ఆనందోబ్రహ్మ
గోధూళి వేళ :
కానీ మాసం పుష్యమి కావటంతో, పచ్చ గుర్రాల వజీరుడు కాస్త పశ్చిమానికి వెళ్ళగానే, పల్చటి నీహారిక పంటవలతి మీద పైటగా జార్చటానికి పొగమంచుగా మారి హడావుడిగా ఆయత్తమవుతూంది. గోదారి మాత్రం ఏవీఁ తెలియని నంగనాచిలా, అసలు పాపికొండల దగ్గర అలిగిన ఆడపడుచు ఈవిడేనా అన్నట్టూ గోవులా మందంగా సాగిపోతుంది.
పడవొచ్చి ఒడ్డున ఆగగానే సోమయాజి చెంగున క్రిందికి గెంతాడు. చేతిలో పుస్తకాలు బురదలో జారకుండా రొమ్ములకి హత్తుకుని వెనుదిరిగి స్నేహితులకి చేయి వూపేడు.
పసిడి కిన్నెరవీణ గాలి తీగలమీద పైదలి కోడలు సుతారంగా మీటితే, కోసిన పైరుణ మిగిలిన కొమ్మలు ఊగుతూ తలలూపుతున్నాయి.
"ఇంత ఆలస్యమయిందేరా?"
"రాజమండ్రి నుంచి ఆటగాళ్ళు వచ్చారు తాతయ్యా! వాళ్ళకీ మాకూ పోటీ....."
"ఎవరు గెల్చార్రా?"
సోమయాజీ తలెత్తి తాతయ్యవైపు చూసి నవ్వాడు. ఎత్తిన తలపై వంపులో 'ఇంకెవరు' అన్న సమాధానం వుంది. బిగించిన చిరునవ్వులో 'దానికి నేనే కారణమన్న విషయం నీకు తెలీదా?' అన్న దబాయింపు వుంది.
తాతయ్యతోపాటూ గోదావరీ అర్ధం చేసుకున్నట్టుంది. నవ్వింది.
చాలామందికి నోర్లుంటాయి. లోపల చెప్పటానికేమీ వుండదు. కొందరికి చెప్పటానికి చాలా వున్నా విప్పటానికి నోరుండదు. గోదారి అలాటిది. యాజులుతో మాత్రం మాట్లాడుతుంది. ఊరంతా నిదురోయాక అతడొక్కడే వెళ్ళి గట్టున కూర్చుంటాడు.
ఎన్నెన్ని కబుర్లనీ -
పల్చటి గరిక పరకల్ని మునిపంట కొరికి కొరికి అలసిన లేడిపిల్ల తన దగ్గరకు చెంగు చెంగున వచ్చిన వైనం నుంచీ - పదివేల నూర్ల పైసలు తక్కువైన కారణంగా అత్త ఆరడి భరించలేక తనలో ఐక్యమైన కొత్త కోడలి కాళ్ళ పారాణి ఎరుపు కన్నీటి కథ వరకూ అది చెప్పేది.
మోకాళ్ళమీద తల ఆన్చుకుని అతడు నిశ్శబ్దంగా వినేవాడు. చెక్కిలి తడిసిన కన్నీటిని చూసి నొచ్చుకుని మాట మార్చేది. వర్షాకాలం రాగానే తను ఎర్ర పట్టుచీర కట్టుకుని భద్రాద్రి రామయ్యని కాళ్ళు కడిగి పరామర్శించి రావటానికి కొండ ఎక్కడం ప్రారంభించగానే, జనం ఎలా గంగ వెర్రెక్కి పారిపోయిందీ చెప్పి నవ్వించేది...
"ఏరా! ఆలోచన్లేనా- ఎక్కవా?" సైకిలు పట్టుకుని అడిగాడు తాతయ్య.
సోమయాజి తల అడ్డంగా వూపుతూ "ఊహూఁ లేదు తాతయ్యా! ఈ రోజు నేను తొక్కుతాను" అన్నాడు.
