ఓపిక లేకపోయినా విఠల్ తో మాట్లాడాలనే ఆశతో అన్ని మాటలు మాట్లాడిన పావని అలసటతో కళ్ళుమూసుకుంది.
పనిమీద ఎక్కడికో వెళ్ళివచ్చిన శిరీష పావనిని ఆ స్థితిలో చూసి సంగతులన్నీ తెలుసుకుని చాలా బాధపడింది.
విఠల్ డాక్టర్ని పిలుచుకొచ్చాడు. సంగతి తెలిసి అందరూ వచ్చారు.
ఒక కూతురుపోయిన దుఃఖంలో కుమిలిపోతోన్న సుందరమ్మ పావనిని ఆ స్థితిలో చూసిసహించలేకపోయింది.
"పావనీ! నా తల్లీ! నన్ను వదిలిపోకే! నీకోసం ఏమైనా చేస్తాను. సంఘాన్నంతటినీ ఎదిరిస్తాను." అని ఆక్రోశించింది.
పావని మెరుస్తోన్న కళ్ళతో "ఏమన్నావ్? సంఘాన్ని ఎదిరిస్తావా? మళ్ళీ అను..." అంది.
"ఆ! ఆ! నా కూతురి కోసం ఏమైనా చేస్తాను. మనుష్యులు సుఖంగా బ్రతకటానికి లేకపోయాక ఎందుకొచ్చిన ఆచారాలివి?" అంది సుందరమ్మ ఏడుస్తూ.
"ఏడవకే! అమ్మాయి బ్రతుకుతుంది. ఎందరికోసమో పాకులాడిన ఆ మంచితనమే అమ్మాయిని కాపాడుతుంది..."
ఏడుపు నిగ్రహించుకుంటూ భార్యను ఓదారుస్తున్నట్లుగా కూతురికి ధైర్యం చెప్పాడు జగన్నాథం.
పావని ఆశ్చర్యంగా తండ్రిని కళ్ళెత్తిచూసింది.
దిగులుగా ప్రేమగా నవ్వాడు తండ్రి.....ఒక్క నిట్టూర్పు విడిచింది పావని.
పద్మావతి పావనిని చూసి క్రుంగిపోయింది. అనుపమనిచూసి పొంగిపోయింది. ఆనందం పట్టలేక పసిపిల్లను కౌగలించుకున్నట్లు అనుపమని కౌగలించుకుని "అబ్బా! నా కడుపు చల్లగా నా కళ్ళకి మళ్ళీ కనిపించావే! నువ్వు చచ్చిపోయావనుకుని ఎంతగా కుమిలి కుమిలి ఏడ్చాను? నా బంగారుతల్లివి. మళ్ళీ నిన్ను కళ్ళచూస్తాననుకోలేదే? ఎంత అదృష్టం!" అంది.
"నీలాంటి అభాగ్యులనేకుల కడుపు చల్లగా నాలాంటి దౌర్భాగ్యులను ఆదుకోవటానికేనమ్మా, వదిన తనను తను బలిచేసుకోవటానికి సిద్దపడుతున్నది, ..." అంది అనుపమ ఏడుస్తూ.
"ఏ దేవుడైనా నా ఆయుర్దాయం తీసుకుని నిన్ను బ్రతికిస్తే బాగుండునే పావనీ!" అంది పద్మావతి పావని మంచం ప్రక్కనే క్రింద కూలబడి.
"మీ అందరి మనసులలో ఇంత మంచిస్థానం సంపాదించుకొన్న నాకు చావు ఎక్కడుంది అత్తయ్యా?" అంది పావని సంతృప్తితో.
అనుపమ బ్రతికే ఉందని తెలిసి సిగ్గుపడుతూ వచ్చాడు అమృతమూర్తి.
"అనుపమా? నన్ను క్షమించు-నువ్వు దూరమయిన నాటినుండీ ఒక్కనాడూ కంటినిండా నిద్రపోలేదు. కడుపునిండా అన్నం తినలేదు" అన్నాడు.
నిజంగానే అమృతమూర్తి చిక్కిపోయాడు. అతడిని చూడగానే జాలిపడుతోన్న తన మనసుమీద తఃనే చికాకుపడింది అనుపమ "ఛీ! ఆడమనసు..." అనుకుంటూ.
"మీ అశాంతికి కారణం అనుపమ మీకు దూరమవటం కాదండీ? మీ మూఢనమ్మకాలు!" కరుగ్గా అంది శిరీష.
"అది కాదనలేను. కానీ ఎక్కడికి పోతుందిలే అనుకున్నంత కాలం అర్ధంకాని విలువ పూర్తిగా చెయ్యిజారిపోయింతరువాత అనుభవంలోకి వచ్చింది. నేను నిజమే చెపుతున్నాను." అన్నాడు అమృతమూర్తి.
"మా అనుపమని ఏ విధంగానూ బాధపెట్టనని మాట ఇస్తే తప్ప పంపను" అంది పద్మావతి,-అప్పటికీ ఖండితంగా 'పంపాను' అనలేక.
