"పోనీ - ఓ బోర్డు కొనుక్కోవచ్చుగదా!" అంది సుహాసిని.
"అమ్మ ఒప్పుకోవడంలేదు. డబ్బు దండుగ అంది" అన్నాడు సుబ్బారావు.
"మీకింకా ఏమిష్టం?" అంది సుహాసిని.
"పచ్చావకాయ నాకు భలే ఇష్టం. కానీ మా ఇంట్లో అమ్మపెట్టదు. మీరెప్పుడైనా అది తిన్నారా?" అన్నాడు సుబ్బారావు.
"తినకేం మా ఇంట్లో ఏటా పడతారది. నాకూ అది చాలా యిష్టం."
"అరే, మన రుచులు బాగా కలిశాయే" అని "అయితే మీకు పులిహోరావకాయ కూడా యిష్టమే అయుంటుంది. అవునా?" అన్నాడు సుబ్బారావు.
"మీకెలా తెలుసు? కానీ ఆ ఊరగాయ మా ఇంట్లో పెట్టరు. మా అత్తయ్యా వాళ్ళింట్లో పెడతారు. చాలా బాగుంటుంది" అంది సుహాసిని.
"మా అమ్మ పెడుతుంది. చాలా బాగుంటుంది. కావాలంటే మీకో గిన్నెడు పంపిస్తాను" అని "ఏమండీ మీకు పోపుపెట్టిన పెసర పచ్చడి ఇష్టమా? మామూలు దిష్టమా? మామూలుదైతే మిగిలిపోయాక అట్టు వేసుకుని తింటే కూడా బాగుంటుంది" అన్నాడు సుబ్బారావు.
పొదల వెనుక రాయుడు ముఖం చిట్లించి "ఇదేం జంట? ఇవేం కబుర్లు? వీళ్ళకంటే ఆ బామ్మగారే నయమనిపిస్తోంది" అన్నాడు.
"ప్లీజ్, నన్ను డిస్టబ్ చేయవద్దు" అన్నాడు రామగోపాల్. అతను ఏకాగ్రతతో వాళ్ళ సంభాషణలు వింటూ మోనికాకు నెమ్మదిగా చెప్పేస్తున్నాడు. మోనికా రాసేసుకుంటోంది. రాయుడు చిరాగ్గా చుట్టూ చూశాడు.
"అట్టుకి మామూలు పచ్చడి బాగున్నా రుచికి పోపు పచ్చడే బాగుంటుంది."
"కరెక్టుగా నా రుచీ, మీ రుచీ ఒక్కటే, మిమ్మల్నోసారి మా యింటికి భోజనానికి పిలవాలి. లేదా నేనే మీ యింటికి భోజనానికి రావాలి!" అన్నాడు సుబ్బారావు.
వాళ్ళిద్దరూ రకరకాల పచ్చళ్ళ గురించి మాట్లాడుకున్నారు. తర్వాత సుబ్బారావు పచ్చీసు ఆట ఎంత థ్రిల్లింగ్ గా ఉంటుందో చెప్పాడు. సరదాగా మా యింటి కొచ్చి ఓసారి నాతో ఓ ఆట వేయండి. ఆ తర్వాత నుంచి రోజూ అదే ఆడతారు."
సుహాసిని అంతః విని "మీకు పేకాట వచ్చా?" అనడిగింది.
"పేకాడితే చెడిపోతారు. అది ఆడకూడదు" అన్నాడు సుబ్బారావు.
"డబ్బు పెట్టి పేకాడితే చెడిపోతారు. కానీ మామూలుగా ఆడుకుందుకేం?"
"మొదట మామూలుగానే మొదలవుతుందట. తరువాత కానీతో మొదలవుతుందట..." అని సుబ్బారావు ఇంకా ఏదో అనబోతుండగా-కానీ ఏమిటనడిగింది సుహాసిని.
"కానీయా? అని మా అమ్మ చిన్నప్పటి డబ్బులు ఇప్పుడు రూపాయకు వంద పైసలూ, అప్పుడు రూపాయకు అరవైనాలుగు కానులట. అమ్మ ఎప్పుడు కానీలనే అంటుంది. నాకూ అదే అలవాటైపోయింది" అని. "అలా కానీతో మొదలై అలా అలా వందలూ వేలలోకి మారిపోతుందిట. మీరు చూశారో లేదో, కూరగాయల బజార్లో ఓ ముసలి ముష్టాడు తిరుగుతూంటాడు. వాడు పేకాడే అలాగైపోయాడట. పేకాడక ముందు వాడికి పదెకరాల భూమి ఉండేదిట. స్వంతిల్లు కూడా ఉండేదిట" అన్నాడు సుబ్బారావు.
"అదీ మీ అమ్మగారే చెప్పారా?"
