట్టి పరికిణీలూ, పొట్టి రైకలూ.....పండగొస్తే ఇల్లంతా జాతర. ఇంటిఇల్లాలికి గదుల మధ్య యాత్ర.
   
    సైకిలు మీద నుంచి దిగుతున్న సోమయాజిని చూసి పెద్దక్కయ్య రెండో కూతురు ఓణీ చెరగు అడ్డుపెట్టుకుని నవ్వాపుకుంది. సోమయాజికి రోషం వచ్చింది. కాని ఆఖరి రోజే కదా అని ఓర్చుకున్నాడు. రేపట్నుంచీ తనే తొక్కుతాడు అన్న ధీమాతో మేనకోడల్ని చూసి వెక్కిరించాడు.
   
    అంతలో "నీ కోసం పంతులుగారు కబురు పంపారు తాతయ్యా" అని చెప్పింది ఆ అమ్మాయి.
   
    "ఎందుకట?"
   
    "ఏమో తెలీదు."
   
    భోజనాలయ్యాక ఆయన బయలుదేరాడు. ఊరికింకా వీధి దీపాలు రాలేదు. మసకచీకట్లో దారి పాములా మెరుస్తూంది.
   
    "తాతయ్యా, రేపట్నుంచీ ఇలా నువ్వెక్కడికి వెళితే అక్కడికి రాను. ఇది కూడా గుర్తుంచుకో" హెచ్చరిందాడు మనవడు.
   
    "ఎందుకురా?"
   
    "ఈ రోజు ఎవరో తెలుగువాచకం అట్ట వెనుక వ్రాశారు - తాతయ్య తోక -అని."
   
    "ఎవర్రా?"
   
    "మహాలక్షో - చిట్టితల్లో...."
   
    చిట్టితల్లి రెండో అక్కయ్య మూడు కూతురు. మహాలక్ష్మి వరసకి పిన్ని అవుతుంది కానీ, వయసులో రెండు సంవత్సరాలు మాత్రమే పెద్దది.
   
    "ఎవరో కనుక్కోలేకపోయావురా!"
   
    "ఎలా తాతయ్యా?"
   
    "నిజంగా నువ్వు తాతయ్య తోకవే అయితే- ఇంతకాలంగా తాతయ్య చెప్పింది జీర్ణం చేసుకుంటూ వస్తూంటే, ఆ మాత్రం తెలివితేటలు నీకు ఈపాటికి అబ్బి వుండాలే...."
   
    సోమయాజి దెబ్బతిన్నట్టూ చూశాడు.
   
    ఇంతలో పంతులుగారిల్లు దగ్గిరపడింది.
   
    ఆయనకీ పక్షవాతం వచ్చి రెండు నెలలయింది. ఇంకా మంచానపడి వున్నాడు. వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు.
   
    వచ్చినవారిని చూసి పంతులుగారు లేవబోతూంటే ఆయన వారించి పక్కమీదే కూర్చుంటూ, మీద ఆప్యాయంగా చేయివేసి "ఎలా వుందిరా" అని అడిగాడు.
   
    "వచ్చే ప్రాణం - పోయే ప్రాణం.....ఆరే దీపాన్ని ఎవరాపగలర్రా"
   
    గుమ్మం వెనుక ముసలావిడ పైట నోట్లో కుక్కుకుని ఏడుపు ఆపుకోవటాన్ని సోమయాజి గమనించాడు. ఆ కుర్రవాడికి ఈ దృశ్యం ఇబ్బందికరంగా వుంది. అంతలో తాతయ్య "అలా అనకురా. ఆచార్యులొచ్చి మందివ్వటం లేదూ" అన్నాడు.
   
    "శరీరానికేసే మందు సంగతి అలా వుంచు. ఇంకో సంగతి నీతో మాట్లాడటానికి పిలిచాను."
   
    "చెప్పరా - ఏమైంది?"
   
    పక్కమీద కష్టంగా అట్నుంచి ఇటు కదులుతూ ఏదో చెప్పడానికి ఉద్యుక్తుడై మళ్ళీ తటపటాయించాడు. తాతయ్య రెట్టించి అడిగాక చెప్పాడు.
   
