Previous Page Next Page 
రాకోయి అనుకోని అతిథి పేజి 18

 

       కార్యకర్తలు మొహాలు చూసుకున్నారు. పగటిపూట కార్యక్రమాల్లో అలసిన మంత్రివర్యులు లోపల మందు సేవిస్తున్న సమయంలో నిజానికి ఎలాంటి అపాయింట్ మెంట్స్ కీ అవకాశం లేదుకాని ఏకాంత అందంగా వుండటం వారికి నచ్చింది.
    
    అందంగా వున్న అమ్మాయి ఆ టైంలో కలుసుకోవాలనడమూ ముచ్చటనిపించింది.
    
    అంతే సెక్రట్రీకి చెప్పారు. సెక్రెట్రీ మంత్రిగారి చెవిలో వేశారు. సూర్నారాయణ కాదనేవాడే కాని 'ఓ అమ్మాయి' అనేసరికి కాసింత ఉత్సాహపడ్డాడు.
    
    అయిదు నిమిషాల వ్యవధిలో ఏకాంతకి అపాయింట్ మెంట్ దొరికింది.
    
    గదిలోనికి అడుగుపెట్టిన ఏకాంత ముందు అమ్మాయిలా అనిపించింది. మరో పది లిప్తలకి లక్షల నక్షత్రాలను మోస్తున్న పాలపుంతంత అందంగా కనిపించింది. వెనువెంటనే కవ్వించే అదృష్టం నెరజాణగా అవతారమెత్తి సౌఖ్య నగరపు కూడలిదాకా నడిపించగల సైన్ పోస్టులా తోచింది.
    
    "చెప్పండి" అన్నాడు "చెప్పు" అనబోయి.
    
    నవ్వింది అదోలా.
    
    మందు మత్తు విరిగిన సూర్నారాయణకి మరోలాంటి మైకం ఆవహిస్తూంది ఆమెను చూస్తుంటే...
    
    "అందరిలో కాదు" అంది గదిలో మరో ఇద్దరు అపరిచితులుండటాన్ని గుర్తుచేస్తూ.
    
    నషాళానికి అంటుకున్న సూర్నారాయణ నిషాతో గావుకేకలు పెట్టాడు తన దగ్గరున్న తన వాళ్ళని చూస్తూ "ఏం మనుష్యులయ్యా... మీరంతా వుంటే ఆడపిల్ల తన కష్టమెలా చెప్పుకుంటాది... బయటికి వెళ్ళండి."
    
    గభాలున బయటికి పరుగెత్తారు 'మరో' ఇద్దరూ.
    
    "థేంక్స్" అంది అతడికి అభిముఖంగా కూర్చుంటూ.
    
    శతత్పూర్ణిమల స్త్రీత్వాన్ని అర్పించటానికి అవసరమయ్యే హోమగుండం కోసం వెదుకుతున్నట్టు ఆమె దిక్కులు చూస్తుంటే "రా కూర్చో" అన్నాడు ముందున్న కుర్చీ చూపిస్తూ.
    
    "థేంక్స్" అంది అతడికి అభిముఖంగా కూర్చుంటూ.
    
    "ఏం సహాయం కావాలి?" ఏకాంతని కాదు ఆమె శరీర సౌష్టవాణ్ణి చూస్తూ తొందరలో మరో గుక్క తాగాడు.
    
    "వేయనా" అంది గోముగా.
    
    "మందా?"
    
    "కాదు!"
    
    "మరి"
    
    "తలుపులు"
    
    రెచ్చిపోయాడు సూర్నారాయన "తెరిచివుంటే చెప్పకూడని కథా?"
    
    "అవును"
    
    "అయితే మూసేయ్"
    
    ద్వారాన్ని మూయటానికి ఆమె లేవబోతుంటే తనే ఉద్విగ్నంగా కదిలి గడియ పెట్టేశాడు ఆలస్యం తాళలేనట్టుగా.
    
    "తెలివైనవారే" అంది నిర్లిప్తంగా.
    
    "అదేమిటి?"
    
    "నేను ద్వారమే వేయమంటే మీరు గడియ కూడా పెట్టేశారు"
    
    "మధ్యలో మరెవరన్నా వస్తే అసహ్యంగా వుండదూ" అన్నాడు సూర్నారాయణ నుదుట పట్టిన చెమటని కంగారుగా తుడుచుకుంటూ.
    
    "ఏ మధ్యలో?"
    
    "మన మధ్యలో"
    
    నవ్వేసింది.
    
    "నీ పేరు?" అడిగాడు ఉత్సుకతగా మందు గ్లాసులో ఒంపుకుంటూ.
    
    "ఏకాంత"
    
    "పేరు బ్రహ్మాండంగా వుంది"
    
    "పేరు మాత్రమేనా?"
    
    "నువ్వు కూడా"
    
    "థేంక్స్"
    
    "చెప్పు నీ సమస్యేమిటి?"
    
    "జీవితం"
    
    ఇంత అందమైన తెలివైన అమ్మాయికి జీవితం ఓ సమస్య కావడం ఇష్టంలేనట్టనిపించిన సూర్నారాయణ "నువ్వు సరేనంటే నేనున్నాను" అన్నాడు పూనకం వచ్చినట్టు వూగిపోతూ.
    
