Previous Page Next Page 
గుళ్ళో వెలిసిన దేవతలు పేజి 18

                                 


    బాణాసంచాలు ప్రేలుతున్నాయి. భారీఎత్తున ఊరేగింపు సాగుతోంది. మేళతాళాలు మ్రోగుతున్నాయి. జనం ఒకరినొకరు తోసుకుంటూ మహాప్రవాహంలా ముందుకు సాగుతున్నారు రెండు నెలలు శిరీష దగ్గిరుండి అప్పుడే వచ్చిన పావని 'ఏవిటిదంతా?" అని అడిగింది సంఘంలో ఒక విద్యార్ధినిని.
    "మీకు తెలియదా? మీ అనుపమ దెయ్యమయి భర్తను వెంటాడింది. గుడికట్టించి దేవతగా నిలబెట్టి పూజలుచేస్తే, దెయ్యం రూపు పోతుందని ఎవరో చెప్పారు. అందుకని అమృతమూర్తిగారు గుడి కట్టించి, అనుపమగారిని దేవతగా నిలబెట్టి..."
    తరువాత మాటలు వినలేకపోయింది పావని. అనుపమను దేవతగా నిలబెడుతున్నారా? అనుపమ సుఖంగా సంసారం చేసుకుంటుందనే ఆశతో ఇచ్చిన కట్నం ఈ విధంగా ఉపయోగపడుతోందా? అనుపమను దేవతగా పూజించటానికి బయలుదేరిందా ఈ జనప్రవాహం? ఎంత మూర్ఖులు ఈ మందలాంటి జనం!
    పూజారులు మంత్రాలతో అనుపమ విగ్రహాన్ని గుళ్ళో ప్రతిష్టిస్తున్నారు. పావని "ఆగండి?" అని గర్జిస్తూ ఆ జనప్రవాహానికి ఎదురునిల్చింది.
    "అనుపమని మనిషిగా నిలవనీయని మీరు దేవతగా నిలబెట్టాలని చూస్తున్నారా? సాటి మనిషిని మనిషిగా చూడలేనిమీరు.....ఎదుటి వ్యక్తి వ్యక్తిత్వాన్ని మన్నించలేని మీరు.....స్వార్ధాలతో, అహంకారాలతో కుల మత వర్గ భేదాలతో, ఎదుటివారిని సుఖపడనీయక, మీరు సుఖపడలేక బ్రతుకులు చికాకులు చేసుకునే మీరు....నిజాన్ని నిర్భయంగా ఎదుర్కోలేక మూఢాచారాల మాటున దాక్కొని దేవుళ్ళనీ దెయ్యాలనీ మీ పిరికి మనసులకి అడ్డుగా పెట్టుకోవాలనుకుంటున్నారా? ఆపండి? అనుపమని దేవతగా పూజించటానికి వీల్లేదు..."
    జనానికి ఒళ్ళు మండిపోయింది. వెర్రెత్తిపోయింది. వాళ్ళలో చాలామందికి అనుపమ దేవత కలల్లో కనిపించి రకరకాల ఆదేశాలిచ్చింది మొక్కుకుంటే ఎందరికో ఎన్నో రోగాలు నయమయ్యాయి.
    తమ దేవతని దేవత కాదంటోంది! నాస్తికురాలు! పాపిష్టిది! సిగ్గూ ఎగ్గూ లేకుండా మొగున్నొదిలి సంఘాలంటూ బజారునపడి తిరిగిన ఆడది...ఆడది చెడిపోయినా ఫరవాలేదని తమ సంస్కృతినే తగలబెడుతోన్న పిశాచం...
    పావని మీదకు కర్రలు లేచాయి. రాళ్ళవర్షం కురిసింది...ఆ ఉన్మాదంముందు ఉదాత్తప్రకృతి కూలిపోయింది.
    "పావనీ!"
    ఆర్తిగా పిలుస్తోన్న ఆ కంఠం విని అతి కష్టంమీద కళ్ళు తెరిచింది పావని. కళ్ళకెదురుగా విఠల్ ముఖం కనిపించేసరికి "మీరా?" అంది బలహీనంగా.
    "ఇప్పుడెలా ఉంది పావనీ!" ఆరాటంగా అడిగాడు విఠల్.
    అప్పుడు జరిగినవన్నీ ఒకదాని వెనుక ఒకటి గుర్తుకొచ్చాయి పావనికి...
    "అనుపమని దేవతగా ప్రతిష్టించారా?" అంది.
    "ఆ! వాళ్ళు మానతారా? చాలామందికి అనుపమ కనిపించిందట! నువ్వెందుకంత తీవ్రంగా ఆడుకున్నావు? ఏమో! అనుపమ నిజంగానే దేవతే అయిందేమో!"
    విఠల్ ముఖంచూసి నవ్వింది పావని...
    "నన్ను వెంటనే శిరీష దగ్గిరకి తీసికెళ్ళండి..." అంది.
    "ఈ స్థితిలోనా?"
    "అవును-అర్జంట్! ఇప్పుడు నన్ను తీసుకువెళ్ళకపోతే, ఆ తరువాత మీరు జీవితాంతమూ కుమిలిపోవలసి వస్తుంది..."
    పావని మాట కాదనలేక టాక్సీలో పావనిని శిరీష దగ్గిరకు తీసుకువెళ్ళాడు విఠల్.
    శిరీష ఇంట్లో అనుపమని చూసి నివ్వెరపోయాడు విఠల్.
    విఠల్ ను చూసి తడబడిన అనుపమ పావనిని ఆ స్థితిలోచూసి "వదినా! ఏమిటిది? ఆ దెబ్బలన్నీ ఏమిటి? నిన్ను కొట్టిన రాక్షసు లెవరూ?" అంది ఏడుస్తూ, అన్న ఉనికిని మరిచిపోయి.
    పావనికి బలహీనంగా ఉంది లేని ఓపిక తెచ్చుకుని కష్టంమీద విఠల్ తో మాట్లాడింది.
    "చూశారా! మీ చెల్లెల్ని మీకు అప్పగిస్తున్నాణు. నా సంఘంలో ఉంటే నయభయాల మళ్ళీ తీసుకుపోతారని బెదిరిపోయింది. అంచేత శిరీష దగ్గిర ఉంచాను....నేనూ, శిరీష ఎంతో నచ్చజెప్పి, ఆత్మహత్యా చేసుకోవాలనే ఆలోచన మనసులోకి రాకుండాచేసి, అనేకవిధాల ధైర్యంచెప్పి ఉద్యోగంలో చేర్పించాం! గుర్తుందా! ఆ రోజు మీరు రాత్రివేళ మా సంఘానికి వచ్చారు. అప్పుడే అనుపమ నా దగ్గిరకు వచ్చింది....బెదిరిపోయి చెదిరిన గుండెతో బ్రతుకుమీద ఆశలేకుండా నన్ను వెతుక్కుంటూ వచ్చింది. ఆ సమయంలో అనుపమను మీరుచూస్తే తప్పకుండా మళ్ళీ భర్తదగ్గిరకు పంపించటానికే ప్రయత్నిస్తారని భయపడ్డాను. అదీగాక అనుపమ ఎవరినైనా కలుసుకుని మాట్లాడగలిగే దశలోలేదు అప్పుడు.....అందుకే మిమ్మల్ని లోపలికి రానియ్యలేకపోయాను...మీరు ఏమనుకున్నారో కదూ..."

