"అయితే మీకీ పెళ్ళి జరుగదు. నేను హామీ యిస్తున్నాను,"
"చిన్నప్పట్నించీ అనుకున్న పెళ్ళి యిది" అంది సుహాసిని.
సుబ్బారావు కాసేపు ఆలోచించి "పోనీ పెళ్ళి కాకుండానే మీరు మీ బావనుమార్చడానికి ప్రయత్నించండి. విజయం సాధిస్తేనే పెళ్ళిచేసుకోండి" అన్నాడు.
సుహాసిని ఏదో అనబోయేంతలో బామ్మగారి కేక వినిపించింది. ఇద్దరూ చటుక్కునలేచి పెద్దల వెనక్కు వెళ్ళిపోయారు.
వాళ్ళు వెళ్ళిపోయాక రాయుడు, రచయిత, రామగోపాల్, మోనికా పొదల చాటునించి బయటకు వచ్చారు.
"ముసలాళ్ళు మంచి హుషారుగా ఉన్నారు. వాళ్ళు ప్రేమ గురించి కూడా మాట్లాడారు" అన్నాడు రచయిత.
"మా వాళ్ళు కూడా ఫరవాలేదు. దారిలో పడుతున్నారు" అంటూ రాయుడు జరిగింది రచయితకుచెప్పాడు.
"అయితే ఫరవాలేదు. కథ దానంతటదే ముందుకు నడుస్తోంది" అంటూ రచయిత సంతోషపడ్డాడు.
"అలాగనుకుని ఊరుకుంటే లాభంలేదు. మన ప్రయత్నాలు మనమూ చేయాలి" అన్నాడు రాయుడు. రామ గోపాల్, మోనికా అక్కణ్ణించి వెళ్ళిపోయాక రాయుడు రచయిత కథ గురించి కాసేపు చర్చించారు.
సుబ్బారావు ద్వారా సుభద్రమ్మకు సుహాసినిపై జాలి కలిగించాలి. సుభద్రమ్మ బామ్మగారి దగ్గర ప్రభాకరం సంబంధానికి వ్యతిరేకంగా ప్రచారం చేయాలి. సుహాసిని ప్రభాకరాన్ని మార్చే ప్రయత్నాలు చేస్తే అవి విఫలం చేయాలి. సుహాసినినీ, సుబ్బారావునీ ఇంకా ఇంకా దగ్గరగా తీసుకురావాలి
చాలాసేపు ఆలోచించి వాళ్ళు తీసుకున్న నిర్ణయాలివి.
10
రాయుడుగారి తంత్రం కొంతవరకూ పనిచేసింది. సుభద్రమ్మ సుహాసిని విషయంలో బామ్మను పట్టుకుని దులిపేసి, "చూస్తూ చూస్తూ ఆపిల్ల గొంతు కోస్తారా?" అని కూడా అడిగింది. బామ్మగారు కూడా సుభద్రమ్మ చెప్పిన ఉదాహరణలు విని హడలిపోయింది. తన్ను తాను సమర్ధించుకోవడం కోసం ఆవిడ "మా ప్రభాకరం మరీ అంతగా చెడిపోలేదమ్మా ఏదో కొంచెం కొంచెం చెడిపోయాడంతే" అని సర్దుకుంది. కానీ ఆవిడ ఈ సంబంధం విషయంలో కొంత ఆలోచనలో పడిందన్నమాట తథ్యం.
సుబ్బారావు, సుహాసినిల మధ్య చనువు కాస్త పెరిగింది. కానీ ప్రేమ మాత్రం ఇంకా పుట్టినట్లులేదు. ప్రభాకరాన్ని మార్చాలనీ సుహాసిని అనుకుంటూంటే అందుకు సుబ్బారావే కొన్ని ఆలోచనలు కూడా చెప్పాడు.
ప్రేమించిన వాళ్ళు ప్రేయసికోసం ఏమైనా చేయాలి. అతడిని పార్కుకు రమ్మనమని సాయంత్రమే ఎందుకు పిలవడం? షాపులో ఉండగానే రమ్మని చెప్పాలి. నా మీద ప్రేముంటే వెంటనే బయల్దేరి ఫలానా చోటుకు రా అని చెప్పాలి!
సుహాసినికీ ఉపాయం వచ్చి వెంటనే అమలు జరుపుతానని కూడా చెప్పింది. ఆ విధంగానే ఆమె మర్నాడు బావకు ఉత్తరం పంపించింది. రాయుడు ఆ ఉత్తరం ప్రభాకరానికి చేరకుండా ఆపాడు. సూర్య్హముఖి సాయంతో ఓ పంచ ధారా చిలకను పట్టి ప్రభాకరం మీదకు వదిలాడు. ఇద్దరూ కలిసి మధ్యాహ్నం ఓ పార్కులో ఉండగా ఆ సమాచారం సుబ్బారావు ద్వారా సుహాసినికి అందజేశాడు. సుహాసిని అక్కడికి వెళ్ళి ఒకరి ఒడిలో ఒకరున్న ఆ జంటను చూసి తెల్లబోయింది.
ప్రభాకరం త్వరగానే సర్దుకుని "పెళ్ళయ్యేదాకానే ఇది!" అంటూ సుహాసినికి నచ్చజెప్పబోయాడు.
