పెళ్లి పందిరంతా చాలా హడావుడిగా వుంది.
ఆడా, మగా, పిల్లా, పీచూ- ఓ పక్క బాండ్ మేళం, మరోపక్క పెళ్ళిపెద్దల కేకలతో హోరెక్కిపోతోంది.
నేనూ, శాయీరామ్ రంగారెడ్డి, జనార్ధన్ మొదలయిన కాలనీ వాళ్ళందరం కలసి, కుర్చీల్లో గుంపుగా కూర్చుని బాతాఖాని కొడుతున్నాం- శాయీరామ్ ఆ తరువాత జరగబోయే కాలనీ మీటింగు తాలూకూ ఎజెండా గురించి ఎడా పెడా చర్చిస్తున్నాడు.
అది మా కాలనీ ప్రెసిడెంట్ గోపాల్రావ్ గారి అమ్మాయి పెళ్ళి అవడం వల్ల కాలనీ వాళ్ళందరూ గుమికూడారక్కడ.
ముహూర్తం దగ్గరపడిపోతుంది. పెళ్ళికొడుకు తాళి పట్టుకుని రెడీ అయిపోయాడు. బాజాలవాళ్ళు వేగం విపరీతంగా పెంచేశారు- ఏదో కొంపమునుగబోతుందన్నట్లు.
"మన తెలుగు సినిమాల్లో అయితే సరిగ్గా ఇలాంటి సీన్ లోనే "ఆగండి!" అంటూ కేక వినబడుతుంది! కదూ" అన్నాడు రంగారెడ్డి.
"అవును! ఇలాంటి 'ఆగండి' సీన్లమీదే కొన్ని వందల సినిమాలొచ్చాయ్" అన్నాడు. శాయీరామ్. "అయినాగాని మన ప్రేక్షకులకు ఇంకా ఆ సీన్ లంటేనే యిష్టం"
సరిగ్గా అప్పుడే "ఆగండి!" అన్నకేక వినిపించి అందరం ఉలిక్కిపడ్డాం. మాతోపాటు పెళ్లి పందిరంతా కూడా నిశ్శబ్దం అయిపోయింది.
"ఎవరో భలేజోకు వేశాడు" అన్నాడు శాయీ రామ్ పగలబడి నవ్వుతూ మేమంతా కూడా నవ్వబోయాంగాని ఆ గొంతు మళ్ళీ కర్కశంగా. "జోకుకాదు - గాడిదగుడ్డూకాదు" అని అరచింది.
ఈసారి ఆ గొంతు తాలూకూ ఓనర్ ని అందరం జాగ్రత్తగా చూశాం. ఆ గొంతు ఓనర్ మరెవరో కాదు. "పెళ్లికొడుకు తండ్రి. శాయీరామ్ ని కోపంగా చూస్తున్నాడతను.
"జోక్ కాదాండి!" కొంచెం తగ్గి అడిగాడు శాయీ రామ్.
"గాడిదగుడ్డు జోకు! జోకేమిటయ్యా! ఇది జోకులేసుకునే టైమా?"
ఇంకా మండిపడుతూ శాయీ రామ్ మీద కొచ్చాడతను. శాయీ రామ్ మరో నాలుగడుగులు వెనక్కువేశాడు.
"నేను జోకనుకున్నాను లెండి."
"బుద్దుండాలి అలా అనుకోవడానికి."
ఇక లాభంలేదని నేనూ రెడ్డీ జోక్యం చేసుకున్నాం.
"వాడికి కొంచెం బుద్ది సరిగ్గా ఉండటం లేదులెండి. అదీ ఈ మధ్య.... టి.వి.లో డ్రామా లేయడం మొదలెట్టినప్పటి నుంచేలెండి! అంతకుముందు బాగానే ఉండేది-" అని సర్దిచెప్పాడు రెడ్డి.
ఇంతలో గోపాల్రావ్ పరుగుతో వచ్చాడు మా దగ్గరికి.
