"సాధారణంగా మేము కారణాలు చెప్పం...." అన్నాడు ఎడిటర్ వ్యంగ్యంగా "కానీ మీరు అడుగుతున్నారని చెబుతునం ఇది రోమనుల కాలం నాటి రచనలా వుంది. అసలు చదువుతూంటే మాకే మతిపోయింది."
"అంత నిశ్చయంగా ఎలా చెప్పగలరు?"
"మేము చెప్పలేదు యాజీ! మా కంప్యూటర్ చెప్పింది" అన్నాడు సర్క్యులేషన్ మానేజర్ కల్పించుకుని.
"నేను మీ ఫీడింగ్ ను చూడాలనుకుంటున్నాను."
"ఎప్పుడు?"
"ఇప్పుడే.... వెంటనే..."
వాళ్ళు పత్రిక ఆఫీసుకు చేరుకున్నారు. ఇంతసేపు, ఇంత వాగ్వివాదం జరుగుతున్నా భరద్వాజ మౌనంగా ప్రేక్షకుడిలా వుండిపోయాడు. వీటన్నిటికీ అతడిప్పుడు అతీతుడిలా వున్నాడు. జరిగేది నిర్లిప్తంగా చూస్తున్నాడంతే యాజీ మాత్రం గాయం తగిలిన శివంగిలా వున్నాడు.
పది నిముషాల్లో ఆ రచనని కంప్యూటర్ కి ఫీడ్ చెయ్యటం జరిగింది. రకరకాల రంగుల లైట్లు - స్విచ్ ఆఫ్ అండ్ ఆన్ లు... ఆ తరువాత కంప్యూటర్ తన నిర్ణయాన్ని తెలిపింది.
DEVASTAIKG... UTTERFLOP....DON'T PUBLISH... FOOLISH...
ఎడిటర్ యాజీవైపు గర్వంగా చూశాడు. యాజీ మాట్లాడకపోయేసరికి గాయంమీద కారం జల్లుతున్నట్టూ "ఈ కాలం కుర్రవాళ్లకి కావలసింది బూజుపట్టిన బొద్దింకల పచ్చళ్ళు కావండి" అన్నాడు.
అప్పటికి తన ఆలోచన పూర్తయినట్టూ యాజీ తాపీగా, "మీ పత్రికలో ఫుల్ పేజీ అడ్వర్టయిజ్ మెంటుకి ఎంత ఖర్చవుతుంది?" అని అడిగాడు.
అసంబద్దమైన ఈ ప్రశ్నకి వాళ్ళ మొహాలు తెల్లబడ్డాయి. ఎడిటర్ జవాబు చెప్పాడు.
యాజీ గంభీరంగా అన్నాడు - "వచ్చేవారం నుంచీ మీ పత్రికలో వారానికి కొన్ని పేజీల చొప్పున నేను అడ్వర్ టైజింగ్ బుక్ చేసుకుంటున్నాను. మీరే రకంగా సీరియల్ వేస్తారో అదే విధంగా నా రచయిత నవల మీ పత్రికలో సీరియల్ గా వస్తుంది. నా యిష్టం వచ్చిన రీతిలో నేను ప్రచురించుకుంటాను."
వాళ్ళింకా షాక్ నుంచి తేరుకోలేదు. యాజీ బయటికి నడిచాడు. అంతా చూస్తున్న భరద్వాజ మోహంలో సంతృప్తితో కూడిన సన్నటి చిరునవ్వు కదలాడింది. వాళ్ళని వదిలేసి తనూ బయటికి నడిచాడు.
"మన నవలకి పేరేం పెడదాం?"
భరద్వాజ కొంచెంసేపు ఆలోచించి "వయసు ఉత్పలమాల" అన్నాడు.
"నవల వ్రాసిన భావుకత్వం నుంచి మీరింకా తేరుకోలేదనుకుంటా ఈ కథ కేవలం ఒక కుర్రవాడి వయసుకి సంబంధించినది కాదు. రొమాన్స్ వున్నమాట నిజమే. కాని అంతకన్నా అంతర్వాహిని అయిన వేదాంతం వుంది. ఆ రెండూ కలిసినట్టు ఏదయినా పెడ్తే బావుంటుంది."
"...ఆనందోబ్రహ్మ" వెంటనే అన్నాడు భరద్వాజ.
యాజీ కళ్ళు సంభ్రమంతో పెద్దవయ్యాయి. 'గుడ్' అన్నాడు.
ఆ తరువాత వారం నుంచి విమల్, పాండ్స్ వారి ప్రకటనల్లా భరద్వాజ సీరియల్ ప్రారంభమయింది.