Previous Page Next Page 
మంత్రముగ్ధ పేజి 17

    "కోర్టు మాకు అప్పగించిన ముద్దాయిని మా అదుపులోకి తీసుకోవాలను కోవటం తప్పెలా అవుతుంది. అది నా డ్యూటీ! లేదంటే అసమర్ధత!"

    "కాని ఈ సమస్య ప్రజల విశ్వాసాలతో ముడిపడి ఉంది. విధి నిర్వహణ కోసమే మీరు ఇదంతా చేశారని అందరూ నమ్ముతున్నారు.

    అలాకాక కేసు మరో మలుపు తిరిగే అవకాశముంది.

    కొంతమంది విశ్వాసాలను దెబ్బ కొట్టేందుకు మరి కొందరు చేయించిన కుట్రగా ప్రచారం జరిగితే మీరేం చేయగలరు.

    "ప్రజలతో ముడిపడిన సమస్యగా మారిన తరువాత ఏ సమస్య అయినా వారి నాయకులకే వదిలివేయటం మంచిదనుకుంటాను".

    "మీరింక ఈ విషయాన్ని మర్చిపోవటం మంచిది."

    "పై అధికారుల వడ్డింపులు పూర్తి అయాక ఎలా మర్చిపోగలను"

    "కేసు గురించే ఆలోచిస్తూ కూర్చుంటారా? నన్ను పట్టించుకోరా? మనకి క్రొత్తగా పెళ్ళయింది కదండీ! అవునూ నాకిప్పుడు సరైన ఆలోచన వచ్చింది. మన హనీమూన్ లో ఈగలా అడ్డుపడ్డాడనే మీకు అతని మీద ఇంతకోపం వచ్చింది! అవునా??" చిరునవ్వులు చిందిస్తూ భర్త ముఖంలోకి చూచింది.

    ఆమె కవ్వింపులు అతని మూడ్ మార్చలేక పోయాయి.

    "ద్రవిడ మహేశ్వరున్ని పట్టుకునే తీరాలంటారా?" బుంగమూతి పెట్టి అలిగినట్లు నటిస్తూ దూరంగా జరిగి కూర్చుంది.

    "అధికారిగా కాకపోతే వ్యక్తిగత హోదాలో అతని అంతు తేల్చుకుంటాను. మొదటి ఓటమి నాదయినా తుది గెలుపు నాదే!"

    "అతని దగ్గర ఆలౌకికమయిన శక్తి ఉన్నదని నేను నమ్ముతున్నాను"

    "మీరంతా కట్టకట్టుకుని గంగలో కలవండి! నాకెందుకు?"

    "ఆయనను సాధించాలని మీరు అంతగట్టిగా ఎందుకు అనుకుంటున్నారు?"

    "ఇలాంటివాళ్ళు సమాజాన్ని మోసగించే ఛీటర్స్ అని నా దృఢ విశ్వాసం!"

    "నమ్మకాలన్ని నిజాలు కావాలని లేదుకదా!"

    "లేదు, కాని నా నమ్మకమో, అతని శక్తులో ఏదో ఒకటి అబద్దం అని తేలేంతవరకూ నా పట్టుదలమాత్రం విడిచిపెట్టను.

    "దాంపత్యం అంటే సర్దుబాటు అని మీరు చెప్పారుకదా! మొదటి పాఠం! మీరు ఇంతపట్టుదలగా ఉన్నారు కనుకే నా అభిప్రాయం మార్చుకుంటున్నాను. నేను మీతో సహకరిస్తాను సరేనా?"

    "ఈ విషయంలో పిరికివాళ్ళు చేయగలిగింది ఏమీ ఉండదనుకుంటాను"

    "మగవాళ్ళు మాత్రమే చేయగలరనుకుంటున్నారా? మీరు పోలీసు అధికారి కనుక మీ ఇన్ ఫార్మర్ గా పనిచేస్తాను. వెళ్ళి ఆ ద్రవిడ మాహేశ్వరుడు ఎక్కడున్నాడో తెలుసుకుంటాను. ధర్మపత్ని-అర్ధాంగి లాంటి గౌరవమయిన పదవులు అక్షరాలా దక్కించుకుంటాను"

    "ఒకరు తెలుసుకోవటం, అందుకోసం శ్రమపడటం ఎందుకు? ప్రతి అయిదు నిముషాలకు కంట్రోల్ రూంకి వార్త వస్తుంది"

    "ఆ కథలు వింటూ తృప్తి పడుతుంటారా? వారిచ్చే వార్తలు అసత్యాలయితే!" అని ధాటిగా ప్రశ్నించింది తులసి. అతని కనుబొమలు ముడిపడ్డాయి.

