"కృతకంగా ఉన్నట్లు మనకు అన్పించినా అతనికి సహజమే!"
"రెండు సర్పాలను అలా జటాజూటంలో బంధించడం సాధ్యమే నంటారా? పాములు పెంపుడు జంతువులు కాదుగదా! చిలుకల్ని భుజం మీద కూర్చోపెట్టుకోవచ్చు! ఉడుతల్ని జేములో వేసుకు తిరగొచ్చు. కుక్కల్ని వెంటతిప్పుకోవచ్చు. కాని పాముల విషయం వేరు"
"అవునమ్మా! అవి పెంపుడు జంతువులు మాత్రంకాదు. అందుకే అతడు వాటిని పిలిచి రప్పించలేదు. నువ్వు సరిగా గుర్తుపెట్టుకున్నావా తల్లీ! మంత్రాలు చదివితే వాటంతట అవే పైకివచ్చినాయి.
సర్పసమ్మోహనవిద్య అతనికి వశమై ఉండవచ్చు!" అంటూ బదులిచ్చింది ప్రొఫెసర్! తులసి అమితాశ్చర్యంగా చూసింది.
"సర్మసమ్మోహన విద్య అంటే ఏమిటి?"
"ఇప్పటికి లభించిన జువాలజీ శాస్త్రీయ విజ్ఞానంలో ఆ పదాన్ని నిర్వచించటానికి వీలుకాదమ్మా! పైగా అంతా అబద్దమని కొట్టి పారవేయాల్సి వస్తుంది! కాని ప్రజల జీవితంలో మన దేశంలో ఎదురు అవుతున్న అనుభవాలు, వాస్తవాలు వేరుగా ఉన్నాయి.
ఆ పరిధిలోనే వాటిని నిర్వచించాలి!
శాస్త్రవిజ్ఞానం ఆధారంగా పాములు పగబడతాయని చెప్పటానికి వీలులేదు. కాని వాస్తవమయిన అనుభవాలు వేరుగా ఉంటాయి.
పాములు ఇరవై ఆరునుంచి ముప్పై సంవత్సరాల నించి మించి జీవించవు కాని తరతరాలు కులదేవతలుగా ఉన్న సర్పాల కథలు ముందుగా రాయలసీమ, ఆ తరువాత తెలంగాణా, ఆంద్ర ప్రాంతాలలో కూడా ఎన్నో ఉదాహరణలున్నాయి వాటిని కాదనలేం!
ఇలా శాస్త్రీయవిజ్ఞానం, వాస్తవానుభవాలు చెరొకదారి అయినప్పుడు ప్రజలు అనుభవ మార్గాన్ని ఎన్నుకోవటం సహజం.
నేను క్లాసు తీసుకున్నప్పుడు నీకు యిచ్చే నోట్సువేరు.
కాని ఆత్మీయురాలుగా సలహా యిచ్చేపుడు మాత్రం సర్పసమ్మోహన విద్యలేదని నిన్ను నమ్మించేందుకు ప్రయత్నించలేను. ఇంక మీ దంపతులు ఇరువురూ ఆ విషయాన్ని మర్చిపోవటం మంచిది.
అసలు ఈ గొడవ అంతటికి కారణం ఏమిటంటావు?
అతడు భిక్షయాచించేందుకు వచ్చాడు! అది సహజం కదా! ఆ సందర్భంలో మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారనేది వాళ్ళుచూడరు.
అడుక్కునేందుకు వచ్చినవాళ్ళు లేదనగానే వెళ్లిపోరు. హఠం వేసుకు కూర్చుంటారు. ఇది ప్రతీ భారతీయ గృహిణుల అనుభవం! అడుక్కోవటమనేది ఈ దేశంలో శతాబ్దాలుగా కాదు సహస్రాబ్దాలుపాటు ఒక వృత్తిగా చెలామణి అయింది అదే కారణం!
తాను ఒక సాధారణ భిక్షకుడు కాదని నిరూపించుకునేందుకు మంత్రాలు చదివి జటాజూటంలోంచి సర్పాలను రప్పించాడు. అప్పుడే అతన్ని గమనించి తృప్తి పరచి పంపేస్తే ఈ గొడవ అంతా ఉండదు.
