Previous Page Next Page 
అసావేరి పేజి 18

    అలా పిలిచింది తమ లెక్చరర్ జవహర్ కంఠంగా గుర్తించడానికి పట్టింది అరక్షణమే. అవాక్కయిపోయాడు శంకూ క్షణంపాటు.
   
    తేరుకున్న వెంటనే శంకూ ఏదో చెప్పబోతుంటే "నో ఎక్సప్లనేషన్స్" అంటూ శంకూని సురేంద్రకి అప్పచెప్పి ఇప్పుడు రవికి ఆసరా ఇచ్చి పైకి లేవదీశాడు జవహర్.
   
    ఈ పోరాటాన్ని ఆపగల ఒకే ఒక్క వ్యక్తిగా భావించి సమయానికి జవహర్ తో అక్కడకు వచ్చిన వెంకట్ ఇక్కడ శంకూ గెలుపుకి ఆనందించడంలేదు. తను చేసిన చిన్న పొరపాటు ఇంత దారుణంగా పరిణమిస్తుందని తెలీనందుకు ఇక్కడ ప్రారంభమైన యుద్ధం ఎక్కడ ముగుస్తుందో తెలిసినందుకు నిశ్శబ్దంగా నిలబడి కుమిలిపోతున్నాడు.
   
    నిప్పు రగులుకుంది.
   
    విద్యార్ధులు రెండు వర్గాలుగా చీలిపోవడానికది కారణమయ్యింది.
   
    ఇక్కడ తాత్కాలికంగా ఆగిన పోరాటం గురించి తనకు జరిగిన పరాభవం గురించి బావ రాజేందర్ దాకా వెళుతుందని ఆ క్షణంలో రవి కూడా వూహించలేదు.
   
    సురేంద్ర శంకూ గాయాల్ని ఏటి నీళ్ళతో శుభ్రంచేసి నడిపించుకు వెళుతుంటే మామిడితోపులో ఓ చెట్టువార్న నిలబడి చూస్తోంది సావేరి....
   
    వచ్చి చాలాసేపు అయినా ఆమె ముందుకు వెళ్ళలేకపోయింది.
   
    మనసు కాగితంపై చెరగని కవితలా దిద్దుకున్న శంకూ రూపం రక్తం ఓడి అమ్మ కడుపునుంచి అప్పుడే నేలపైకి జారిన పసికందులా అనిపించిందో లేక చేయని తప్పుకు సిలువ చేయబడ్డ నిస్సహాయతే కనిపించిందో అలవాటులేని కన్నీళ్ళో ఆమె నేత్రాలనుంచి ఆగకుండా స్రవిస్తున్నాయి.
   
    అసురసంధ్య దాటి గంట గడిచింది. పల్లెని చీకటికప్పి అరగంట అయ్యింది తన గదిలో లైటు వెలిగించుకోకుండా చీకటిలో కూర్చుంది సావేరి కానీ గదిలో ఏదో పనున్నట్లు అడుగుపెట్టిన మంగ స్విచ్ వేసి ద్వారాన్ని మూసింది.
   
    ఏదో పని చేస్తున్నట్టు అభినయిస్తూ కొంతసేపు గడిపిన మంగ జరిగింది చెప్పాలనుకుని తల పైకెత్తి అప్పుడు చూసింది. నీళ్ళు నిండిన కళ్ళతో కనిపించింది సావేరి.
   
    "జరిగింది నీకు తెలుసా అమ్మా?" కమిలిపోయిన శంకూ రూపం గుర్తుకొస్తుంటే మంగ గొంతు రుద్దమైపోయింది.
   
    "ఆ....!" సావేరి రొప్పుతూంది ఉద్విగ్నంగా..... "అంతా చూశాను."
   
    నివ్వెరపోయింది మంగ "ఏటి ఒడ్డున...."
   
    "చెబుతున్నానుకదే! చూశాను."
   
