Previous Page Next Page 
భామ కలాపం పేజి 17


    ఇద్దరూ కారు దిగి , ఆ స్థలమంతా తిరిగి చూశారు. పెద్ద చింతల తోపు అది. దానికి నాలుగు వైపులా మెయిన్ రోడ్లే.

 

    గబగబ లెక్క వేసింది సుదీర మనసు. ఇక్కడ నుంచి ఎయిర్ పోర్టు రెండు కిలోమీటర్లు, రైల్వే స్టేషన్ ఒకటిన్నర కిలోమీటరు, మెయిన్ షాపింగ్ సెంటర్ ఒక కిలో మీటరు. మార్కెట్ ఒక కిలో మీటరు. కిలోమీటరు వ్యాసార్ధంలో ఎనిమిది దియేటర్లు మంచి సెంటర్ అది.

 

    "ఎక్స్ లెంట్!" అంది సుదీర.

 

    అప్పుడు గుర్తొచ్చింది. తనకి దాహం వేస్తోందని. ఎండ మండిపోతోంది. ఆమె కనుబొమ్మల మధ్య నుంచి ముక్కుమీదికి జారుతోంది ఒక స్వేదపు చుక్క.

 

    "కొద్దిగా మంచినీళ్ళు దొరికితే బాగుండు!" అంది సుదీర. బాగా దాహం వేసినప్పుడు ఏ కూల్ డ్రింకు మంచి నీళ్ళకి సాటి రాదు.

 

    "ఇక్కడే చిన్న హొటల్ ఒకటి ఉంది. రండి!" అని దారి తీశాడు సారధి.

 

    "వాళ్ళు కూర్చోగానే రెండు గ్లాసులతో మంచినీళ్ళు పెడుతూ వేడిగా ఇడ్లి, దోశ, మైసూర్ బొండా! ఏం తీసుకుంటారు సార్!" అన్నాడు హొటలతను. అతను దయాకర్.

 

    ఆ స్థలంలో అతని హొటలు ఉంది.

 

    కుతూహలం కొద్ది ఇడ్లి, కారపు పొడి, కొబ్బరి చెట్నీ, అల్లం పచ్చడి ఆర్డరు చేసింది సుదీర. తను అలాంటివి స్టఫ్ తిని చాలా రోజులయింది. స్వర్గానికి బెత్తెడు దూరంలో ఉన్నట్లు అనిపించింది వాటి రుచి.

 

    సువాసనలు వెదజల్లే ఫిల్టరు కాఫీ తాగాక, బిల్లు తెచ్చాడు దయాకర్. రెండు రూపాయల యాభై పైసలు........! అంతేనా?

 

    ఆశ్చర్యంగా అయిదు రూపాయల నోటు అందించి, చిల్లర తీసుకోకుండానే కారెక్కింది సుదీర.

 

    ఆమె కారు కదిలిన తరువాత ముప్పై సెకండ్లకు, భారతి కాంటిన్లో అడుగు పెట్టింది.

 

    ఆ ముప్పై సెకెండ్ల తేడా, తరువాత తరువాత వాళ్ళందరి జీవితాలని బలమైన మలుపులు తిప్పేసి, ఉహించలేనంత దారుణమైన పరిణామాలకు దారి తీస్తుందని వాళ్ళెవరికి తెలియదు అప్పట్లో.

 

    సుదీర కనక భారతిని అప్పుడే, అక్కడే చూసి ఉంటె కధ మరోలా ఉండేది.

 


                                                                            --------------

 

    పెరట్లో బావి దగ్గర తన ఖద్దరు లాల్చీ పంచా తనే ఉతుక్కుంటున్నారు సదాశివరావుగారు. ఒంటి చేత్తో వాటికి సబ్బు పట్టించడం కష్టంగానే ఉంది.

 

    ఆయనకు ఎప్పుడూ రెండే రెండు జతల బట్టలు వుంటాయి. ఇదివరకు, ఆస్తి పూర్తిగా తరిగిపోని రోజుల్లో కూడా అదే పద్దతి. ఒకటి ఒంటి మీద ఉంటె, రెండోది ఉతికి ఆరేసి వుంటుంది. ఖద్దరు కూడా మామూలు ముతక రకందే వాడతారు. చాలామంది రాజకీయవేత్తల్లాగే అతి పలచటి, అతి ఖరీదైన ఖద్దరు బట్టలు యాభై జతలు కలిగి వుండి, డ్రైక్లినింగ్ చేయించి పొద్దునా, సాయంత్రం రోజుకి రెండుసార్లు బట్టలు మార్చే రకం కాదాయన. సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్, అంటే నిరాడంబరంగా జీవించు, మహోన్నతంగా ఆలోచించు అన్న నానుడిని మార్చేస్తూ 'ఆడంబరంగా జీవించు, అత్యల్పంగా ఆలోచించు' అన్న నయా నాయకుల స్థాయికి అయన ఇంకా ఎదగలేదు.

