8
రాజేష్ చాలాసేపట్నించీ స్వీటీ కోసం ఎదురుచూస్తూ కూర్చున్నాడు. చేతిలోని టాఫీని మాటిమాటికీ చూసుకుంటున్నాడు. తను కొత్తగా చూసిన సినిమాలో హీరోయిన్ లా చిన్న చిన్న బట్టలు వేసుకుని వస్తే బావుండునని ఉంది. కానీ ఆ స్వీటీకి భయం. మెడక్రింద చెయ్యి వెయ్యనివ్వదు. ముద్దు మాత్రం ఇష్టంగానే యిస్తుంది.
రాజేష్ లో అసహనం పెరిగిపోతోంది. స్వీటీ ఎందుకో అతను ఉన్న చోటికి ఆ రోజు రాత్రి రాలేదు. చాలాసేపు ఎదురు చూసి వచ్చి పడుకున్నాడు.
మరునాడు స్కీటీ అతనికి ఓ స్లిప్ పంపించింది. అందులో "నన్ను మరిచిపో....ప్లీజ్!" అని ఒకే వాక్యం ఉంది.
ఆ వాక్యం చదవగానే రాజేష్ కి మతిపోయినంత పనయింది. వెంటనే స్వీటీ క్లాస్ కి వెళ్ళాడు. మేడమ్ హిస్టరీ చెప్తోంది. కిటికీలో నుండి స్వీటీని బైటికి రమ్మని సైగ చేశాడు. స్వీటీ బెదురుగా చూసింది. "రా.... లేకపోతే నేను వస్తాను!" అని రాజేష్ సైగ చెయ్యడంతో విధి లేనట్లుగా టీచర్ ని టాయ్ లెట్ కి అని అడిగి బైటికి వచ్చింది.
టాయ్ లెట్స్ దగ్గర రాజేష్ కోపంగా చెయ్యి పట్టుకుని "ఈ ఉత్తరం ఎందుకు రాశావు?" అన్నాడు- ఏదో సినిమాలో హీరోలా!
స్వీటీ జవాబు చెప్పలేదు. వెక్కిళ్ళు పెట్టి ఏడ్పు ప్రారంభించింది....
"ఎందుకు ఏడుస్తున్నావు" కంగారుపడ్డాడు రాజేష్.
"గోపీ నీతో మాట్లాడితే చంపేస్తానన్నాడు" వెక్కిళ్ళ మధ్యే చెప్పింది స్వీటీ.
రాజేష్ కోపంగా "వాడికి ఎందుకుటా?"
"గోపీ నాకు బావ. మన సంగతి మా అమ్మకి చెప్తానన్నాడు" అంది.
"ఏడిశాడు!" కసిగా అన్నాడు రాజేష్.
"గోపీ సంగతి నీకు తెలీదు. చిన్నప్పుడు తను కావాలన్న బొమ్మ మా అన్నయ్య ఇవ్వలేదనీ వాడి తొడమీద బ్లేడు పెట్టి కోసేశాడు!"
"అయితే వాడికి భయపడి మనం ప్రేమించుకోవడం మానెయ్యాలా?"
"అంతే కాదు! నేను గోపీని పెళ్ళి చేసుకోవాలట!" ఏడుస్తూ చెప్పింది స్వీటీ.
రాజేష్ ఉక్రోషంగా "అంతవరకూ వచ్చాడా? వాడి సంగతి నేను చూస్తాను!" అన్నాడు.
"వద్దు రాజేష్! నువ్వు గోపీతో పోట్లాడితే నామీద ఒట్టే! ఈ గొడవ ఇంట్లో తెలుస్తుంది. పెద్దవాళ్ళు కూడా విడిపోతారు కాబట్టి నాకోసం గోపీతో పోట్లాడనని ప్రమాణం చెయ్యి" అంది.
"పెద్దయ్యాక నన్ను పెళ్ళి చేసుకుంటానన్నావుగా!" అడిగాడు రాజేష్.
"అమ్మో! గోపీ చంపేస్తాడు" భయంతో ఆమె కళ్ళు పెద్దవయ్యాయి.
"అయితే నాతో ఇంకా మాట్లాడవా?" రాజేష్ కళ్ళల్లో నీరు నిండింది.
"నీ కోసమే నేను నీకు దూరం అవుతున్నాను రాజేష్!" స్వీటీ కూడా ఏడుస్తూ అంది. "....నన్నర్ధం చేసుకో."
"అయితే రేపట్నించీ ఈ టాఫీలు నేను ఎవరికివ్వాలి?" ఉత్తరాలు ఎవరికి రాయాలి?"
స్వీటీ ఫ్రాక్ చివరతో కళ్ళు తుడుచుకుంటూ.... "...ఇంకో మంది అమ్మాయిని చూసి ప్రేమించు రాజేష్!" అంది. ".... ప్రేమ త్యాగాన్ని కోరుతుంది."
"అది ఈ జన్మకి జరగదు స్వీటీ! నేను నిన్ను మరచిపోలేను. అసలు నేను ఎప్పటికీ పెళ్ళే చేసుకోను" కోపం, దుఃఖం ఒకదానితో ఒకటి పోటీ పడ్తుండగా చెప్పి వెళ్ళిపోయాడు.
స్వీటీ కళ్ళు తుడుచుకుని క్లాసుకి వెళ్ళిపోయింది.
హాస్టల్ కాంపౌండ్ లో ఒక చెట్టుకింద దీర్ఘాలోచనలో కూర్చొని వున్నాడు రాజేష్ ఏం చెయ్యాలో అతడికి పాలుపోవడం లేదు.
రెండే మార్గాలున్నాయి.
గోపీకి స్వీటీని వదలి అస్తమిస్తున్న సూర్యుడివైపు వెళ్ళిపోవటం.
గోపీ విలన్ అని స్వీటీకి తెలిసాక, అతడితో ఫైట్ చేసి గెలిచి, స్వీటీని పొందటం.
మొన్నే టీవీలో చూసిన రెండు సినిమాల్లో రెండు ముగింపులు.
రెండిటిలో తనేం చెయ్యాలి?
వాళ్ళిద్దరూ టాయ్ లెట్స్ దగ్గర కలుసుకోవడం ఇంకో జత కళ్ళు చూశాయని వాళ్ళిద్దరికీ తెలీదు!
-- * * * * --