Previous Page Next Page 
శ్రీ శ్రీ సంసార ప్రస్థానం పేజి 17


    నిజంగానే, ఆశ్చర్యపోయారు.
    సిగరెట్టు వెలిగించి, టేబుల్ దగ్గర కూర్చున్నారు. రాసిన స్క్రిప్ట్ వారి ముందు పెట్టాను. మెరుపులాంటి ఓ చూపు విసిరారు.
    స్నానంచేసి, కాఫీతాగి, "నన్ను లేపొద్ద"ని అమ్మతో చెప్పి పక్కవేశాను. అంతే..నాకు తెలివి వచ్చేసరికి పదకొండు గంటలయ్యింది.
    లేచి చూసేసరికి, టేబుల్ ముందు 'పనేమీలేదు, ప్రయాణమే కదా?' అనే ధైర్యంతో నిబ్బరంగా అరబాటిల్తో శ్రీశ్రీగారు కూర్చున్నారు.
    "అమ్మతో కలిసి, బజారుకు వెళ్ళివస్తాన"న్నాను. "డబ్బుతో సహా కారు పంపమని శంకర్ సింగ్ గారికి ఫోన్ చేశాను. కారొస్తుంది. నేనూ వస్తాను వెళదాం. బట్టలు సర్దుకోండి. సాయంత్రం అయిదుగంటలకే బండి. బెంగుళూరు మెయిల్ ఎక్కితే ఉదయం అయిదు గంటలకల్లా మద్రాసు వెళ్ళిపోతాం" అన్నారు.
    "మీరు వస్తున్నట్లు కంపెనీ వాళ్ళకి వైరిచ్చారా?".
    "రాత్రి వచ్చి ఏం చేశాననుకున్నావ్? చమ్రియాకి ఫోన్ చేసి మాట్లాడాను?".
    "వెరీగుడ్" అన్నాను.
    "నువ్వు స్క్రిప్ట్ పూర్తి చేస్తావనుకోలేదు. వెరీగుడ్" - అని ఆయన కూడా అన్నారు.
    కారు వచ్చిందని బాయ్ వచ్చిచెప్పాడు. ఏమనుకున్నారో ఏమో, "పోనీ మీరు వెళ్ళి వచ్చేస్తారేమిటి? నేను రెస్ట్ తీసుకుంటాను... ఇదిగో ఈ డబ్బు తీసుకో" - అని మూడువందల రూపాయలు ఇచ్చారు.
    "ఇస్తానన్న మొత్తం ఇప్పుడేం ఇచ్చాశారేమిటీ? చెయ్యాల్సిన పని చాలా వుందే?.
    "తర్వాత చూసుకుందాం. మీరు వెళ్ళండి" - అన్నారు.
    బహుశా - ఈ ట్రాన్స్ లేషన్ తో పనయిపోయిందేమో! మొత్తం డబ్బిచ్చేశారను కుంటూ కార్లో కూర్చున్నాను. ఆ మాటే అమ్మ కూడా అంది. "పోనీలే అమ్మా! ఏం చేస్తాం? పని చేసినంతవరకు తృప్తిగా చేశాను" - అన్నాను.
    బజారులో దిగి పాతిక రూపాయల చొప్పున ఎనిమిది మైసూరు సిల్క్ చీరలు (ఫ్యూర్ కాదు) కొన్నాను. కారుంది కదా. ఊరంతా ఒక రౌండ్ కొట్టేసి మూడు గంటలకి రూముకి చేరుకున్నాం.
    "టైం ఎంతయ్యింద"ని అడిగారు.
    "పనేమీ లేదుకదా, అని ఆలస్యం చేశాను".
    "ప్రయాణం వుందని తెలుసుగా?".
    కొన్న చీరలన్నీ ఆయన ముందు పడేసి, "ఎలా ఉన్నాయండి" - అని అడిగాను.
    "నన్నేమీ అడక్కు ఇది ఆడవాళ్ళ సంగతి. నాకేమీ తెలీదు".
    "కోపంగా వున్నారన్న విషయం గ్రహించకుండా, చీరలు చూపడం నాదే బుద్ది తక్కువను'కున్నాను.
    "భోంచేశారా?".
    "లేద"న్నారు.
    "భోంచేద్దాం రండ"ని పిలిచారు.
    "మీరు తినండి. నాకింకా టైముంది" - అన్నారు. మేం భోంచేశాం. నాలుగు గంటలకి వారు తింటూండగా శంకర్ సింగ్ గారు వచ్చారు.
    "నాలుగు గంటలయ్యింది. ఇప్పుడు భోంచేస్తున్నారేమిటండీ" - అని అడిగారు.
    "మావాళ్ళు బజారుకెళ్ళి ఇప్పుడే వచ్చారు" - అని మా మీద తోసేశారు. నాలో నేనే నవ్వుకున్నాను.
    "శ్రీశ్రీగారూ! పది రోజుల్లో రికార్డింగ్ పెడుతున్నాను. మూడురోజుల్లో మొత్తం పాటలు లాగేద్దాం. మీరు ఒకరోజు ముందుగా వస్తే ఆర్టిస్టులకి రిహార్సల్స్ ఇస్తాం" - అన్నారు శంకర్ సింగ్ గారు.
    శ్రీశ్రీగారు 'అలాగే' అంటూ, "మరో మాట - సరోజ కూడా బాగా పాడుతుంది. పదహారు పాటలున్నాయి. రెండు మూడు పాటలు ఈమె చేత కూడా పాడించండి" - అన్నారు.
    "అలాగే పాడిద్దాం. ఏమమ్మా పాడతారా?" అని అడిగారు.
    "మీరు అవకాశం ఇస్తే తప్పకుండా పాడతానుసార్!" అన్నాను.
    
