"ఇది మరీ పాత మోడల్ సార్! దీన్నేవరు కొంటారు?"
"పురాతన వస్తువులంటే ఇష్టపడేవాళ్ళు చాలామంది ఉంటారు కదా సిటిలో.........వాళ్ళకు బ్రహ్మాండమైన రేటుకి అమ్మవచ్చు" నవ్వుతూ అన్నాడు నటరాజ్.
"ఏభయ్ రూపాయలిస్తాన్సార్" అన్నాడు వాడు కొద్ది క్షణాలు అలోచించి.
"ఏయ్ వెంకట్! డబ్బావసరమన్నాం కదాని ముంచెయ్యడానికి ప్రయత్నించకు! అమ్మేసిం తర్వాత పోయిందని పోలీసు కంప్లయింటిస్తే నిన్ను మూసేస్తారు."
"పోనీ సార్! అరవై .......అంతకంటే ఎక్కువ రాదు.'
"సరే.......ఇవ్వు."
అరవై రూపాయలు తీసుకుని తిన్నగా కళ్ళజోడు షాపు చేరుకొని జేబులో నుంచి సీత కళ్ళజోడు తీసి అతనికిచ్చాడు.
"ఇదిగో ప్రిస్కిప్షన్! వెంటనే అద్దాలు వేసివ్వాలి! ఎంతవుతుందో చెప్పు."
"యాభై."
కిందటి సారి నువ్వేసిన అద్దాలు మంచివి కావని డాక్టర్ చెప్పాడు. దానివల్లే మా సీతమ్మ కళ్ళకి సైటు పెరిగిపోయిందంట" అన్నాడు నటరాజ్.
"పవర్ ఉన్నప్పుడు అద్దాలన్నీ ఒక్కటే" నవ్వుతూ అన్నాడు షాపు అతను. "సరే నలభై యివ్వండి.'
రామచంద్రమూర్తి నలభయ్ ఇచ్చేశాడు.
"రేపొద్దున్న యిస్తావా?"
"పదింటికి రండి!"
ఇద్దరూ మౌనంగా ఇంటికి తిరిగొచ్చారు.
"ఎక్కడికి పోయారిద్దరూ చెప్పకుండా?" చిరాకుపడింది సీత.
"మేమేక్కడికి పోతామమ్మా! ఆ చివరింటిలో ఆరు వోట్లు వున్నాయంటే ప్రచారాని కెళ్ళాం."
"అంటే పిచ్చి ముదిరిందన్న మాట.'
"అప్పుడే కదా ఎలక్షన్స్ లో గెలిచేది?"
ఆ రాత్రి రామచంద్రమూర్తికి నిద్ర పట్టలేదు. గ్రామఫోన్ రికార్డ్ పగిలిపోవటం కంటే కూడా గ్రామఫోన్ అమ్మేయటం మరింత బాధ కలిగించిందతనికి.
జీవితంలో తనకున్న ఒకే ఒక్క అనందం ఆ గ్రామఫోన్ రికార్డ్.
అది లగ్జరీ కాకపోయినా ఎంతో అపురూపమైన స్టానం దానికుంది తన హృదయంలో! తన మొదటి జీతంతో కొనుక్కున్నడది.
మొదటి జీతం తీసుకెళ్ళి తన తల్లికిస్తే , మాకేందుకురా డబ్బు - నువ్వే తిండి తిప్పలు చూడాలి కదా! ఇంక డబ్బుతో మాకేం అవసరం? నీకు చిన్నప్పటి నుంచీ గ్రామఫోన్ యిష్టం కదా! అది కొనుక్కో పోనీ" అంది ఆమె.
"ఏమిటింకా నిద్రపోతున్నారు! ఇవాళ మీ పెళ్ళి రోజు సార్! నటరాజ్ లేపుతుంటే మెలకువ వచ్చిందతనికి. చటుక్కున కళ్ళజోడు విషయం గుర్తుకొచ్చిందతనికి.
నటరాజ్! నేను స్నానం చేసి రెడీ అయ్యే లోపల నువ్వెళ్ళి కళ్ళజోడు తీసుకురా!"
ఒకే సార్"
అన్నట్టే పది గంటల కల్లా కళ్ళజోడు తెచ్చేశాడతను.
సీత అప్పటికే పూజ ముగించుకుని బయటికొచ్చింది. పాత పట్టుచీర కట్టుకుని వింత అందంతో మెరిసిపోతోందామె.
"ఈసారి నీకు బహుమానం ఏమిటో చెప్పుకో చూద్దాం!" అన్నాడు రామచంద్రమూర్తి.
సీత నవ్వింది.
"బాగుంది! మీరే కుబెరులా ఏమిటి బహుమతులు ఇచ్చిపుచ్చుకోటానికి! ఈసారి నేనే మీకు బహుమతి యిస్తున్నాను. ఒక్కసారి కళ్ళు మూసుకోండి."
రామచంద్రమూర్తికి అశ్చర్యం కలిగింది.
"నువ్వు బహుమతి యిస్తావా."
"ఏం? ఇవ్వలేనా?"
"నీ దగ్గర డబ్బేది?"
"అవన్నీ చెప్తారా ఏమిటి? ముందు మీరు కళ్ళు మూసుకోండి"
నటరాజ్ ఆసక్తిగా చూస్తున్నాడు.
రామచంద్రమూర్తి కళ్ళు మూసుకున్నాడు.
అతని చేతికి ఓ గుండ్రని కవర్ తగిలింది.
చటుక్కున కళ్ళు తెరిచాడు.
సరికొత్త గ్రామ ఫోన్ రికార్డ్! గుండె వేగంగా కొట్టుకుందతనికి.
చటుక్కున కవర్ తీసి చూశాడు. ఘంటసాల 'అందమే అనందం' అక్షరాలు కనిపించాయి. మధ్యలో ఎక్కడలేని అనందం ఉక్కిరిబిక్కిరి చేసిందతనిని.