కాని అలా జరగలేదు. మీ మమ్మీ స్పృహతప్పి పడిపోవటంతో కథ అంతా తారుమారు అయింది. అతడు జనంమధ్య శక్తి నిరూపించుకుని ఆరాధన పొందగలిగాడు. కనుక ఇంకా ఆ విషయాన్ని వదలి వేయటం మంచిది అని నేను అనుకుంటున్నాను"
"మేడమ్! మీరుచెప్పిన విషయాలన్నీ యదార్ధమయితే రెండు కారణాలవల్ల అతన్ని నేను కలుసుకోవాలి! ఒకటి ముందుగా క్షమాపణలు అర్ధించటం. రెండవది సర్పసమ్మోహన విద్యగురించి తెలుసుకోవటం. ఏమంటారు?" అని ప్రశ్నించింది తులసి!
"మొదటిది మానవత్వం. రెండోది వెంచర్!
విష్ యూ ఆల్ సక్సెస్! అంటూ తన ఆశీస్సులు అందించింది ప్రొఫెసర్ సమతాబెనర్జీ.
"మేడమ్! మీ ఆశీస్సులతో ముందుకే వెడుతున్నాను. విద్యా విషయాలలో నేను అన్వేషించాలనుకున్న సమస్య ఒక గృహిణిగా ఎదుర్కొవలసిన సమస్య రెండూ ఒకటే అయినాయి. ఫలితాంశం ఎలాంటిది అయినా నాకిప్పుడు వెనకడుగు వేయటానికి అవకాశంలేదు. వస్తాను మేడమ్!" అంటూ అడుగు ముందుకేసింది తులసి!
ఒక దృఢమయిన నిర్ణయంతో వెలుపలకు వచ్చిన తులసి పబ్లిక్ టెలిఫోన్ నించి తన ఫ్రండ్స్ కి వార్తలు అందించింది!
మరో యిరవై నిముషాలకు కళ్యాణి, ఉమ అక్కడకు వచ్చి వాలిపోయారు.
"మనమిప్పుడు ఓ అడ్వంచర్ చేయాలోయ్?" అంది తులసి!
"క్రొత్తగా రిలీజ్ అయినా పిక్చర్ కి టికెట్స్ సంపాదించాలా?" అని ప్రశ్నించింది ఉమ. కళ్యాణి ఆసక్తిగా చూస్తోంది.
"అదేమీ కాదు. ద్రవిడ మాహేశ్వరయోగి ఎక్కడున్నాడో తెలుసుకోవాలి!"
"ఒకసారి చూచినప్పుడు ఒళ్ళంతా క్వెట్టింగ్ తో తడిపేసుకున్నావు కదా! గడగడ వణికిపోయావ్! ధైర్యం లేనిదానికి నీకెందుకీ రభస!"
"రభస కాదే అవుసరం! జరిగినా సంఘటనలో ఎవరి తప్పులేదు. అనవసరమయిన రభస జరిగింది. టెన్షన్ ఇంకా సాగుతోంది! వెంటనే దీనికొక ముగింపు ఆలోచించాలి!"
"అవునులే! తప్పుచేసిన ఆఫీసర్ నీ భర్త కదా!?" అంది కళ్యాణి!
"తప్పేమిటే చింతకాయ్? అసలు గారడీ వాళ్ళని నిషేదించాలి" అంది ఉమ!
"మీరిలా మాట్లాడితే నేను ఒకర్తెనే వెళ్ళిపోతాను" తులసి బెదిరించింది!
"వొద్దులే! అంతపని చేయకు. ఆయన ఎక్కడుంటాడంటావు?"
"ఎవరి వెంట వెళ్ళాలో వారి దగ్గరే ఉండాలి. లేదంటే జనం తిరగని ఏకాంత ప్రదేశాలలో ఉండాలి!" తులసి వివరించింది.
"అలాంటి చోటు ఈ కాంక్రెట్ జంగిల్ లాంటి మహా నగరంలో ఎక్కడుంటాయి?
"స్మశానం ఒక్కటే కదా! తప్పని సారీ అయినప్పుడు తప్ప మిగిలిన సమయాలలో ఆ చోటుకి ఎవరు మాత్రం వెడతారు? పైగా చీకటి పడుతోంది!"
"ఇప్పుడు మనం వెడుతున్నాం కదా! నీతో స్నేహం చేయటమంటే కొరివితో తల గోక్కోవటమే! చేతులు కాల్చుకున్నవాళ్ళు ఆకులు పట్టుకోక తప్పదులే పద! పోదాం!" అంటూ ముందు తనే దారితీసింది ఉమ.