Previous Page Next Page 
రాయుడిగారి సినిమాకథ పేజి 18

    బామ్మ బాధగా నిట్టూర్చి "నీ అత్తగారు చాలా అదృష్టవంతురాలు. నాకూ నీలాంటి కోడలు దొరికుంటే ఎంత బాగుండును?" అంది.   
    "నాకూ అలాగే అనిపిస్తోంది. మీ కోడలు చాలా అదృష్టవంతురాలు. నాకు నీలాంటి కోడలు దొరికుంటే ఎంత బాగుండును?" అంది.   
    "నాకూ అలాగే అనిపిస్తోంది. మీ కోడలు చాలా అదృష్టవంతురాలు. నాకు మీలాంటి అత్తగారు దొరికుంటే ఎంత బాగుండును" అంది సుభద్రమ్మ.
    ఇద్దరూ ఒకరి వైపు ఒకరు చురుగ్గా చూసుకున్నారు. అప్పుడు సుభద్రమ్మ "చుట్టరికం లేకపోతేపోయె. కనీసం మనం ఒకే యింట్లో ఉన్నా ఎంత బాగుండేది? మీలాంటి పెద్దవారు అందరికీ దొరుకుతారా?" అంది.  
    "మీ ఇంటి పేరేమిటీ?" అంది బామ్మ, వినగానే ఆవిడ కళ్ళలో వెలుగు కనిపించింది. "అయితే మీరు మా వాళ్ళేనన్నమాట!" అంది.  
    సుభద్రమ్మ తటపటాయిస్తూ "మీ ఇంటిపేరు?" అంది.   
    బామ్మ చెప్పింది. యిద్దరికీ కులాలు కలిశాయి. కానీ శాఖలు కలవలేదు.   
    "ఈ రోజుల్లో ఇంకా శాఖ పట్టింపులు కూడానా? కులాలే పట్టించుకోవటం లేదు" అంది సుభద్రమ్మ.   
    "అది పెద్దదిక్కు లేని ఇళ్ళల్లో మాట. మా యింట్లో అలా కాదు" అంది బామ్మ.   
    "అయినా ఈ శాఖ పట్టింపులు మనకెందుకు? మన వేమన్నా పెళ్ళి సంబంధాలు చూస్తున్నామా ఏమన్నానా?" అంది సుభద్రమ్మ.   
    "బాగా చెప్పావు మనం రోజూ ఇలాగే కలుసుకుంటే బాగుంటుంది కదూ! ఇంత హాయిగా కబుర్లు చెప్పి చాలా రోజులయింది. మా కోడలు ఏం చెప్పినా అలాగా అని ఆశ్చర్యపడడం తప్ప ఓ కబురుండదు. కాకరకాయుండదు" అని బామ్మ సుహాసిని వంక తిరిగి "ఏంటర్రా మీరు పెద్దాళ్ళం మేమిన్ని కబుర్లు చెప్పుకుంటుంటే, కుర్రాళ్ళు మీరు బొత్తిగా మాట్లాడుకోరు" అంది.   
    "మీ మాటలు వింటున్నాం బామ్మా!" అంది సుహాసిని.   
    "మా మాటలు వినడమేమిటమ్మా! మీ మాటలు మీకూ ఉండాలి గానీ" అంది సుభద్రమ్మ.   
    కాసేపు సుభద్రమ్మ, బామ్మ వాళ్ళిద్దర్నీ బలవంతపెట్టారు. తప్పనిసరై వాళ్ళిద్దరూ కాస్త దూరంగా వెళ్ళి కూర్చున్నారు.   
    "అమ్మయ్య. ఈ బామ్మగారు మంచి ఉపకారమె చేసింది" అన్నాడు రాయుడు.   
    "అది సరే - మేమిప్పుడు ఎవరి కథ రాయాలి? ఈ బామ్మగారిదా, సుహాసినిదా?" అనడిగాడు రామగోపాల్.  
    "బామ్మగారి కథ మా రచయిత తయారు చేస్తాడులే కానీ నువ్వు వాళ్ళ సంభాషణలే కాస్త వివరంగా తయారు చేయి మా హీరో. హీరోయిన్లు ఏకాంతంలో ఏం మాట్లాడుకుంటారో తెలుసుకోవాలని నాకు చాలా కుతూహలంగా ఉంది" అన్నాడు రాయుడు.   
    మోనికా, రామగోపాల్ - పొదలమాటున కదిలి సుబ్బారావు, సుహాసినిలకు దగ్గరలో ఉన్న పొదలమాటుకు చేరారు.   
    "వాళ్ళు కుర్రాళ్ళు వాళ్ళ కబుర్లు వేరే ఉంటాయి. మన మాటలు విసుగొచ్చి ఇంకా పోదాం అని లేచేస్తే మనకిక్కడ మరికాస్సేపు కబుర్లాడుకునే అవకాశముండదనిపించి అలా పంపించేశాను" అంది సుహాసిని బామ్మ.   