పక్కన పిడుగుపడినా అంత ఆశ్చర్యం కలిగి వుండకపోవును. "....నువ్వు తొక్కుతావా?"
"ఆహా! నిన్నెక్కించుకుని."
"మతిపోయిందేమిట్రా నీకు?"
"అందరూ నవ్వుతున్నారు తాతయ్యా! గోదారి రేవు వరకు నువ్వు ప్రతి రోజూ సైకిలు తీసుకువస్తావని .... నేనేం చిన్నపిల్లాడినా? ఆటస్థలంలో బంతితోపాటూ ఇటునుంచి అటు చివరకు నాలుగుసార్లు పరుగెత్తినంత దూరం వుండదు మన ఊరు ఈ మాత్ర్తం దూరం నేను నడిచి రాలేనా?"
"నీ మొహం అన్ని క్రోసుల దూరం నడుస్తూ వస్తావట్రా."
"నడవన్లేగానీ, నువ్వు మాత్రం ప్రతిరోజూ ఇంతదూరం రావటం దేనికి? నేనే ఇక్కడ ఒ సైకిలు తీసుకుని వచ్చేస్తాగా."
"నువ్వా! ఇంకా నయం ఒకవైపు విసురుగాలి, మరోవైపు గోదారి మధ్యలో ఇరుకాటి దారి..... మాటలు చాలుగానీ.... ఎక్కు"
సమిష్టి కుటుంబంలా అక్కడివరకూ జీవనదిలా వచ్చిన గోదావరి, స్వంత ఆస్థి జమ చేసుకునే తాపత్రయంతో విడిపోయిన అన్నదమ్ముల్లా, సముద్రానికి కలిసే తొందర్లో పాయలు పాయలుగా విడిపోతుంది. మధ్యలో చిన్న చిన్న దీవులు. నాల్గయిదు దీవులకో పాఠశాల. ఆపైన చదవాలంటే దూరం పోవాల్సిందే. అద్దె సైకిళ్ళుంటాయి. అయితే ఏ అంగడిలో తీసుకుంటే అక్కడే తిరిగి యివ్వనక్కరలేదు. రేవులో తీసుకుని పల్లెల్లో యివ్వొచ్చు.
"ఊఁ... ఎక్కరా."
'నేను పెద్దవాడి నయ్యానని యింకా ఎప్పుడు తెలుసుకుంటావ్ తాతయ్యా' అనుకుంటూనే సోమయాజులు ఎక్కి ముందు కూర్చున్నాడు.
మనవడి మనసు గ్రహించినట్టూ ఆయన నవ్వాడు.
"ఒరేయ్ అంతటా ఉరుకులు పరుగుల్తో ప్రవహించే గోదారి అక్కడికొచ్చేసరికి అంత నెమ్మదిగా ఎందుకుందంటావ్. అక్కడ దాని మనసులో కల్మషం ప్రవేశించిందన్నమాట. దాన్నే సుడిగుండం అంటారు."
ఇదంతా ఎందుకు చెపుతున్నాడో తెలియక ముందు కూర్చున్న సోమయాజి వెనక్కి తలెత్తి తాతయ్య మొహంలోకి చూశాడు.
"ఆళ్ళు నిన్ను చూసి నవ్వటం లేదురా అబ్బీ! ఏడుస్తున్నారు. నీ కున్నట్టూ తమకీ ఓ తాతయ్య లేనందుకు మనసులోనే ఏడుస్తున్నారు. తాతయ్యేఁవిట్లే. ఇపుడిపుడు కన్నతండ్రులే కొడుక్కి ఏడెనిమిదేళ్ళు వచ్చేసరికి మంచి చదువుల పేరుతో దూరంగా తోలేస్తున్నారట. ప్రపంచం మారిపోతోందిరా చిన్నా. ఇక్కడ ప్రశ్న నువ్వు తొక్కుకుంటూ రాగలవా లేవా అన్నది కాదు. నువ్వొచ్చే పడవ కోసం ఎదురు చూడటానికి రేవులో ఒకరున్నారన్నది! అదీ తృప్తి. రావటంలో నాకూ.....నన్ను చూడటంలో నీకూ అందుకోసమే ఇంతదూరం రావటం" అన్నాడు.
