Previous Page Next Page 
అరణ్యకాండ పేజి 18

    గుడిసెలోనుంచి  ఓ మూలుగు  వినిపిస్తోంది.

    అడ్డపొగను  పీలుస్తూ  కూర్చున్న  ఓ వృద్ధుడు  చైతన్యముందుకు  వచ్చాడు. మామూలుగా  అయితే  అతడూ  నిరాసక్తంగా  పక్కకి  వెళ్ళి పోయేవాడేకాని ,ఎందుకో  చైతన్యను  చూడగానే  ఎదుటివాళ్ళని  సునాయాసంగా  ఆకట్టుకోగల  అతణ్ని  ఎవరన్నదీ  గ్రహించి  మౌనంగా  ఓ గుడిసెలోకి  తీసుకువెళ్లాడు.

    ఓ తుంగ  చాపపై  మృత్యువుతో  పోరాడుతూ  పడివున్నాడు  వో పదేళ్ళ బాలుడు. ఆచ్చాదనలేని  శరీరమంతా  రక్తంతో  ఓడి వుంది.

    ఒక్కగానొక్క  కొడుకు  పరిస్థితికి  దీనంగా  విలపిస్తోంది  ఓ స్త్రీ.

    "పశువుల్ని  కాసుకోడానికెళ్ళిన  పసికందుని  పదిరోజుల  కిందటే  పులి  సంపబోయింది. ఎద్దులు  కొమ్ముల్తో  పులికి  అడ్డంపడితే  సావుబతుకుల్లోవున్న  బిడ్డ పరుగుతో  వొచ్చి  వాగొడ్డున  వరకల్లో  పడిపోనాడు. ఎద్దు సచ్చింది. ఈడు  సావడానికి  సిద్ధమైవుండు__" వృద్ధుడు జరిగింది చెప్పాడు.

    ప్రపంచమే  పూర్తిగా  తెలీని  ఆ పసివాడి  పరిస్థితినిచూస్తే హృదయం  ద్రవించింది. సమయానికి  వైద్యసహాయం  అందకపోవటంతో  ఆకులతో, అలములతో  నూరిన  పసరును  శరీరానికి  అద్దారు.

    నెమ్మదిగా  సమీపంలో  కూచున్న  చైతన్య  బిక్కుమంటూ  తన వేపే చూస్తున్న  పసివాణ్ని  లాలనగా  తలపై  నిమిరాడు.

    ఏదన్నా  వివరాలు  తెలుసుకునే  స్థితికాదది. భయంతో  బెంగ టిల్లిన  పిల్లాడి  గుండె  ఆరిపోతున్న  దీపం  ఉలికిపాటుతో  ఒక్కసారి  వెలుగును  చిమ్మినట్టు  ఎగిసిపడుతున్నది.

    శరీరంలోని  రక్తమంతా  విషపూరితమైనట్టు  ఒంటిరంగు నల్లబడి  పోయిందప్పటికే. మనిషి  మాంసంతో  చిక్కుకున్న  పులిగోళ్ళు  చాలా ప్రమాదకరమయిన  క్రిములతో నిండిపోయివుంటాయి. గాయపడిన  కొన్ని గంటల్లో  సెప్టిక్  కాకుండా  జాగ్రత్తపడితే  తప్ప మరణం తప్పదు.

    అయినా, ప్రయత్నించాలనుకున్నాడు. పిల్లవాడిని  నెమ్మదిగా చేతుల్లోకి  తీసుకుని అక్కడి  వారిని  ఒప్పించి  జీపుతో  తనపక్కన కూర్చోబెట్టుకున్నాడు  మాడుగుల తీసుకువెళ్ళాలని.

    నీళ్ళు నిండిన  కళ్ళతో  ఆర్తిగా  చూసిందా బాలుడి  తల్లి. మరికొన్ని  నిముషాలలో  మరో యువకుడితోపాటు  జీపు  రివర్స్ చేసి శరవేగంతో  వెనక్కి  పోనిచ్చాడు.

    ఆ విధంగా  అక్కడి  గిరిజనులను  ఆకట్టుకోవాలని  కాదు_కేవలం మానవతావాదంతో  రక్షించాలన్న  ప్రయత్నం  మాత్రమే!

