Previous Page Next Page 
కిడ్నాప్ పేజి 16

    సరిగ్గా అదే సమయంలో గేట్లోంచి లోనికొస్తున్న టయోటా జీప్ వేపు చూసిందామె.

    సత్తిపండు జీప్ దిగి వదినగార్ని విష్ చేసి, తేజ బుగ్గమీద గిల్లాడు.

    "ఏమిటీ మీ అన్నగారు మధ్యాహ్నం లంచ్ కు రాలేదు" అడిగింది సుదేష్ణాదేవి.

    "లేబర్ మినిస్టర్ వచ్చాడు ఫ్యాక్టరీకి. గెస్ట్ హౌస్ లో లంచ్" అని జవాబు చెప్పి__

    "వీడు పెద్దయిపోతే నా బాధ్యతలన్నీ వీడి కప్పగించి, ఏ హృషీకేశ్ కొ వెళ్ళిపోతాను" అని అన్నాడు సత్తిపండు.

    "అంత వైరాగ్యం ఏమొచ్చింది సత్యం" నవ్వుతూ అంది సుదేష్ణాదేవి.

    సరిగ్గా అదే సమయంలో బ్రౌనీ వేపు చూసిన సత్తిపండు ముందుకు పరిగెత్తి__

    కాళ్ళతో బ్రౌనీని గట్టిగా తన్నడం, ఆ తన్నుకు బాధతో సుడులు తిరిగిపోతూ బ్రౌనీ కుయ్, కుయ్ మని అరవడం__

    ఆ అరుపు చూసిన తేజ, ఒక్కసారిగా ఏడుపు లంకించుకోవడం_అన్నీ ఆకస్మికంగా జరిగిపోయాయి.

    అంతవరకూ ప్రశాంతంగా వున్న తేజ, ఒక్కసారిగా ఏడవటంతో సత్తిపండు చర్యకు సుదేష్ణకు కోపం వచ్చింది.

    "అనవసరంగా ఆ కుక్కని కొట్టడం ఎందుకు" మందలిస్తున్నట్టుగా అంది, తేజను లాలిస్తూ.

    "అయిదువేలు ఖర్చుపెట్టి అన్నయ్య తెచ్చిన బొమ్మని, ఎలా పీలికలు చేసేసిందో బ్రౌనీ" పీలికలై పోయిన బోమను చూపిస్తూ అన్నాడు సత్తిపండు.

    "బ్రౌనీ అంటే తేజ కిష్టం- అది బాధపడితే, వాడు చూడలేడు."

    ఆ మాటతో ఒక్కసారిగా చిన్నబోయాడు సత్తిపండు.

    "ఈ ఇంట్లో కుక్కలకున్న విలువ, మనుషులకులేదు" సీరియస్ గా అనేసి గబగబా లోనికి నడిచాడు.

    సుదేష్ణాదేవి ఎదుట బయటపడటం అదే సత్తిపండుకి మొదటిసారి.
   
                                ౦    ౦    ౦

    లోనికెళ్ళగానే కోమలాంగి అడిగింది భర్త సత్తిపండుని.

    "ఏమిటీ....తీరుబడిగా వదినగారితో మాట్లాడుతున్నారు?"

    "ఆ గుంటవెధవకి ఆ కుక్కంటే ప్రాణమట. ఆ కుక్కని నేను కొట్టానని ఏదో అంది."

    "అంటుంది- అంటుంది- ఎందుకనదూ! భూప్రపంచమ్మీద అదే తల్లయినట్టు, వాడె కొడుకైనట్టు - లక్షరూపాయలు టాయస్ కోసం....ఎవడయినా ఖర్చు చేస్తాడా! బొంబాయినుంచి తెప్పించాడు మీ అన్న__దీర్ఘంతీస్తూ అందామె.

    "కంగారుపడకు- కౌంట్ డౌన్ స్టార్టు అయింది" ఆమె కళ్ళల్లోకి చూస్తూ అన్నాడతను.

    "ఎప్పుడు? ఎలా?" చాలా ఉత్సాహంగా అడిగింది కోమలాంగి.

    "టాప్ సీక్రెట్స్ నీలాంటి ఆడవాళ్ళకు చెప్పకూడదు." అంటూ బాత్ రూమ్ వేపు నడిచాడు సత్తిపండు.
   