"నీకు ఇష్టంలేకపోతే వెళ్ళక్కర్లేదు అనుపమా! సంసారమనిషి అన్యోన్యంగా కలిసి మెలిసి సుఖంగా ఉండటానికి కాని, సంఘంకోసం ఒకరినొకరు అసహ్యించుకొంటూ కలిసిపడి ఉండటానికి కాదు!" అన్నాడు విఠల్.
"శబాష్!" అంటూ చప్పట్లు కొట్టింది శిరీష..
"ఆయన దగ్గిరకు వెళ్ళటానికి నాకు ఎందుకు ఇష్టంఉండదు అన్నయ్యా! నిలవనీయకుండా తరిమికొడితే దూరంగా వచ్చాను. కాని నా అంతట నేను నా సంసారాన్ని వదులుకుంటానా? ఆదరాభిమానాలతో అందలాలు ఎక్కించక్కర్లేదు. సాటి మనిషిగా చూడగలిగితే చాలు! సర్దుకు పోవటానికే ప్రయత్నిస్తాను."
"ఇదీ ఈనాటికీ మన స్త్రీల మనస్తత్వం....అమృతమూర్తిగారూ! మీరు అదృష్టవంతులండీ! మళ్ళీ మా అనుపమను దేవతగానో, దెయ్యంగానో మార్చెయ్యక మనిషిగా బ్రతకనీయండి!" అంది శిరీష
పావనిని చూడటానికి రవి కూడా వచ్చాడు.
"మళ్ళీ పరీక్ష పాసయ్యేవరకూ నీ ముఖం చూడలేక నీ దగ్గిరకి రాలేక పోయాను వదినా! అసలు నువ్వు ఇంట్లోంచి వెళ్ళకపోతే, నేను ఇలా రౌడీస్నేహాలతో పాడయ్యేవాడిని కాను. ఎందుకు వెళ్ళిపోయావు వదినా?" అన్నాడు రవి ఏడుస్తూ.
పావని రవి తలమీద చెయ్యివేసి అభిమానంగా నిమిరింది.
"నేను మీ అందరి దగ్గిరనుండి ఎందుకు వచ్చేసానో, ఇప్పుడు నీకు అర్ధం కాదు. కానీ, నీ భార్యకి మాత్రం ఇంట్లోంచి వెళ్ళిపోయే దురదృష్టం కలగనియ్యకు..."
పావనిని చూడటానికి నళినికూడా వచ్చింది. పట్టరాని దుఃఖంతో "మేడమ్ ఏం తప్పుచేసారని ఇంత దారుణంగా హింసించారు?" అంది.
"క్రీస్తు ఏం తప్పుచేసాడని శిలువ వేసారు? ఒక క్రొత్త మార్గాన్ని చూపిస్తే...పరంపరగా వచ్చే సూత్రాలకందని సత్యాన్ని వివరిస్తే జనం అంగీకరించలేరు. ఆ వ్యక్తులను సర్వనాశనం చేస్తారు. వ్యక్తులు నాశనమయినా సత్యాలు నాశనం కావుగనుక, అవి నెమ్మదిగా అర్ధమవుతాయి. అప్పుడు తెలివి తెచ్చుకుని తాము నాశనం చేసిన వ్యక్తులను తామే దేవతలని ఆరాధిస్తారు." విషాద స్వరంతో అంది శిరీష.
శంకర్ నళినిని వెతుక్కుంటూ వచ్చాడు.
"నన్ను క్షమించు నళినీ! సరళదేవత నా కలలో కనిపించి నిన్ను పెళ్ళిచేసుకోమని చెప్పారు! మనిద్దరమూ ఆవిడ మాటను గౌరవించాలి?" అన్నాడు.
ఆ మాటలు విని భరించలేకపోయింది పావని.
"దెయ్యాలకు భయపడుతూనో, దేవతలను ఆశ్రయిస్తోనో తప్ప మనుష్యులు మనుష్యులలాగ బ్రతకలేరు కాబోలు! ఇదేనేమో మానవచరిత్ర సారాంశం!" అంది ఆవేశంగా.
పావని అంత ఆవేశపడటం చూసి భయపడింది శిరీష.
"ఊరుకో! విశ్రాంతి తీసుకో? మాట్లాడకు!" అంది.
"ఫరవాలేదు ఇంక నాకే భయంలేదు. నా శరీరంలోకి అమృతం ప్రవహిస్తోంది."
"అమృతం ప్రవహిస్తోందా?"
"అవును! ఇదిగో చూడు! ఈ స్పర్శలోంచి..."
తన చెయ్యి ప్రేమగా దృఢంగా పట్టుకున్న విఠల్ చేతిని ఎత్తి చూపింది పావని.
జంటగా ఉన్న ఆ చేతులను ముగ్ధురాలై చూసింది శిరీష.
---సమాప్తం---