Previous Page Next Page 
సిగ్గేస్తోంది! పేజి 18

              

                                                                   7
   
    ఫోటో స్టూడియో ముందు స్కూటర్ ఆపి "ఈ రోజు కూడా ఫోటోలు తీసుకెళ్ళకపోతే ఇంట్లోకి రానియ్యదు ధరణి!" అనుకున్నాడు శ్రీధర్.
   
    శ్రీధర్ ని చూడగానే "రండి సార్!" అన్నాడు అసిస్టెంట్ కుర్రాడు.
   
    "మీ ఓనర్ ఏడీ?" అడిగాడు శ్రీధర్.
   
    "లోపల డార్క్ రూంలో ఉన్నాడు సార్!" అన్నాడు వాదు.
   
    "ఫోటోలు డెవలప్ చేశాడా?" అడిగాడు శ్రీధర్.
   
    "అడిగొస్తాను సార్!" అంటూ వాదు లోపలికి వెళ్ళాడు.
   
    శ్రీధర్ అక్కడ అద్దం కింద ఫ్రేమ్ లో పెట్టిన రకరకాల సైజుల ఫోటోలు చూస్తూ కూర్చున్నాడు.
   
    ఇంతలో అక్కడికి ఓ పాప వచ్చింది. స్కూల్ డ్రస్ లో ముద్దుగా వుంది. పూజలాగే వుంది. ఇంకొ రెండేళ్ళలో పూజకూడా ఇంత పొడుగవుతుంది! అనుకున్నాడు శ్రీధర్.
   
    "పాస్ పోర్ట్ సైజు ఫోటోకి ఎంతవుతుంది అంకుల్? బస్ పాస్ కి!" అంది బెరుకుగా చూస్తూ.
   
    శ్రీధర్ నవ్వాడు. "ఫోటో గ్రాఫర్ వస్తాడు కూర్చోమ్మా" అన్నాడు.
   
    "సారీ అంకుల్!" అంది నమ్రతగా.
   
    శ్రీధర్ జేబు తడుముకుని అందులోనుండి ఓ క్యాడ్ బరీస్ చాక్లెట్ తీసి పాప కిచ్చాడు.
   
    "వద్దు అంకుల్!" అంది మొహమాటంగా.

    "తీసుకోమ్మా! మా పాపకోసం కొన్నాను. నిన్ను చూడగానే ఇవ్వాలనిపించింది" అన్నాడు.
   
    "మరి మీ పాపకో?" అడిగింది.
   
    "మళ్ళీ కొంటాను. అయినా మా పాప శనివారం దాకా రాదు. హాస్టల్లో వుంటుంది" అన్నాడు.
   
    "అయ్యో పాపం!" అంది చాక్లెట్ అందుకుంటూ.
   
    "వెంట పెద్దవాళ్ళు ఎవరూ రాలేదా?" అడిగాడు శ్రీధర్.
   
    "మా డాడీ ఏక్సిడెంట్ లో పోయారు! మా మమ్మీకి షిఫ్ట్ డ్యూటీలు ఆస్పత్రిలో నర్స్. వెంటరావడానికి ఎవరూ లేరు. అయ్యో థాంక్స్ చెప్పడం మరిచిపోయాను అంకుల్!" అంది తింటున్న చాక్లెట్ వైపు చూసుకుంటూ.
   
    శ్రీధర్ నవ్వి "ఏ క్లాసూ?" అడిగాడు.

    "సెవెన్త్ కి వచ్చాను. మీ పాపా?" అడిగింది.
   
    "ఫిఫ్త్ కి వచ్చింది. కాస్త చిన్నది" చెప్పాడు.
   
    "మీ పాప లక్కీ!" అంది నవ్వుతూ.
   
    "ఏం?"
   
    "వాళ్ళ డాడీ చాక్లెట్లు తెస్తారు!" అంది.
   
    శ్రీధర్ కి ఆ మాట మనసు పొరల్లోకంతా వెళ్ళి గుచ్చుకుంది. తనకి తెలీకుండానే అప్రయత్నంగా పాప తలమీద చెయ్యివేసి నిమిరాడు.
   
    "నీ పేరూ?" అడిగాడు.
   
    "పునీత" చెప్పింది.
   
    "స్వీట్ నేమ్!" మెచ్చుకున్నాడు.
   
    ఇంతలో అసిస్టెంట్ కుర్రాడు లోపల్నుంచి వచ్చాడు.
   