                                                                             ౦    ౦    ౦
]
    "జగదా...ఓ జగదా" గొంగళీ భుజమ్మీద వేసుకుని గీతాంజలి సినిమాలో నాగార్జునలా పాట పాడుతూ మామిడి చెట్టుకింద కూర్చుని గేటు వేపే చూడసాగాడు వీర్రాజు.

    "ఆ జైలర్ గారు, ఆ జగదను లాక్కెళ్ళిపోయి మూడుగంటలయి పోయింది. అసలు ఫ్లాష్ బ్యాక్ ఏంటో చెప్పరా- నీ కడుపులోని దుఃఖాన్ని మా కాళ్ళమీద పడెయ్యరా" విషాదపు ఫేసుతో అన్నాడు సేతురాజు.

    "అదొక న్యూస్ బ్లాక్" మరింత ట్రాజిక్కా అన్నాడు వీర్రాజు.

    "న్యూస్ బ్లాక్ అంటే?"

    "అదంతే- వాడిక్కూడా మీనింగ్ తెలీదు- తాత్పర్యాన్ని అర్ధం చేసుకో- చెప్పింది విను- నువ్వు చెప్పరా" ఇంటరెస్టింగ్ గా ముఖంపెడ్తూ అన్నాడు పోతురాజు.

    "సరిగ్గా ఏడునెలలక్రితం, చౌటుప్పల్ లో ఓ లాండ్రీలో షర్టులు, ఫ్యాంటులూ దొంగతనం చెయ్యడానికి వెళ్ళామా- ఆ లాండ్రీ ఓనర్ కూతురే నా జగదా- ఆ అరగంటలోనే, చీకట్లోనే నేనామేను, పిచ్చిగా, గాఢంగా ప్రేమించేశాను- అప్పుడే తెల్సింది- రెండో పెళ్ళివాడికి తననిచ్చి, కట్టబెట్టేసారని- అయినా నాతో వచ్చేస్తానంది నా జగద-

    హైదరాబాద్ లో ప్రొఫెషనల్ కేడీగా స్థిరపడ్డాక, నేను నిన్ను తీసి కెళ్ళిపోతానని, వేడి వేడి ఇస్త్రీ పెట్టిమీద ప్రమాణం చేసి, మరీ చెప్పాను_ ఒరేయ్ ఫ్రెండ్సూ-మీరు నాకు థిక్కెస్ట్- బెస్ట్ ఫ్రెండ్స్ అయితే, మా ఇద్దర్నీ కలపండ్రా-" భోరుమంటూ విలపిస్తూ న్యూస్ బ్లాక్ ను విశదీకరించాడు వీర్రాజు.

    ఆ విషాదగాధకు ఇద్దరి మిత్రుల హృదయాలూ చేరువుల్లా అయిపోయాయి.

    "ఇదే నా శపధం- ఆ జైలర్ గాడి దగ్గర్నుంచి, నీ ప్రేయసిని విడిపించి, ఇదే జైల్లో నీకు, హోమ్ మంత్రి సారధ్యంలో పెళ్ళి జరిపించకపోతే నా పేరు సేతురాజు కాదు-"

    "డిటో-" అన్నాడు పోతురాజు.

    సరిగ్గా అదే సమయంలో నక్క, గాడిద కలగలిసిన కూత విన్పించేసరికి ముగ్గురూ హార్టు ఆపరేషన్ పేషెంట్స్ లా, గుండెలు చేతబట్టుకొని గోడవేపు చూశారు.

    శ్రీకృష్ణ పాండవీయం సినిమాలో చక్కని వేషధారి ధూళిపాళలా, గోడచాటునుంచి వచ్చాడు జైలర్ ఆందోళనరావు.

    "నాకు తెల్సు- మీ ముగ్గురూ- ఇలాంటి కుట్రేదో చేస్తారని, నాకు తెలుసు-రాత్రంతా నా జగద వీరు-వీరు -అని కలవరించినపుడే అనుకున్నాను- ఇదేదో వ్యవహారమని- అంచేతే మిమల్ని ఎక్కడకు పంపించాలో అక్కడికు పంపించే తతంగం పూర్తి చేశా-" విలన్ లా నవ్వుతూ వీర్రాజు వేపు చూస్తూ లాఠీని ఝుళిపించి ముందుకెళ్ళిపోయాడు ఆందోళనరావు.

 Previous Page Next Page