"మనకెందుకూ?" వాడి వెనకాల ఎంత పెద్ద ముఠా ఉందో అన్నాను" కొద్దిగా తల వంచుకుని చెప్పాడు శ్రీధర్.
".....మరిప్పుడు వీడి వెనకాల ఎంత పెద్ద గ్యాంగ్ ఉందో, ఏ పొలిటికల్ ఇన్ ఫ్లూయెన్స్ ఉందో ఏమైనా ఆలోచించే కొట్టారా?" అడిగాడు విక్రం.
శ్రీధర్ ఎర్రబడ్డ కళ్ళతో "నా బిడ్డ వయసున్న పాపమీద నా కళ్ళముందు అత్యాచారం జరుగుతూ ఉంటే, అవన్నీ ఆలోచిస్తూ కూర్చోమంటారా ఇన్ స్పెక్టర్?" అన్నాడు.
"ఆ రోజున తనమీదే అలాంటి చర్య జరుగుతూ ఉంటే ధరణిగారుకూడా చూఒస్తూ కూర్చోలేకపోయింది మిస్టర్ శ్రీధర్!" చిన్నగా నవ్వి అన్నాడు విక్రం.
శ్రీధర్ అంగీకారంగా "అవును! తానెంత బాధపడిందో ఇప్పుడు అర్ధమవుతోంది" అన్నాడు.
"మీకు తెలియని ఇంకో విషయం చెప్పనా! ఆ రోజు బస్ లో ధరణిగారు చెప్పిన అమ్మాయి నా సొంత చెల్లెలు!" అన్నాడు విక్రం.
శ్రీధర్ ఆశ్చర్యంగా చూశాడు.
"ఆ నిజం తెలిశాక నేనూ ఇంతే ఆవేశంలో వాణ్ణి చితకతన్ని మీ ఇంటికి పట్టుకొచ్చాను. కానీ వాణి మూడురోజుల కంటే ఎక్కువ సెల్ లో పెట్టలేక పోయాను!"
"ఏం? ఆశ్చర్యంగా అడిగాడు శ్రీధర్.
"వాదు మన నియోజకవర్గం ఎం.ఎల్.ఏ. కి బావమరిదట!" కసిగా పలికాడు విక్రం.
శ్రీధర్ బాధగా చూశాడు.
"కంప్లెయింట్ రాసివ్వండి.... అన్యాయాన్ని ప్రతిఘటించాలని మిఇలా అందరికీ అనిపించిన రోజున మా డ్యూటీ మాకు తేలికైపోతుంది. దేశం ప్రగతిపథంలో పయనిస్తుంది. గుడ్ సింప్టమ్!" అన్నాడు విక్రం.
శ్రీధర్ కంప్లెయింట్ రాసిచ్చి, "థాంక్యూ ఇన్ స్పెక్టర్. మళ్ళీ కలుద్దాం" అన్నాడు.
విక్రం నవ్వి "ఓ.కే! కానీ ఇలా కాదు... మా ఇంటికి మీరూ మీ మిసెస్ రావాలి!" అన్నాడు.
శ్రీధర్ తలూపి "....పాపని ఇంట్లో దింపి నే వెళ్తాను! వాడి సంగతి కాస్త చూసుకోండి!" అన్నాడు.
విక్రం లాఠీ చేతిలోకి తీసుకుంటూ, "ఏ ఎం.ఎల్.ఏ. దగ్గర్నుంచో ఫోన్ వచ్చేలోగా వీడి ఎముకలు పొడి చేస్తాను" అన్నాడు.
శ్రీధర్ పునీతని తీసుకొని, ఆమె ఇంటికి వెళ్ళాడు. ఆ అమ్మాయి తల్లి అప్పటికే బాగా కంగారుపడుతోంది. పునీతని చూడగానే "నా బంగారు తల్లి! ఎక్కడికెళ్ళావే? ఏం జరిగిందే?" అంటూ కౌగిలించుకుని ఏడ్చేసింది.
శ్రీధర్ పాపని మంచినీళ్ళు తీసుకురమ్మని లోపలి పంపి, ఆమె తల్లితో జరిగిందంతా వివరించాడు.