    మరో  మూడుమైళ్ళ దూరమయినా  వెళ్ళలేదు. పసివాడు నిస్తాణంగా ఒరిగిపోయాడు.

    సడెన్  బ్రేక్ వేసి  జీపు  ఆపిన  చైతన్య  నెమ్మదిగా  స్పృశించాడు. సరిగ్గా కూర్చోబెట్టాలని. చివరి మజిలీ పూర్తయినట్టుగా  వొళ్ళంతా చల్లబడి వుంది. 
                 
    మరణయాతన  నుంచి  విముక్తిపొందినట్లు  నిశ్చలంగావున్న  బాలుడిని చూస్తుంటే  కడుపు దేవినట్టయి, బాధగా  స్టీరింగ్ పైకాలానించి వుండిపోయాడు.

    మృత్యువుతో  పోరాడుతున్న, ఆచిన్ని  ప్రాణాన్ని  చివరిక్షణంలలో  రక్షించాలని  తాపత్రయపడ్డాడు. ఆ నిర్భాగ్యపు  తల్లికి  చివరి చూపయినా  దక్కకుండా  చేశాడు.

    "ఎనక్కి  యెల్లిపోదాం  దొరా!" జీపులోవున్న  ఆ యువకుడు మూల్గుతున్నట్టు  నెమ్మదిగా  అన్నాడు.
    అంతకంటే  చేసేదేమీలేదు.

    జీప్ ను రివర్స్  చేస్తూ వెనక్కు  మళ్లించాలనుకున్న  చైతన్య దృష్టి  ఎదురుగావున్న  బండరాయిపై  పడింది. సరిగ్గా  అదే  బండరాయి ఇందాక  తనను  అంతం  చేయాలని  గుట్టపై నుంచి  దొర్లిపడింది.

    చాలా యాదృచ్చికంగా  పసికందు  ప్రాణాలు  అక్కడికి  చేరేసరికే అనంతవాయువుల్లో  కలిసిపోయాయి.

    "వెనక్కి వెళ్ళిపో! బలై పోతావు."

    తను రాసిన  దానికి బదులుగా  హెచ్చరికగా  ప్రత్యర్ధివర్గం  వ్యక్తం  చేసిన  అక్షరాలు, రాతికి  సమీపంలో చాక్ పీస్ కనిపించింది.

    బిగుసుకున్న  పిడికళ్ళతో  క్షణంపాటు  క్రిందికి  దిగి, "వచ్చింది వెళ్ళటానిక్కాదు...."స్పష్టంగా  రాశాడు తన ఉద్దేశాన్ని  స్పష్టంచేస్తూ.

    విడ్డూరంగా  చూస్తున్నాడు  జీప్ లోని యువకుడు.

    ప్రత్యర్ధి  వర్గం  ఆ సమీపంలోనే  పొంచి  ఇదంతా  గమనిస్తుందన్న  విషయం చైతన్యకు  తెలీదు.

    మరికొన్ని  క్షణాలలో  జీప్ బగులవాడుని  చేరుకుంది.

    పిల్లవాడి తల్లి  ఏడుపులతో, పెడబొబ్బలతో  పల్లె  కదిలింది. చైతన్య మనసు  మెలితిరిగినట్టు  ఆక్రోశించింది.


                                                                                9

    ఎగుడు దిగుడు  రాళ్ళతో, గతుకులతో  నిండిన  బాటద్వారా మరో అయిదు మైళ్ళు  ప్రయాణం  చేసిన  జీప్ భయానకంగా  వున్న  అడవి గుండా  ఫారెస్టు రెస్ట్ హౌస్ కి చేరుకుంది.

    నట్టడవిలో  సమాధిలా  కనిపిస్తున్న రెస్టు  హౌస్ ను చేరుకోగానే  భారీగావున్న  ఓ వ్యక్తి  శాల్యూట్ చేసి జీప్ ముందు  నిలబడ్డాడు. అతని యూనిఫారం  చూడగానే  ఫారెస్ట్  గార్డుగా  గ్రహించిన చైతన్య భారీ కాయంతో, బుర్రమీసాలతో  నిలబడి__"నా పేరు తవిటయ్యండి" అంటూ  బ్రీఫ్ కేస్ ను బంగళాలోకి  తీసుకువెళుతుంటే  తొలిచూపులోనే  ఓ అసహ్యతలాంటిది  ఏర్పడిపోయింది.