"దాని గురించి కాదు నేను చెబుతుంట. నేను రమ్మనమని కబురంపినా రాకుండా ఇంకొకరితో తిరుగుతున్నావా?" అంది సుహాసిని.
ఆమె రాసిన ఉత్తరం తనకు అందలేదని ప్రభాకరం చెప్పినా సుహాసిని నమ్మలేదు. అప్పుడు "నీకు యిష్టమైన వారి మీద ఒట్టు. నేను నిజమే చెపుతున్నాను" అన్నాడు ప్రభాకరం. ఈ వివరం కూడా మోనికా, రామగోపాల్ రాసుకున్నాను.
సుహాసిని అక్కణ్ణించి బైటకు వచ్చేసింది.
ఆ సాయంత్రం మళ్ళీ పార్కులో అంతా కలుసుకున్నారు. మధ్యాహ్నం జరిగిన దంతా విన్న రాయుడు సుబ్బారావుకు కొన్ని సూచనలు ఇచ్చాడు. ఆ ప్రకారం__సుబ్బారావు "ఈ రోజు నాకు భరించలేని తల నొప్పిగా ఉంది. అది కూడా హఠాత్తుగా వచ్చింది. ఒళ్ళంతా ఒకటే పులపరంగా ఉంది" ఆనందు సుహాసినితో.
"హఠాత్తుగా ఏమయింది మీకు?" అంది సుహాసిని.
"ఏమో, తెలియదు! అమ్మతో చెబితే అందీ - ఎవరయినా నీ మీద తప్పుడు ఓట్లు వేస్తే అలా జరుగుతుందీ అని!" అన్నాడు సుబ్బారావు.
"తప్పుడు ఓట్లు అంటే!"
"ఓసారి చిన్నప్పుడు నేను చెల్లాయిని కొట్టి - కొట్టలేదని అమ్మకు అబద్దం చెప్పాను. నిజంగా కొట్టలేదని ఒట్టేయి అంది అమ్మ. అమ్మమీద ఒట్టేశాను. వెంటనే అమ్మకు జ్వరం వచ్చేసింది. నేను తప్పుడు ఒట్టువేయడం వల్లనే జ్వరం వచ్చిందని అమ్మ చెప్పింది. తర్వాత నుంచి ఇంకెప్పుడూ తప్పుడు ఓట్లు వేయలేదు. నేను ఒట్టు వేశానంటే - నిజమే చెబుతాను" అన్నాడు సుబ్బారావు.
"మధ్యాహ్నం మా బావ నీ కిష్టమైన వాళ్ళమీద ఒట్టు అన్నాడు. నాకు బావంటేనే చాలా ఇష్టం. కానీ బావకేమీ కాలేదే!" అంది సుహాసిని.
"మీ బావకేమీ కాలేదు. కానీ మధ్యాహ్నంనుంచే నాకు పులపరం ప్రారంభమయింది. నామీద ఎవరు ఒట్టేశారో ఏమో" అన్నాడు సుబ్బారావు.
"కొంపదీసి నాకు మీరన్నా ఇష్టమేనేమో!" అంది సుహాసిని అమాయకంగా.
"మీ సంగతి నాకు తెలియదు. కానీ నాకు మాత్రం మీరంటే చాలా ఇష్టం!" అన్నాడు సుబ్బారావు. ఈమాట వింటూనే పొదలమాటున రాయుడు హుషారెక్కాడు.
"ఇష్టమంటే?" అంది సుహాసిని.
"ఇష్టమంటే....నాకు మా అమ్మంటే ఇష్టం. చెల్లి అంటే ఇష్టం. మీరంటేఇష్టం.... అలాగన్నమాట!" అన్నాడు సుబ్బారావు.
రాయుడు నిరుత్సాహపడి "ఈ జన్మకు నువ్వు బాగుపడవు" అన్నాడు.
"నాకిష్టమైన వాళ్ళంటే బావొక్కడే కానక్కర్లేదు కదా! ఈ ఆలోచన రానేలేదు. ఈరోజు మిమ్మల్ని కలుసుకోవడం మంచిదే అయింది. బావ అబద్దం బైటపడింది...." అని ఓసారి కళ్ళు తుడుచుకుని "బావ మారడేమో! నాతో ఇప్పట్నించీ అబద్దాలు చెప్పేస్తున్నాడు" అంది.
"దానికేముంది మళ్ళీ మళ్ళీ ప్రయత్నించండి" అన్నాడు సుబ్బారావు.
సుహాసిని ప్రభాకరాన్ని కలుసుకోవాలనుకున్నప్పుడల్లా రాయుడు ఏదో విఘ్నాన్ని సృష్టిస్తూనే ఉండేవాడు. ఓసారి ప్రభాకరం ఆమె హోటల్ కు రమ్మంటే స్నేహితుడితో భార్ కు వెళ్ళాడు. సమాచారం తెలిసి సుహాసిని బార్ కు వెడితే, ఆమె ఉత్తరం చేరలేదని అతడామె కిష్టమైన వారి మీద ఒట్టేశాడు. అతను ఒట్టు వేసినపుడు సుహాసిని టైమ్ కూడా నోట్ చేసుకుని తర్వాత సుబ్బారావుని కలిసినపుడు "ఈరోజు మీకేమైనా అయిందా?" అనడిగింది.