    "మీరు సమర్ధులని తెలుసుకోబట్టే మీ దగ్గరికొచ్చాను సూర్నారాయణగారూ... నేనో అనాథని..."
    
    "నేనున్నానని చెప్పాక నువ్వు అనాథవెలా అవుతావు?"
    
    ఏకాంత తల వంచుకుంది. రెండు నిమిషాల విరామం... ఒంటిలోని అణువణువూ విస్ఫోటనం చెందుతున్నట్టుగా వుందామెకి. ఎంత కృతకంగా వుంది. ఎవరూ రాయని నాటక రంగస్థలంపై ఇమిడి తన పాత్ర నటించడము చాలా బాధని కలిగిస్తూంది.
    
    ఏకాంత నిశ్శబ్ధాన్ని భరించలేనట్టు అమాంతం చేతులు ముందుకు సాచి ఆమె తల పైకెత్తాడు "ఏమైంది?" ఆమె కళ్ళలోని నీళ్ళను చూసి బోలెడంత చలించిపోయాడు "ఏం జరిగిందో చెప్పు"
    
    చెప్పటానికి చాలా వున్నా ఏకాంత ఏ విషయమూ చెప్పలేదు... ఇప్పుడు ఆమె కోరుకుంటున్నది సవ్యసాచి గురించి చెప్పి సానుభూతిని సంపాదించడం కాదు. అతడ్ని క్షణక్షణమూ ఓడించగల పరపతిని అందించే సూర్నారాయణ అండ...అసలు ఆమె నేత్రాలు అశ్రుశిక్తం కావటానికి కారణం సవ్యసాచి గుర్తుకురావడం కాదు. ఒకనాడు తనకు తెలీకుండా తనను తాను కోల్పోతే ఇప్పుడు తెలిసే తనను తానే పోగొట్టుకోవటానికి సిద్దపడుతూంది. తననొకనాడు కబళించిన శిలా జ్ఞాపకాలు ఎంత బాధాకరమైనాగానీ ఈ రోజు కోరి పతనంలో అడుగుపెట్టబోతుంటే మనసు హర్షించడం లేదు. కన్నీళ్ళు నేస్తాలై వేదన అదిగా రాయబోయే గ్రంథానికి శిథిల యౌవనం పెట్టుబడిగా పెట్టడం అవసరమా? అని నిలదీస్తుంటే ఏం జవాబు చెప్పగలదని.
    
    ఎవరి చేతులో ఆమెను తాకుతున్నాయి. స్పష్టంగా తెలుస్తూనే వుంది ఆ చేతులు సూర్నారాయణవని ఆమె వారించడం లేదు. విషవాయు ప్రసరణం లాంటి నిట్టూర్పులు... చావు బ్రతుకుల సంధికాలంలో మనసును మెలిపెట్టే చమురు వాసన... భావికి చేజేతులా ఇచ్చిన తాళంచెవిని పట్టుకుని ఓ అవకాశవాది ద్వారాల్ని తెరుస్తుంటే జీవిగానో చిరంజీవిగానో తలవంచిన ఆమె కనులనుంచి రాలే అశ్రువులు ఎంతగా కలవారపరుస్తున్నాయని...
    
    ఆమె నేలపైకి జారింది, ఏ స్మృతులో కదిలి కలవరపెడుతుంటే.
    
    ప్రియా... నీకు నన్ను నేనుగా అర్పించుకోవాలని ఎదురుచూసిన క్షణాలు ఇంకా నాకు గుర్తున్నాయి. చీకటిపడుతున్నా, తెల్లవారుతున్నా అభిసారికలా నీ కోసం నిరీక్షించటం ఇంకా నాకు జ్ఞప్తికుంది. కానీ ఏం చేయను? మబ్బులు కమ్మిన వర్తమానం నా స్పష్టమైన రూపాన్ని నీకు కనిపించకుండా నన్ను ఓడిస్తే గుబులుగా నీకు నిజం చెప్పాలని ఎన్ని యుగాలు ఎదురు చూశానని...నన్ను కాదన్నావుగాని నువ్వే జాలితో నా ముందుకు వచ్చి వుంటే ఏ ఈదురుగాలి నన్ను నీ నుంచి నెట్టిందో, ఏ ప్రభంజనపు దుమారం నీ నుంచి నన్ను దూరం చేసిందో చెప్పేదాన్ని. ఏదీ ఆ అవకాశము నువ్వు నాకివ్వలేదుగా! ఏముంది నాకు.... ఆషాడ వర్ష నిశీధి ఛాయల్లో గర్జించే మేఘ రథాన్నెక్కి ఎప్పటికయినా నువ్వు వస్తావన్న ఆశతప్ప... నా చివరి కోరిక ఒక్కటే ప్రభూ... నీకెప్పుడు దయకలిగితే అప్పుడు నిశ్శబ్దంగా నా పక్కన వచ్చి కూర్చో... నా మాటల్ని వినటానికో, నా మొహం చూడటానికో మనస్కరించకపోయినా మరణవాంగ్మూలం లాంటి నా గుండె చప్పుళ్ళని వింటూ నేనేమిటి అన్నది తెలుసుకో అది చాలు... మరో జన్మలో అయినా నీ మనిషిలా పుడతాను. నీ ప్రియసఖిగా అంతం కావాలని ఇప్పటినుంచే తపస్సు చేసి ధన్యతని సిద్ధించుకుంటాను.

 Previous Page Next Page