    అలా ఎందు కనిపించిందో  చైతన్యకు సైతం  అర్ధంకాలేదు.

    బయటకి  వచ్చి  మళ్ళీ ఎదురుగా  నిలబడ్డ  తవిటయ్య  చూపులు  మనిషి మాంసానికి  అలవాటుపడ్డ  మృగంలా  వున్నాయి.   

    బహుశా  ఏ జీలుగుకల్లో, విప్పసారాయో  తాగి  వున్నాడేమో కళ్ళలో  ఎర్రటి జీరలు అసహ్యంగా.

    సూట్ కేస్ కూడా బెడ్ రూంలోకి  తరలించిన  తవిటయ్య  కిటికీ తెరలన్నీ  పక్కకి  తొలగించి" రేంజరుగోరు  సెప్పినట్టు  తమరికి  వొంట  తెలిసిన  ఓ ఆడదాన్ని  కూడా ఉంచేనయ్యా" అన్నాడు ఆ టెన్షన్ లో  నిలబడి  గొంతు బొంగురుపోయి  మాట సైతం  జుగుప్పని కలిగిస్తోంది.

    అతడి మాటలు  వింటూనే  బెడ్ రూంని  ఆనుకుని  వున్న డైనింగ్ హాలు, దాని పక్కనేవున్న  విశాలమయిన  హాలు  దాటి ఈ మధ్యనే  పరిశుభ్రం  చేసినట్లున్న  కారిడార్ లోకి వచ్చి  నిలబడ్డాడు.

    ఆరడుగుల  ఎత్తున  వున్న  కాంపౌండ్  వాల్ మీదుగా  చుట్టూ దృష్టి సారించాడు. పడమటి భాగంలో ఎత్తయిన  సిరిమాను, వేగిశ, కంజి చెట్లతో  పాటు, గుబురు పొదలతో  క్రూరమృగాల మాటుచేయడానికి  అనుకూలమయిన  వాతావరణమని  గుర్తు చేస్తోంది.

    సుమారు నాలుగు  వందల  గజాల దూరాన ఉత్తరం  వేపు నేలకి అయిదడుగుల ఎత్తు  ఎదిగి  ఉన్న  గడ్డిదుబ్బులు, సమీపంలో ఓ లోయ, తూర్పున  మైళ్ళ  తరబడి  వ్యాపించి  అడవికి  సరిహద్దుల్లా  బారులు తీరిన  కొండలు, వాయువ్యంగా  గుట్టకు  దిగువ  భాగంలో ఏపుగా ఎదిగిన పచ్చిక బయళ్లు, లోయని  ఆనుకుని  వున్న  ఎర్ర గుట్టపై నుంచి  అగాధంలోకి  జారుతున్న  సెలయేరు.

    ప్రకృతి  అందాలకు  స్పందించే మనసు  గల చైతన్యకు  ఆ వాతావరణం ఎంతో  ఆహ్లాదాన్ని  కలిగించింది. సహజంగా భావుకుడు. సాత్వికమయిన  మనస్తత్వం  కలవాడు_అరణ్యాన్ని  తమ వానస్థలాలుగా  భావించి  చిత్రమయిన  ధ్వనులతో  వింత  సవ్వడులతో, వివిధ ప్రవృత్తులతో  సంచరించే  మృగాలంటే  అభిమానిస్తాడు.

    అడ్వాన్సు ఫారెస్ట్రీలో  సిల్వికల్చర్  స్టడీకోసం  ఎన్నో  అరణ్యాలను  తిరిగిన చైతన్యకు  అడవులపై ఆధారపడి  బ్రతికే గిరిజనుల నిర్భీతి ఉన్న  దాంట్లోనే  తృప్తిపడే  వారి మనః ప్రవృత్తులంటే  జాలి, క్రూరమృగాలయినా  వాటిమధ్య చోటు చేసుకునే  అనుబంధాలు, అవి చేసే అల్లర్లు, పెరుగుతున్న పిల్లలకోసం  అవి పడే  తతాపత్రయాలు, వేటలో  అవి చూపే ఒడుపులు....అన్నీ  అతనికి  పరిచయమే.

 Previous Page Next Page