    "కృష్ణుడి సంగతి నీకు తెలుసుగా మా చిన్నమ్మ పోయాక మా ఇంట్లోనే వుంటూ వచ్చాడు. నాకు కాస్త వయసు మళ్ళాక ఆ దేవాలయంలో అర్చనలూ అభిషేకాలూ వాడే చూస్తున్నాడు."
   
    "అవును"
   
    'తరతరాలనుంచీ ఆ గుడిమీద వచ్చేదాన్నే తింటున్నాం. నీకు తెలియని దేముంది? దేముడిని అభిషేకం చేసే ఆస్థి హక్కుమీద రాతకోత లేముంటాయి?'
   
    వింటున్న శ్రోతలిద్దరూ ఉలిక్కిపడ్డారు.
   
    "అసలేమయిందిరా?"
   
    పంతులుగారు చెప్పలేకపోయారు.
   
    తలుపు చాటునుంచి రుద్దకంఠంతో ముసలావిడ అంది. "సంవత్సరం నుంచి ఆ చిన్న గుడి తాలూకూ పూజా అర్చనా కృష్ణుడే చూసుకుంటున్నాడు బాబూ. కొంతకాలం బాగానే వున్నాడు. ఇదిగో ఈయన ఇలా మంచాన పడగానే సణుగుడు ప్రారంభమైంది. ప్రతిదానికి విసుక్కోవటమే. మొన్న చివరికి చెప్పేశాడు. భార్యతోసహా వెళ్లిపోతానని-"
   
    సోమయాజి తలతిప్పి తాతయ్య మొహంలోకి చూశాడు. ఆయన మొహంమీద హరికేన్ లాంతరు వెలుతురు ఆగి ఆగి పడుతుంది. ఎందుకో తెలియదుగానీ, ఆ కుర్రవాడికి భీష్ముడు గుర్తొచ్చాడు. ఆ పోలికకి అర్ధం లేదు. అయినా ఆ క్షణం అతడే గుర్తొచ్చాడు. అతడికెందుకో వళ్ళు జలదరించింది. తాతయ్య వదిలే ఊపిరిలోంచి వేల వేలమంది సైనికులు పుట్టుకొచ్చి వీరవిహారం చేస్తున్న భావన కలిగింది. ఈ లోపులో ముసలాయన అన్నాడు-
   
    "నేను హక్కుల గురించి మాట్లాడటం లేదురా - వాడి సంపాదన మీద మాకేమీ హక్కులేదు. కానీ ఈ వయసులో ముసలివాళ్ళని పొమ్మంటే ఎక్కడికి పోతాం?"
   
    ఆయన పూర్తిగా వినలేదు. లేస్తూ "కృష్ణుడున్నాడా?" అని అడిగాడు ఆ గొంతుకి పాక కూడా వణికినట్టయింది. లోపలెవరో కదిలారు. బహుశా కృష్ణుడి భార్యేమో.
   
    "లేదురా అయినా నిన్ను పిలిచి ఇలా చెప్పించామని వాడేమయినా అనుకుంటాడేమో బాధా భయమే తప్ప ఇది హక్కులకోసం..." మాట పూర్తికాకుండానే బయట గుమ్మం దగ్గిర అలికిడి అయింది. అప్పుడే వచ్చినట్టున్నాడు కృష్ణుడు.
   
    లోపలికి ప్రవేశించి, అతిథుల్ని చూసి అప్రయత్నంగా అడుగు వెనక్కివేశాడు.
   
    "కృష్ణా! ఇటురా" శాసిస్తూ ఆయన పెరట్లోకి వెళ్ళాడు. తటపటాయిస్తూ కృష్ణుడు కూడా వెనుకే.
   
    పదినిమిషాలపాటూ అత్యంత దుర్లభమైన ఆ నిశ్శబ్దంలో, ముసలి దంపతులతోపాటు సోమయాజి ఒక్కడే ఆ గదిలో మిగిలాడు.
   
    ఆ తరువాత ఆయన తిరిగి వచ్చాడు. "పద" అని సోమయాజితో అని గుమ్మం దగ్గిర ఆగి స్నేహితుడితో అన్నాడు. "నేను చేయవలసినదంతా చేశాన్రా. మాటే వేదమైతే వాడిని మారుస్తుంది. లేకుంటే శాపమై దహిస్తుంది" అని జవాబుకోసం చూడకుండా సాగిపోయాడు.

 Previous Page Next Page