Previous Page Next Page 
శతఘ్ని పేజి 18

 

    "మల్లేశమా...."
    
    "అవ్" అవతల ఫోన్ రిసీవ్ చేసుకున్న అబ్కారీ శాఖ మంత్రి మల్లేశు అలర్టయిపోయాడు నిద్ర మత్తులోకూడా అర్జెంటుగా ముఖ్యమంత్రిగారి పి.ఏ గాని ఫోన్ చేశాడేమో అనుకుంటూ "నేను గౌడ మల్లేశాన్ని మాట్లాడ్తున్న....."
    
    "నాపేరు త్యాగి...."
    
    బోధపడింది ఎవరో "నువ్వా...."
    
    "అవును..."
    
    "గీటైమ్ లో ఫోన్ చేసినవ్..."
    
    "అవసరంపడింది మల్లేశు.....నిజానికి సరాసరి నీ తమ్ముడిదగ్గరికి వెళ్ళి తోలువలిచేవాడ్నే కానీ మూలపురుషుడివి నీకేసరాసరి అల్టిమేటమ్ యివ్వాలనిపించింది......"
    
    "దిమాక్ లేని మాటల్ మానెయ్...." తనుమంత్రి నన్నవిషయం గుర్తుకొచ్చి కాస్త రోషాన్ని ప్రకటించాడు. "ఇసువంటి టైంలో మంత్రుల్కా ఫోన్ గొట్టడం....."
    
    "కాస్త ప్రశాంతంగా విను మల్లేశం. నీ ప్రియమైన అనుచరుడు సత్తి చావు దెబ్బలుతిని తన యింటిముందు పడి వున్నాడు......కొట్టింది నేనే.....ఎందుకంటే నా యింటికి వచ్చి నేను లేనపుడు నానా రభసా చేశాడు. కాబట్టి....ఇలాకొట్టినందుకు పోలీసులకి ఫోన్ చేస్తానని హుంకరించకు........పోలీసులదగ్గరికి వెడితే నువ్వు ముఖ్యమంత్రి ఆదేశంపై నా ఇంటిపై దాడిచేసిన విషయం బయటపడుతుంది.....అలా పత్రికలోపోయి నీ శక్తిక్షీణించిపోతుంది"
    
    ఫోన్ క్రెడిల్ చేసిన మల్లేశంకి ఆ రాత్రినిద్రపట్టలేదు. ఇది నిజమా అనుకున్నాడు. సత్తి లాంటివాడ్ని ఓ మామూలు వ్యక్తిచిదగ్గొట్టడమేమిటి అనుకుంటూ తెల్లవార్లూ గడిపాడు. ఇలా గూండాలు తన్నులుతింటూపోతే తనలాంటివాళ్ళ భవితమేమిటిఅనుకుంటూ తెల్లవారగానే సత్తికి కబురుపెట్టాడు. ఒళ్ళు మండిపోయింది సగానికి పైగా బేండేజిచుట్టుకున్న సత్తిని చూడగానే....."ఏందిది?"
    
    జరిగింది మంత్రిగారికి తెలీదనుకున్నసత్తి నిన్న సాయంకాలం జరగాల్సిందెంతవరకూ వచ్చిందని అడుగుతాడనుకున్నాడు.
    
    "అది ఇంటికి జీప్ లోపోయనం, సెమ్డా లూడగొట్టేటోడ్నిగాని ఆడు చుటాయించిండు.......గంతే దర్వాజాలు గిట్టబద్దలు జేసినం."    

 

    "గొంతమనకి నిన్నే దెల్సు.....గిదేంది?"
    
    సత్తికొంచెం కంగారు పడినా...... "ఓస్సిదా" తేలిగ్గా నవ్వేశాడు "నిన్న జర్రంతమందు పోసుకుని యింటికొస్తావుంటే లారీ టక్కరైనది......"
    
    "లారీటక్కరైనాది....."
    
    "అవ్......"
    
    "అందుకే యీ దెబ్బల్ తగిల్నయా?"
    
    "ఆవ్"
    
    "తూనీయవ్వ" కాండ్రించివుమ్మాడు. "బేష్ రమ్ నా కొడకా......యిజ్జత్ దీసినవ్ గద్రా.......షేర్ నన్జెప్పి బొర్ర యిరుసుకుతిరిగేటోన్వి గద్ బే.....గింతమొగాడివట్రా.....లారీటక్కరైనాది.......నేనుహవులాగానితిరుగొడుతున్నలే..... నీకాందాన్......."
    
    కాందాన్ (వంశ వృక్షం) మొత్తాని దులిపేసేవాడే కాని హఠాత్తుగా సి.ఎం.నుంచి ఫోన్ అన్నాడు పి.ఏ......
    