    
    "నాన్నగారూ!" అని దగ్గరికి వెళ్ళాడు భరత్. "వద్దన్న ఊరుకోకుండా శ్రమ పడతారు మీరు. ఆ ఒక్క జత బట్టలూ నేనో, భరతో ఉతికి పెట్టామా! మీరు పక్కకి జరగండి."


    "వద్దు నాయనా! ఇదెంత పని అని!"

 

    వినిపించుకోకుండా, ఆయన్ని లెమ్మని , తను కూర్చున్నాడు భరత్. "నాన్నగారూ!"

 

    "చెప్పు భరత్!"

 

    అప్పుడే కాలేజి నుంచి తిరిగి వచ్చింది భారతి. భరత్ ని చూడగానే, "ఇంకా నయం! నువ్వు బట్టలు ఉతకడమేమిటి? లేలే!: అంటూ పుస్తకాలు గుమ్మం దగ్గరే పెట్టేసి దగ్గర కొచ్చింది.

 

    హతాశుడయినట్లు చూశాడు భరత్.

 

    "నువ్వే వెళ్ళు ఇంట్లోకి. లేలే!"

 

    ఏం చెయ్యాలో తోచలేదు భరత్ కి. అతను సుదీర విషయం తండ్రితో చెప్పాలని నిన్నటి నుంచి ప్రయత్నిస్తున్నా కుదరడం లేదు. ఇప్పుడింక తెగించి చెప్పేద్దామనుకుంటే చెల్లెలు వచ్చేసింది.

 

    "నువ్వు లోపలి కెళ్ళు భారతి! నేను నాన్నగారితో మాట్లాడాలి"

 

    "ఏం? నేను వినకూడనంత రహస్యమా ఏమిటి? అంది భారతి అల్లరిగా. తను కనిపెట్టేసింది భరత్ చెప్పబోయేది ఏమిటో.

 

    "అల్లరి చేశావంటే ఇవాళ నీ పెళ్ళి చేస్తాను.'

 

    "ఆ........ఆ! అదే నీకు అవబోయేది! అని నవ్వుతూ చూసి లోపలికి వెళ్ళిపోయింది భారతి. వెళ్ళి కిటికీ దగ్గరే కనబడకుండా నిలబడి వింటోంది.


    "నాన్నగారూ!"

 

    "చెప్పు భరత్. తటపటాయిస్తావెందుకు?"

 

    "అన్నయ్య చెప్పలేడు లెండి నాన్నగారూ! నేనే చెప్పేస్తాను. ఇది చిలక సందేశం అనే కద! మనింట్లో కొత్త పంచవన్నెల రామచిలక రాబోతోంది."

 

    "ఏమిటి?"

 

    "అదే నాన్నగారూ! సుదీర అని ఆ రోజు ఒక అమ్మాయి రాలెదూ? ఆ అమ్మాయి మన ఇంటికి పర్మనెంటుగా వచ్చేసి ఇక్కడే ఉండిపోవాలని తపించిపోతోంది."

 

    "నీ కెవరు చెప్పారు?" అన్నాడు భరత్ ఆశ్చర్యంగా.

 

    "ఒకళ్ళు చెప్పాలేమిటి? ఆ అమ్మాయి నీ మొహంలోకి చూసినప్పుడు ఆమె మొహంలో మోహం కనపడిపోతుంటే."

 

    "నీ మొహంలే!"

 

    "నిజమేనా భరత్" అన్నాడు సదాశివరావుగారు.


    ఇబ్బందిగా కదిలాడు భరత్. "ఆ అమ్మాయి తనంతట తనే అడిగేసింది నాన్నగారూ 'నన్ను పెళ్ళి చేసుకుంటారా?" అని" అన్నాడు తన తప్పేమీ లేదన్నట్లు.