అంతా విని ఆమె భోరుమని ఏడ్చింది. "ఇంకా పుష్పవతి కూడా కాని పసిదానిమీద ఇటువంటి దౌర్జన్యం చేస్తారని వూహించగలమా! అదెలా బతుకుతుందీ? ఏ నమ్మకంతో ఈ పసిదాన్ని స్కూల్ కీ, ఆటలకీ పంపాలి? ఆడపిల్లగా పుట్టిన నేరానికి దాన్ని ఇంట్లో బందీగా పడేసి ఉంచాలా? దానికి ఎల్లప్పుడూ కాపలాగా ఉండడానికి నాకు వీలవదు. రెక్కాడితేకానీ మా డొక్కలు నిండవు! మాలాంటివాళ్ళు ఎలా బతకాలో మీరే చెప్పండి!" అంది.
"మీ బాధ నాకు అర్ధం అవుతోంది. నాకూ ఆడపిల్ల ఉంది!" కొండంత దిగులుగా చెప్పాడు శ్రీధర్.
"మీ మేలు మరిచిపోలేను బ్రదర్!" ఆవిడ చేతులు జోడించింది. ఈ లోపులో పునీత వచ్చింది.
"అది నా కర్తవ్యం!" మనస్ఫూర్తిగా అన్నాడు శ్రీధర్.
శ్రీధర్ వచ్చేస్తూ వుంటే "అంకుల్!" అని పిలిచింది పునీత.
"ఏంటమ్మా?" అడిగాడు శ్రీధర్.
"థాంక్యూ చెప్పడం మరిచిపోయాను అంకుల్! వాడు నన్ను కొట్టాడని, నువ్వు వాణ్ణి కొట్టావుగా!"
శ్రీధర్ కి షాక్ తగిలినట్టు అయింది. లైంగిక అత్యాచారాన్ని కూడా 'కొట్టడం' అనుకుంటోంది ఆ చిన్నపిల్ల.
అమాయకంగా మెరుస్తున్న ఆ పసిదాన్ని కళ్ళల్లోకి చూడలేక పోయాడు శ్రీధర్. "ఇంకా ముందు ముందు ఏం ఎదుర్కోవాలో పిచ్చితల్లీ!" అనుకుని తల నిమిరి "బై" అని వచ్చేశాడు.
ఇంటికొచ్చేటప్పటికి ధరణి ఎదురుచూస్తూ కనపడింది.
"ఏవైందీ? ఇంతాలస్యం అవుతుందని ఓ ఫోన్ చెయ్యొచ్చుగా!" అని గయ్యిమంది.
శ్రీధర్ మాట్లాడలేనట్లు సోఫాలో వెనక్కి జార్లగిలబడి నిస్సత్తువగా కూలబడ్డాడు.
ధరణి కంగారుగా "ఏవైందండీ?! ఒంట్లో బావుందా?" అని అడిగింది.
శ్రీధర్ తలెత్తి ధరణి కళ్ళల్లోకి చూస్తూ "ధరణీ! నువ్వన్నది నిజం! మనకెందుకులే అని అన్యాయాల్ని చూసీ చూడనట్లు పోతే ఏదో ఒకరోజున అవి మన చుట్టూ పేరుకుపోయి మననే ముంచేస్తాయి! జీవితం క్షణికం.... అశాశ్వతం....అందుకే ప్రతిక్షణం సాఫల్యం చెందేటట్లుగా చూసుకోవాలి.... 'నేను మనిషిగా పుట్టినందుకు ఈ పని చేశానూ....' అని గర్వంగా చెప్పుకోవడానికి ఒక్క విషయం కూడా లేనివాడు అసలు బతకడమే వ్యర్ధం!"
ధరణి శ్రీధర్ వంక ఆశ్చర్యంగా చూసింది.
"ఈ రోజు నేను ఒకణ్ణి కొట్టాను. కొట్టడం అంటే అలా ఇలా కాదు. విరగ్గొట్టాను. అంతేకాదు, పోలీస్ స్టేషన్ లో అప్పజెప్పి లాకప్ లో పడేయించి మరీ వచ్చాను!" షర్ట్ గుండీలు విప్పుతూ అన్నాడు.
"మీరా!" ఆశ్చర్యం ముప్పిరిగొనగా అడిగింది.
"ఔను! ఏం? నమ్మకం కలగడంలేదా?"
"ఎందుకూ? మీకేం ప్రమాదం జరగలేదు కదా!" గాభరాగా అడిగింది.
"
జరగలేదు. పెద్ద ప్రమాదాన్ని ఆపగలిగాను. అందుకు నన్ను అభినందించు!"
ధరణి తేలిగ్గా నిట్టూర్చి "అసలు ఏమైందీ?" అని అడిగింది.
"ఒక అమ్మాయిని కాపాడడం కోసం ఒకని చితక్కొట్టాను."
"ఓ! అమ్మాయి ముందు హీరోయిజం చూపించుకోవడం కోసమా?" ధరణి కవ్విస్తున్నట్లుగా యీర్ష్యగా అంది.