    ఒక్క అంగలో హాల్లోకి పరిగెత్తుకొచ్చినమల్లేశం అమాంతం రిసీవర్ని అందుకుని "అన్నా..... నేనేమాట్లాడ్తున్న" అన్నాడు.
    
    నిశ్శబ్దం.....
    
    "అగో...మాటాడవేందన్నా."    

    "అర్జెంటుగాయింటికిరా."
    
    ఫోన్ చేసిన పెద్దమనిషి వెంటనే ఇంటికెందుకు రమ్మన్నాడో అర్ధం కాలేదు. ఒకవేళ సత్తి తన్నులుతిన్న విషయం ముఖ్యమంత్రికి తెలిసిపోయిందేమో అని కూడా ఆందోళన పడుతూ ఎదురుగా నిలబడ్డ సత్తిపై విసుగ్గా అరిచాడు "నీ యవ్వ గట్లా కట్టుకట్టుక్కూసోడం కన్నా కాల్వలో బడిసావాలె......గల్లిల్లోగివి కట్టుకుని తిరిగితే నలుగురూ  వుముస్తరు......ఆడంగిదానిలాగింట్లో కూసో."
    
    ఆఘమేఘాలమీద ముఖ్యమంత్రిగారింటికి వచ్చిన మల్లేశు రాజారాం నేత్రాల్ని చూడగానే బెంబేలుపడిపోయాడు. "అన్నా.......బంటులాటోన్ని గట్ల కోపగించుకోక.......నాతోనతప్పయిన సెప్పుదెబ్బకొట్టు....... "రాజారాం మాట్లాడలేదు.
    
    కొంపదీసి బర్తరఫ్ చేసే ప్రయత్నంలో ఉన్నాడేమో అనిపించి మరింత ఆందోళన ప్రకటించాడు"నువ్ గట్ల జూస్తే బయమైతున్నదే......పరేశాన్ చేయక నా తప్పేటో సెప్పు.....అవ్" "ఈరోజు పేపర్ చూశావా?"
    
    "తెప్పిచ్చాగాని చదవడాన్కి నేను అన్ పడ్ గాడ్నిగదే"
    
    "సినిమా బొమ్మలు చూసినా.....యియ్యాల సిరంజీవి సినిమా రిలీజని పెద్దబొమ్మ యేస్తే జర్రంతయక్కువసేపు చూసినా....."
    
    తలపట్టుకున్నాడు ముఖ్యమంత్రి.
    
    "సిరంజీవిబొమ్మ గంటసేపు సూట్టంతప్పితే చెవులు పట్టుకుంటాగాని గిట్టానువ్ తల పట్టుకుని...."
    
    "మల్లేశూ....." అరిచాడు రాజారావు"నేను అడుగుతున్నది ఈ బొమ్మ గురించి...."
    
    చూపించాడు 'అబ్జర్వర్' పత్రికలో త్యాగి పబ్లిష్ చేయించిన ఫోటోని, విరిగిన కుర్చీ......చిరిగిన కాగితాలు ......చిందరవందరగావున్న గది.
    
    "ఆవ్....చూసినా"
    
    "ఇదేమిటో తెలుసా?"
    
    "సదూకుంటేమంచిగా తెలిసేదన్న! సిన్నతనంలో మా అయ్య బీగదేచెప్పిండుగాని నేనుజరంత నిర్లక్ష్యం జేసినా...."
    
    "సోది ఆపెయ్..." కసురుకున్నాడు రాజారాం. "ఇది త్యాగిగాడి గది.... ఆ గదిలో నీ మనుషులు వెలగబెట్టిన నిర్వాకం! అసలు నేను చెప్పిందేమిటి...నువ్వు చేసిందేమిటి.....వాడు ఏం రాశాడో తెలుసా?"
    
    తనలాగే ముఖ్యమంత్రికి ఇంగ్లీషు రాదని తెలుసుగాని చదివించుకుంటాడని బోధపడిపోయింది.
    
    "నాకు వ్యతిరేకంగా రాసినందుకు నా గూండాలే ఇలా దాడిజరిపారంటాడు. శాంతిభద్రతలు పాటించని పభుత్వంలో పత్రికా స్వేచ్చకేముప్పువాటిల్లితేయిక సామాన్యుడి సంగతేమిటి అంటూ ముఫ్ఫై లక్షలమందికి తెలిసేట్టు అవాకులూ చెవాకులూరాశాడు....."
    
    "గట్లరాస్తే మనం వూకుంటమా.....ఆధారాలు గిట్ట సూపిచమనినిలదీస్తమ్......"

 Previous Page Next Page