    "కానీ ఆపలేకపోయావు...."
   
    "ఆడపిల్లని మధ్యలోకి ఎలా వెళ్ళను?"
   
    "అదేనమ్మా....నువ్వెంత ముద్దుల బిడ్డవయినా ఆడపిల్లవి....కాబట్టే జరిగేదాన్ని ఆపలేవు. ఇదేకాదు....రేపు నీ తండ్రి, లేకపోతే నీ బావ ఎవరు కోపగించుకున్నా ఆ కోపంతో శంకూని ముక్కలు చేసినా నువ్వు అడ్డుకోలేవు."
   
    "అలాంటి మాటలంటే చంపుతా" మంగ చెప్పింది సవ్యంగానే అనిపించినా మనసు అంగీకరించక గుండె గొంతుకడ్డం పడినట్టు విలవిల్లాడి పోయింది. "అంతవరకూ వస్తే...."
   
    "ఏం చేస్తావు?"
   
    వెంటనే స్పురించలేదు. కానీ జవాబు చెప్పలేని ఓటమిని అంగీకరించలేకపోయింది. "నేను చస్తాను...."
   
    ఒక పసిపిల్ల ఇప్పుడిప్పుదే మాటలు నేర్చుకుంటున్న ఓ పసికందు కనిపించింది సావేరిలో. ఆప్యాయంగా తల నిమురుతూ అంది మంగ. "చచ్చిపోడానికే మొదలయిన ప్రేమైతే యిప్పుడే జాగ్రత్త పడొచ్చు తల్లీ....నీకేం తక్కువని ...? గొప్పింటి బిడ్డవి కో అంటే కోటిమందికి యిష్టంకాగల అందమైన ముద్దమందారానివి....శంకూని మరిచిపో కూడదూ?"
   
    "వద్దే....అలాంటి మాటలనకు. నీకు దణ్ణం పెడతాను."
   
    ఈ రాలుగాయిపిల్ల ఇంత స్వల్పవ్యవధిలోనే అంతటి మక్కువనెందుకు పెంచుకోగలిగిందో నిర్వచనం తెలేని మంగకిదంతా పిచ్చిలగే అనిపించింది 'కావాలీ' అనే ఓ బలమైన కోరిక రేపు ఎన్నెన్ని అనర్ధాలకు దారితీస్తుందో మాత్రం బోధపడిపోవడంతో సాధ్యమైతే ఆమె మనసు మార్చే ఆఖరి ప్రయత్నం చేయాలనుకుంది. "శంకూని నువ్వు యిష్టపడుతున్నావు కానీ నిన్ను శంకూ యిష్టపడుతున్నాడని ఎలా అనుకుంటున్నావు?"
   
    "నాకు తెలుసు....."
   
    "చెప్పాడా?"
   
    "అలా...." అడ్డంగా తలూపింది. "నాకు తెలుసంతే...."
   
    "ఎలా తెలుసు?" ఆత్మీయంగానే మందలించింది. "నువ్వు అనుకుంటే సరిపోతుందా?"
   
    "ఇష్టపడటంలేదని నీకెలా తెలుసు?" టక్కున అడిగింది సావేరి."నువ్వనుకుంటే సరిపోతుందా?"
   
    నిర్వీన్నురాలయింది మంగ. అయినా పట్టువదలకుండా అడిగింది. "శంకూది చిన్నపిల్లాడి మనస్తత్వం సావేరీ....నిన్నేకాదు....చాలా చాలా యిష్టపడతాడు అది తీసి దాచుకునే యిష్టం కాదమ్మా! చూసి ఆనందించే అభిమానం మాత్రమే."
   
