Previous Page Next Page 
నెత్తుటిబొట్టు పేజి 18

    "అసలు నామీద నీ కంత పంతమేమిటి?"

    "చెప్పనా? నీలోని ప్రతి అణువూ నాకు నచ్చింది కాబట్టి. ఆ అణువణువునూ అనుభవించాలని ఉవ్విళ్ళూరుతున్నాను కాబట్టి."

    "ఛీ" అంది ప్రజ్ఞ. "అది నీ తరం కాదు"

    "చూస్తాను. నిన్ను నా కళ్ళ దగ్గరకు వచ్చేలా చేసుకోకపోతే నా పేరు శివరాం కాదు."
   
   

              *                          *                      *    


    ప్రజ్ఞ రోడ్డు మీద నడుస్తోంది. హాస్పటల్ కు రిక్షాలో వెళ్దామనుకుంది. కాని చేతిలో డబ్బులేదు. అలసటవల్లా, ఆందోళనవల్లా ఆమెకు విపరీతమైన బలహీనంగా వుంది. ప్రొద్దుటి నుంచీ ఏమీ తినలేదు కూడా.

    అక్కడ తండ్రి పరిస్థితి ఎలా వుంది? డాక్టరు గారికి ఏం సమాధానం చెబుతుంది?

    లోపల్నుంచి ఉబుకుతోన్న భయం. వడివడిగా కొట్టుకుంటూన్న గుండె.

    అడుగులు తడబడుతున్నాయి.

    ఇరవై నిమిషాలు గడిచాక ఆమె హాస్పిటల్ ఆవరణలో వుంది...తన తండ్రి కోసం కేటాయించిన గదిలోకి వెళ్ళేసరికి ఎవరూ కనబడలేదు. బెడ్ మీద పడుకోవాల్సిన తండ్రి లేడు. ఆమెకు చాలా భయం  వేసింది. ఏమయింది? దగ్గర్లో సిస్టర్స్ ఎవరూ కనబడలేదు. డాక్టర్ గారి గది దగ్గరకు వెడితే ఆయన కూడా లేరు.

    "డాక్టరు గారెక్కడ వున్నారు?" అనడిగింది అక్కడున్న ఓ పేషెంట్ తాలూకూ మనిషిని.

    "థియేటర్ లో వున్నారు ఎవరికో ఆపరేషన్ చేస్తున్నారు."

    "ఎవరికి?"

    "తెలీదు."

    ఇంతలో లోపల్నుంచి ఓ సిస్టర్ అటుకేసి  వచ్చింది. "సిస్టర్" అని పిలిచింది తడబడే కంఠంతో "మా నాన్నగారికి..."

    "రూమ్ నంబర్ నైన్ లో ఆయన కదూ?"

    అవునన్నట్టు తల ఊపింది.

    "ఆయనకు లోపల ఆపరేషన్ జరుగుతోంది. ఎమర్జెన్సీ వెయిట్ చెయ్యడానికి వీల్లేకపోయింది."

    కాళ్ళ క్రింద భూమి కదిలినట్టయింది. కళ్ళ ముందు చీకట్లు క్రమముతూండగా అక్కడున్న బెంచీమీద కూర్చుండిపోయింది.


                *                      *                   *


    దాదాపు ఓ గంట గడిచాక డాక్టర్ దయాకర్ ఆపరేషన్ థియేటర్ లోంచి బయటకు వచ్చి, చేతులు వాష్ చేసుకుని తన కన్ సల్టింగ్ రూమ్ లోకి వెళ్ళాడు. ఓ నిమిషం తర్వాత ప్రజ్ఞకు కబురొచ్చింది _ లోపలకు రమ్మనమని.

    ప్రజ్ఞ గదిలోకి వెళ్ళి ఆయన కెదురుగా నిల్చుంది.

    డాక్టర్ దయాకర్ ముఖం చాలా అలసటగా, బడలికగా కనిపిస్తోంది.

    "ఉన్నట్టుండి పేషెంట్ షాక్ లోకి వెళ్ళాడు. మీ కోసం వెయిట్ చెయ్యడానికి టైమ్ లేకపోయింది. అందుకని రిస్క్ తీసుకుని ఆపరేషన్ చెయ్యాల్సి వచ్చింది."

    ప్రజ్ఞ ఎలాగో గొంతు స్వాధీనంలోకి తెచ్చుకుంది. "ఇప్పుడాయన పరిస్థితి..."

    "ప్రమాదం తప్పినట్లే. ఓ అరగంట పోయాక రూమ్ లోకి తీసుకొస్తారు."

    ప్రజ్ఞ అతనివంక కృతజ్ఞతా భావంతో చూసింది.

    "నేను...డబ్బు...ఇంతవరకూ...ఏమీ తెచ్చివ్వలేకపోయాను..." సిగ్గు, అవమానం దహించివేస్తుండగా ఒక్కొక్క మాట బలవంతాన పెగుల్చుకుంటూ అన్నది.

    "ఇప్పుడు మిమ్మల్ని డబ్బెవరడిగారు?"

    ప్రజ్ఞ అతనివంక ఆశ్చర్యంగా చూసింది.  ఇంకా  ఇరవై ఎనిమిది ఏళ్ళు నిండని ఈ యువకుడు...ఓ అద్భుతమైన మానవతామూర్తిగా _ దివ్య పురుషుడిగా గోచరించాడు.

    ఆమె కళ్ళ వెంట జలజలమని నీళ్ళు కారుతున్నాయి.

    "అరె! ఇదేమిటి?" అంటూ డాక్టర్ దయాకర్ సీటులోంచి లేచి ఆమె కెదురుగా వచ్చాడు.

    "మీకు...నేను...ఎలా..." మాట పూర్తి  చెయ్యలేక  చప్పున  అతని పాదాల మీదకు వంగింది.

    అతను చాలా కంగారుపడ్డాడు. "అరె" అంటూ ఆమె బుజాల మీద చేతులు వేసి పైకి లేవదీశాడు.


                                   7


    యోగి తన స్నేహితులతో బాతాఖానీ కొడుతూ రోడ్డు ప్రక్క చెట్ల క్రింద నిల్చున్నాడు. వాళ్ళంతా కలసి ఏడెనిమిది మంది వుంటారు. అందరి చేతుల్లోనూ సిగరెట్లున్నాయి. దాదాపు అందరికీ స్కూటర్లున్నాయి _ ప్రక్కనే కొంచెం దూరంలో పార్కు చెయ్యబడి.
    యోగికి ఇరవయ్యేళ్ళుంటాయి. దృఢంగా, ఎత్తుగా వుంటాడు. న్యారోకట్ పాంట్, బుష్ షర్టు వేసుకున్నాడు. కళ్ళు విశాలంగా వుండి కాంతితో మెరుస్తున్నాయి గాని _ వాటిలో క్రౌర్యం నిండి వుండడం చేత చూసేవాళ్ళకి అందంగా కనిపించవు.

    "ఆ అమ్మాయి ఇంకా రాలేదేం గురూ?" అన్నాడొకడు.

    "వస్తుంది. వచ్చే టైమయింది. నిన్ను కూడా ఇదే టైమ్ కి ఇటువైపు వెళ్ళింది. చేతిలో క్యారియరుంది. కాబట్టి, ఎవరికో, బహుశా హాస్పిటల్ లో వున్న ఏ పేషెంట్ కో మీల్స్ తీసుకుని వెడుతూ వుండవచ్చు" అన్నాడు యోగి.
 

 Previous Page Next Page