ఇదివర కెప్పుడూ నిర్మానుష్యంగా బావురుమంటూ వుండే యిప్పుడు అంతూ పొంతూ లేని మనుషుల రాక పోకలతో, వాళ్ళు చేసే హంగామాతో పెద్దసత్రంలా తయారయింది.
సత్యమూర్తి తప్పించుకుని, ఎంత వంటరిగా వుందామన్నా సాధ్యపడేదికాదు. "ఇదిగో చూడరా సత్యం: ఆ బీరువాలోంచి బట్టలు తియ్యాలి. తాళం చెవులు యిట్లా యియ్యి. నిన్ను పరామర్శించటానికి ఎవరో వచ్చారు, ఒకసారి బయటకురా. పురోహితుడు పిలుస్తున్నాడు త్వరగా వెళ్ళు." ఇట్లా ఎన్నో పిలుపలు వస్తూండేవి.
వ్యవహారమంతా శాస్త్రోక్తంగా జరిగిపోతుంది. సత్యమూర్తి రోజూ తెల్లవారు ఝామునే స్మశాన వాటికకు వెళ్ళి, తండ్రిని భూశయనం చేసిన చోట నిలబడి, అక్కడి కాండ అంతా శ్రద్దగా, జాగ్రత్తగా నిర్వర్తించి వస్తూండేవాడు. దగ్గర్లో గోదావరి వున్నది కాబట్టి, అస్థికలు అక్కడకు కూడా తీసుకు వెళ్ళి కలపాలని రామకృష్ణయ్యగారు ఆదేశించారు. సత్యమూర్తి రాజమండ్రి వెళ్ళి గోదావరిలో తండ్రి అస్థికలు కలిపి వచ్చాడు.
అతన్ని చూడటానికి, పరామర్శించటానికీ తండ్రి పరిచయస్థులూ, ఇరుగు పొరుగూ అంతా వచ్చేవారు. సత్యానందంగారు రెండు మూడుసార్లు వచ్చి, పలకరించి, ధైర్యం చెప్పి వెళ్ళారు. ఒకసారి వెంట సుధ కూడా వచ్చింది. కాని ఆమె ఏమీ మాట్లాడలేదు. వయసు, సిగ్గు ఆమెను ఆటంక పర్చివుంటాయి. తండ్రి మాట్లాడుతున్నంతసేపూ ప్రక్కనే మౌనంగా కూర్చుని, వెళ్ళేటప్పుడు నమస్కారం చేసి వెళ్ళిపోయింది.
ఎక్కడెక్కడినుంచో బంధువులు వచ్చి యింట్లోదిగారు. ఇంకా దిగుతున్నారు. వీళ్ళందర్నీ చూసేసరికి సత్యమూర్తికి మతిపోతున్నది. చికాకువేసుకుని వస్తున్నది. రోజులు గడిచినకొద్దీ వాళ్ళంతా వరుసలూ సంబంధాలూ కలపటం మొదలుపెట్టారు.
ఒకబ్బాయి జంకూ గొంకూ లేకుండా అతను కూర్చుని వున్న గదిలోకి ప్రవేశించి "మామా! మీ కాకినాడ యింత బాగుంటుందని అనుకోలేదు సుమీ. ఇక్కడ్నుంచీ కదల బుద్ది కావటంలేదు" అన్నాడు ఉత్సాహంగా.
అతను తలపంకించే వూరుకున్నాడు.
నాయనా అనీ, అబ్బాయి అనీ, బాబూ అనీ సంబోధించే వృద్ధులూ, నడివయసు మనుషులూ సరేసరి.
ఒకమ్మాయి- పదహారేళ్ళుంటాయి మొదట సిగ్గుపడి, దూర దూరంగా తొలగిపోతూండేది. తర్వాత తర్వాత "అదేమిటే పిచ్చి మొహమా! బావ దగ్గర సిగ్గేమిటి? ఎవరైనా నవ్విపోతారు" అని తల్లి గట్టిగా కేకలేసినట్లుంది. మెల్లిగా సంకోచాన్ని త్రోసిపుచ్చి "బావా! నాకు తోచటంలేదు" ఆహా, "ఎప్పుడూ వంటరిగా ఏం ఆలోచిస్తుంటావు బావా?" అని కల్పించుకుని మాట్లాడుతూ వుండేది.
