తడబడుతూ కౌసల్య ఎడం చేత్తో కర్చీఫ్ ని మచ్చ దగ్గర పెట్టుకుంది. అప్పటికే రాధా సుధాకరూ ఇద్దరూ చూసేశారు. అనుభవజ్ఞులు కనుక, దాన్ని చూసి ఇద్దరూ ముసిముసిగా నవ్వుకున్నారు.
అత్తయ్యకి దెబ్బ తగిలితే అమ్మా నాన్నా అలా ఎందుకు నవ్వుకుంటూన్నారో అర్ధం కాని స్మిత వారికేసి అలా చూస్తుండి పోయింది.
కౌసల్య మాత్రం సిగ్గుతో చచ్చిపోతూ తలొంచుకుని మరీ టేబుల్ ని కరుచుకున్నట్టుగా వంగిపోయింది. తినడం పూర్తీ చేసి సుధాకర్ చేతులు కడుక్కువచ్చి , గదిలో వున్న కౌసల్య సూట్ కేస్ ని చూసి గతుక్కుమన్నాడు. అతనికేదో అనుమానం వచ్చింది. అడగాలనుకున్నాడు. కాని తనకన్నా రాదే కౌసల్య దగ్గర అన్ని విషయాలు రాబట్టగలదని అలోచించి వెంటనే ఏమి అనక రాదని పిలిచి సూటు కేసు చూపించి, మెల్లగా సంగతేమిటో తెలుసుకోమన్నాడు. ఆమెకి కూడా అనుమానం వొచ్చింది. కౌసల్య ఒక్కర్తే ఇలా పెట్టె పట్టుకొచ్చేయడం, ఆమె మొహంలోని దైన్యం అనుమానాన్ని బలపరిచాయి. నవ్వుతూ తుళ్ళుతూ మాట్లాడే కౌసల్య అలా ఉదాసీనంగా వున్నప్పుడే అనుకుంది , ఏదో జరిగుంటుందని! మెల్లగా అడుగుదాంలే అని ఊరుకుంది రాధ.
తినడం పూర్తీ చేసి చెయ్యి కడుక్కు వొచ్చింది కౌసల్య. స్మిత కూడా తినడం పూర్తీ చేసి అత్త పక్కనే నుంచుంది.
"ఇవ్వాళ్ళ స్కూలు కెళ్ళావా?" అడిగింది కౌసల్య స్మితని.
"ఓ....." అంది వెళ్ళానని తలూపుతూ స్మిత.
"నీ ఫ్రాక్ చాలా బాగుంది కొత్తదా?" అడిగింది కౌసల్య.
అవును డాడీ తెచ్చారు , మొన్న బాంబే నుంచి"
"డాడీ బోంబే వెళ్ళారా? ఎప్పుడు?
"నీకు తెలియదా? నీతో చెప్పాలనేనాన్న గారు బయలు దేరుతుంటే మామయ్యగారే ఇక్కడి కొచ్చారు. 'కౌసల్యతో నేను చెప్పను లెండి అన్నారు . ఆ రాత్రి ఇక్కడే భోజనం చేశారు కూడా. నాన్నగారు నీకోసం మమ్మికోసం జర్జేట్ చీరలు కూడా తెచ్చారు. నాన్నగారు , అమ్మా వొచ్చి నీకిద్దామనుకున్నారు ఇవ్వాళ. వాళ్ళతో నేను కూడా వద్దమనుకున్నాను. అందుకే ఈ ఫ్రాక్ వేసుకున్నాను. ఇంతలో నువ్వే ఒచ్చేశావ్. ఉండు, ఫ్రాక్ మార్చుకుని వచ్చేస్తాను." అంటూ లోపలికి పరుగెత్తింది స్మిత. ఈ సంభాషణలు విన్న రాధ కౌసల్య ఒంటరిగా వుండడం చూసి "కౌసల్యా! అన్నయ్య బాంబే వెళ్ళే ముందు మీ అయన ఇక్కడి కొచ్చారు. అసలు ఆ రోజు మేమే నిన్ను చూడాలని బయలుదేరుతుంటే అతనొచ్చాడు. ఇక్కడ చాలా సేపు వుండి భోం చేసి వెళ్ళారు. ఆ సంగతి నీతో చెప్పలేదా?" అడిగింది రాధ.