                    


    మాట్లాడలేక ఆగిపోయింది పావని....విఠల్ కి ఆనాడు తాను పొందిన ఆశాభంగం, ఆవేదన గుర్తుకొచ్చాయి.
    "నువ్వు తప్పుచేసావని అనుకోలేదు పావనీ! నాకు సరిఅయిన శిక్షనే విధించావని అనుకున్నాను."
    "నా భర్త నన్ను అపార్ధంచేసుకోరు" అని నిశ్చింతగా అనగలిగిన నిన్ను ఊహామాత్రంగానైనా అనుమానించాను. మళ్ళీ నీ దగ్గిరకు రాగలిగే అర్హత నా కెక్కడిది?"
    "మీరు నన్ను అనుమానించలేదు. మీ పావనిని గురించి ఇతరులు మరో రకంగా అనుకోవడం సహించలేకపోయారు. ఆ ఆవేశంలో ఉన్న మిమ్మల్ని నేను తప్పుధారి పట్టించాను. నేను అభిమానవంతురాలినే! కానీ, నా అభిమానానికి మిమ్మల్ని కాదని తిరస్కరించేటంత శక్తిలేదు. విధిలేక మీకు దూరంగా ఉండిపోయినా ప్రతిక్షణమూ మీ పిలుపుకోసమే ఎదురుచూస్తున్నాను. ఆ నిరీక్షణే యాంత్రికమయిన నా జీవితంలో నేను మిగుల్చుకున్న మాధుర్యం...నా ఉనికికి ఆధారం...నాకు దేవతలలో నమ్మకంలేదు. దెయ్యాలంటే నమ్మకంలేదు. కానీ ప్రేమలో నమ్మకం ఉంది.....నేను మిమ్మల్ని ప్రేమించాను. నా త్రికరణాలతో ప్రేమించాను. మీరు నా దగ్గిరకిరాక తప్పదు. ఆ ధైర్యమే. ఆ నమ్మకమే, నా కర్తవ్యనిర్వహణకి కావలసిన నైతికబలాన్నందించింది నాకు..."

 Previous Page Next Page