    "మా ఉద్యోగి ఒకరు వారి వెంటే ఉంటారు!"

    "అతనుకూడా భక్తుడైపోయి వారికి సహకరిస్తే?" అంటూ మరో మెలిక వేసింది తులసి! ఈ సారి శివరాజ్ నిలిచిపోయాడు.

    "పోనీ వెళ్ళి ఆ విషయం తేల్చుకురా! నీ ప్రయత్నానికి ఫలితం శూన్యమే అయినా నేను కావాలనుకున్న ఏకాంతం దొరుకుతుంది కదా!" అన్నాడు.

    "ఒక స్వీట్ ఇవ్వండి! తేలిపోయి వెళ్ళొస్తాను."

    "స్వీట్ అంటే ముద్దా! నువ్వు పెట్టిన షరతుల ప్రకారం ప్రస్తుతం అలాంటివి గుర్తు చేసుకోకుండా ఉండటమే క్షేమం"

    "అయితే నేనిస్తాను" అంటూనే స్వీట్ చాక్లెట్ అతని చెంపమీద అంటించి పైటకొంగుతో తుడిచి మరీ వెళ్ళిపోయింది తులసి.

    ముందుగా ఈ విషయమై చర్చించటానికి మేడమ్ దగ్గరకు వెళ్ళింది.

    "రా బేబి! చాలచాల వార్తలు వింటున్నాను"

    "నమ్ముతున్నారా, కొట్టిపారేస్తున్నారా?"

    "వాస్తవాలను నేను ధ్రువీకరించలేక పోవచ్చు! కాని భారతీయుల విశ్వాసాలు అర్ధవంతమయినవే అని నమ్ముతాను. అంధవిశ్వాసాలు కొన్ని ఉంటాయికాని అవి తరుచు మారుతుంటాయి. మారకుండా అంచెలంచెలుగా వేల సంవత్సరాలు నిలిచిన నమ్మకాలు కదా మనవి?"

    "ద్రవిడ మాహేశ్వరుడు పోలీసుల వలయంనించి అలా రెండుసార్లు వెళ్ళిపోయారు. ఇప్పుడాయన ఎక్కడున్నాడో తెలుసుకోవడం నావంతు అయింది. మీరేదైనా సలహా యివ్వండి మేడమ్!" అర్ధించింది తులసి.

    "సహజంగా అలాంటివాళ్ళు ఆశ్రమాలలోకాని, స్మశానాల మధ్య కాని తిరుగుతుంటారు. ఈ సమస్యలో నీవు తలదూర్చటం అంత మంచి పనికాదు. భార్యభర్తలు పరస్పరం సహకరించుకోవటం సహజమేకాని ఇలా మాత్రంకాదు" అని సలహా ఇచ్చిందామె.

    ఎన్నడూ గురువుగారిమాట కాదనని తులసి ఈ విషయంలో మాత్రం వెనుకడుగు వేయలేదు. వెళ్ళితీరాలని పట్టుబట్టింది.

    హనీమూన్ వాయిదా పడినందువల్ల కొంత అశాంతికి గురి అయినట్లు భావించిందామె! మనుషులు తామేచేస్తున్నామ్నుకుంటారు. జరుగుతున్న సంఘటనలె జీవితాలను మలుపు తిప్పుతాయి. లేదా విధి!!

    తులసి జీవితం తుఫాను రేగిన కడలిలా అల్లకల్లోలం అవుతుందని అనిపించిందామెకు. అయినా భీరువులా పారిపొమ్మని చెప్పటం తనకి తగనిపని! ఆమె శిష్యులను తల్లిలా ప్రేమిస్తుంది.

    "మేడమ్! ఆయన ప్రవర్తన అంతా విచిత్రంగా కృతనంగా ఉండటానికి కారణం ఏమిటి?" అని ప్రశ్నించింది తులసి.
 

 Previous Page Next Page