ఇహ డబ్బు...! మంచినీళ్ళలా ఖర్చవుతోంది. "నాయనా సత్యం! ఓ వంద యిలా తే బాబూ" "బాబూ సత్యం! ఓ యాభయి యిటు పంపించు నాయనా" అని రామక్రిష్ణయ్యగారి గొంతు విధి విరామం లేకుండా మ్రోగుతూనే వుండేది.
తండ్రి చనిపోతూ చెప్పిన మాటలు...! అతని మనసు గింజుకులాడేది. కాని "ఎందుకు నాన్నా?" అని ధైర్యంగా తండ్రిని ప్రశ్నించలేక పోయేవాడు. "అవసరమంటావా?" అని ఒకటి రెండుసార్లు తెగింపుతో తల ప్రక్కకి త్రిప్పుకొని ఎలాగో అడిగాడు ఇంకా నయం! అవసరమా అని అడుగుతావూ? చనిపోయిన ఆయన ఆత్మశాంతించాలంటే కర్మకాండ అంతా శాస్త్రాల్లో చెప్పినట్లు తు.చ. తప్పకుండా ఆచరించాలిరా నా తండ్రి. మన ప్రాచీన సాంప్రదాయాలు... పద్దతులు....జవదాటకూడదురా బాబూ" అంటూ పురాణం ఏకరువుపెట్టాడు. ఈ ధోరణికి విస్తుపోయి సత్యమూర్తి మళ్ళీ ఎప్పుడూ ఎదురు ప్రశ్నవేయలేదు.
రాధమ్మగారు ఎంతో అత్యవసరమైనపని వున్నప్పుడు తప్ప తన గదిలోంచి బయటకు వచ్చేదికాదు. ఆ యింట్లో ఎటూ అర్ధంకాని స్థితిలో, స్థానం దొరక్క సతమతమయ్యే వీరభద్రం, అతని సతీమణి సుభద్రమ్మా నిరంతరం ఆమెకు పహారా యిస్తూన్నట్లుగా అక్కడే గడుపుతూ, దుర్భర శోకంలో మునిగి వున్న ఆమెకు దుఃఖాపశమనం కలుగ చెయ్యటానికి సదా ప్రయత్నిస్తూ వుండేవారు. వీరభద్రం ఎప్పుడైనా పని మీద బయటకు వెళ్ళినా సుభద్రమ్మ వదినగార్ని క్షణమైనా విడిచి పెట్టకుండా జాగ్రత్త పడుతున్నది
ఒకరోజు రాధమ్మగారు మంచంమీద పడుకుని, అటూయిటూ పొర్లుతూ, విలపిస్తూ "ఆ మహారాజు పోవటంతోనే యీ యింట్లో ధర్మం నశించి, అరాచకం భగ్గుమని అలుముకున్నది సుభద్రా. ఆ దుస్టులింకా యిక్కడినుంచి కదలరేమిటి?" అని వాపోయింది.
సుభద్రమ్మ అటూ యిటూ చూసి "కాస్త ఓపికపట్టండి వదినా. పరిస్థితులన్నీ వాటంతట అవే సర్దుకుంటాయి. మీ తమ్ముడుగారు అదనుకోసం చూస్తున్నారు. అంతే. ఆ దుష్టులని యిక్కడినుంచి తరిమివేసే పూచీనాది" అన్నది చేతులు త్రిప్పుకుంటూ.
రాధమ్మగారు యిటు తిరిగి మరదలివైపు దీనంగా చూసింది. "ఇంత జరిగినా మా విజయమ్మ దగ్గర్నుంచి ఏ కబురూ తెలియటం లేదే సుభద్రా. మన ఉత్తరాలకు ఎలాంటి జవాబూ లేదు. ఎక్కడ వుందో, ఏమీ యిడుములు పడుతుందో! తమ్ముడు మళ్ళీ జాబు రాశాడా?" అని అడిగింది.
"రాశాడు వదినా! నీ కంటే ఎక్కువ ఆత్రంగా జవాబుకోసం మేమూ ఎదురు చూస్తున్నాము. ఇదిగో యీ హడావుడి అయినాక ప్రశాంతంగా వాకబు చేద్దాం. నీవేమీ దిగులుపడవద్దు అన్ని విషయాలు మేముచూస్తాం" అని ఓదార్చింది మరదలు.