"లేదు" అంది కౌసల్య.
"ఆశ్చర్యంగా వుందే!" అంది రాధ.
కౌసల్య ఎంత ఆపుకుందామని ప్రయత్నించినా కన్నీళ్ళు ఆగకుండా ఉప్పెనలా తోసుకుకొస్తున్నాయి. కర్చీఫ్ తో కళ్ళు తుడుచుకుంది.
"కౌసల్యా! నీలో నువ్వు చాలా బాధపడి పోతున్నట్టున్నావు. ఎంతో ఉత్సాహంగా వుండే నీ మొహం ఇలా దీనంగా ఎందుకుంది? అసలేం జరిగింది మీ మధ్యన చెప్పామ్మా!" అంది తల నిమురుతూ ఆప్యాయంగా రాధ. ఆమె మాటల్లోని అభిమానానికీ, ఆదరణకీ వెచ్చదనానికి అంతసేపూ గుండెలో ఉండ చుట్టుకుపోయిన బాధ , నిప్పులో కరిగిన ఉక్కులా ద్రవించి గొంతులోంచి కన్నీరై ప్రవహించి కళ్ళల్లోంచి ఉబుకొచ్చి కళ్ళూ మొహం ఏకం చేశాయి. "వొదినా!" అంటూ ఆమెని చుట్టేసి పసిపిల్లలా ఏడ్చింది కౌసల్య. అలా ఏడుస్తున్న కౌసల్యని చూసి ఏదో పెద్ద గొడవే జరిగి ఉంటుందని ఊహించుకుంది రాధ. ఆమె బాధ కొంత తగ్గి కాస్త ఉపశమనం కలిగాక తనే చెపుతుంది ఏం జరిగిందోనని మాట్లాడించకుండా వీపు నిమురుతూ ఓదార్చింది రాధ. కాసేప్పటికి ఏడుపు మాని, కుర్చీలో కూర్చుంది. బట్టలు మార్చుకునొచ్చిన స్మిత కౌసల్య ఏడవటం చూసి పరుగెత్తుకుంటూ వెళ్ళి తండ్రితో చెప్పింది. సుధాకర్ కంగారుగా పరుగెత్తు'కొచ్చాడు. కౌసల్య రాదని కౌగలించుకుని ఏడవడం చూసి ఏదో అనే లోపలే రాధ 'మాట్లాడకండి' అని సైగ చెయ్యడంతో వెనక్కెళ్ళి పోయి తన గదిలో కూర్చున్నాడు. ఇదంతా చూసిన స్మిత తను కూడా మాట్లాడకూడదని, అక్కడుండకూడదనీ గ్రహించి వెళ్ళి టి.వి ముందు కూర్చుంది ఏమి తెలియని దానిలా.
కౌసల్య రాధ దగ్గర ఏ విషయమూ దాచకుండా అంతా చెప్పింది. అతనన్న మాటలూ, ప్రవర్తించిన తీరు అంతా విన్నాక, రాధకి కూడా అతనంటే అసహ్యం వేసింది. కానీ ఏం చేస్తుంది?
'అసలేం చెయ్యాలి? అతనిని ఎలా మార్చడం? అతను మారుతాడా అసలు? మారకపోతే ఈ సమస్యకి పరిష్కారమేమిటి?' ఇత్యాది ప్రశ్నలకి సమాధానం దొరకక, ఆలోచిస్తూ వుండిపోయింది.
"అవన్నీ తరువాత అలోచిద్దాంలే! ముందు దాన్ని రెస్టు తీసుకోనీ" అన్నాడు సుధాకర్.