    "సార్.. మీరో పది నిమిషాలు వెయిట్ చెయ్యాలి!" అన్నాడు.
   
    "మీరు ఫోటో దిగుతారా?" అడిగింది పునీత.
   
    "లేదమ్మా, మా పాపా, బాబూ, వాళ్ళమ్మా, నేనూ దిగిన ఫోటోలు డెవలపింగ్ కి ఇచ్చాను" అన్నాడు.
   
    "అయితే ఓ పదినిమిషాల్లో వాళ్ళని చూడచ్చన్నమాట!" మెరుస్తున్న కళ్ళతో అంది.
   
    శ్రీధర్ తల ఊపాడు.
   
    "నీకేం కావాలీ?" అసిస్టెంట్ కుర్రాడు పాపని అడిగాడు.
   
    "పాస్ పోర్టు సైజు కావాలి. బస్ పాస్ కి. రేపే లాస్ట్ డేట్. ప్రొద్దుటే ఇచ్చేస్తావా?" అడిగింది.
   
    అసిస్టెంట్ ఎగాదిగా చూసి "రేపే కావాలా? అవదు" అన్నాడు.
   
    పాప నిరాశగా చూసి వెనుతిరుగుతుండగా "ఆగు! వెళ్ళి అడిగొస్తాను" ని లోపలికి వెళ్ళాడు.
   
    "మమ్మీ నిన్ననే తీయించుకోమని డబ్బిచ్చింది. తీయించుకోలేదంటే తిడుతుంది" అంది పునీత.
   
    "ఆ! ఇది కాకపోతే ఇంకో స్టూడియో" అన్నాడు శ్రీధర్.
   
    "ఇదే మా ఇంటికి దగ్గరగా వున్న స్టూడియో!" అంది.
   
    "నేను స్కూటర్ మీద తీసుకెల్తాగా!" హామీ ఇచ్చాడు శ్రీధర్.
   
    "నిజంగానా?" పాపా కళ్ళు మిల మిలా మెరిశాయి.
   
    అసిస్టెంట్ లోపల్నుండి వస్తూ "సరే, లోపలికి వెళ్ళు మా బాస్ పిలుస్తున్నాడు" అన్నాడు.
   
    షూస్ విప్పి, "ఇప్పుడే వస్తా అంకుల్!" అంటూ పునీత తూనీగలా లోపలి పరుగెత్తింది.
   
    శ్రీధర్ ఏం తోచక సిగరెట్ కొనుక్కోవడానికి పాన్ షాప్ వైపు నడిచాడు. ఇంట్లో ధరణి కాల్చనీయదు. ఎప్పుడైనా బయటే కాలుస్తుంటాడు. అధీ అలవాటుగా కాదు. టైంపాస్ కి! శ్రీధర్ వాచ్ వైపు చూసుకుంటూ ఇంకొ ఐదు నిమిషాలు అనుకున్నాడు. సిగరెట్ కాలుస్తూ ఎదురుగుండా ఉన్న ధియేటర్ వైపు దృష్టి సారించాడు.
   
    ఏదో కొత్త సినిమా ఆడుతోంది. స్కూల్ డ్రెస్ విప్పి పైట వేసుకున్నట్లుగా చిన్నపిల్లలా ఉంది హీరోయిన్! పదమూడేళ్ళ యువతి హీరోయిన్ గా నటించిన సరికొత్త రొమేంటిక్ చిత్రం! అని బోర్డుమీద ఎడ్వర్ టైజ్ మెంట్.
   
    పదమూడేళ్ళ పిల్ల బాలిక అవుతుంది కానీ యువతి ఎలా అవుతుందో శ్రీధర్ కి అర్ధం కాలేదు.
   
    సిగరెట్ పారేసి వాచ్ వైపు చూసుకున్నాడు. పదినిముషాలూ అయిపోయింది. స్టూడియోలోకి వెళ్ళాడు.
   
    అసిస్టెంట్ కుర్రాడు కుర్చీలోనే కునికిపాట్లు పడుతున్నాడు.
   
    "లోపలికెళ్ళి అయిందేమో కనుక్కురా!" అన్నాడు శ్రీధర్.
   
    అతను వినిపించుకోలేదు. నిద్రలో గురక కూడా పెడుతున్నాడు.
   