    "మంచి పనిచేశారు" అని మెచ్చుకుంది సుభద్రమ్మ. ఇద్దరూ కబుర్లలో పడ్డారు.   
    రాయుడు రచయితనొక్కన్ని అక్కడ వదిలి సుహైస్ని, సుబ్బారావులవైపు బయల్దేరాడు. రచయిత రాయుడి వంక జాలిగా చూసి "నన్ను వీళ్ళకు వదిలేసి - మీరు చక్కగా ఆ యువజంట సంభాషణ వినడానికి వెళ్ళిపోతున్నారు. ఇది చాలా అన్యాయం" అన్నాడు.   
    "కర్మఫలం అనుభవించడం ఎవరికైనా తప్పదు" అని రాయుడు అక్కణ్ణించి వెళ్ళి రామగోపాల్ ను కలుసుకున్నాడు.   
    అప్పటికింకా సుహాసిని, సుబ్బారావు మాట్లాడుకోవడం ప్రారంభించలేదు. సుబ్బారావు సుహాసినితో మాట్లాడదానికి సిగ్గుపడుతున్నాడు. అతను కొద్దిగా మెలికలు తిరుగుతున్నాడు సుహాసిని మాత్రం ఓరకంట అతన్నే గమనిస్తూ అతనేం మాట్లాడుతాదా అని ఎదురు చూస్తోంది. ఎప్పటికీ అతడు మాట్లాడక పోవడంతో విసిగిపోయిందో ఏమో "ఏం, మాట్లాడరేం?" అంది.   
    సుబ్బారావు చటుక్కున గొంతు సవరించుకుని "మా అమ్మ, మీ బామ్మ మాట్లాడు కుంటారనుకున్నాను. ఇలా మనం మాట్లాడుకోవలసి వస్తుందని నాకు తెలియదు" అన్నాడు.   
    "మీరు సినిమాలు చూస్తారా?" అనడిగింది సుహాసిని.   
    "చూడకేం- చాలా ఎక్కువగా చూస్తాను" అన్నాడు సుబ్బారావు.   
    "మీకు జయసుధ యిష్టమా? జయప్రద యిష్టమా?" అంది సుహాసిని.   
    "అలా అడిగితే నాకు తెలియదు. నాకు పాత్రలపేర్లే గానీ, తారల పేర్లు తెలియవు. జ్యోతి సినిమాలో జ్యోతి నటన నాకు చాలా వచ్చింది. సినిమా అయిపోయాక నాకు ఏడుపు కూడా వచ్చింది."   
    సుహాసిని ఆశ్చర్యంగా "మరి హీరోలు?" అంది.   
    "ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు బాగా తెలుసు నాకు. కొత్తవాళ్ళెవ్వరూ నాకు తెలియదు. అయినా  చాలా మంది బొమ్మచూసి తారలపేర్లు చెప్పేస్తారు. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మీరు అలా గుర్తుపట్టగలరా?" అనడిగాడు  సుబ్బారావు.   
    "మీకు శోభన్ బాబు, కృష్ణ, కృష్ణంరాజు-వీళ్ళెవ్వరూ తెలియదా?"   
    "పేర్లు తెలుసు. మనుషులు తెలియదు" అన్నాడు సుబ్బారావు.   
    "మీకు ఆటలేమైనా వచ్చా?" అంది సుహాసిని.   
    "బోల్డు వచ్చు. పులీమేకా, వరసాట, పచ్చీసు..."   
    "అవికాదు-ఫుట్ బాల్, క్రికెట్, హాకీ, టెన్నీస్..."   
    "అమ్మో- ఆ ఆటలాడితే వంటికి దెబ్బలు తగుల్తాయని అమ్మ ఆడనిచ్చేదికాదు. అందుకని నేను వాటి జోలికి వెళ్ళనేలేదు. కానీ పచ్చీసు ఆటలో గవ్వలు పట్టుకున్నా వంటే ఏ పందెం కావాలంటే అది వేయగలను" అన్నాడు సుబ్బారావు గర్వంగా.   
    సుహాసిని నిట్టూర్చి - "పోనీ టేబుల్ లెన్నిస్, క్యారమ్సు....వచ్చా?" అంది.   
    "టేబుల్ టెన్నిస్ రాదు. కానీ క్యారమ్సు వచ్చు. ఆ ఆటంటే నాకూ చెల్లాయికీ కూడా ఎంతో ఇష్టం. ఇంట్లో ఆడుకోవాలంటే బోర్డు కావాలిగదా! పక్కింటికి పోయి ఆడుకునే వాళ్ళం. రెండేళ్ళ క్రితం వాళ్ళు ట్రాన్సుఫరై వెళ్ళిపోయారు. అప్పట్నించీ మళ్ళీ ఆడలేదు."

 Previous Page Next Page