                             *    *    *
    
                                         తిరుగు ప్రయాణం
    
    శంకర్ సింగ్ గారికి మా వర్క్ మీద మంచి అభిప్రాయం ఏర్పడింది. ఇద్దరం కష్టపడి పనిచేసే వాళ్ళమని అర్ధం చేసుకున్నారు.
    "ఇక మీద మేం మైసూరుకి వచ్చినప్పుడల్లా టికెట్లు మీరే ఇవ్వాలి" - అని శ్రీశ్రీగారన్నారు.
    "తప్పకుండా ఈ సారి మీరు కనీసం పదిరోజులైనా వుంటారనుకున్నాను.
    పాపం! వీళ్ళు మైసూర్లో ఏమీ చూడలేద"ని శంకర్ సింగ్ గారన్నారు.
    "మీ దయవుంటే మళ్ళీసారి వచ్చినప్పుడు చూస్తాం సార్! డబ్బింగ్ అంతా ఇక్కడే కదా చేస్తారు" - అన్నాను.
    "లేదమ్మా! పాటలు మాత్రం ఇక్కడ, డబ్బింగ్ మద్రాసులోనే చేస్తాను - ఎలాగూ పాటలకోసం మీరిక్కడికి రావాలిగా" అని, "శ్రీశ్రీగారూ! నాకిక శలవా! నాలుగైదు రోజుల్లో నేనుకూడా మద్రాసు వస్తున్నాను. మిమ్మల్ని కలుస్తాను. ఈలోగా డైలాగ్స్ సంగతి చూస్తారా!" -అని అడిగారు.
    "డైలాగ్స్ నాకు బృందావన్ గార్డెన్స్ లో రాయాలని వుందండి. పాటలు కోసం మూడు రోజులు, డైలాగ్స్ రాయడానికి మూడు రోజులు వుండి వెళ్ళేటట్టు ఈసారి ప్లాన్ చేసుకుని రావాలనుకుంటున్నాను" - అన్నారు శ్రీశ్రీగారు.
    "వెరీగుడ్ అంతకన్నా ఏం కావాలి! చాలా సంతోషం. మీకు బృందావన్ గార్డెన్స్ లోనే రూమ్ బుక్ చేస్తాను. జాగ్రత్తగా వెళ్ళిరండి. నేను దిగి కారు పంపుతాను" - అంటూ శ్రీశ్రీగారి చేతికి వెయ్యి రూపాయలిచ్చారు.
    కారు పంపవద్దని నేను చెప్పాను. మద్రాసులో కలుసుకుందామని వెళ్ళిపోయారు శంకర్ సింగ్ గారు.
    కొన్న చీరలన్నీ పెట్టెలో కుక్కేశాను.
    "టైమయిపోతోంది. త్వరగా తెమలండి" - అన్నారాయన.
    చీరలు కొనగా మిగిలిన డబ్బు వారి దగ్గర పెట్టాను.
    "ఏం వద్దా?".
    "అది కాదండీ...."
    "ఏది కాదు? దగ్గరుంచుకో....ఇదిగో, మరో రెండువందలు కూడా ఇస్తున్నాను. తీసుకో" అన్నారు.
    "నాకిస్తానన్నది మూడు వందలైతే, రెండు వందలు ఎక్కువ ఇస్తున్నారే మరి మీకో?" అన్నాను.
    "నీ  కళ్ళెదుటే వెయ్యి రూపాయలిచ్చారుగా? ఇందులో నీకు రెండువందలిస్తున్నాను. తీసుకో" అన్నారు.
    మొదట్లో చెప్పినప్పుడు, మూడు వందల కన్నా ఎక్కువ ఇవ్వలేనన్నారు. ఇప్పుడు అయిదు వందలిచ్చారు. ఏమిటీ వీరి తత్వం!