"ఆ అమ్మాయి వయసు చెప్తే నీ మొహంలో నవ్వు మాయమైపోయి భయం చోటు చేసుకుంటుంది!" జరిగిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ కోపంగా అన్నాడు.
"ఎంత వయసు?" అడిగింది ధరణి.
"మన పూజ అంత పిల్ల" కూల్ గా చెప్పాడు.
"వ్వాట్" అదిరిపడ్డట్టు చూస్తూ అడిగింది.
శ్రీధర్ తల పంకించాడు. "పసిపాప మీద అఘాయిత్యం చేస్తున్నవాడిని హత్యచేసి నీ భర్తజైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి! కొంచెంలో తప్పిపోయింది."
"అసలు ఏమైందీ? వివరంగా చెప్పండి!" ధరణి శ్రీధర్ భుజం పట్టి కుదుపుతూ ఆతృతగా అడిగింది. శ్రీధర్ అంతా వివరంగా చెప్పాడు. వింటున్న ధరణి ఒళ్ళు భయంతో గగుర్పొడిచింది. "మైగాడ్!" అని మాత్రం అనగలిగింది.
"ఆ టైమ్ లో నన్ను ఎలా కంట్రోల్ చేసుకున్నానో నాకే అర్ధం కావడంలేదు. ఆ పాపలో మన బిడ్డే కనిపించింది తెలుసా?" అతని కంఠం కంపించింది. ధరణి చాలా అప్ సెట్ అయినట్లుగా తల రెండు చేతులతో పట్టుకుని కూర్చుంది.
"ఆర్నెల్లు సావాసం చేస్తేనే వారు వీరవుతారంటారు. అలాంటిది పన్నెండేళ్ళుగా నీతో సాహచర్యం చేస్తున్నానుగా!" ఆమె మనసుని తేలిక పరచడానికి ప్రయత్నించాడు శ్రీధర్.
"వాడు..... వాడు..... పోలీస్ స్టేషన్ లోనైనా సిగ్గుపడ్డాడా? చేసిన తప్పుకి పశ్చాత్తాపపడ్డాడా?" అడిగింది ధరణి.
"ఊహూ! ఏవో బీరాలు పలుకుతూ బండబూతులు తిడుతూనే వున్నాడు."
"మనుషులు తప్పులు చేస్తున్నారంటే నాకు ఆశ్చర్యం కలగదు కానీ ఆ తర్వాత కూడా వ్బాల్లు అందుకు సిగ్గుపడకపోవడమే నాకు వింతగా వుంటుంది" అంది అసహ్యాన్ని కళ్ళల్లో చోపిస్థొఇఒ శ్రీధర్ మాట్లాడలేదు.
"ఆ పాపకి మన పూజ వయసే అన్నారు కదూ!" వణికే గొంతుతో అడిగింది.
"ఆ!"
ధరణి హటాత్తుగా శ్రీధర్ మెడని కౌగిలించుకొని "నాకు భయమేస్తోంది" అంది.
"ఎందుకూ?" శ్రీధర్ ఆమె తలని నిమురుతూ అడిగాడు.
"ఆడపిల్లని కన్నందుకు?" అతని గుండెల్లో తల దాచుకుని అంది.
"నువ్వేనా ఇలా మాట్లాడేది?" విస్మయంగా అడిగాడు శ్రీధర్.
ధరణి మనసులో గీతనీ, కమలనీ, పునీతనీ తలుచుకుంటూ "ఔను! నేనే అలా మాట్లాడ్తున్నాను. నానాటికీ ఎదురవుతున్న అనుభవాలతో విసిగిపోయి ఇలా మాట్లాడుతున్నాను!" అంది.
శ్రీధర్ సడెన్ గా "పూజని చూడాలని వుంది!" అన్నాడు.
బాత్ రూం బయట స్నానం చెయ్యనని మారాం చేస్తూ ఏడుస్తున్న పూజని ఎవరో గద్దిస్తున్నట్లుగా, పూజ పెద్దగా ఏడుస్తున్నట్లుగా ధరణికి కూడా అనిపించింది.
"రేపు తీసుకొచ్చేయండి!" అంది.
"వద్దు! శనివారం ఎంతోదూరం లేదుగా" అన్నాడు శ్రీధర్.
ఇద్దరూ అలా ఎంతసేపున్నారో తెలీదు. ఎక్కడో ఏదో అపశృతి దొర్లుతోంది. ఏమిటది? ఏ..మి..ట..ది?