ఎందుకో తెలీదుగానీ సోమయాజి కంట నీరు తిరిగింది. తాతయ్యే రాకపోతే బోసిపోయే రేవుని ఊహించుకునో, ప్రపంచం రేవులో తనని ఒంటరిగా పడవలో వదిలేసి వెళ్ళిపోయిన తల్లిదండ్రులని తల్చుకునో....
అవఘళించే ఆలోచన్లని తప్పించటం కోసం, "ఈ రోజేమయిందో తెలుసా తాతయ్యా" అని అడిగాడు.
"ఏమయిందిరా?"
"పాఠం చెబుతూ మా అయ్యవారు, తెలుగున నాచన సోమనాథుని మించిన కవి లేరన్నారు. చిఒవారికి పోతన కూడా - సత్యభామ నరకాసురునితో పోరాడే ఘట్టంలో 'ఆరి జూచున్ హరిజూచు' అన్న సోమనాథుని పద్యం చూసి, ప్రేరితుడై '.....పరుజూచున్ నరుచూచు' అన్న పద్యం వ్రాశాడట!"
"అయితే ఏమయిందిరా?"
"నేను లేచి, తెలుగునా పోతనని మించిన కవి లేడనీ, నాచన నుంచి అతడు ప్రేరణ పొందినా, యుద్దఘట్టంలో కూడా శృంగారాన్ని వర్ణించటం తగదనీ, అది నాచన చేశాడనీ అన్నాను. తప్పా తాతయ్యా?"
ఆయన మాట్లాడలేదు ఆలోచనలో పడ్డాడు.
"చూచుకము అంటే స్త్రీ స్థనాగ్రమే కదా. యుద్ధం చేసేటప్పుడు ఆ హడావుడిలో పైట తొలగించి అని వ్రాయొచ్చు. అంతవరకూ ఫర్వాలేదు కానీ 'మందార కేసరమాలా మకరంద బిందు సలిలసద్యంబు లందంబులై ప్రవహించినవి' అని వ్రాయటం ఎందుకు చెప్పు? అందులోనూ చూచుకములని చెప్పి.....నిశ్చయంగా ఈ విషయంలో నాచన తప్పుచేశాడంటాను. నువ్వేమంటావ్ తాతయ్యా?"
"నాచన గొప్పో, పోతన గొప్పో అలా వుంచుగానీ ఈ రోజు నుంచీ మాత్రం నువ్వు నా పక్కలో పడుకోవటానికి వీలులేదురా అబ్బీ"
సోమయాజి ఉలిక్కిపడి "ఎందుకు తాతయ్యా" అని అడిగాడు.
"నేను తొక్కుతూంటే ఇంతకాలం సైకిల్ ఎక్కటానికి మొహమాటపడనిధి, ఇప్పుడు పడ్డావంటే అర్ధంకాలేదు గానీ, ఈ మాటల్తో తెలుస్తూందిరా, నీకిక ఒంటరిగా పడుకునే వయసొచ్చిందని...."
"నిజంగానే అంటున్నావా తాతయ్యా."
"మాటవరసకైనా నా మాట పొల్లుపోవటం ఎప్పుడైనా చూశావట్రా."
సోమయాజి బిక్కమొహం పెట్టుకు కూర్చున్నాడు. మాటంటే మాటే మరి. "పోనీ ఈ ఒక్క రాత్రికీ పడుకుంటాను తాతయ్యా" బ్రతిమాలినట్టూ అడిగాడు. ఆయనకీ జాలేసింది. "సర్లే, రేపు సంక్రాంతి నుంచీ వేరే.... ఇదే ఆఖరి రాత్రి సరేనా!"
సోమయాజి మొహం విప్పారింది. కొంతలో కొంత నయం.