 

    సదాశివరావుగారు నవ్వారు. "ఇది జెట్ యుగం నాయనా! ఈ వేగానికి తగినట్లు కాకుండా పాతకాలపు పద్దతుల్లో పెంచానేమో మిమ్మల్ని. సరే! ఇంతకీ ఏం జవాబు చెప్పావు?"

    
    "ఏ జవాబు చెప్పాలో నాకు తోచలేదు. మీతో కూడా మాట్లాడి చెబుతా నన్నాను."

 

    ఆప్యాయంగా కొడుకు వైపు చూసుకున్నారు సదాశివరావుగారు. అతను తనకంటే నాలుగంగుళాలు ఎక్కువ పొడుగు. బలంగా, ఆరోగ్యంగా ఉంటాడు. తన కాళ్ళ మీద తను నిలబడి బతకగల సమర్ధుడు. తనకి తోచిన నిర్ణయాలు తీసుకోగలడు. తలచుకుంటే తన దారి తను వెదుక్కుంటూ వెళ్ళిపోగలడు.

    
    అయినా తన మీద పెద్దరిక ముంచి అడుగుతున్నాడు.


    అభిమానంగా అన్నారాయన "ఒక వయసు వచ్చాక కొడుకుని స్నేహితుడిలా చూసుకోవాలని పెద్దలు అంటారు. భరత్! నా అభిప్రాయలు మీ మీద రుద్దడం తప్పు! అసలు నీ అభిప్రాయమేమిటో చెప్పు ముందు?"

 

    "నాకు ఏ అభిప్రాయము లేదు."

 

    తను కలగజేసుకుంది భారతి. "మీరు తీర్మానాన్ని ఓటింగు కి పెట్టి నా అభిప్రాయం కూడా అడిగితే నాకు ఆ అమ్మాయి మీద చాలా సదభిప్రాయమే ఉందని చెబుతాను."


    ఇలాంటి విషయాల్లో అభిప్రాయలు చెప్పేటంత ప్రాయం నీకు లేదు" అన్నాడు భరత్ నవ్వుతూ.

 

    "అని దురభిప్రాయపడుతున్నావు నువ్వు!" అంది భారతి వెంటనే.


    అప్పుడు మొదటిసారిగా స్పురించింది భరత్ కి. తను ఇంకా భారతిని తన చిట్టి పొట్టి ముద్దుల చేల్లెలిగానే చూస్తున్నాడు. ఎంత పొరబాటు! తను ఎత్తుకు ఆడించిన పాప కాదింక భారతి! దాదాపు తన ఎత్తుకు పెరిగిపోయిన ముగ్ధ ఈ అమ్మాయి.


    అతను ఆమెను అప్పుడే, మొదటిసారిగా చూస్తున్నట్లు ఆశ్చర్యంగా చూశాడు.


    వయసు వచ్చిన చెల్లెలికి పెళ్ళి చెయ్యకుండా తనే ముందుగా పెళ్ళికి తయారవుతున్నాడా?


    చీ! చీ! అలా జరగకూడదు తప్పు.


    హఠాత్తుగా ఒక నిశ్చయానికి వస్తూ అన్నాడు భరత్. "నాకు ఇప్పట్లో పెళ్ళి చేసుకునే ఆలోచన లేదు నాన్నగారూ! ఇష్టం లేదని ఆ అమ్మాయితో చెప్పేస్తాను."


    "ఉన్నట్లుండి ప్లేటు మార్చేశావేమిటి? ఏమయింది?"  అంది భారతి ఆశ్చర్యంగా.


    "ముందు నీ పెళ్ళి చెయ్యాలి. ఆ తరువాతే నా పెళ్ళి."

 

    "అలా ఎందుకూ?" అన్నారు సదాశివరావుగారు. "నాలుగు రోజులు గట్టిగా తిరిగి భారతికి కూడా సంబంధం చూస్తే ఇద్దరూ ఒకే పందిట్లో పెళ్ళి చేసేసుకోవచ్చుగా కన్నుల పండుగగా."


    దయాకర్ సంగతి చెప్పేద్దామా అని అనిపించింది భారతికి. కానీ, ఆమె పెరిగిన సాంప్రదాయం ఆ మాటని నోటినుంచి బయటకు రానివ్వలేదు. ఈ విషయం దయాకరే వచ్చి చెప్పాలి. తనే చెప్పేస్తే ఎబ్బెట్టుగా వుంటుంది.

 Previous Page Next Page