    "తాగుడు మైకంలో ఇచ్చారేమోనే" - అంది మా అమ్మ.
    "అలాగై వుండదమ్మా.... పోనీ రేపు ఇచ్చేస్తాలే" - అన్నాను.
    డబ్బింగ్ ఇంకా కాలేదు. సాంగ్స్ సరే సరి! సాంగ్స్ కి నేను లేకపోయినా మునిగిపోయేదేమీ లేదు. ఇంకా - తెలుగు డైలాగ్స్ రాయాలిగా! - అనుకుంటూ, ఆ మహానుభావుడికి మనస్సులోనే జోహార్లు అర్పించాను.
    అయిదు వందల రూపాయల కోసమో, లేక అయిదు వందల ముఖం ఎరక్కనోకాదు. వారి మనస్సు, మాట నిలకడ... ఇవికాక ముఖ్యంగా, జాలిగొలిపే ఆ తత్వం నా మనస్సుని కలచివేసింది.
    "నువ్వేం భయపడకు. నిన్నే మీ చెయ్యను. రాక్షసుడ్ని కాను" - అన్నారు. నిజంగానే మమ్మల్నే విధంగానూ నొప్పించలేదు. మద్రాసులోని వదంతులతో భయపడ్డ మేము, మైసూరు ప్రయాణం ఇంత సాఫీగా సాగుతుందనుకోలేదు.
    ఒక్కటి మాత్రం నిజం. ఆయన ఒండూ గుండూ తెలీని మనిషి, నిజంగా అమాయకులే! అందుకే అందహ్రూ ఆడిపోసుకుంటున్నారని ఆలోచిస్తూ కూర్చున్నాను.
    "అన్నీ సర్దేశారా! నా పెట్టే ఏదీ?".
    "మీ పెట్టేకూడా సర్దేశాను. అదిగో అక్కడుంది. మనీపర్స్ మాత్రం తలగడ కింద వుంది. కళ్ళజోడు, వాచీ, పెన్ను, డైరీ టేబుల్ మీదే వున్నాయి. మీదే ఆలస్యం. మేం రడీ" - అన్నాను.
    కళ్ళజోడు పెట్టుకున్నారు. పెన్నూ, పర్సూ, డైరీ జేబులోకి వెళ్ళిపోయాయి "నేనూ రడీ" - అన్నాను.
    "పెట్టెకి తాళం వేసెయ్యనా?".
    "ఆఁవేసేసి తాళంతోపాటూ, ఒక పిన్ను కూడా ఇయ్య" మన్నారు.
    పిన్నుకి తాళం తగిలింది, ఎంతో శ్రద్దగా జేబుకి గుచ్చుకున్నారు.
    నాకు ఆశ్చర్యం వేసింది. తాగిన డ్రింక్ అంతా ఏమయ్యింది? ఊరంతా తిరిగొచ్చి మేం ఇంకా డల్ కొడుతున్నాం. కానీ ఆయన తాగినట్టు లేరు.
    "అన్నట్టు పాటలు, స్క్రిప్ట్ మీ పెట్టెలోనే పెట్టేశారు" అని చెప్పాను.
    "ఏమీ, నీ దగ్గరే వుంచలేకపోయావా?".
    అనుమానం తీర్చుకోడానికి అవకాశం దొరికింది.
    "మద్రాసులో దిగగానే ఎవరితోవ వాళ్ళదే! మీకు స్క్రిప్ట్ అవసరమైతే కష్టం కదా? మళ్ళీ పిలిస్తే తప్ప. నేను మైసూరు వచ్చేది కూడా సందేహమే! స్క్రిప్ట్ వర్క్ పూర్తయిపోయింది. ఈ పిక్చర్లో నా అసిస్టెంట్ పనికూడా అయిపోనట్టేగా?" - అని గబగబా అనేశాను.

 Previous Page Next Page