"అవును. నా చిన్నప్పుడు చెప్పింది. ఒకసారి చెబితే నేను ఏదీ మరచిపోను. సారా గురించి కూడా అమ్మ అలాగే చెప్పింది. సిగరెట్లు గురించీ అలాగే చెప్పింది. అందుకే నేను అలాంటి వాటి జోలికి పోను" అన్నాడు సుబ్బారావు.
"అయ్యో- పాపం, అయితే నీకు పెళ్ళి అయితే ఇబ్బందే! ఒక్క దురలవాటు కూడా లేకపోతే మీ భార్యకు కష్టం కదూ!" అంది సుహాసిని.
భార్య అన్న పధం వింటూనే సుబ్బారావు కాస్త సిగ్గుపడినా వెంటనే తమాయించుకుని "కష్టం మేమిటో నాకు అర్ధం కాలేదు" అన్నాడు.
"ఆడవాళ్ళు పెళ్ళెందుకు చేసుకుంటారు? భర్తను బాగుచేసుకుందుకు, లేదా భర్తతో కలిసి కష్టాలు పడడానికి. అప్పుడే ఆడదానికి పేరొస్తుంది. భర్తకు ఏ దురలవాటూ లేకపోతే భార్యకు కీర్తిప్రతిష్టలుండవు" అంది సుహాసిని.
"అయ్యో, మీరలాగనుకుంటున్నారా, మా అమ్మ ఇంకోలా చెప్పిందే."
"ఏం చెప్పింది. మీ అమ్మ?"
ఈ సంభాషణ వింటూంటే రాయుడికి చిన్నప్పుడు తనూ, చెల్లెలు లలితా కలిసి బఠానీలు తింటూ కబుర్లు చెప్పుకోవడం గుర్తొచ్చింది.
సుబ్బారావు చెప్పుకు పోతున్నాడు. "కథల్లోనూ సినిమాల్లోనూ చూపించినట్లు ఒకసారి చెడిపోయిన వాళ్ళు ఇంకా మారరట. అదీకాక మొగుడు తాగుబోతైతే పెళ్ళానికి చాలా కష్టమట. వాడేమో ఉన్నదంతా తాగుడుకు తగలెట్టేయడమేకాక రోజూ పెళ్ళాన్ని కొడతాడట. దెబ్బలంటే సామాన్యమైన దెబ్బలు కావు. వంటి నుంచి రక్తం వచ్చేలా దెబ్బలు. ఒకాయన తాగుడు మైకంలో పెళ్ళాన్ని చంపేశాడు కూడానట."
"అమ్మ బాబోయ్ - చంపేయడమే" అంది సుహాసిని.
"అలాగే పేకాటకు అలవాటు పడ్డవాడు. పెళ్ళాన్ని కూడా అమ్మేస్తాడుట. అలా ఒకావిడ, పాపం ఇప్పుడు బోగందైపోయిందిట" బోగంది అని చెప్పడానికి సుబ్బారావు కాస్త సిగ్గుపడ్డాడు.
"మీ అమ్మకు ఇవన్నీ ఎలా తెలుసు?"
"మా అమ్మకింకా చాలా తెలుసు. అందుకె నేను అన్నీ ఆవిడ చెప్పినట్లే వింటాను. నేను మరీ బుద్దిమంతున్ననీ కొందరు వేళాకోళంకూడా చేస్తారు. అయినా సరే, మున్ముందు నేనే అందరికంటే గొప్పగా ఉంటానట. సుఖపడతానట" సుబ్బారావు గర్వంగా చెప్పాడు.
సుహాసిని మొఖంలోకలవరపాటు కనిపించింది. ఆమె తనలో అనుకుంటున్నట్లు "మరి మా బావ బాగా తాగుతాడు. బోగం వాళ్ళింటికి కూడా వెడతాడు. ఈ అలవాట్లు ఇంకెప్పటికీ మానడా?" అంది.
సుబ్బారావు ఆశ్చర్యంగా "మీ బావకు అలాంటి అలవాట్లున్నాయా? అలాంటి సంబంధమొకటి మా చెల్లెలికి వచ్చింది. సంబంధం తెచ్చిన పేరయ్య మగాడికా మాత్రం అలవాట్లుంటే తప్పులేదమ్మా - అబ్బాయి బాగా కలిగిన వాడు- అని కూడా చెప్పాడు. అమ్మమాత్రం ఎంత కసాయి వాడు కూడా చూస్తూ చూస్తూ అలాంటి వాడికి పిల్లనివ్వలేడంది. మరి మీ యింట్లో ఈ సంబంధాని కెలా ఒప్పుకున్నారు?" అన్నాడు.
"మా యింట్లో అంతా మంచివాళ్ళే - కసాయి వాళ్ళెవ్వరూలేరు."