    శ్రీధర్ విసుగ్గా చూసి గట్టిగా పిలుస్తుండగా లోపలినుంచి ఓ చిన్న కేక వినపడింది.
   
    శ్రీధర్ కి పునీత గుర్తొచ్చింది! తలుపు బయట వదిలిన ఆమె షూస్ అక్కడే ఉన్నాయి. అతని కెందుకో మనసు కీడు శంకించింది.
   
    మళ్ళీ చిన్నగా వెక్కిళ్ళు పెడుతున్న ధ్వని వినిపించింది.
   
    శ్రీధర్ ఇంకా ఆగలేకపోయాడు! లోపలికి తలుపు నెట్టుకుంటూ పరిగెత్తాడు. అక్కడ కనిపించిన దృశ్యం అతడిని అచేతనున్ని చేసింది.
   
    పునీతని నేలమీద వత్తిపెట్టి, ఆమె మీదకి ఒరిగి పెదవులని తన నోటితో బందిస్తున్నాడు ఆ ఫోటోగ్రాఫర్. పునీత నోట్లోంచి శబ్దం రావడానికి కూడా ఆస్కారం లేదు.
   
    శ్రీధర్ కి ఆ దృశ్యం చూడగానే మతిపోయినంత పనైంది. పువ్వు లాంటి పసిపిల్ల మీద వాదు చేస్తున్న అత్యాచారాన్ని చూడగానే, ఆవేశంగా "రేయ్! బాస్టర్డ్!" అంటూ ముందుకి ఉరికాడు.
   
    ఫోటోగ్రాఫర్ తలెత్తి "నువ్వు ఎవర్రా?" ఆన్నాడు.
   
    "అదే చెప్తాను" అంటూ శ్రీధర్ వాడి కలర్ పట్టుకుని పైకి లేపి కడుపులో గుప్పెట బిగించి కొట్టాడు.
   
    అనుకోని ఆ దెబ్బకి వాడు 'అమ్మా' అంటూ కడుపు పట్టుకుని కుప్పకూలాడు.
   
    అప్పుడు ఏడ్చింది పునీత "అంకుల్" అంటూ.....
   
    శ్రీధర్ పాపని దగ్గరికి తీసుకొని "భయం లేదమ్మా ఏడవకు! నేనొచ్చానుగా" అన్నాడు.
   
    "అంకుల్!" అన్న అరుపుకి వెనక్కి తిరిగి, తన తలమీద ఫ్లవర్ వేజ్ తో కొట్టబోతున్న ఫోటో గ్రాఫర్ చెయ్యి పట్టుకుని బలంగా మెలితిప్పి కిందపడేసి, గుండెలమీద కూర్చుని కసిగా పిడిగుద్దులు కురిపించాడు.
   
    "అంకుల్.... చచ్చిపోతాడేమో!" ఏడుస్తూ భయంగా అంది పునీత.
   
    శ్రీధర్ లేచి వాణ్ణి పట్టుకుని బైటికి ఈడ్చుకొచ్చాడు.
   
                                     *    *    *
   
    "వీడికి కఠినమైన శిక్షపడాలి ఇన్ స్పెక్టర్! పసిపాప మీద కామాంధకారంతో అత్యాచారం చెయ్యబోయాడు. ఆ పాప ముఖం చూడండి! వీడు ఏం చెయ్యాబోయాడో కూడా ఆ పసిపాపకు తెలీదు! ఆ అంకుల్ నా మీద ఎందుకు పడ్డాడు? నన్నెందుకు అలా చేశాడూ? అని ఏడుస్తోంది. ఆ ప్రశ్నలకి జవాబులు ఎవరు చెప్పగలరు?" ఆవేశంతో బాధతో కంఠం వణుకుతుండగా అడిగాడు శ్రీధర్.
   
    విక్రం చాలా కూల్ గా శ్రీధర్ వైపు చూశాడు. "మీరు ధరణిగారి హజ్బెండ్ కదూ!"
   
    శ్రీధర్ విక్రంని గుర్తు పట్టలేదు. "మీరూ...." అన్నాడు.
   
    "ఆ రోజున బస్ లో ఎవరో ఆడపిల్లని ఏడిపిస్తూ ఉంటే చూసి మీ మిసెస్ కూడా ఇలాగే ఆవేశపడ్డారు. అప్పుడు మీరు ఏమన్నారో గుర్తుందా?" అడిగాడు విక్రం.

 Previous Page Next Page