    "లేదు...." అసహనంగా తలూపింది. తనను శంకూ అన్నింటి కన్నా ఎక్కువ యిష్టపడతాడన్న భావాన్ని మంగ ఖండిస్తున్నందుకు బాధ అనిపించిందో, లేక శంకూ తనను చూసేవేళ అతడి కళ్ళలోని లాలిత్యమే గుర్తుకొచ్చిందో రోషంగా అంది "నన్ను.....నన్ను...నాలాగే శంకూ ఇష్టపడతాడు...ఎలా తెలుసంటే..." మనసులోని భావానికి భాష్యం చెప్పలేనట్టు ఆగిపోయింది తల పట్టుకుంటూ.
   
    "అమ్మ...సా...వేరీ...." చివరగా అంది మంగ "శంకూ తల్లి దండ్రులు లేని బిడ్డ. ఉన్నది అమ్మమ్మొక్కర్తే. నీ మూలంగా రేపు అనుకోనిది జరిగితే...ఆ ముసలిదానికి మనవడూ లేకుండా పోతాడు."
   
    "చంపుతాను..." ఉక్రోషంగా చూస్తూ అంది. "ఎందుకుపోతాడు? ఎక్కడికి పోతాడు?"
   
    నిర్లిప్తంగా అంది మంగ. "ఎన్ని కథలు వినలేదమ్మా...ఎన్ని జీవితాలు చూడలేదూ....ఈ ఇంట నీకు ఆడింది ఆట, పాడింది పాట అయినా నీ పాలి శంకూ యిమడలేడమ్మా! నీ స్థాయికి తగ్గవాడు కాదు కాబట్టి నువ్వు యింకా మొండితనం ప్రదర్శిస్తే ప్రాణాలు కోల్పోతాడు."

    "ఎందుకు అనుకుంటున్నావు?"
   
    "శంకూ అండ లేనివాడు కాబట్టి...."
   
    "నేనుంటాగా...."
   
    "అయ్యో...." బాధగా తలవంచుకుంది మంగ.
   
    "నీకెలా చెప్పలమ్మా! శంకూ మీద మీ అన్న తిరగబడ్డాడు. రేపు మీ బావ దాడి చేస్తాడు. ఆ తర్వాత మీ తండ్రి...."
   
    ప్రతి ప్రేమ కథ ప్రారంభానికీ ఉన్న అడ్డంకులు అవే....అయినా చావని ప్రేమ చచ్చేటంత మొండితనాన్ని అందిస్తుంది. గండిపడిన ప్రేమ వాగుకి యీ మాటలే వారధిగా మారగాలిగితే చాలా ప్రేమలు కావ్యాలుగా కాక సంఘటనలుగా మిగిలిపోయేవేమో!
   
    "మమ్మీ...." గట్టిగా కేకపెట్టింది సావేరి.....ఎందుకో అర్ధంకాని మంగ చూస్తుండగానే కూతురి కేక వింటూ రాధమ్మ లోపలికి పరుగెత్తుకొచ్చింది.
   
    "ఏమిటే? ఆ గావుకేకలేమిటి?"
   
    "నేను గుడికి వెళదాం అంటే మంగ ఇప్పుడొద్దూ అంటుంది."
   
    మంగ నివ్వెరపోయింది....మంగేకాదు రాధమ్మ పరిస్థితీ అలాగే వుంది. ఎప్పుడు గుడికివెళదామన్నా అయిష్టతను వ్యక్తంచేసే సావేరి ఇంత హఠాత్తుగా ఎందుకు వెళ్ళాలనుకుంటున్నదీ రాధమ్మకి తోచలేదు.
   
    పైగా సావేరి తను ఉపయోగించిన వాక్యంతో గుడికి యిప్పుడే వెళ్ళితీరాలి అని పరోక్షంగా తల్లికి చెప్పినట్టయింది.
   
    దిగ్బ్రమగా చూస్తూనే రాధమ్మ అంది. "దీనికంత భక్తి పుట్టుకురావడం చోద్యమేనే మంగా....కాదంటే ఎలా....?"
   
    మరో అయిదు నిమిషాలలో తయారైపోయింది సావేరి.

 Previous Page Next Page