"ఏమిటి వియ్యంకుడుగారూ! ఏం జరిగింది" అన్నాడు గాబరాగా.
"గాడిదగుడ్డు జరిగింది" అన్నాడు బట్టతలాయన బట్టతల సవర్దీసుకుంటూ.
"గాడిదగుడ్డా?"
"అవును!"
"గాడిదగుడ్డు జరగడమేమిటి?" మరింత గాబరాగా అడిగాడు.
"కాకపోతే ఏమిటయ్యా! తాళికట్టే టైము దగ్గరపడింది! ఇంతవరకూ వప్పుకున్న కట్నకానుకలన్నీ ఇవ్వరేం."
"అదేమిటీ? కట్నం ముందే ఇచ్చాంగా?"
"కట్నం సంగతి సరేనయ్యా కిర్సనాయిలుసంగతేమిటి?"
"కిర్సనాయిలా?"
"అవును"
"కిర్సనాయిలు ఇప్పుడెందుకు?"
"ఇప్పుడు కాకపోతే ఎప్పుడిస్తారయ్యా? మాకోడలిని తగలేసుకోవద్దా?"
"వీల్లేదు. మా వంశాచారం ప్రకారం పదకొండో నెలవరకూ ఇంటికోడలిని తగలెట్టడానికి వీల్లేదు" అరచాడు గోపాల్రావ్.
"మీ బోడి వంశచారం- మీ కోడలికి పాటించండి. మా కోడలిని ఎప్పుడు కిర్సనాయిలుతో తగలెయ్యాలో అది మా ఇష్టం"
"కాదు మా ఇష్టం" అన్నాడు గోపాల్రావ్.
"అలా ఒకరికొరకు రెచ్చిపోతే ఎలా గోపాల్రావ్ గారూ! ఇలాంటి విషయాల్లో పట్టు విడుపులంటూ లేకపోతే కష్టం. మన అమ్మాయిని వాళ్ళ చేతుల్లో పెట్టాక వాళ్ళు ఎప్పుడయినా తగలేసుకోనీండి. మనం అడ్డు చెప్పడం బావుండదు" అన్నాడు రంగారెడ్డి ఇద్దరినీ శాంతపరుస్తూ....
"సరే, అలాగే! ఎనిమిదోనెలే తగలేసుకోనీండి." తగ్గి, అన్నాడు గోపాల్రావ్.
"మరి కిర్సనాయిలు మాటేమిటి?" మళ్ళీ అడిగాడు బట్టతలాయన.
"ఏం కిర్సనాయిలు?"
"మీ అమ్మాయిని తగలెయ్యడానికి పాతికలీటర్ల కిర్సనాయిలు ఇస్తానని ఒప్పుకున్నారుగా, అదేది అనడుగుతున్నాను."
"కిర్సనాయిలు సప్లయి చేస్తానని నేను వప్పుకోలేదే."
"వప్పుకున్నారని మధ్యవర్తి చెపితేనే గదయ్యా- ఈ సంబంధం చేసుకోవడానికి వప్పుకుంది."
"ఏడీ మధ్యవర్తిని పిలవండి."
"పిలవండి!"
అందరం మధ్యవర్తికోసం వెదికాంగానీ మామూలుగానే ఆయనెక్కడా కనిపించలేదు.
"అయ్యా ముహూర్తం మించిపోతోంది. తాళి కట్టించేస్తే బావుంటుంది-" అన్నాడు పురోహితుడు.
"బోడి ముహూర్తం పోతేపోనీ, కిర్సనాయిలు సంగతి తేలందే తాళి కట్టడానికి వీల్లేదు! అబ్బాయ్ పీటల మీద నుంచి లేచి ఇక్కడికొచ్చేయి" అన్నాడాయన. రెడ్డి మళ్ళీ ఆయనను శాంతపరచడానికి ప్రయత్నించాడు.
"ఇదిగో చూడండి బట్టతలగారూ"
ఆయన కోపంతో ఎగిరిపడ్డాడు.